జగన్‌లో బాలయ్య టెన్షన్
posted on Jun 24, 2023 @ 1:32PM
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నందమూరి ఫ్యామిలీకి కంచుకోట అన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు, తెలుగుదేశం నాయకుడు నందమూరి బాలకృష్ణ వరుసగా గెలుపొందుతున్నారు. అయితే ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడించేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అందులో భాగంగానే హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ జా దీపిక అనే మహిళను ఎంపిక చేసే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జూన్ 21వ తేదీన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంపై సీఎం జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దీపికను సీఎం వైయస్ జగన్ ఆహ్వానించడం.. ఆమెకు తొలి వరుసలో మహిళామంత్రుల పక్కనే కూర్చునే అవకాశం ఇవ్వడం, అందుకు సంబంధించిన వీడియోలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బాలయ్య ప్రత్యర్థి దీపికేనా అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. హిందూపురం నియోజకవర్గంలో అగ్రనేతలు ఇక్బాల్, అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్‌లను పక్కన పెట్టి మరీ దీపికను పిలవడంతో నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రసకందాయంలో పడిందనే అంటున్నారు.
కాగా హిందూపురంలో వైసీపీలో గ్రూపు రాజకీయాలకు కొదవే లేదు. అటువంటి గ్రూపుల్లోని వ్యక్తిని కాకుండా.. ఎప్పుడూ ఎవరూ ఊహించని విధంగా దీపికను ఇలా ఒక్క సారిగా తెరపైకి తీసుకు రావడం వెనుక జగన్ ఆంతర్యం ఏమిటనే సందేహం స్థానిక నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అయితే ఈ ఎపిసోడ్‌లో పార్టీ రాయలసీమ ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అదీకాక కర్ణాటక అసెంబ్లీకి ఇటీవలే ఎన్నికైన ఓ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేతోపాటు ఈ దీపిక.. తాజాగా సీఎం జగన్‌తో భేటీ అయినట్లుటాక్. అయితే దీపికకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన సీఎం జగన్.. తమకు ఎందుకు ఇవ్వడం లేదని అటు నిశ్చల్ వర్గం, ఇటు ఇక్బాల్ వర్గం, మరోవైపు మధుమిత వర్గం గుర్రుగా ఉన్నాయని సమాచారం.
మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు... చేపడుతోన్నారు. ఆ క్రమంలో అన్నా క్యాంటీన్లు, ఆరోగ్య సంజీవినీ తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు సైతం చేపట్టి.. ప్రజల మనస్సులు చూరగొని.. తనదైన శైలిలో ఆయన దూసుకు పోతున్నారు. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం రాయలసీమలో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకొంది. అందులో హిందూపురం ఒకటి కావడం గమనార్హం.
ఇంకోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తన యువగళం పాదయాత్రను రాయలసీమ నుంచి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఆయన నిర్వహించిన పాదయాత్రకు అక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం విదితమే. అలాగే ఇటీవల తూర్పు, పశ్చిమ రాయలసీమల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక్లలో సైతం టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి వేళ టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల కోసం సీఎం జగన్ అన్వేషణ చేపట్టారు. ఆ అన్వేషణలో భాగంగానే దీపికను బాలయ్యకు ప్రత్యర్థిగా ఎంపిక చేశారని అంటున్నారు.