పొత్తు ఖాయం.. సీఎం ఆయనే.. కుండబద్దలు కొట్టిన పవన్
posted on May 12, 2023 9:17AM
జనసేనాని గుప్పెట విప్పేశారు. పొత్తులు ఉంటాయని కుండ బద్దలు కొట్టేశారు. అదే సమయంలో తాను ముఖ్యమంత్రి పదవి రేసులో లేననీ, ఆ పోస్టు కోసం వెంపర్లాడబోననీ కూడా తేటతెల్లం చేసేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ అవినీతి పాలన అంతమొందించడమే లక్ష్యమని మొదటి నుంచీ చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కండా ఉండేందుకు తన వంత ప్రయత్నం, కృషి చేస్తానని గతంలోనే ప్రకటించారు.
ఏపీలో బలం ఉన్న, బలంగా ఉన్న పార్టీలు మూడే మూడు. అవి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, అధికార పార్టీ వైసీపీ, జనసేన. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించిన రోజునే.. ఆయన తెలుగుదేశంతో పొత్తు ఉంటుందన్న సంకేతాలిచ్చారని అందరికీ తేటతెల్లమైపోయింది. బీజేపీని కూడా ఒప్పిస్తాననీ, ఆ పార్టీకి యిప్పటికే మిత్రపక్షమైన జనసేన క్లియర్ గా చెప్పింది. దీంతో ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా 2014 ఎన్నికల నాటి పొత్తులు మళ్లీ పొడుస్తాయని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. అయితే నరం లేని నాలుక నానా విధాలుగా మాట్లాడుతుందన్నట్లు కొందరు సామాజికవర్గం పేరు చెప్పి సీఎం పదవి విషయంలో చేసిన వ్యాఖ్యలో కొంత గందరగోళాన్ని సృష్టించాయి.
దానిని పునాదిగా చేసుకుని అధికార వైసీపీ కూడా సింహం సింగిల్ గా వస్తుంది వంటి పంచ్ డైలాగులతో పొత్తలపై విమర్శల వర్షం కురిపించింది. అన్నిటికీ మించి జనసేన పార్టీలో కొత్తగా కార్యదర్శి పదవి పొందిన జనసేనాని సోదరుడు తాజాగా చేసిన వ్యాఖ్యలతో సానుకూల వాతావరణం చెడుతుందా అన్న భావన సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ పొత్తులు, ముఖ్యమంత్రి పదవి వంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయంగా పెట్టుకుంటున్నామని ప్రకటించారు. సీఎం పదవి విషయంలో జరుగుతున్న ప్రచారానికి కూడా తెర దించే శారు. తాను సీఎం పదవిని అడగబోనని కుండబద్దలు కొట్టేశారు.
ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని ఢీకొని కూలదోయడానికి జరిగే ప్రయత్నంలో షరతులు పెట్టే ప్రశక్తే లేదని తేల్చేశారు. ప్రజలు కావాలని కోరుకుంటే సీఎం అవుతానన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు జనం 30 స్థానాలు ఇచ్చి ఉంటే యిప్పుడు తాను సీఎం రేసులో ఉండేవాడినని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికలలో తాను సీఎం రేసులో లేనని విస్పష్టంగా తేల్చేశారు. జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాలలో 30శాతం ఓటింగ్ ఉందన్నరు. అందుకు అనుగుణంగానే జనసేనకు ఉన్న బలం మేరకే పొత్తులో భాగంగా సీట్లు కోరుతానని పవన్ కల్యాణ్ చెప్పేశారు.
పొత్తుల విషయంలో తన స్టాండ్ మారలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా పొత్తులతోనే బలపడ్డాయని గుర్తు చేశారు. ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో తాను వచ్చే నెల 3వ తేదీ నుంచీ ఏపీలోనే ఉంటానని చెప్పిన జనసేనాని.. పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని తాను ఒప్పిస్తానని చెప్పారు. ఇదే విషయం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కూడా మాట్లాడారు. బీజేపీ కూడా కలిసి రావాలని ఢిల్లీలో పవన్ చర్చలు జరిపినట్లుచెబుతున్నారు.
ఒక వేళ బీజేపీ రాకపోతే.. టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారని ఆయన తాజా వ్యాఖ్యలతో నిర్ధారణ అయిపోయిందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం పదవి విషయంలో తమ క్యాడర్ చేస్తున్న వ్యాఖ్యలతో పొత్తు అంశం ముందుకు సాగకుండా అడ్డం పడకుండా ఆదిలోనే చెక్ పెట్టేశారు. పవన్ తాజా వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది స్పష్టమైపోయిందని పరిశీలకులు చెబుతున్నారు.