పవన్ కల్యాణ్ మాటలలో ముందస్తు ఎన్నికల సంకేతం?
ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట గతంలో కంటే గట్టిగా వినిపిస్తోంది. విపక్షాలలో అయోమయాన్ని సృష్టించి ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మరల్చుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా ముందస్తు ముచ్చటను తెరమీదకు తెచ్చిందన్న వాదన వినవస్తున్నా.. విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ యిప్పటికే పార్టీ జెండాలు, ఇతర ఎన్నికల సరంజామాకు పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.
కారణాలేమైనా జగన్ అసెంబ్లీని గడువుకు ముందే రద్దు చేసి ప్రజా తీర్పును కోరుతారన్న భావన రాజకీయ వర్గాలు, పరిశీలకుల్లోనే కాదు.. సామాన్య ప్రజానీకంలో కూడా వెల్లువెత్తుతోంది. పార్టీలో అసంతృప్తి, అంతర్గత కలహాలు, కోర్టు కేసులు, ఆర్థిక సంక్షోభం.. అన్ని వర్గాలలోనూ వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకత కలిపి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఫ్రెష్ మేండెట్ కోరడం ద్వారానే ఒకింత ఊరట పొంందావచ్చని జగన్ భావిస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా గురువారం (మే 11) మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున తాను ఇక ఏపీలోనే ఉంటానని ప్రకటించారు. ఆయన పొత్తల గురించి ఎలాంటి శశబిషలూ లేకుండా క్లరిటీ ఇవ్వడం.. పొత్తులకు సీఎం పదవి అనేది ఎంత మాత్రం అవరోధం కాదనీ, తాను ఆ పదవి కోసం వెంపర్లాడటం లేదనీ రేసులో లేదనీ కూడా స్పష్టంగా చెప్పేసి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగడమే మిగిలిందని కుండబద్దలు కొట్టేశారు.
పార్టీలో పొత్తును ఇష్టపడని వారినీ, ఇతర వైసీపీ వ్యతిరేక పార్టీలలో ఏ పార్టీ అయినా పొత్తును వ్యతిరేకిస్తుంటే వారినీ ఒప్పించే బాధ్యత తానే తీసుకుంటున్నాననీ కూడా జనసేనాని విస్పష్టంగా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల జరగడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా సన్నాహాలు ప్రారంభించేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇక జనసేనాని తన ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చే నెల 3 నుంచి తాను ఏపీలో నే ఉంటానని తేటతెల్లం చేయడం ద్వారా సినిమాలకు విరామం ఇచ్చేసినట్లేనన్న సంకేతాలిచ్చారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం పవన్ కల్యాణ్ వద్ద ఉందని పరిశీలకులు అంటున్నారు.
మొత్తంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల సెంట్రిక్ గానే పవన్ పొత్తులు, ముఖ్యమంత్రి పదవి గురించి తమ పార్టీ శ్రేణులకే కాకుండా అభిమానులకు కూడా ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడం ద్వారా పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే సమయానికి ఎటువంటి ఇబ్బందులూ, అసమ్మతులూ వెల్లువెత్తకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడ్డారన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది. మొత్తం మీద పవన్ కల్యాణ్ పొత్తులు, పదవులు, సీట్ల పంపకం తదితర అంశాలపై ఇచ్చిన క్లారిటీ కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేనల పొత్తుకు ఒక సానుకూల వాతావరణాన్నీ, ఆ పొత్తుకు ఇరు పార్టీలే కాకుండా జనం సమ్మతిని ముందుగానే పొందే అవకాశం ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు.