బావ.. బావ మరిది.. ఓ ఆధిపత్య రాజకీయం!
posted on May 12, 2023 8:54AM
బావ.. ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదన్నట్లు.... బాలినేని తనకు బావే కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం కాదన్నట్లుగా ఆయన బావమరిది, టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహారశైలి ఉందనే ఓ చర్చ ఒంగోలు నగరంలో సూపర్ స్పీడ్‌తో సవారీ చేస్తోంది. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా ఉండగా.. ప్రకాశం జిల్లాలో బాలినేని మాటారాజకీయమే.. బాటా రాజకీయమే.. . చివరకి ఆయన బర్త్ డే ఫంక్షన్ కూడా రాజకీయమే అన్నట్లుగా నడిచింది. ఇంకా చెప్పాలంటే... బాలినేని వాసన్న రాజకీయం అంతా స్మూత్‌గా.. సాఫ్ట్‌గా మూడో కంటికి తెలియకుండా నరుక్కోంటు వెళ్లిపోయేవారని.. అయితే బాలినేనికి మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత.. అప్పటి వరకు కొంగుచాటు కృష్ణుడిలాగా తెరచాటు రాజకీయం చేసిన ఆయన బావమరిది వైవీ సుబ్బారెడ్డి తెరమీదకు ఎంటర్ ది డ్రాగన్‌లాగా ఎంటరై... టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా దేవదేవుడి సన్నిధిలోనే సేవ చేసుకొంటూ కూడా... చిత్తం, చూపులు అన్నీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల చుట్టూనే గిరా గిర్రా తిరుగుతోన్నాయని... ఆ క్రమంలో ఉన్నతాధికారుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఆయనగారి కనుసన్నల్లోనే జరుగుతోండడంతో.. బావగారి సున్నిత మనస్సు.. గట్టిగానే కందిపోయిందని... ఈ నేపథ్యంలో మూడు జల్లాల పార్టీ సమన్వయకర్త పోస్టింగ్‌కి బావగారు బాలినేని మంగళం పాడేశారని... దాంతో ఆ పంచాయతీ కాస్తా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వద్దకు చేరడం.. బాలినేనిని పిలిపించుకొని.. రాజీనామాకి దారి తీసిన పరిస్థితులు... ఆ క్రమంలో బావమరిదిగారు చేస్తున్న రాజకీయ చెదరంగంలో తనను ఓ చెద పురుగుని చేసేశారంటూ సాక్షాత్తూ పార్టీ అధినేత వైయస్ జగన్ ముందే బాలినేని తీవ్ర ఆవేదనకు లోనైనట్లు ఓ చర్చ సైతం ఒంగోలు జిల్లాలో కొనసాగుతోంది.
అయితే సీఎం జగన్‌తో జరిగిన భేటీలో మళ్లీ మూడు జిల్లాల పార్టీ సమన్వయకర్త బాధ్యతలు స్వీకరించాలంటూ పార్టీ అధినేత కోరినా బాలినేని సున్నితంగా తిరస్కరించినట్లుగా ఓ టాక్ వైరల్ అవుతోంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బామ్మర్థి వై వీ సుబ్బారెడ్డి రాజకీయానికి కత్తెర వేయాలని పార్టీ అధినేతను కోరినా అందుకు ముఖ్యమంత్రి జగన్ మిన్నకుండిపోయినట్లు సమాచారం. దీంతో చేసిది లేక.. బాలినేని సైలెంట్‌గా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేశారని తెలుస్తోంది.
మరోవైపు వైవీ సుబ్బారెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా.. అవి విఫలమవుతూనే వస్తున్నాయనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలో కొన.. సాగుతోంది. ఆయన ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా ఉండి కూడా పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని... అలాగే టీటీడీ చైర్మన్‌గా ఆయన హాయాంలో తిరుమలలో వరుసగా చోటు చేసుకొంటున్న పరిణామాల పట్ల భక్తులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ఓ చర్చ ఒంగోలులోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా గట్టిగానే సాగుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా బావమరిది అంటే... బావా బతుకు కోరతాడంటారు... అంతే కానీ ఈ బామ్మర్ధి ఏంటీ.. బావగారి రాజకీయ భవిష్యత్తుకి గంట కొట్టి మంగళహరతులు ఇచ్చేసేలా వ్యవహరిస్తున్నారనే చర్చ ఒంగోలు నగరంలో కొన.. సాగుతోంది. ఏదీ ఏమైనా తమ్ముడు తమ్ముడే పేకాట పేకటే అన్నట్లుగా బామ్మర్థిగారి వ్యవహారం ఉందని అభిప్రాయం సైతం సదరు నగర ప్రజల్లో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.