ఆలీ .. కాట్రవల్లి.. కల తీరేనా?
posted on May 11, 2023 @ 5:10PM
జగమెరిగిన కమెడియన్ అలీ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. బాలా నటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన అలీ వటుడింతై అన్నట్లు ఎదుగుతూ.. వందల్లో కాదు, వేల సినిమాల్లో నటించారు. కమెడియన్ గానే కాకుండా ఒకటో రెండో (ఇంకా ఎక్కువో కూడా) సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు. అలాగే, అలీ ...తో సరదాగా .. కార్యక్రమంతో టీవీ యాంకర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్ని మాటలు ఎందుకు గానీ,తెలుగు సినిమా చరిత్రలో అలీ తనకంటూ ఒక స్థానాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్నారు. సందేహం లేదు.
అంతవరకు అయితే, ఓకే కానీ, ఈలోగా ఆలీని రాజకీయ పురుగు కుట్టింది. సినిమా విజయాలతో సంతృప్తి చెందని ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. నిజానికి ఆలీ రాజకీయలకు కూడా కొత్తకాదు. ఎంతో కాలంగా ఆయన పొలిటీషియన్’ అయిపోవాలని కలలు కంటున్నారు.కాస్ట్యూమ్స్ గట్రా రెడీ చేసుకున్నారు. అప్పుడెప్పుడో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, లంచ్’కి పిలిచి త్వరలోనే గుడ్ న్యూస్ చేపుతానంటే, కొత్త బొత్తాలు కుట్టించుకుని మరీ రెడీ అయి పోయారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యే కాదంటే చివరకు ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా పట్టుకోవాలని, ఆలీ ఎప్పటి నుంచో కలలు కంటూనే ఉన్నారు. ఊరించి ఊరించి ఎట్టకేలకు ఒక నామినేటెడ్ కట్టబెట్టిన జగన్ అలీ అశలను నెరవేర్చారా? అంటే లేదు ఉసూరు మనిపించారనీ అలీ అభిమానులు అంటున్నారు.
అలీ రాజకీయ ప్రవేశం ట్రయల్స్ తెలుగు దేశం టికెట్ కోసం ప్రయత్నించడంతో మొదలయ్యాయి. అప్పట్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి టికెట్ ఖరారైపోయిందన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని తరువాత తెలిసింది. యిక ఆ తరువాత అలీ సినిమా పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు అని చెప్పుకునే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరి రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తలంచారు. అయితే అప్పట్లో టీడీపీ, జనసేన రెండూ పార్టీలకు బాగా దగ్గరగా ఉన్న అలీ.. కేవలం ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోవాలన్న ఆశతోనే.. ఆ రెండు పార్టీలలో టికెట్ రాదన్న కన్ఫర్మ్ చేసుకున్న తరువాత అనూహ్యంగా జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఆయనకు ఆశించిన విధంగా ఎమ్మెల్యే టికెట్ మాత్రం రాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తీరిగ్గా మూడేళ్లు గడిచిపోయిన తరువాత పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన జగన్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరి పెట్టారు. అప్పటికే అన్ని ఆశలూ వదిలేసుకున్న జగన్ సలహాదారు పదవితో సంబరపడిపోయి.. తన స్థాయికి మించిన ప్రకటనలు చేశారు. సినీ పరిశ్రమలో అలీ తనకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే పవన్ కల్యాణ్ పైనే పోటీకి సై అంటూ కామెడీ డైలాగులతో సవాళ్ళూ చేసేశారు.
అదలా ఉండే యిప్పుడు ఏపీలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు యింకా ఏడాది సమయం ఉన్నా.. ముందస్తు ఉహాగానాల నేపథ్యంలో ఆశావహులు తమతమ పార్టీల అధినేతలను ప్రసన్న చేసుకుని టికెట్ కన్ఫర్మ్ చేయించుకోవడానికి ప్రయత్నాలను షురూ చేసేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అలీకి వైసీపీ నుంచి పోటీ చేయడానికి టికెట్ లభిస్తుందా? అందుకోసం ఆయన ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? అన్న సందేహాలు సహజంగానే అలీ అభిమానుల్లో వ్యక్తమౌతున్నాయి.
అలీ అయితే రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీకి ఫిక్స్ అయిపోవడమే కాకుండా ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలను సెలక్ట్ చేసుకుని సర్వేలు కూడా చేసి అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చారని అంటున్నారు. ఇందులో గుంటూరు ఈస్ట్, కర్నూలు సిటీ, కడప సిటీ, రాజమండ్రి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయనీ ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏ చోట నుంచి పోటీ చేసినా సరే కచ్చితంగా గెలుస్తాననే ధీమా అలీకి ఉందట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే అలీ చెప్పినదంతా విన్న జగన్.. ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదట.
తల్లినీ, చెల్లినే కాదు పొమ్మన్న వైసీపీ అధినేత జగన్ అలీకి పార్టీ టికెట్ ఇస్తారా? రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి తర్వాత తండ్రి అంతటి బాబాయ్ నే పక్కకు తప్పించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ రెడ్డి అలీ కి ఎన్నికలలో పోటీకి అవకాశం కల్పిస్తారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే అలీ ఆశిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికే హేమాహేమీలు పోటీకి రెడీగా ఉన్నారు. మరి వారిని కాదని జగన్ అలీకి టికెట్ ఇస్తారా? ఒక వేళ ఇస్తే గన్ ప్రభుత్వం ఎదుర్కుంటున్న వ్యతిరేక సునామీలో కొట్టుకుపోకుండా నిలబడగలరా? నిలబడి గెలవగలరా అన్న అనుమానాలు ఆయన అభిమానుల్లో వ్యక్తమౌతున్నాయి. మొత్తం మీద అన్నం పెట్టిన సినీ పరిశ్రమలో అయిన వాళ్లని కాదనుకుని మరీ జగన్ పంచన చేరిన అలీ తన ఎన్నికల్లో పోటీ ఆశ ఈ సారైనా నెరవేరుతుందా? చూడాలి.