అధికారాన్ని వీళ్ళలా ఎవరూ వాడుకోలేరేమో!
posted on Jun 26, 2023 7:14AM
ఎంపీ వైఎస్ అవినాష్ జైలుకు వెళ్లక తప్పదు.. రేపో మాపో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనుంది. ఈసారి సీబీఐ విచారణకి అవినాష్ హాజరవుతారా? లేక సాకులు చెప్పి డుమ్మా కొడతారా? ఈసారి సీబీఐ విచారణలో ఏమైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయా? అసలు వివేకా హత్యకేసులో కోర్టు విచారణ ముగుస్తుందా? సీబీఐ అసలు ఈ కేసులు తేల్చేస్తుందా? ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో మొన్నటి వరకు ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు, అంతకు మించిన ఊహాగానాలు ప్రచారంలో ఉండేవి. కానీ, ఇప్పుడు అవేమీ ఎక్కడా వినిపించడం లేదు. మొన్నటి వరకు బ్రేకింగులు, ప్యాకేజీలు, ఎపిసోడ్లకు ఎపిసోడ్లు ప్రసారం చేసిన మీడియా చానెళ్లు సైతం ఈ కేసు అంశాన్ని పక్కన పెట్టేశాయి. ఈ హత్య కేసులో కీలకంగా కొన్ని వారాల పాటు రోజూ వినిపించిన అవినాష్ కూడా మళ్ళీ తిరిగి ప్రజల మధ్యకి వచ్చేశాడు.
ఔను.. ఎంపీ అవినాష్ రెడ్డి గడపగడపకి కార్యక్రమంలో భాగంగా కడప నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మందీ మార్బలంతో ఇంటింటికీ తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. వార్తా పత్రికల కడప జిల్లా పేజీలలో కూడా అవినాష్ పర్యటనను బాగా ప్రచారం అయ్యేలా చూసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కాస్త సైడ్ అయిపోయిన అవినాష్ మెల్లగా మళ్ళీ రాజకీయాలపై ఫోకస్ పెంచుతున్నారు. దీంతో ఈ విషయం చూసిన స్థానిక ప్రజలు, సోషల్ మీడియాలో అవినాష్ పర్యటన పోస్టులను చూసిన నెటిజన్లు అసలు ఈ కేసులో దోషులకు శిక్ష పడుతుందా? అసలు ఈ కేసు విచారణ తేలేదేనా? అంటూ చర్చించుకుంటున్నారు.
అయితే, ఈ హత్య జరిగిన తీరు, సీబీఐ దర్యాపు, ఏపీలో పోలీసుల వ్యవహారం, మొత్తంగా ఈ హత్య కేసు విచారణ చుస్తే.. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చా? ఎంతటి నేరాల నుండైనా తప్పించుకోవచ్చా? అనే అనుమానాలు రాక మానవు. అంతేకాదు, బహుశా అసలు వీళ్ళలా అధికారాన్ని ఎవరూ వాడుకోలేరేమో అని కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ కేసు విచారణను గమనిస్తే తొలి రోజు నుండే ఎక్కడిక్కడ భారీ ఎత్తున వ్యవస్థలను మ్యానేజ్ చేశారని స్పష్టమవుతుంది. సీబీఐ కూడా పలుమార్లు న్యాయస్థానాలకు అదే వెల్లడించింది. చివరికి సీబీఐ అధికారులను కూడా ఈ కేసు విచారణకు రాకుండా అడ్డుకొనేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇక పోలీసుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివేకా కూతురు సునీతనే ఎన్నోసార్లు మీడియా ముందు మొరపెట్టుకున్నారు. కేసును కూడా పక్క రాష్ట్రానికి కేటాయించే వరకు శ్రమించారు.
ఈ కేసులో హైలెట్ అంశం అవినాష్ రెడ్డి. అతను నేరం చేశాడా లేదా అన్నది రేపో మాపో కోర్టు తెలుస్తుంది కానీ.. తనకి ఉన్న ఓపిక మాత్రం సాధారణమైనది కాదు. ఈ కేసు విచారణ ఎన్నో మలుపులు తిరిగినా.. అన్నీ అవినాష్ వైపే ఉన్నా.. అతను మాత్రం ఓర్పుతో నేర్పుతో చాకచక్యంగా వ్యవహరించారు. చివరికి ఆయన మాతృమూర్తి శ్రీలక్ష్మీ అనారోగ్య పరిస్థితిని కూడా తనకి అనుకూలంగా మలచుకోవడంలో అవినాష్ రెడ్డి వందకి వంద మార్కులు కొట్టేశారు. ఏదైతేనేం మళ్ళీ అవినాష్ ప్రజల మధ్యకి వస్తున్నారు. ఇక్కడ న్యాయం గెలిచిందా? వ్యవస్థలు గెలిచాయా అన్నది ముందు ముందు తేలాల్సి ఉంది. అయితే, కాస్త ఆలస్యం అయినా చివరికి గెలిచేది న్యాయమే అనే పాత సామెత అందరికీ తెలిసిందే. ఒకవేళ ఆ న్యాయస్థానాలలో న్యాయం మరింత ఆలస్యమైనా ప్రజా క్షేత్రంలో ప్రజలే సరైన న్యాయం చెప్పడం గ్యారంటీ!