కర్ణాటకలో కింగ్ మేకర్ జెడిఎస్

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో, ఎగ్జిట్ పోల్‌లలో చాలా వరకు కాంగ్రెస్‌కు బలం చేకూర్చాయి, వాటిలో మూడు అధికార బిజెపీతోతో గట్టి పోటీలో నిలిచాయి. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీని అందించాయి. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 122 నుండి 140 సీట్లు సాధిస్తుందని అంచనా.  న్యూస్ 24-టుడే చాణక్య ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్  పార్టీ 120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా . 224 మంది సభ్యుల సభలో అధికార బిజెపి మెజారిటీ సాధిస్తుందని కేవలం ఒక పోల్‌స్టర్-న్యూస్ నేషన్-సిజీఎస్ అంచనా వేసింది. చాలా సర్వేలు జేడీ(ఎస్)కి 20-స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన మొదటి దక్షిణాది రాష్ట్రం కర్ణాటక కావడం విశేషం.  సర్వేల ప్రకారం అధికారం బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతుల్లోకి మారనుంది.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ప్రచారంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుంది. 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలోపు బలమైన పునరాగమనం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎన్నికల సంఘం ప్రకారం 72.67 శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ , జనతాదళ్ (సెక్యులర్) 2018 ఎన్నికలలో మిత్రపక్షాలుగా పోటీ చేసి  పరాజయం చెందాయి.  జనతాదళ్ (సెక్యులర్)తో ఎన్నికల తర్వాత పొత్తు ఉండదని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ బుధవారం ఉదయం  విలేకరులతో అన్నారు.2018 ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్, జెడిఎస్ జతకట్టాయి. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరడంతో వారి ప్రభుత్వం కూలిపోయింది.  "జెడిఎస్‌తో పొత్తుకు అవకాశాలు లేవు. మేమే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం"అని శివకుమార్ అన్నారు. కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశాలు లేవని తెలుస్తోంది.  అధికారంలో వచ్చే పార్టీలకు జేడీఎస్   మద్దత్తు ఇస్తే సరిపోతుంది. కాబట్టి జెడిఎస్ కింగ్ మేకర్ అని చెప్పొచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న జెడీఎస్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా? బిజెపీతో పొత్తు పెట్టుకుంటుందా? వేచి చూడాలి.  

విశ్వనగరం కాదు ఉగ్ర నగరం!

హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారిందా?  విశ్వనగరం అంటూ బీఆర్ఎస్ ఒక వైపు గొప్పలు చెప్పుకుంటుంటే మరో వైపు  రాష్ట్ర రాజధాని ఉగ్రనగరంగా  మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే  హైదరాబాద్ ప్రజలు బాంబులపై  నివసిస్తున్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్ర లింకుల ఆరోపణలపై అరెస్టైన సలీం ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పనిచేస్తుండాన్ని ప్రస్తావించిన ఆయన ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు.  2‌016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ చేసిన ప్రకటనను కూడా ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు.  హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు షెల్టర్ గా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. దేశంలో ఎక్కడ ఏ ఉగ్ర ఘటన జరిగినా హైదరాబాద్ లింకులు బయటపడుతున్నా కేసీఆర్ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని నిలదీశారు.   ఓటు బ్యాంకు కోసం, అధికారం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మజ్లిస్ పార్టీతో  కుమ్మక్కయ్యానని బండి విమర్శిస్తున్నారు.  హైదరాబాద్ లో హిజ్జు ఉత్ తహరీర్ (హెచ్ యుటి) ఉగ్ర సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాదులు పట్టుబడటంతో మరోసారి హైదరాబాద్ కు ఉగ్ర లింకుల అంశం తెరపైకి వచ్చింది.  రసాయన, జీవ ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం స్రుష్టిస్తున్న హెచ్ యుటి కావడం.. ఆ సంస్థతో లింకులున్నాయంటూ హైదరాబాద్ లో అరెస్టులు జరగడం సహజంగానే హైదరాబాదీయులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.   లుంబినీపార్క్, దిల్ షుక్ నగర్ పేలుళ్ల ఘటనల ను నగర వాసులు యింకా మరచిపోకముందే.. మరో సారి నగరంలో ఉగ్ర మూలాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.   ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన పౌరులు వీసా గడువు ముగిసినా హైదరాబాద్ లోనే మకాం వేసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.    

అట్టుడికిన పాక్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత అక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలతో బుధవారం అర్థరాత్రి పాకిస్తాన్ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాటకీయ నిర్బంధం తరువాత ఎనిమిది రోజుల పాటు కస్టడీలో ఉంటారు. ఖాన్‌ను మంగళవారం రాజధాని ఇస్లామాబాద్‌లో సాధారణ విచారణ సందర్భంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  నిరసనకారుల సామూహిక అరెస్టులతో పాకిస్థాన్ అట్టుడికింది.    పాకిస్థాన్ లో  అనేక స్మారక చిహ్నాలు మరియు ప్రభుత్వ భవనాలు తగలబడ్డాయి."మేము ఇమ్రాన్ ఖాన్‌కు అండగా ఉంటాము. మరణం వరకు అతనికి మద్దతు ఇస్తాము." అని అభిమానులు నినదించారు. శాంతిని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.  రాజధానిలో సైన్యాన్ని మోహరించడానికి మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలో ఇమ్రాన్ ఖాన్ కు  చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఇస్లామాబాద్ తో పాటు ఇతర నగరాల్లో పిటీఐ మద్దతుదారులు పోలీసులతో  ఘర్షణ పడ్డారు.  

తిట్ల పురాణాలను యికనైనా స్వస్తి పలుకుతారా?

తిట్ట పురాణాలే రాజకీయ విమర్శలుగా  చెల్లుబాటు అవుతున్నాయి. రాజకీయాలలో  భిన్నాభిప్రాయాన్ని హుందాగా వ్యక్తం చేయడమన్నది కనుమరుగైపోయింది. కొడాలి నాని మార్కు విమర్శలకే నాయకులు ప్రాధాన్యత యిస్తున్నారు. అయితే ఆ పరిస్థితి మారాలి. మారుతుందా అంటే తలసాని, రేవంత్ రెడ్డిల ఎపిసోడ్ లో తలసాని ఒక అడుగు వెనక్కు వేసి తన పిసుకుడు విమర్శను వెనక్కు తీసుకోవడం చూస్తే మారుతుందనే అనిపిస్తుంది. యింతకీ అసలీ పిసుడుకు విమర్శ, దానికి రేవంత్ రెడ్డి స్పందించిన తీరు రాజకీయాలలో భాషా దారిద్యం  ఏ స్థాయికి వెళ్లిందో అర్ధమౌతుంది.  బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలపై, తెలంగాణ సీనియర్‌ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాటలతో విరుచుకుపడ్డారు.  పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేరెత్తకుండానే  ఆ పొట్టోని నోటికి బట్టనే లేదు. ఎమ్మెల్యే లేదు. మంత్రులు లేదు. అందరినీ వాడు వీడు అని సంబోధిస్తున్నాడు. పిసికితే పోతాడు’’అని తలసాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అందుకు అంతే దీటుగా రేవంత్ కూడ బదులిచ్చారు అది వేరే సంగతి. అయితే తలసాని తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని తన మాట తూలుడును సద్దుకునే ప్రయత్నం చేశారు. తమ అధినేత కేసీఆర్ ను కించపరిచేలా విమర్శలు చేశారన్న ఆగ్రహంలో నిగ్రహం కోల్పోయి మాట తూలనని తలసాని హుందాగా అంగీకరించారు.  బాధ్యతగల మంత్రిగా, రాజకీయ నాయకుడిగా నేను ఆవేదనతో , ఆగ్రహంతో చేసిన అనుచిత చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. పార్టీలు వేరైనా ప్రత్యర్థులపై చేసే విమర్శలు అర్ధవంతంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు.  వ్యక్తిత్వాన్ని వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఉండటం మంచిది కాదన్నది తన అభిప్రాయమనీ  ఇకనైనా బాధ్యతగా మాట్లాడుతూ ఒకరినొకరు గౌరవించుకోవాని  అన్నారు. అయితే తలసాని తనను పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఏమీ హుందాగా స్పందించలేదు. పేడ పిసికే అలవాటున్న తలసాని, పిసుగుడు గురించే మాట్లాడతారంటూ ఆయన కూడా మర్యాద గీతను దాటేశారు.  ఆయన కూడా వెనక్కు తగ్గి తన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆగ్రహంతో మాట తూలడం, ఆ తరువాత జరిగిన పొరపాటు తెలుసుకుని ఆ మాటను ఉపసంహరించుకోవడం రాజకీయాలలో  గతం నుంచీ కూడా ఉంది. అయితే యిటీవలి కాలంలో అనుచిత వ్యాఖ్యలను సమర్ధించుకోవడం. మర్యాద గీతను ఎంత దాటితే అంత గొప్ప  నేత అన్న భావన ఎక్కువ అవ్వడం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు నోటికి పని చెప్పడం ద్వారానే తమ పార్టీ అధినేత ప్రాపకం పొందగలం అన్న భావనలో ఉన్నారని అనిపించక మానదు. ఏది ఏమైనా తలసాని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఆగ్రహంతో మాట తూలానని అంగీకరించడం హుందాగా ఉంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు ప్రతి విమర్శలూ మర్యాద గీత దాటిన సందర్బాలు చాలా అరుదు. అలా అరుదుగానైనా మాట జారిన నేత వెంటేనే వనక్కు తగ్గి క్షమాపణతోనో, తన వ్యాఖ్యల ఉపసంహరణతోనో దిద్దుబాటు చర్యలకు దిగేవారు. అయితే రాష్ట్ర విభజన తరువాత అటువంటి వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బూతులూ, తిట్లే రాజకీయ విమర్శలు అనుకునే పరిస్థితి ఏర్పడింది.  ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ విషయంలో ప్రధమ స్థానంలో ఉండగా, తెలంగాణలో కూడా ఈ విషయంలో ఏమీ తక్కువ తినలేదు.   ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుని హుందాతనాన్ని చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో నేతలు యిక నుంచైనా మాటలు మీరే విషయంలో నియంత్రణ పాటించాలి. ఒక వేళ తూలినా.. హుందాగా ఆ విషయాన్ని అంగీకరించి ఉపసంహరించుకుంటే.. రాజకీయాలలో విలువలకు ఒక అర్ధం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. 

శృతి మించిన విమర్శలు..రేవంత్ వర్సెస్ తలసాని!

రాజకీయాలలో విమర్శలు.. ప్రతి విమర్శలు సాధారణ విషయం. అయితే అవి శృతి మించితే  ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉంటాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ల మధ్య పిసుకుడు చాలెంజ్  ఆ కోవకే చెందుతుంది. కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటనపై స్పందించేందుకు ప్రెస్ మీట్ పెట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందు.. పిసికితే పాణం పోతదని పరోక్షంగా రేవంత్ రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడీయాలో వైరల్ అయ్యాయి. తలసాని చేసిన కామెంట్లు దుమారం రేపడంతో,  రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తలసానిని దున్నపోతుతో పోల్చి తీవ్ర విమర్శలు చేశారు. దున్నపోతులతో తిరిగిన దున్నపోతు తలసాని శ్రీనివాసయాదవ్ అని, మొదట్నుంచి పశువుల పేడ పిసుక్కున్న అలవాటు తలసాని శ్రీనివాసరావుకుందని, అందుకే పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడంటూ  రేవంత్ రెడ్డి  కౌంటరిచ్చారు. అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు గుట్కాలు నమిలే వ్యక్తులు కూడా తన గురించి మాట్టాడటమా అని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాసయాదవ్ కు అంత పిసుకుడు కోరిక ఉంటే,ఎక్కడికి ఎప్పుడు రావాలో చెబితే తాను వస్తానని,అప్పుడు ఎవరు ఏం పిసుకుతారో అర్థమవుతుందని సవాల్ చేశారు. కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని పిసకటం అంటూ మండిపడ్డారు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసినా, తన స్థాయికి రాలేరని తేల్చిచెప్పారు. ఇంకా ఏదైనా మోజుంటే, మోజు తీర్చుకోవాలంటే తాను వస్తానని రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తేల్చి చెప్పారు.విషయమేమిటంటే.. పరిధిలు దాటి  పరస్పర విమర్శలతో రెచ్చిపోతున్న ఈ ఇద్దరూ కూడా ఒకప్పుడు టీడీపీలో కలిసి పని చేసిన వారే.  2014లో ఇద్దరూ టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత తలసాని టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. అప్పట్లో కూడా రేవంత్ రెడ్డి, తలసాని మధ్య ఘాటు విమర్శలు చోటు చేసుకునేవి. ఇప్పుడు మరోసారి.. తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ ల మధ్య విమర్శలు మర్యాద పరిధి దాటుతున్నాయి. ఓ వైపు ఎండలు..మరో వైపు అకాల  వర్షాలతో  రైతులు, ప్రజలు కష్టాలలో ఉంటే.. వాటిని విస్మరించి..  బాధ్యతాయుత పదవులలో ఉన్న నేతలు  యిలా చౌకబారు విమర్శలతో  కాలం గడిపేయడమేమిటని జనం ఛీత్కరించుకుంటున్నారు.   

ముద్రగడ రాజకీయ అడుగులు ఎటో?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి పున: ప్రవేశంపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని అంటున్నారు. కాపు సామాజికవర్గ ప్రజలకు ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలో తుని రైల్వే కేసు కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన సత్యం జయించిందని సంతోషమని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ జోకర్ కార్డులా మారినందుకు చింతిస్తున్నానని లేఖలో ప్రస్తావించారు. 2016 ఫిబ్రవరి 2న తనను తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీ చేశారన్నారు. బెయిల్ తెచ్చుకోండి, లేకపోతే అండర్ గ్రౌండ్ కి వెళ్లమని సలహాలు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజల్లో మార్పు రావాల్సి ఉందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎన్నడూ రాలేదన్నారు. తుని ఘటన తరువాత తనను తీహార్ జైలుకు తీసుకువెళ్లేందుకు హెలికాప్టర్ సిద్ధం చేశారన్నారు. ఒకవేళ అలా చేసి ఉంటే కాపు ఉద్యమం చులకనయ్యేదన్నారు. అప్పటి డీజీపీకి కూడా నాపై సమస్త కేసులు పెట్టుకోండంటూ అప్పట్లో లేఖ రాశానన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పాడుచేయమని ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదన్నారు. తుని రైలు దగ్ధం కేసును ఇటీవల రైల్వే కోర్టు కొట్టివేసింది. అంతకముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై పెట్టిన కేసులు ఎత్తేసింది. దీంతో ముద్రగడ పద్మనాభం  వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం  ఉందన్నప్రచారం విస్తృతంగా జరుగుతోంది.  అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించలేదు. అలాగని వాస్తవమేననీ అనలేదు. తాజాగా రాసిన లేఖలో మాత్రం రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో  ముద్రగడ రాజకీయ అడుగులు ఎటువైపు అన్నచర్చ అయితే జోరందుకుంది. అదలా ఉంటే.. ముద్రగడ కమలం వైపు మొగ్గు చూపుతున్నాన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ ప్రచారానికి ముద్రగడతో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు జరిపినట్లుగా చెబుతున్నచర్చలు కూడా ఒక కారణం.   ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముద్రగడ తాను కాకపోతే  తన వారసుడిని న్నికల బరిలో నిలపాలని ముద్రగడ ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే  ముద్రగడ లేఖ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో  కాపు రిజర్వేషన్లు అంటూ ఉద్యమాలు చేసిన ముద్రగడ.  వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నకు సమాధానం యిచ్చిన తరువాతే ఆయన రాజకీయపున: ప్రవేశం చేయాలని కాపు నేతలుఅంటున్నారు.  

ఇంటర్మీడియేట్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు!

పదో తరగతి తరహాలోనే ఇంటర్మీడియేట్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే  బెటరని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉండడం, పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలంగాణ భావిస్తోంది. కొన్నేళ్ల నుంచి జేఈఈ మెయిన్, నీట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదు. ఈసారి నుంచి ఎంసెట్ కూ శాశ్వతంగా వెయిటేజీ తొలగించారు. ఈ క్రమంలో ఇంటర్లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? అన్న కోణంలో ఆయా అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని  బీఆర్ఎస్ సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదని ఇంటర్ విద్య ఐకాస ఛైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి  అంటున్నారు. ఎస్ఐటీలు, ఐఐటీల్లో చేరేటప్పుడు కనీసం 75% మార్కులు అడుగుతారని, అలాంటప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకూ ఇంటర్ మార్కులే ఆధారంగా ఉన్నందున నిపుణుల కమిటీ వేస్తే ఏదో ఒక పరిష్కారం లభించే అవకాశం ఉందని అంటున్నారు.   ఇప్పుడు ఇంటర్ మార్కుల కంటే జేఈఈ, నీట్ ర్యాంకులు వస్తాయో? రావో? అన్న దానిపైనే అధికంగా ఒత్తిడి ఉందనడంో సందేహంల లేదు. అనేక కారణంల వలన  సరిగ్గా సాగని విద్యా సంవత్సరం, స్మార్ట్ ఫోన్ రంగప్రవేశం లాంటివి విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశం. ఫలితంగా.. వారు పరీక్షలను ఒత్తిడి లేకుండా ఎదుర్కోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పదో తరగతి తరహాలోనే ఇంటర్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇవ్వాలనే  తెలంగాణ సర్కారు ఆలోచన  కార్యరూపం దాలిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, విద్యారంగ నిపుణులూ అంటున్నారు. 

పెట్టుబడులు ఎవరికో మరి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పనిలో పడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికున్న అవకాశాలు, తెలంగాణ సర్కార్ పారిశ్రామిక వేత్తలకు వేస్తున్న రెడ్ కార్పెట్ గురించి వివరించడానికి మంత్రి కేటీఆర్ ఈ సారి యూకే కు బయల్దేరారు. మే 11, 12 తేదీల్లో లండన్‌లో జరగనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సు రెండో ఎడిషన్‌లో మాట్లాడాల్సిందిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావును గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ ఆహ్వానించింది.రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో కేటీఆర్ యూకే పర్యటన ఈ నెల 13 వ తేదీ వరకు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా కేటీఆర్ ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతల గురించి ఆయన వివరించనున్నారు.అయితే గతేడాది మే లో మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి  లండన్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భారత హైకమిషన్ సమావేశంతో పాటు ప్రవాస భారతీయలు, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల అధిపతులతో ఆయన భేటీ అయ్యారు.అయితే ఈ పర్యటన మంచి ఫలితాలను ఇచ్చింది. లండన్ కు చెందిన పలు కంపెనీలో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీంతో ఈ సారి కేటీఆర్ యూకే పారిశ్రామిక వేత్తలను టార్గెట్ చేశారు. తెలంగాణాకు పెట్టుబడులు తేవాలన్న లక్ష్యంతో యూకే బయలు దేరిన కెటీఆర్ ఇక్కడి ప్రభుత్వ స్థలాలను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికే ఈ పర్యటన అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు  ఒక సవాల్ చేశారు. దమ్ముంటే భూకబ్జాలు, ఖరీదైన ప్రభుత్వ భూములను కార్పొరేట్‌ ఆస్పత్రికి విక్రయించడం తదితర ఆరోపణలన్నీ అవాస్తవమని నిరూపించాలని సూచించారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి  ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల వివరాలను కూడా వెల్లడిస్తానని చెప్పారు. నిబంధనలను తుంగలో తొక్కి బిల్డర్లకు అనుమతులు ఇస్తున్నారని, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులివ్వడమేంటని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కెటీఆర్ యుకె పర్యటన వివాదాస్పదం కానుందని విశ్లేషకులు అంటున్నారు. 

పవన్ కల్యాణ్ ఫ్రం 2014 టు 2024

కొణిదెల కల్యాణ్@ కొణిదెల పవన్ కల్యాణ్@ పవర్ స్టార్ పవన్ కల్యాణ్లో కొన్ని అరుదైన గుణాలు ఉన్నాయని ఆయనను దగ్గరగా చూసిన వారు అంటూ ఉంటారు. అన్నచాటు తమ్ముడిగా, సినిమాలలో అడుగులు వేసి, అన్నతోటి తమ్ముడిగా ప్రజారాజ్యంలో కలిసి, అన్నను మించిన తమ్ముడిగా జనసేనతో మెరుస్తున్న పవన్ కల్యాణ్ ది కొంత విలక్షణమైన మనస్తత్వమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో  పవన్ కల్యాణ్  పేరు ఒకటి అని చెప్పడానికి అనుమానం అక్కర్లేదు.  2007 అక్టోబర్ లో రివాల్వర్ పట్టుకుని జూబ్లీహిల్స్ రోడ్లపై హల్ చల్ చేసిన పవన్ కు, పీఆర్పీ పెట్టనప్పుడు ప్రసంగాలు చేసిన పవన్ కు, జనసేన అధినేతగా  యిప్పుడు పావులు కదుపుతున్న పవన్ కి చాలా వ్యత్యాసం ఉంది.  కానీ పవన్ కల్యాణ్ కు సినిమారంగంలో దక్కినంత స్టార్ డమ్రాజకీయాలలో దొరకలేదనే చెప్పాలి. ఈ విషయాన్ని పవన్ స్వయంగా అంగీకరించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. సహజంగా గెలిచిన నాయకులు కూడా ప్రజల మొహం చూడని నేటి రాజకీయాలలో సమయం దొరికినపుడు ప్రజలతో కలిసే పవన్ కల్యాణ్ ను ప్రజలు యిష్టపడతారు.  రెండు చోట్లా ఓడించినా ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తుమాట అనని పవన్ తన మీద తానే జోకులు వేసుకుని ప్రజలకు దగ్గరయ్యేందకు ప్రయత్నిస్తున్నారు.  యిదంతా పవన్ మేనరిజం అనుకుంటే పొరపాటే. పవన్ తన భావోద్వేగాలను తాను నియంత్రించుకుని రాజకీయ నాయకుడిగా తనను తాను మలచుకుంటున్నారు. పవన్ సినిమాలు, రాజకీయాలు అంటే జోడు పడవల ప్రయాణం చేస్తున్నాడని ఆరోపిస్తున్న వారికి సినిమాలు తన జీవనోపాధి అని చెప్పేశారు. కనుక సినిమాలు చేయక తప్పని పరిస్థితి అనేది స్పష్టమైంది. గతంలో పవన్ ను కేవలం సినిమా స్టార్ గానే ప్రజలు చూశారనడంలో సందేహం లేదు. కానీ ఆ ఇమేజ్ ని పవన్ మార్చుకోగలిగారు. ఇందుకు పవన్ లోని రాజకీయ నిబద్ధత, కొంత కారణమైనా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం.  2014 మార్చ్ 14న ప్రారంభమైన జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో  2014 ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇచ్చింది. టీడీపీఅధికారలోకి రావడానికి తాము కూడా కారణమని భావించిన జనసేన 2019 ఎన్నికలలో స్వయంగా రంగంలోకి దిగి ఒకే ఒక్క అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. దీంతో రాజకీయాలంటే సినిమా కాదని పవన్ కల్యాణ్ కి తెలిసి వచ్చింది. సహజంగానే 2019 ఓటమి తరువాతే పవన్ కల్యాణ్ లో గుణాత్మకమైన మార్పు వచ్చింది.  గడిచిన నాలుగేళ్లలో అధికార వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ ను మరింతగా పదును పెట్టారు.  క్రమంగా రాజకీయాలు వంటబట్టించుకున్న పవన్ ఎప్పుడూ ర ాష్ట్ర అభివృద్ధి వైపే ఉంటానని చెప్పారు.  తాజాగా టీడీపీకి పవన్ దగ్గరవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది వైసీపీ. అంతే కాకుండా మోడీ ఆశీస్సులు బలంగా పవన్ కల్యాణ్ పట్ల అధికార వైసీపీ ఆచితూచి స్పందిస్తోంది. గతంలో పవన్ వివాహాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగాగమనిస్తున్న జనసేన బృందం ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలుగుదేశంతో జతకట్టే అంశంపై రెండో ఆలోచనకు తావులేదనిపవన్ కల్యాణ్జనసేన ముఖ్యనేతలకు తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉంటుందని, పవర్ షేరింగ్అనే విషయాలపై ఎవరూ నోరెత్తవద్దని పవన్ కల్యాణ్ తన పార్టీ సీనియర్లకు అల్టిమేటం ఇచ్చారని తెలిసింది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా త్వరలో బస్సుయాత్ర చేసేందుకు పవన్ సిద్ధంఅవుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.  ఇదంతా గమనిస్తే  రాజకీయ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి పవన్ ఎంత వ్యూహాత్మకంగా పావులుకదుపుతున్నారో అర్ధంఅవుతుంది. అభిమానుల ఆవేశాన్నికంట్రోల్ చేస్తూ, వ్యూహాలకు పదును పెడుతున్న పవన్ 2024 ఎన్నికలలో జనసేనపోటీ చేయబోతున్న సీట్లపై కూడా స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలుస్తోంది.

సిలబస్ నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతం తొలగింపు తగదు

పిల్లలలో తార్కిక ఆలోచనా విధానానికి, శాస్త్రీయ దృక్ఫధంలో నిర్ణయాలు తీసుకునే  శక్తికీ తిలోదకాలిచ్చేసేలా ఎన్సీఈఆర్టీ నిర్ణయాలు ఉంటున్నాయని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠ్యాంశాల నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడం అటువంటి నిర్ణయమేనని వారంటున్నారు. టెన్త్ క్లాస్ సిలబస్ నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించాలని యిటీవల ఎన్సీఈఆర్టీ నిర్ణయించింది. ఈ అంశంపై తాజాగా టాటా యిన్సిటిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వివిధ ఐఐటీలకు చెందిన 1800 మంది  నిపుణులు రాసిన బహిరంగ లేఖలో జీవపరిణామ సిద్ధాంతాన్ని విస్మరిస్తే తదనంతర కాలంలో మనం దేన్నీ అర్థం చేసుకోలేమని అందులో పేర్కొన్నారు. డార్విన్ సిద్ధాంతం సాయం లేకుండా చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని అధ్యయనం చేయడం కుదరదనీ,  ప్రజల్లో విజ్ఞానం పెంపొందించాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఎన్సీఈఆర్టీ నిర్ణయం విరుద్ధమని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.  చరిత్రను.. భవిష్యత్తును అర్ధం చేసుకోవడానికి దోహదపడే  సిద్దాంతాలను తొలగిస్తే.. భవిష్యత్ తరాలు దేన్నీ కూడా అర్థం చేసుకోలేమ పరిస్థితి ఎదురౌతుందనీ, రాబోయే తరంలో మూఢ నమ్మకాలు పెరుగుతాయని మేధావులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

కునో పార్కులో మరో చీతా మృతి

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మరో చీతా ప్రాణాలు వదిలింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన  చీతాల్లో ఒకటైన ఆడ చీతా దక్ష మృతి చెందింది. పార్క్ లో ఇతర చీతాలతో జరిగిన ఘర్షణలో  తీవ్రంగా గాయపడిన దక్ష చికిత్స పొందతూ  చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. దక్ష మృతిలో కునో నేషనల్ పార్కులో లో  40 రోజుల వ్యవధిలో ఇది మూడో  చీతా చనిపోయినట్లైంది. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన సాశా అనే ఆడ చీతా ఈ ఏడాది మార్చి 27న చనిపోయింది. భారత్ కు రాకముందు నుంచే మూత్రపిండ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆ చీతా.. మరింత అస్వస్థతకు గురై  మృతిచెందింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఉదయ్ అనే మగ చీతా.. ఈ ఏడాది ఏప్రిల్ 23న అనారోగ్యానికి గురై చనిపోయింది.  ప్రాజెక్ట్ చీతా భాగంగా  ఇండియాకు 20 చీతాలు తీసుకొచ్చారు. 2022 సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలను, 2023 ఫిబ్రవరి 17న సౌతాఫ్రికా నుంచి 12 చీతాలు తీసుకొచ్చారు. వీటిలో మూడు చీతాలు చనిపోయాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా  వీటిని  దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి తీసుకువచ్చిన చీతాలను ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆర్భాటంగా మధ్యప్రదేశ్ కునో పార్కులో వదిలిన సంగతి విదితమే.  వీటిలో ఒక్కొక్క చీతా  మరణిస్తుండటంతో పార్కు అధికారులు ఏం చేయాలో అర్థం కాక, తలలు పట్టుకుంటున్నారు.

మణిపూర్ లో మారణాయుధాలు చోరీ

దక్షిణాదిలో కర్నాటక ఎన్నికలలో మోడీ అమిత్ షా, ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డిలు క్షణం తీరికలేకుండా వ్యూహాలు రచిస్తుంటే,  ఈశాన్యంలో మణిపూర్  పరస్పర దాడులతో అట్టుడుకుతోంది. యిప్పటికే అధికారిక లేక్కల ప్రకారం 60 మందికి పైగా మరణించగా వందల మంది గాయపడ్డారు. వేల కొలదీ యిళ్లు అగ్నికి ఆహుతి కాగా, 25కి పైగా చర్చిలు కూల్చివేయబడ్డాయి. యింత జరుగుతున్నా దేశ నాయకులకు యిది పట్టడం లేదు. మణిపూర్ లో పెట్రేగిన హింస యింత వరకూ అదుపులోనికి రాలేదు. స్థానిక పోలీసు, సైనిక వ్యవస్థలు కొంత వరకూ పరిస్థితిని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. అయినా యింకా ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి కొనసాగుతోంది. మణిపూర్ లో తాజా పరిస్థితిపై నోరు విప్పిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని షాకింగ్ నిజాలను మీడియాతో పంచుకున్నారు. గత కొద్ది రోజులుగా  జరుగుతున్న దాడులలో 1041 తుపాకులు, 7450 రౌండ్ల బుల్లెట్లు మాయమయ్యాయని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చెప్పుకొచ్చారు. వీటిలో అత్యాధునిక ఏకే సిరీస్ రైఫిళ్లు, సెల్ఫ్ లోడెడ్ మ్యాగజైన్లు ఉన్నాయని ఆయన చెప్పారు. జాతుల మధ్య జరుగుతున్న ఈ హిసాకాండలో వెయ్యికి పైగా తుపాకులు, ఏడున్నర వేల బుల్లెట్లు ప్రజలు లూటీ చేశారని  ముఖ్యమంత్రి స్వయంగా అంగీకరించారు. ఆ ఆయుధాలు యిప్పుడు ఎవరి చేతికి చేరాయో తెలియని, యిది ఆందోళన కలిగించే అంశమని  బీరేన్ సింగ్ చెబుతున్నారు. దానిపై మణిపూర్ లో నిరసన వ్యక్తమవుతోంది.  నాలుగు దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రష్యాలలో పరిస్థితిపై దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. యిన్ని ఆయుధాలు నిజంగా భద్రతా సిబ్బంది నుండి ప్రజలు లూటీ చేశారా లేక ప్రభుత్వమే వాటిని దారి మరల్చిందా అన్న ప్రశ్న ప్రతిపక్షాల నుండి ఎదురౌతోంది. సమస్యాత్మక రాష్ట్రాలుగా చెప్పుకునే ఈశాన్య రాష్ట్రాల పట్ల యిలాంటి వైఖరి సరికాదనేది వారి వాదన. అల్లర్లలో మరణించిన వారికి 5లక్షలు ఎక్స్ గ్రేషియా, యిళ్లు కోల్పోయిన వారికి 2 లక్షలు నష్టపరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి పాతిక వేల రూపాయల పరిహారాన్ని మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. 

బండి సెల్ ఫోన్ కేసీఆర్ చేతుల్లో?

తెలంగాణ బిజేపీ చీఫ్ బండి సంజయ్  సెల్ ఫోన్ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎత్తుకెళ్లారని ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. తనను అరెస్ట్ చేసిన పోలీసులే తన సెల్ ఫోన్ ఎత్తుకెళ్లి ముఖ్యమంత్రి చేతిలో పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.  సిద్దిపేట వరకు వచ్చే వరకు సెల్ ఫోన్ ను భధ్రంగానే ఉంచారని అక్కడి నుంచే మాయమైందని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు తనను కస్టడీలోకి తీసుకున్న మరుసటి రోజు బండి సంజయ్ ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.  తన సెల్ ఫోన్లో కాల్ లిస్ట్ చూడటానికే కేసీఆర్ పోలీసుల చేత ఈ దొంగతనం చేయించారని బండి సంజయ్ ఆరోపించారు.  తనను కస్టడీలో తీసుకుని సెల్ ఫోన్ ను కేసీఆర్  మాయం చేయించారని ఆయన  ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు  చాలామంది తనతో టచ్ లో ఉన్నట్లు బండి సంజయ్ చెప్పారు. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ విషయంలో తన పాత్ర ఉందని కేసీఆర్ ప్రచారం చేశారని బండి గుర్తు చేస్తున్నారు. వరంగల్ సీపీ తన కాల్ లిస్ట్ బయటపెట్టడాన్ని సీరియస్ గా తీసుకున్న బండి త్వరలో సీపీ మీద పరువు నష్టం కేసు వేస్తానన్నారు. రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బిజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ  ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దళిత బంధులో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు  మూడు లక్షల కమిషన్ అందుతుందని పార్టీ అధినేత ఇచ్చిన స్టేట్ మెంట్ రాజకీయాల్లో అప్పట్లో  చర్చనీయాంశమైంది. ఆ 30 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు రావని కేసీఆర్ ఇప్పటికే  ఖరా ఖండిగా చెప్పారు. ఇక్కడ టికెట్లు రాకపోతే బిజేపీలో చేరతారు అని ఊహించే కేసీఆర్ ఈ సెల్ ఫోన్ మాయం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. 30 మంది ఎమ్మెల్యేలు బండి సంజయ్ తో టచ్ లో ఉన్నట్లు వార్తలు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతల పేర్లను తెలుసుకోవడానికే సెల్ ఫోన్ మాయం  అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.    

ద్వేషాన్ని తరిమి కొట్టండి

కర్ణాటకలో ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది. బీజేపీని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత ట్వీట్ చేసింది. ద్వేషాన్ని దేశం నుంచే తరిమి కొట్టాలని, కర్ణాటక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిస్తున్నారు.  ఇవ్వాళ కర్ణాటక రాష్ట్రంలో పోలింగ్ సందర్బంగా కవిత చేసిన ట్వీట్ ఒక విషయాన్ని స్పష్టం అయ్యింది.  బీజేపీని ఓడించండి అని పరోక్షంగా    పిలుపునిచ్చారు . మద్యం కుంభకోణంలో తనను బీజేపీ ప్రభుత్వం ఇరికించిందని కవిత ప్రధాన ఆరోపణ. బీజేపీని  దేశం నుంచే తరిమికొట్టడానికి కర్ణాటక నాంది కావాలని ఆమె చెప్పకనే చెప్పారు. కర్ణాటక ఫలితాలు 13వ తేదీన ఉన్నాయి. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. రెండో స్థానంలో బీజేపీ కి వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కర్ణాటకలో ప్రచారం చేసింది. జేడీఎస్ తరపున ప్రచారం చేసింది. మాజీ ప్రధాని దేవగౌడ పిలుపు మేరకు కేసీఆర్ అక్కడ ప్రచారం చేయాలని తొలుత నిర్ణయించుకున్నారు. కానీ తెలంగాణా పాలిటిక్స్ హీటెక్కడంతో ఢిల్లీలో బీఆర్ ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభించి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఒక వేళ కేసీఆర్ హైదరాబాద్ రాకపోయి ఉంటే కర్ణాటక ఎన్నికల  ప్రచారంలో ఉండేవారు. బిజేపీని తరిమికొట్టడమే ప్రధాన లక్ష్యమని ముందు నుంచి కేసీఆర్ చెబుతున్నారు. ప్రధాన ప్రత్యర్థి మీద ఫోకస్ పెట్టదలచుకుని బుధవారం ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. 

పశువులా మాట్లాడొద్దు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వ్యక్తిగత దూషణలు కూడా చేస్తున్నాయి. పశుసంవర్ధక శాఖామంత్రి తలసానిని పశువు అని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు సంభోధించింది.మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలపై తలసాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పశుసంవర్ధక శాఖ అయితే మాత్రం పశువులా మాట్లాడకు తలసాని అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తలసాని శ్రీనివాస్ ఏ పార్టీ నుంచి వచ్చారు. టీడీపీలో ఆయన ఏం చేశారో అందరకీ తెలుసన్నారు. రాబోయే రోజుల్లో ఎవరి దమ్ము ఎంతో తెలుస్తుందని చెప్పారు. అందరూ దోచుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. శ్రీకాంతాచారి చనిపోవడానికి కారణం తలసాని శ్రీనివాస్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం కుర్చీలో ఉన్నారు అంటే అది తమ భిక్ష అని ఆమె చెప్పుకొచ్చారు. మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలపై  తలసాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పశుసంవర్ధక శాఖ అయితే మాత్రం.. పశువులా మాట్లాడకు తలసాని అంటూ ఘాటుగా స్పందించారు.తలసాని శ్రీనివాస్ ఏ పార్టీ నుంచి వచ్చారు.. టీడీపీలో ఆయన ఏం చేశారో అందరకీ తెలుసన్నారు సునీతారావు. రాబోయే రోజుల్లో ఎవరి దమ్ము ఎంతో తెలుస్తుందని చెప్పారు. అందరూ దోచుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. . కేసీఆర్ సీఎం కుర్చీలో ఉన్నారు అంటే అది తమ భిక్ష అని సునీతరావు చెప్పారు.   

జగనన్నకు చెబుదాం.. గంటకు 250 కాల్స్

వైసీపీ ప్రభుత్వం కొత్తగా  ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి  విశేష స్పందన లభించింది. అంటే యిదేదో జగన్ కు జనాదరణ బ్రహ్మాండంగా ఉందనడానికి తార్కానంఎంత మాత్రం కాదు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే జనాలు తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదించుకునే అవకాశం యివ్వడమే. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కేటాయించింది. ఆ నంబర్ కే కాల్స్ వెల్లువెత్తాయి. రమారమి గంటకు250 చొప్పున కాల్స్ వస్తున్నాయి. అంటే జగన్ నాలుగేళ్ల కాలంలో సమస్యలు ఎంతగా పేరుకుపోయాయి అన్నది ఈ కాల్స్ ను బట్టే అవగతమౌతోంది.  జనాలు ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి చెప్పుకుంటే.. వారి సమస్య అలా పరిష్కారం అయిపోతుందన్నంత రేంజ్ లో  ప్రచారం చేశారు. దీంతో  జగన్ పాలనలో పేరుకుపోయిన సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.  నాలుగు గంటల్లో వెయ్యిమంది ఫిర్యాదులు చేశారంటేనే సమస్యలు ఏ స్ధాయిలో  పేరుకుపోయాయన్నది అర్ధమైపోతోంది. నిజానికి ప్రజా సమస్యల పరిష్కారాలకే ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. గ్రామస్ధాయి నుండి సెక్రటేరియట్ లో పనిచేసే అత్యున్నత స్ధాయి అధికారులందరు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి. అయితే జగన్ హయాంలో ఆ దిశగా పనులు జరగడం లేదనడానికి జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి ఈ స్థాయిలో  ఫిర్యాదులు వెల్లువెత్తడమే నిదర్శనం.   రోడ్లు ,ఆరోగ్య కేంద్రాల పనితీరు, ఫించన్లు, రేషన్  వంటి సమస్యలే అధికంగా ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే  జగనన్నకు చెబుదాం  కార్యక్రమంపై సందేహాలు, అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.  పాలనలో నాలుగేళ్లు పూర్తయ్యాయి.  మరి నాలుగేళ్లలో చేయనిది, చేయలేనిదీ.. ఒక్క ఫోన్ కాల్ కు స్పందించి జగన్ ప్రభుత్వం చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   రాష్ట్రంలో అభివృద్ధే కాదు.. సంక్షేమం కూడా అందని ద్రాక్షగానే మారిందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయన్నది  కేవలం విమర్శే కాదు.. కాదనలేని వాస్తవం.  

వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఇక దబిడి దిబిడే

ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయిందా?  బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు గ్యారంటీయేనా?  అంటే ఈ రెండు పార్టీల  నుంచీ కూడా ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికలకు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది.  దీంతో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని ఆ పార్టీ వర్గాల నుంచే వినవస్తోంది.  యిప్పటికే ఏవో రెండు మూడు జిల్లాలలో  ఒకటి రెండు  నియోజకవర్గాల విషయంలో తప్ప  పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు  దాదాపు ఖరారైపోయాయని కూడా చెబుతున్నారు.  2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందన్న అంచనాల నేపథ్యంలో పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై జరిగిన చర్చలలో తెలుగుదేశం, జనసేనల మధ్య  రెండు పార్టీలకూ ఆమోదయోగ్యంగా ఒప్పందం దాదాపుగా కొలిక్కి వచ్చిందని అంటున్నారు. హీరోగా, పొలిటీషియన్ గా జనసేనాని పవన్ కల్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.  ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలోనే ప్రజలు ఆయన సభలకు హాజరౌతున్నారు.  తెలుగు రాష్ట్రాలలో అత్యంత జనాకర్షణ   ఉన్న నేతలలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు.   అయితే ఈ జనాకర్షణ ఎన్నికలలో విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం కచ్చితంగా ఔనన్న సమాధానం రాదు.  గత ఎన్నికలలో  130కి పైగా స్థానాలలో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించింది.  ప్రస్తుతం కూడా ఆ పార్టీకి జనాదరణ పెరిగినా ఒంటరిగా ఎన్నికల సమరాంగణంలో గెలిచేంత బలం లేదని పరిశీలకులు మాత్రమే కాదు.. జనసేన వర్గాలు సైతం అంటున్నాయి. ఈ  నేపథ్యంలోనే 2014 ఎన్నికలలో వలె తమ పార్టీ ఓట్ల చీలికకు అవకాశం లేని పాత్ర పోషించాలని జనసేనాని సైతం చెబుతున్నారు. అయితే అప్పటి మాదిరిగా పోటీకి దూరంగా ఉండి మద్దతు తెలపడం కాకుండా తమ పార్టీ బలానికి తగ్గట్టుగా ఎంపిక చేసిన నియోజకవర్గాలలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఆ నేపథ్యంలోనే ఆయన గత కొంత కాలం నుంచీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనిచ్చేది లేదని చెబుతూ వస్తున్నారు. ఆయన అన్నఆ మాటతోనే  ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల చర్చ తెరమీదకు వచ్చింది. యిక జనసేన విషయానికి వస్తే  ఆ పార్టీ ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం  జగరలేదు.  అలాగే  జనసేన పార్టీకి సంబంధించినంత వరకూ పవన్ కల్యాణ్ వినా మరో నాయకుడు కనిపించరు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంతే. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నా.. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు. వీరిద్దరినీ మినహాయిస్తే మిగిలిన నాయకులకు పెద్దగా జనంలో గుర్తింపు ఉన్న దాఖలాలు లేవు.  ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన మొదటి నుంచీ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేశారు. శిక్షణ శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాల నమోదుపైనా దృష్టి సారించారు. ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణ  శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. అందుకే   నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ  సంస్థాగతంగా బలంగా ఉంది.  అందుకే  తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు బలంగా చాటుకుని, స్థిరంగా నిలిచింది.   ఏ రాజకీయ పార్టీ అయిన పదికాలాలు  నిలవాలంటే, సంస్థాగత నిర్మాణం  అవసరం. అది లేక పోవడమే  జనసేన  లోపం. ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే, 2019 ఫలితాలే పునరావృతం అవుతాయి. అంతే కాదు,  జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఫలితంలో మార్పు ఉండదు. బీజేపీ దేశంలో బలమైన శక్తి కావచ్చును, కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం బీజేపీకి నిండా ఒక శాతం ఓటు బలం కూడా లేదు. అందుకే  వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకి తప్ప మరో పార్టీకి లేదు.  సో .. వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్  ముందున్న ఏకైక ఆప్షన్  తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకోవడం ఒక్కటే.  అలాగే  తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చే ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ గెలుపును అడ్డుకోవాలన్న లక్ష్యం నెరవేరాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న జనసేనను కలుపుకుని పోవడం ఆ పార్టీకీ అవసరమే. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్యా పొత్తు పొడుపుకు మార్గం సుగమమయ్యేలా చర్చల ప్రక్రియకు తెరలేచింది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా వరకూ ఒక అవగాహన కుదిరింది.  విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఇప్పటికే ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు కూడా చాలా వరకూ ఖరారైందని చెబుతున్నారు.   పొత్తులో భాగంగా ఏడు జిల్లాలలో 20 స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని చెబుతున్నారు. మిగిలిన జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అవగాహన కుదిరిన  స్థానాలు ఇలా ఉన్నాయి.  గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెన పల్లి, కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్ల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలలోనూ జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఇక విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతిలో పొత్తలో భాగంగా జనసేన పోటీ చేస్తుంది.  ప్రకాశం జిల్లా లోని దర్శి, గిద్దలూరు స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించింది. నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనల పొత్తు ఖాయమని ఆ రెండు పార్టీలూ కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నాయి.  పొత్తు చర్చల్లో భాగంగా జనసేన 60 స్థానాల నుంచి బేరాలు మొదలు పెట్టిందని చెబుతున్నారు. అయితే హేతుబద్ధత ఆధారంగా రెండు మూడు చర్చల అనంతరం ఆ సంఖ్యను బాగా కుదించుకుని పాతిక స్థానాలకు ఆమోదం తెలిపిందని అంటున్నారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా.. కష్టనష్టాలను తట్టుకుని, ప్రభుత్వ అణచివేత చర్యలను ఎదుర్కొని పార్టీ కోసం బలంగా నిలబడిన తెలుగుదేశం నాయకుల నుంచి ఆ సంఖ్యలో స్థానాలను వదులు కోవడం యిష్టం ఉండకపోవడంతో.. చర్చల సమయంలో  జనసేన కోరుకున్నా యివ్వలేని స్థానాలపై మరో సారి  చర్చించాలన్న అంగీకారానికి యిరు పార్టీలూ వచ్చాయని చెబుతున్నారు. మొత్తం మీద సీట్ల సర్దు బాటులో  ఒకటి రెండు స్థానాల విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడినా పోత్తు విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందే  యిరు పార్టీల మధ్యా సీట్ల విషయంలో ఒక ఒప్పందం కుదిరిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో భాగస్వామ్యం, మంత్రివర్గంలో బెర్తులు వంటి అంశాలపై జనసైనికులెవరూ మాట్లాడవద్దని జనసేనానిని స్పష్టమైన ఆదేశాలిచ్చారనీ, అందుకే ఆ విషయాల జోలికి వెళ్ల కుండా క్షేత్ర స్థాయిలో తెలుగుదేశంతో కలిసి పని చేయడంపైనే పవన్ పార్టీ దృష్టి పెట్టిందనీ చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రలో జనసేన జెండాల రెపరెపలు, స్థానిక సమస్యలపై ఐక్య పోరాటాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

ప్రభుత్వ భూములు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో

ప్రభుత్వ భూములను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసక్తి చూపుతుందని  కాంగ్రెస్ లెజిస్లేటివ్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపిస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన యాత్ర రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సభలో మల్లు బీఆర్ఎస్ చేస్తున్న కబ్జాలను తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చే ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఆశ చూపి ఇల్లు ఇవ్వకపోగా.. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బలవంతంగా తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందన్నారు.రాజ్య హింస భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నామన్నారు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం, ఎదురు తిరిగితే లాఠీ చార్జీలు, హక్కుగా ఇచ్చిన భూమిలో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ రాజధాని నడిబొడ్డున రాజహింస, భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తుందన్నారు. ‘‘ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే రూ.5 లక్షల కోట్ల విలువైన సుమారు 10 వేల ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కబ్జా చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల పేదల భూములను కూడా 25 లక్షల కోట్ల రూపాయలతో లాక్కుంది. పేదల నుంచి లాక్కున్న భూములను ధనవంతులు, కార్పొరేట్ల కంపెనీలకు, హెచ్‌ఎండీఏ లేఅవుట్ల రూపంలో వేలానికి ఇచ్చారని కాంగ్రెస్‌ నేత ఆరోపించారు.కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్దంగా, మౌనంగా, కనిపించకుండా ప్రభుత్వం రాజ్య హింస చేస్తుంది’’అని భట్టి విక్రమార్క ఆరోపించారు. భట్టి చేపట్టిన యాత్రకు మహేశ్వరం నియోజకవర్గంలో మంచి రెస్పాన్స్ వచ్చింది.