జర..సబర్ కరో కాంగ్రెస్ కు పీకే హెచ్చరిక !
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పెద్ద విషయం కాదు. విశేషం అసలే కాదు. కర్ణాటక ఓటర్లు గడచిన నాలుగు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల్లోనూ మార్పు కు పట్టం కడుతున్నారు.
మళ్ళీ మరో మారు అదే ఆనవాయితీ కొనసాగించారు. మే 10 తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ(బీజేపీ)ని కాదని, ప్రతిపక్ష (కాంగ్రెస్) పార్టీకి పట్టం కట్టారు. సో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం అనూహ్యం కాదని అనుకోవచ్చును. కానీ కాదు. ఎందుకంటే, ఈ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు కాంగ్రెస్ ను గెలిపించ లేదు. బీజేపీని ఓడించారు. మోడీ షా జోడీ కి షాకిచ్చారు. ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ అంచనాలను తల్లకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేని ఆధిక్యత ఇచ్చారు. హంగ్ ఆశలనే కాదు, అత్తెసరు మార్కులతో కాంగ్రెస్ గట్టెక్కుతుందనే అంచనాలను కర్ణాటక ఓటర్లు వమ్ము చేశారు. అలాగే 2018 ఆపరేషన్ కమల్ రీప్లే చేసే అవకాశం కమల దళానికి లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీని భారీ (135/224) మెజారిటీతో గెలిపించారు. బీజేపీ అందులో సగానికంటే తక్కువకు (66) సీట్లకు పరిమితం చేశారు. సుస్థిర పాలన అందించే చక్కని అవకాశం హస్తం పార్టీ చేతి కిచ్చారు.
సరే ... ముఖ్యమంత్రి ఎంపిక విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమేరకు నిలబెట్టుకుంటుంది. ప్రజలు పార్టీకి ఇచ్చిన చక్కని అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే కర్ణాటక గెలుపు అక్కడితో ఆగుతుందా, ఇక్కడి నుంచి 2024లో జరగనునున్న లోక్ సభ ఎన్నికలవరకు జరిగే మరో ఎనిమిది తొమ్మిది రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగుతుందా అనే చర్చ ఇప్పుడు జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తోంది.
నిజానికి ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంలో అదే విధంగా జాతీయ ఎన్నికల రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది అన్ని సందర్భాలలో ఒకేలా ఉండదు. అయితే జాతీయ స్థాయిలో అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఫలితాలు ప్రాణ వాయువు (ఆక్సిజన్) అందించాయి అనడంలో సందేహం లేదు. అయితే కర్ణాటక విజయంతో ఏకంగా ఢిల్లీ పీఠం చే జిక్కింది అనుకోవడం, అయితే అజ్ఞానం కాదంటే అమాయకత్వంతో కూడిన అహంకారం అనిపించుకుంటుందని కాంగ్రెస్ శ్రేయోభిలాషులు సైతం అంటున్నారు.
అదలా ఉంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఒక విధంగా, ‘సబర్ కరో’ అని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల గెలుపు 2024 లోక్ సభ ఎన్నికల విజయానికి ముందస్తు సంకేతం అనుకోవద్దని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాదించిన నిజాన్ని కాంగ్రెస్ శ్రేణులు మరిచి పోరాదని ప్రశాంత కిశోర్ హెచ్చరించారు. అలాగే, 2019 లోక్ సభ ఎన్నికలకు సంవత్సరం ముందు మూడు కీలక రాష్త్రాలు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మరో మారు చతికిలపడిన వాస్తవాన్ని విస్మరించరాదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
అలాగే 2012లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కానీ ఆ తర్వాత రెండేళ్ళకు 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 80 స్థానలకు 73 సీట్లు గెల్చుకున విషయాన్ని గుర్తు చేశారు. నిజానికి ఒక ఎన్నిక ఫలితాలు మరో ఎన్నికల ఫలితాలను కొంత వరకు ప్రభావితం చేస్తే చేయవచ్చు కానీ, కర్ణాటకలో గెలిచాము కాబట్టి తెలంగాణలో, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ చివరకు 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందన్న నిర్ణయానికి రావడం అంత శ్రేయస్కరం కాదని ప్రశాంత కిశోర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.