పరాన్న జీవి -ఆర్జీవి
posted on May 12, 2023 @ 2:31PM
రాముడిని, గోపాలుడిని కలిపి ఒకడిగా అవతరించిన రూపం రామగోపాలవర్మ. ఈయనను అందరూ అర్జీవీ అని పిలుచుకుంటారు. బహుశా ప్రపంచంలో యింత కన్ఫ్యూజన్ క్యారెక్టర్ మరోకటి ఉండదేమో అనినిస్తుంది అర్జీవీని చూస్తే. అసలే కన్ఫ్యూజన్ లో ఉండే ఈ పెద్ద మనిషి అందరినీ కన్ఫ్యూజన్ లో పెట్టడంలో బిజీగా ఉంటాడు.
అప్పుడెప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం ఒక సినిమా తీసి పాపులర్ అయిన రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ ని కొంత కాలం కొనసాగించారు. టాలీవుడ్, బాలీవుడ్ లలో కొన్ని గొప్ప సినిమాలు తీసిన ఆర్జీవీ తరువాత తన విపరీత మనస్తత్వానికి పదును పెట్టాడు. సినిమాలు తప్ప అన్ని విషయాలపై తన మేధస్సును ప్రపంచానికి పంచే పని మొదలు పెట్టాడు. మొదట్లో జనాలకు ఆయన ధోరణి నచ్చింది కానీ క్రమంగా విద్యావంతులు, ఆలోచనాపరులు ఆర్జీవీ వాదలను వ్యతిరేకించడం మొదలైంది. తన సినిమాలను చూడండని తానెప్పుడూ ప్రేక్షకులను కోరలేదని బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చే రామ్ గోపాల్ వర్మ, తన పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కూడా పాపులారిటీగా తీసుకున్నాడు. చిరంజీవి, శ్రీదేవి లాంటి పెద్ద స్టార్లతో సినిమా మొదలు పెట్టి ఆపేసిన ఆర్జీవీ తాను తీసిన సినిమాల కంటే ఆపేసినవే ఎక్కువ అని చెబుతుంటారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఏ విషయాన్నీ ఆర్జీవీ వదిలి పెట్టడం జరగదు. అలాగే రాజకీయాలలో ఎవరు ఎలాంటి ప్రకటన చేసినా రామ్ గోపాల్ వర్మ నోరు విప్పక మానడు. రాంగోపాల్ వర్మ అంటే ఎందరికో వినోదం. కొందరికి అసహ్యం. కొద్ది మందికి అవసరం అనేది అందరికీ తెలిసిన అక్షర సత్యం. 2019 ఎన్నికల ముందు లక్ష్మీ పార్వతి కథతో సినిమా తీసి చంద్రబాబును ఇరుకున పట్టాలన్నా, పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడినా దానిపై సెటైర్లు వేయాలన్నా అది రాంగోపాల్ వర్మకే సాధ్యం. ఆర్జీవీ చేసేప్రతి పనికీ ఒక ప్యాకేజీ ఉంటుందని సినీ పరిశ్రమలో చెప్పుకుంటారు.
అడవి దొంగ వీరప్పన్ తనకు ఆదర్శం అని బాహాటంగా చెప్పే అర్జీవీ నిజ జీవితంలో కూడా అలాంటి వ్యక్తులనే సమర్ధిస్తుంటాడు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి.
సహజంగా పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేసిన వారిని ఆయన అభిమానులు వదిలిపెట్టరు, కానీ తాజాగా పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఆగ్రహించినట్లుగా ఎక్కడా కనిపించలేదు. కారణం ఆర్జీవీని పట్టించుకోకపోవడమే సరైన జవాబు అని జనసేన భావించడమే ఆ పార్టీ శ్రేణులు చెప్పడం ఆర్జీవీ ప్రస్తుత స్థితిని అద్దం పడుతోంది.