భయపెట్టిన జగన్.. భయపడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో పాటు పొత్తుపడుపుల అంచనాలూ జోరందుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల కోసం తొందరపడుతున్నదీ, ఎన్నికలంటే భయపడుతున్నదీ ఒక్క అధికార పార్టీ వైసీపీ మాత్రమే. గత నాలుగు సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల నుంచీ అసమ్మతి మూటగట్టుకోవడమే కాకుండా సొంత పార్టీలో కూడా అసమ్మతి కుంపట్లు రగిల్చిన వైసీపీ యిప్పుడు ముందస్తు ఎన్నికలకు తొందరపడుతోంది.
అదే సమయంలో ఎన్నికలంటే ఓటమేనా అన్న భయంలోనూ ఉంది. ఈ అభిప్రాయం రాజకీయవర్గాలలో కలగడానికి ఆ పార్టీ అధినేత జగన్ సహా, సీనియర్ నేతలు చేస్తున్న ప్రకటనలే కారణం. పార్టీలో అసమ్మతి గళాలు పదునెక్కుతున్నాయి.. నేరుగా అధినేత విధానాలనే విమర్శిస్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో జగన్ ను కూడా వరుసగా చిక్కులు చుట్టుముట్టాయి. వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ, వైఎస్ సమీప బంధువు అవినాష్ రెడ్డి బయటపడలేనంతగా యిరుక్కుపోవడం, ఆయన అరెస్టునకు యిన్నాళ్ళుగా రక్షణ కవచాలుగా నిలిచిన కోర్టులు.. అరెస్టునకు లైన్ క్లియర్ చేయడం.. అదే సమయంలో హత్య జరిగిన సమయంలో వివేకా రాసినట్లుగా చెబుతున్న లేఖ విషయంలో గతంలో జగన్ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా యిప్పుడు అవినాష్ మీడియా సమావేశాలలలోనూ, సెల్ఫీ వీడియోలలూనూ మాట్లాడుతుండటంతో జగన్ చిక్కుల్లో పడ్డారనీ, ఆ కేసు విషయంలో జగన్ తీరు పట్ల పొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోందనీ పరిశీలకులుఅంటున్నారు.
అదే సమయంలో మాట తప్పను మడమ తిప్పను అంటూ బీరాలు పోయిన ముఖ్యమంత్రి యిప్పుడు తనను ధిక్కరించే వారిని బుజ్జగించడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తుండటం చూస్తుంటే.. పార్టీపై ఆయనకు ఉన్న పట్టు సడలందన్న విశ్లేషణలు పరిశీలకుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, 2024 ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల గాయాలకు, మంత్రుల ఉద్వాసనతో చికిత్స చేయాలనే నిర్ణయానికీ వచ్చారు. ఈ నేపధ్యంలోనే ఐదారుగు,మంత్రులకు ఉద్వాసన చెప్పే ఆలోచన కూడా చేశారు. మంత్రివర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరించాలనీ భావించారు.
అయితే వివేకా హత్య కేసు విషయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యం కావడం, దానిని ఆపేందుకు ఆయన హస్తిన వెళ్లి మరీ చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో ఆయన టోన్ మారడం... హస్తినలో ఆయనకు సీన్ రివర్స్ అవ్వడమే కావడం కారణమని పరిశీలకులు అంటున్నారు. అందుకే మంత్రులకు ఉద్వాసన, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆలోచనను విరమించుకున్నారనీ విశ్లేషిస్తున్నారు. అందుకే గడపగడపకూ టెస్ట్ లో ఫెయిలైన మంత్రులు, ఎమ్మెల్యేల (వీరి సంఖ్య దాదాపు 40 వరకూ ఉంటుందని అంచనా) పై వేటు కాదు సరికదా కనీసం మందలింపు కూడా చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం జగన్ ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే, టిక్కెట్ విషయం ధృవీకరించురకునేందుకు జగన్ ను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆయన మళ్ళీ టికెట్ ఇచ్చేది లేదని చెప్పడంతో... ఆ ఇద్దరూ.. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో .. మా ఇంటికి మీ ఇల్లూ అంతే దూరమన్న చందంగా ఆత్మ ప్రభోధం మేరకు ఓటు వేశారు. యిలాంటి తక్షణ తిరుగుబాటును ఊహించని జగన్ కంగుతిన్నారు.
అప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాలనూ తెలుగుదేశం కైవశం చేసుకోవడంతో జగన్ రెడ్డి షాక్’కు గురయ్యారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలకు, ఇంటెల్జెన్సీ వర్గాల నుంచి ఎలాంటి నివేదికలు వచ్చాయో ఏమో కానీ, ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించి పెట్టవలసిన నాలుగు పెట్టి పంపారని అంటున్నారు. నిజానికి, కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళ్ళారనే విషయంలో అప్పట్లో అనేక ఊహాగానాలు వినిపించినా, నిజానికి ముఖ్యమంత్రి తనంతట తానుగా ఢిల్లీ వెళ్ళలేదని, ఢిల్లీ పెద్దల ‘ఆదేశం’ మేరకే ఆయన హస్తిన వెళ్ళారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఇంటెల్జెన్సీ వర్గాలు అందించిన సమాచారం మేరకే, ఢిల్లీ పెద్దలు జగన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి పరిస్థితిని వివరించారని అంటున్నారు.
అందుకే విషయ తీవ్రతను దృష్టిలో ఉంచుకునే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బాగా పొద్దుపోయిన తర్వాత, అర్థ రాత్రికి అరగంట ముందు జగన్ రెడ్డికి అప్పాయింట్మెంట్ ఇచ్చారనీ, అంతే కాకుండా ఆ సందర్భంగా ముఖ్యమంత్రి తమ ధోరణి మార్చుకోకపోతే, చాలా పెద్ద సంఖ్యలో, ఇంచు మించుగా హాఫ్ సెంచరీ వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా అమిత్ షా జగన్ ను హెచ్చరించినట్లు చెబుతున్నారు. అందేకే హస్తిన నుంచి తిరిగి వచ్చిన తరువాత జగన్ అసమ్మతి ఎమ్మెల్యేల విషయంలో.. అలాగే గడపగడపకు కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోని ఎమ్మెల్యేల విషయంలో పూర్తిగా యూటర్న్ తీసుకుని బుజ్జగింపుల పర్వంలోకి దిగారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.