కుమారస్వామికి కేసీఆర్ హ్యాండిచ్చారా?
posted on May 12, 2023 @ 9:47AM
కర్నాటక ఎన్నికలలో కింగ్ మేకర్ గా కచ్చితంగా ఉంటామనీ, కాలం కలసి వస్తే.. ముఖ్యమంత్రి పదవి కూడా దక్కేస్తుందనీ ఎన్నో ఆశలుపెట్టుకున్న జేడీఎస్.. తీరా ఎన్నికలు పూర్తయిన తరువాత తమకు అంత సీన్ లేదని అంగీకరించేసింది. అయితే ప్రజా తీర్పు మేరకే తమకు ఆ సీన్ లేకుండా పోయిందని మాత్రం అనడం లేదు.
అవసరమైనంతగా సొమ్ములు ఖర్చు చేయలేకపోవడం వల్లే.. ఈ పరిస్థితి ఎదురైందని చెబుతోంది. అంతే కాదు.. తాము అనుకున్నంతగా పోటీ యివ్వ లేకపోవడానికి నమ్ముకున్న ఒక మిత్రుడు హ్యాండ్ యివ్వడమే కారణమని చెబుతోంది. కచ్చితంగా యివే మాటలు కాకపోయినా.. జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కర్నాటక ఎన్నికల పోలింగ్ పూర్తయిన తరువాత మీడియా సమావేశంలో చెప్పిన మాటలకు యిదే అర్ధం. ఆయన సహకరించలేదంటూ పేరెత్తకుండా చేస్తున్న విమర్శలన్నీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనేనని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. కర్నాటక ఎన్నికలు ముగిశాయి. శనివారం ( మే 13) ఫలితాలు వెలువడుతాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ లు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎడ్జ్ కాంగ్రెస్ కు ఉందని చెబుతున్నాయి. జేడీఎస్ కీలక రోల్ ప్లే చేసే అవకాశం ఉందన్నది ఎగ్జిట్స్ పోల్స్ చెబుతున్న మాట. అయినా జేడీఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా కీ రోల్ ప్లే చేయడానికి అవసరమైన స్థానాలలో తాము విజయం సాధిస్తామన్ననమ్మకాన్ని వ్యక్తం చేయడం లేదు. ఎంత శ్రమపడినా ఆర్థిక ప్రతిబంధకం వల్ల మహా గెలుస్తే ఓ పాతిక స్థానాలలో గెలిచినా అదేమీ తాము కీ రోల్ ప్లే చేయడానికి సరిపోవన్నది ఆయన మాటల సారాంశం. కాగా కుమారస్వామి ఆర్థిక వనరుల లేమి కారణంగానే తాము ఎన్నికలలో అనుకున్నంతగా పోటీ యివ్వలేకపోయామనడంపై కన్నడ రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణ రాజకీయ వర్గాలలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుమారస్వామి అసంతృప్తి అంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు అండగా నిలవలేదనేనని అంటున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశం గురించి చెప్పిన క్షణం నుంచీ కుమారస్వామి ఆయన వెంటే ఉన్నారు. నడిచారు. కన్నడ ఎన్నికలలో బీఆర్ఎస్ తో పొత్తు గురించి కూడా తొలుత ఆయనే మాట్లాడారు. పొత్తులో భాగంగా లోక్ సభ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తామనీ, అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ తమకు అన్ని విధాలుగా సహకరించాలన్న ప్రతిపాదనలు కూడా చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలలో జేడీఎస్ కు బీఆర్ఎస్ ఆర్థికంగా అండదండగా ఉంటుందన్న ప్రచారం అప్పట్లో కర్నాటక , తెలంగాణ రాష్ట్రాలలో విస్తృతంగా జరిగింది.
కర్ణాటక ఎన్నికల్లో కలిసి పని చేద్దామని ఆర్థిక సాయం చేస్తామని కేసీఆర్ చెప్పారని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. ఆ కారణంగానే కుమారస్వామి కేసీఆర్ కాకితో కబురెట్టినా హైదరాబాద్ వచ్చి వాలిపోయేవారని గుర్తు చేస్తున్నారు. కానీ తీరా సమయం వచ్చినప్పుడు కేసీఆర్ ముఖం చాటేశారన్నది కుమారస్వామి భావనగా ఆయన మాటలను బట్టి అవగతమౌతోంది. కారణం ఏమిటన్నది పక్కన పెడితే.. కర్ణాటక ఎన్నికల వైపు కేసీఆర్ కనీసం దృష్టి కూడా పెట్టలేదు. జేడీఎస్ కు ఎటువంటి ఆర్థిక సాహం చేయలేదు. ఆ కారణంగానే కుమారస్వామి కర్నాటక ఎన్నికలు ముగిసిన తరువాత బహిరంగంగానే కేసీఆర్ పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.