ఆ జీవో ప్రాథమిక హక్కులకు భంగకరం
posted on May 12, 2023 @ 12:45PM
జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సభలూ, సమావేశాలూ నిర్వహించకుండా, రోడ్ షోలకు అవకాశం లేకుండా చేస్తూ తీసుకువచ్చిన జీవో నంబర్ వన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో జారీ చేసినప్పుడే ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కడానికీ, విపక్ష పార్టీలను అణచివేయడానికే ఈ జీవో ను జగన్ సర్కార్ తీసుకువచ్చిందంటూ అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజాస్వామ్య వాదులూ ఈ జీవోను వ్యతిరేకించారు.
అప్పట్లో చంద్రబాబు నిర్వహించిన రెండు వరుస సభల్లో తొక్కిసలాటలు జరిగాయి. ఆ తొక్కిసలాటలలో మరణాలు సంభవించాయి. అంతే ఆ రెండు సంఘటనలనూ సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద రాష్ట్రంలో సభలూ, సమావేశాలు, రోడ్డు షోలపై ఆంక్షలు విధిస్తూ జీవో నంబర్ 1 తీసుకు వచ్చేసింది. ఆ జీవోను అడ్డుపెట్టుకుని అప్పట్లో చంద్రబాబు కుప్పం పర్యటనను సర్కార్ అడ్డుకుంది. తర్వాత ఆనపర్తిలోనూ చంద్రబాబు పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు కల్పించింది.
యిదే జీవోను చూపుతూ లోకేష్ పర్యటనపై ఆంక్షలు విధించింది. కాగా ఈ జీవోను కొట్టి వేస్తూ ఏపీ హైకోర్టు ఇది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేదిగా ఉందని పేర్కొంది. జీవో నెం.1ను సవాల్ చేస్తూ సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందన్న పిటిషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారని పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారని రామకృష్ణ తరపు న్యాయవాది వాదించారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. వీటితో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఈ జీవో జారీ చేసినప్పుడు హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఆకారణంగా ఈ పిటిషన్ ను అప్పుడు విచారించిన వెకేషన్ బెంచ్ ఈ జీవోపై స్టే ఇచ్చింది.
తర్వాత విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ బెంచ్.. ఆ స్టేను పొడిగించడానికి నిరాకరిస్తూ, తీర్పు రిజర్వ్ చేసింది. చాలా కాలం పాటు తీర్పు ఇవ్వకపోవడంతో రామకృష్ణ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. త్వరగా తీర్పు ఇవ్వాలని హైకోర్టులోనే కోరాలని.. తీర్పు వచ్చే వరకూ స్టే ఇవ్వాలని హైకోర్టును కోరాలని పిటిషనర్ రామకృష్ణకు సుప్రీంకోర్టు సూచించింది. ఇటీవల హోంశాఖపై సమీక్ష జరిపిన సీఎం జగన్ జీవో వన్ సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఆ జీవోను కొట్టివేసింది.