పేటీఎం వర్మా నీ రేటెంత.. సోషల్ మీడియాలో దుమ్ముదుమారం!
posted on Jun 26, 2023 7:08AM
సోషల్ మీడియా విస్తృతం అయ్యాక సెలబ్రిటీలు దాన్నే వ్యాపారంగా మలచుకొని కాసులు పోగేసుకుంటున్నారు. బాలీవుడ్ హీరోలనే తీసుకుంటే వీళ్ళు ఒక్కో ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు రూ.కోట్లలోనే వసూలు చేస్తారు. వ్యాపార సంస్థలు వారి ప్రోడక్ట్స్ సేల్ చేసుకొనేందుకు వీరిని ఉపయోగించుకుంటారు. వ్యాపారసంస్థలు ఈ సెలబ్రిటీలకు ఇన్‌ఫ్లూయెన్షర్లు అని పేరు కూడా ఒకటి పెట్టుకున్నారు. ఈ ఇన్‌ఫ్లూయెన్షర్లు వ్యాపార సంస్థల నుంచి డబ్బు తీసుకుని వారి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. దీనికి ప్రధాన ఆయుధం సోషల్ మీడియానే. ఇందులో ఎంత ఫాలోయింగ్ ఉంటే అంత డబ్బు ఈ సెలబ్రిటీల సొంతం అవుతుంది. దీనిని వ్యాపార భాషలో చెప్పాలంటే డిజిటల్ మార్కెట్ అని కూడా అంటుంటారు.
అలాగే, అదే సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు కూడా తమదైన శైలిలో వాడుకుంటుంటాయి. తమకి గిట్టని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలపై రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా బురదజల్లే పని చేస్తుంటాయి. దీని కోసం ఏ పార్టీకి ఆ పార్టీ డిజిటల్ విభాగాలను సైతం ఏర్పాటు చేసుకొని భారీగానే ఖర్చు చేస్తుంటుంది. ఈ డిజిటల్ విభాగాలు భారీగా నిరుద్యోగ యువతను రిక్రూట్ చేసుకొని వారితో ఈ యాక్టివిటీలను చేయించడంతో పాటు నెటిజన్లతో కూడా రాజకీయాలు, పార్టీలు, నేతల వ్యక్తిగత జీవితాలపై కూడా పోస్టులు, కామెంట్లు చేయిస్తూ ఒక్కో పోస్టుకు ఇంత అని డబ్బులు ముట్టజెప్తుంటాయి. మొదట్లో ఈ లావాదేవీలన్నీ డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారానే జరిగేది. ఇప్పుడు రకరకాల మార్గాల ద్వారా ఈ లావాదేవీలు జరుగుతున్నాయి.
కాగా, టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా వ్యూహం అనే సినిమా టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. యధావిధిగా ఈ టీజర్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబును నెగటివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు. వైఎస్ఆర్ మరణం నుండి జగన్ సీఎం అయ్యేవరకు జరిగిన కథతో తెరకెక్కిన సినిమాగా చెప్పుకుంటున్న ఈ సినిమా కథలో చంద్రబాబే అంతా చేయించాడనే మాదిరి టీజర్ ద్వారా ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ టీజర్ తోనే ఈ సినిమా భవిష్యత్ తేలిపోయింది. అయితే, ఈ టీజర్ చూసిన టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు వర్మపై ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. నిజానికి వాస్తవ కథ పేరుతో వైసీపీ స్క్రిప్ట్ ఆధారంగా ఈ సినిమాను వర్మ తెరకెక్కించడం ఆయనను ఇష్టపడే వారికి సైతం వెగటుగా మారింది. ఇక టీడీపీ ఫాలోవర్లయితే సోషల్ మీడియాలో విమర్శలతో దుమ్ము రేపుతున్నారు.
వర్మ సినిమాలను ప్రేక్షకులు అసలు పట్టించుకోవడం కూడా మానేయడంతో బార్లు, పబ్బుల ఖర్చుల కోసం తన టాలెంట్ ను జగన్మోహన్ రెడ్డికి అమ్మేసుకున్నాడని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఎవడబ్బ సొమ్ము కాదు టాలెంటు అంటూనే వైసీపీ కోసం ఇంతకి దిగజారి పోయావా వర్మా అంటూ ఏకి పారేస్తున్నారు. నీ రేటెంతో చెప్పు పేటీఎం వర్మా.. ఒక్క రూపాయి ఎక్కువే ఇస్తాం అసలు నిజాలు బయటపెట్టు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ కి పోస్టుకి రూ.5 ఇస్తే.. నీకు రూ.10 ఇచ్చారా వర్మా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి ఒక్క టీజర్ కే ఇంతలా ఈ యుద్ధం మొదలైతే.. రేపు ట్రైలర్.. ఆ తర్వాత సినిమాపై ఎలాంటి వ్యతిరేకత వస్తుందో.. ఇంకెన్ని కామెంట్లు చదవాల్సి వస్తుందో!