పోసాని గెస్ట్ ఆర్టిస్టా.. పెయిడ్ ఆర్టిస్టా?
posted on Jun 24, 2023 @ 2:41PM
జగన్ రెడ్డిని భుజాన మోయడంలో పోసానికి ఎవరూ పోటీ రాలేరు. అటువంటి పోసాని కృష్ణ మురళి కూడా జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత కానీ ఓ నామినేటెడ్ పోస్టుకు నోచుకోలేదు. అయితే పార్టీ కోసం పని చేసినందుకు పోసానికి ఆ పోస్టు వచ్చిందని స్వయంగా పోసాని కూడా నమ్మడం లేదు. ఇక పార్టీ శ్రేణులైతే పోసానికి పోస్టుపై భయంకరమైన జోకులు కూడా వేసుకుంటున్నాయి.
2019 ఎన్నికలకు ముందు జగన్ పార్టీ కోసం పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు పని చేసినప్పటికీ.. అందరిలోకీ బాగా గుర్తింపు వచ్చిందీ, అలా వచ్చేలా విపక్షాలపై నోరు వేసుకు పడిపోయిందీ మాత్రం ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, మాటల రచయత నుంచి నటుడిగా, రచయతగా, దర్శక నిర్మాతగా చివరాఖరికి రాజకీయ వేత్తగా మారిన పోసాని కృష్ణ మురళీ మాత్రమే. ఇక కమేడియన్ అలీ అన్ని పార్టీలనూ చుట్టేసి ఎక్కడ తనకు సేఫ్ అని బేరిజు వేసుకుని మరీ గత ఎన్నికల ముందు వైసీపీ గూటికి చేరారు. పృధ్వీరాజ్, పోసాని ఎన్నికలలో పోటీ కోసం టికెట్ ఆశించలేదు కానీ, ఆలీ మాత్రం ఎన్నికలలో పోటీ చేసి అసెంబ్లీకో లేకపోతే పార్లమెంటుకో చెక్కేద్దామని మాత్రం భావించారు.
ఇక పృధ్వికి అయితే సొంత కెరీర్ ను ఫణంగా పెట్టి మరీ చేసిన ఓవర్ యాక్షన్ కు తగ్గ ఫలితం వెంటనే వచ్చింది. ఎస్వీబీసీ చైర్మన్ గా ఈ ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఓ పొస్టు దక్కింది. అది మూణ్నాళ్ల ముచ్చటే అయ్యిందనుకోండి అది వేరే విషయం.
కానీ అలీ, పోసోనిలకు మాత్రం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ తరువాత తీరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాకా ఇద్దరికీ చెరో పదవీ ఇచ్చి జగన్ చేతులు దులిపేసుకున్నారు. అలీ వరకూ అయితే వచ్చే ఎన్నికలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఇచ్చి పోటీకి నిలబెడతానన్న హామీ దక్కిందని పార్టీ వర్గాల సమాచారం. ఇక పోసాని విషయానికి వస్తే.. ఆయన గత ఎన్నికల ముందు నుంచీ వైసీపీకి గెస్ట్ ఆర్టిస్ట్ గానే సేవలందిస్తూ వస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని వివాదం చేయడానికి సినిమాలలో సంభాషణల రచయతగా తనకున్న అనుభవాన్నంతా రంగరించి భాషా పాండిత్యాన్ని మీడియా ముందు ప్రదర్శించడం.. ఆ తరువాత బుల్లి తెరలో రియాల్టీ షోలు, ఇతర సరదా కార్యక్రమాలలో తన విలక్షణ నటనకు పరిమితమైపోవడం పరిపాటిగా మారింది. అయితే విషయమేమిటంటే ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన జగన్ సర్కార్ కు అనుగుణంగా ఏర్పాటు చేసిన, చేస్తున్న ప్రతి మీడియా సమావేశంలోనూ పెయిడ్ ఆర్టిస్టుగానే వ్యవహరిస్తున్నారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ప్రభుత్వంపై, వైసీపీ నాయకులపై ఎక్కుపెడుతున్న విమర్శనాస్త్రాలకు అధికార పార్టీ కాళ్ల కింద భూమి కదిలిపోతోందా అన్నట్లుగా ఖంగారు పడుతున్నారు. ఒక వైపు లోకేష్ పాదయాత్ర, మరో వైపు వారాహి యాత్ర వైసీపీని గాభరాపెడుతున్నాయి. వారి యాత్రలకు వస్తున్న అశేష జనసందోహం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో గోదావరి జిల్లాలలో ఎన్నికలలో గెలుపుఓటములను ప్రభావితం చేయగలిగే కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకురావడం ద్వారా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రభావాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా పవన్ భాషను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం పేర్ని నాని వంటి కాపునాయకుల ఎదురుదాడి పెద్దగా ప్రభావం చూపకపోవడంతో కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ తెరపైకి వచ్చారు.
పవన్ కల్యాణ్ కాకినాడ ఎమ్మెల్యే పై చేసిన విమర్శలను తప్పుపడుతూ తెరముందుకు వచ్చిన ముద్రగడ పవన్ పై విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా గతంలో కాపు ఉద్యమానికి ఉప్మాలు, లారీలు సప్లై చేసిన ద్వారంపూడిని విమర్శిస్తావా అంటూ బహిరంగ లేఖ రాశారు. అది బూమరాంగై కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసింది. ఇవిగో నీ ఉప్మా డబ్బులు అంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన యువత ముద్రగడకు మనీయార్డర్లను వెల్లువలా పంపింది. కాపు ఉద్యమాన్ని వైసీపీకి తాకట్టు పెట్టేశారంటూ ముద్రగడపై విమర్శలు గుప్పించింది. ఆయన కారణంగానే కాపు రిజర్వేషన్లు అందకుండా పోయాయని దుమ్మెత్తి పోసింది. దీంతో ముద్రగడకు మద్దతుగా మాట్లాడేందుకు పోసానిని వైసీపీ వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకువచ్చింది.
పోసాని ముద్రగడ కు మద్దతుగా.. పవన్ కు వ్యతిరేకంగా తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేశారు అది పక్కన పెడితే పవన్ కల్యాణ్ భాష విషయంలో ఒకింత సంయమనం పాటించాలనీ, హుందాగా ఉండా లని పోసాని సుద్దులు చెప్పారు. విషయం లేక పోసాని సినిమా స్టైల్ లో మాయ చేయాలనుకున్నారనీ.. కానీ గతంలో ఇదే పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అసభ్యంగా పోసాని మాట్లాడిన మాటలను సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ఎత్తి చూపి నిలదీస్తున్నారు. నీతులు చెప్పే వారు నీతిగా ఉండటం అవసరమనీ, ముందుగా పోసాని తన భాషను సంస్కరించుకోవాలని హితవు చెబుతున్నారు. గతంలో అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించిన ఈ నట శూన్యకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి సొమ్ములు తీసుకుంటూ.. రాజకీయ విమర్శలు చేయడం పెయిడ్ వ్యవహారంగా కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పోస్టు పొంది అధికార పార్టీకి అడ్డగోలుగా వత్తాసు పలకుతున్న పోసాని తీరును జనసైనికులే కాదు.. సామాన్య జనం కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.