దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హంగామా
posted on May 12, 2023 @ 1:58PM
వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన బిఆర్ ఎస్ హాట్రిక్ కొట్టాలని తీవ్రంగా యత్నిస్తోంది. ఈ రెండు పర్యాయాలు డెవలప్ మెంట్, వెల్ఫేర్ కార్యక్రమాలతో ప్రజలను అలరించినట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పకనే చెప్పబోతుంది. పట్టుమని పదేళ్లు నిండిన ప్రభుత్వానికి తగిన ప్రచారం అవసరమైంది. పదేళ్ల విజయోత్సవాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఈ మేరకు ఉత్తర్వులు జారి చేసింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. పదో వసంతంలోకి తెలంగాణ అడుగుపెడుతుంది. ఈ శుభసందర్భాన్ని పుర స్కరించుకొని దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జూన్ 2 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని పదేళ్ల పండుగ సందర్భంగా ఘనంగా చాటేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల పోరాట చరిత్రను స్మరించుకునేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రాధాన్యత పథకాలు, వాటి ద్వారా ప్రజలకు కల్గిన ప్రయోజనాలను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పనున్నారు. రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రగతిపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సాధించి విజయాలు, అమలు చేస్తున్న అభివృద్థి, సంక్షేమ పథకాలు, వినూత్న విధానాలు, ఇతర రాష్ట్రాలు, ఇంకా దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా మారిన తీరును ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడానికి కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, ఇతర సంబరాలు కూడా ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తోంది.
ఇక వీటితో పాటు రాష్ట్ర రాజధానిలో ఓ భారీ బహిరంగ సభను కూడా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల మైదానం, ఎల్బీ స్టేడియం లలో ఏదో ఒక చోట భారీ సభ నిర్వహించేందుకు ఆలోచన చేస్తోంది. ఇక తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవాన్ని కూడా దశాబ్ది ఉత్సవాల్లోనే చేపట్టనున్నారు. అయితే ఈ కార్యక్రమాలపై అధికారుల కసరత్తు తరువాత ఎన్ని రోజులు వేడుకలు నిర్వహించాలి, ఏయే కార్యక్రమాలు నిర్వహిచాలన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.