కామన్ సివిల్ కోడ్ కు హిమంత బిశ్వ ముందడుగు
posted on May 11, 2023 @ 5:03PM
మన చట్టాలు బహు భార్యత్వాన్ని నిషేదించాయి. ఒక్క ముస్లిం పర్సనల్ లా షరియత్ మాత్రమే బహు భార్యత్వాన్ని అంగీకరించాయి. దేశమంతా కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలని కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అసోంలో బిజెపి ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ తీసుకురావడానికి పావులు కదుపుతోంది. బహు భార్యత్వంపై 2024లోపు నిషేధం విధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం ప్రకటించారు.
రాష్ట్రంలో బహుభార్యత్వ నిషేధాన్ని అమలు చేయడంపై సమగ్ర అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కమిటీ ఏర్పాటు ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు.కమిటీ తన నివేదికను సమర్పించడానికి మూడు నెలల సమయం ఇవ్వబడుతుంది.
‘‘అసోంలో బహుభార్యత్వంపై ఈ సంవత్సరం చివరి నాటికి 2024లోపు మనం బహుభార్యాత్వాన్ని నిషేధించే చట్టాన్ని తీసుకురాగలమని నేను ఆశిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు
"రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని నిషేధించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందో లేదో పరిశీలించేందుకు అసోం ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది" అని ట్వీట్‌లో పేర్కొన్న మూడు రోజుల తర్వాత శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ బహుభార్యత్వాన్ని నిషేధించాలని శర్మ చేసిన ప్రకటనను వ్యతిరేకించారు.
రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని, అయితే ముఖ్యమంత్రి షరియత్ కు వ్యతిరేక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారని ఆయన ఎద్దేశా చేశారు.
అజ్మల్ ప్రకటనపై హిమంత బిశ్వ శర్మ స్పందించారు. “అతను (బద్రుద్దీన్ అజ్మల్) మా ప్రతిపక్షం. ఆయన నాకు మద్దతిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఎలా ఓటు వేస్తారు? కాబట్టి, నేను అజ్మల్‌కి ప్రాముఖ్యత ఇవ్వదల్చుకోలేదు’’ అని హిమంత అన్నారు.
కామన్ సివిల్ కోడ్ తీసుకురావడానికి బిజెపి ప్రభుత్వం ముందడుగు వేసిందనే చెప్పుకోవచ్చు.