జగన్ రెడ్డికి కేంద్రం ప్రత్యేక వెసులుబాట్లు

మాటల్లో విమర్శలు.. చేతల్లో వత్తాసు.. ఇదీ జగన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి. ఆంధ్రప్రదేశ్  ప్రజల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తీరు మాటల్లో పలకరింపు, నొసటితో వెక్కిరింపు అన్న చందంగా ఉంది. గత నాలుగేళ్లుగా జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను అన్ని విధాలుగా సమర్ధిస్తూ వచ్చిన మోడీ సర్కార్.. ఇక ఎన్నికల సంవత్సరం వచ్చే సరికి ఎక్కడ లేని హడావుడీ ప్రదర్శించి ఒకే సారి రాష్ట్రానికి రెవెన్యూ లోటును విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడేసేందుకు చేయగలిగినంతా చేసింది. అదీ సరిపోదనుకుందో ఏమో అప్పులకూ అడ్డగోలు అనుమతులు ఇచ్చేసింది. అందించగలిగినంత సహకారం అందించేసి... ఇక ఇప్పుడు ఏపీ సర్కార్ పై విమర్శల పర్వానికి తెరతీసింది.   కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ఏపీ పర్యటనలో జగన్ సర్కార్ ను అవినీతి మయంగా అభివర్ణించారు. దోపిడీ, అవినీతి జగన్ నాలుగేళ్ల పాలన సారాంశంగా తేల్చేశారు. వారి తరువాత ఇక బీజేపీ ఏపీ నేతలు తమ నోటికి పని చేబుతున్నారు. అయితే మాటలు కోటలు దాటుతుంటే.. చేతలు మాత్రం ఇంకా జగన్ రెడ్డి సర్కార్ కు సహకారం అందిస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జగన్ ను మోడీ ఎంత అభిమానంతో  చూసుకుంటారో గతంలో చెప్పిన మాటలను ఒక సారి గుర్తు చేసుకోవాలి. జగన్ పట్ల మోడీకి ఉన్నది పుత్ర వాత్సల్యం అని నిర్మలా సీతారామన్ గతంలో ఒక సారి చెప్పారు. అందుకే అడ్డగోలు అప్పులు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేసేస్తున్నా సహకారం అందిస్తూనే వస్తున్నారు. జగన్ సర్కార్ ను అవినీతి మయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించేసిన తరువాత కూడా ఈ సహకారం ఆగలేదు. తాజాగా రుణ పరిమితిలో విధించిన కోతకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.   ఎన్నికల ఏడాదిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా ఉండేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ చేయగలిగినంతా, చేయాల్సినంతా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే కేంద్రం జగన్ రెడ్డి ప్రభుత్వానికి రూ. 28,704.02 కోట్ల మేర ప్రయోజనాలను అందించింది.   ఇవి చాలవన్నట్లు మరింతగా రుణం పొందేందుకు అవకాశం కల్పించకపోయినా.. గతంలో విధించిన కోతను వాయిదాల పద్ధతిన తీర్చేందుకు వెసులు బాటు కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితిపై   8,000 కోట్ల రూపాయల  కోత విధించాల్సి ఉంటే మోడీ పుత్స వాత్సల్యంతో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ కోతను వాయిదా పద్ధతిలో  విధించాలని నిర్ణయించారు. అంటే  ఎన్నికల సంవత్సరంలో జగన్ నెత్తిన రుణభారం పడకుండా వెసులుబాటు ఇచ్చారు. ఇక ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వం ఈ భారం భరించాల్సి ఉంటుందన్న మాట. ఒక వేళ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా జగన్ రెడ్డి ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి రాకపోతే.. జగన్ రెడ్డి తప్పిదాలకు  మూల్యం వచ్చే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్న మాట.  తప్పులు ఈ ప్రభుత్వం చేస్తే.. తదుపరి ప్రభుత్వం ఆ భారం భరించాల్సి ఉంటుందన్న మాట.  

ముందస్తు జాబితాకు కేసీఆర్ కసరత్తు!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ బీఆర్ఎస్ లో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సిట్టింగులకు అందరికీ టికెట్లని ప్రకటించిన క్షణం నుంచీ పార్టీలో అసమ్మతి రగడ పెరగడంతో దానిని చల్లార్చేందుకు కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. సిట్టింగులందరికీ టికెట్లు అన్న తన మాటను తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేత ఖండింప చేసి టికెట్ ఆశావహుల్లో ఆశలను సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఇక కీలక మంత్రి కేటీఆర్ అయితే పని చేసే సిట్టింగులకే టికెట్లు అంటూ చేసిన ప్రకటన ఫిల్టరింగ్ వార్నింగ్ గా పరిశీలకులు అభివర్ణించారు. 2019 ఎన్నికల అనంతరం ఇతర పార్టీల నుంచి కుప్పలు తెప్పలుగా నాయకులను పార్టీలోకి ఆకర్షించిన ఫలితమే బీఆర్ఎస్ లో ప్రస్తత అసంతృప్తి, అసమ్మతికి కారణంగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తొలి నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్న వారికి రిక్తహస్తం, కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి పెద్ద పీట అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉండటంతోనే 2024 ఎన్నికల ముందు పార్టీలో అసమ్మతి జ్వాలలు పార్టీనే దహించేస్తాయా అన్నంతగా ఎగసిపడుతున్నాయంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే యత్నాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని చెబుతున్నారు.  పార్టీ అభ్యర్థులను ముందస్తుగానే ప్రకటించేసి అసమ్మతిని అణచివేయాలన్న వ్యూహంతో కేసీఆర్ అడుగులు ముందుకు వేస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అందుకే ఆషాఢం వెళ్లగానే వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఆషాఢం వెళ్లే వరకూ ఆగడం అన్నది కేసీఆర్ కు ఉన్న సెంటిమెంటే కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసంలో కనీసం 30 స్థానాలలో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నారనీ, ఆ స్థానాలన్నీ పార్టీ టికెట్ కోసం ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఉన్న స్థానాలేననీ అంటున్నారు. ఆయా స్థానాలలో వచ్చే నెల రెండో వారంలోనే అభ్యర్థులను ప్రకటించేసి పూర్తి స్థాయిలో ఎన్నికల సమరాంగణానికి సన్నద్ధం అవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అసమ్మతిని చల్లార్చడానికి, పార్టీలో కొనసాగేవారెవరో, బయటకు వెళ్లే వారెవరో  అన్న విషయం ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి.. ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థులకు పరిస్థితులను తమకు అనుకూలంగా మరల్చుకోవడానికి కావలసినంత సమయం ఉంటుందన్నది కేసీఆర్ భావనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు మూడు నెలల ముందుగా అభ్యర్థుల్నిప్రకటించేయడం వల్ల అసంతృప్తులు, అసమ్మతి వాదులు చివరి క్షణంలో రెబల్స్ గా రంగంలోకి దిగి పార్టీ ఇబ్బందుల్లోకి పడే  పరిస్థితి ఉండదన్నది కేసీఆర్  భావనగా చెబుతున్నారు.  ముందుగానే అభ్యర్థులను ప్రకటించేయడం వల్ల నిరాశ చెందిన ఆశావహులు ఉంటే ఉంటారు, పార్టీని వీడితే వీడతారు దీని వల్ల ఆఖరి క్షణంలో ఎవరు పార్టీకి  ఎదురు తిరుగుతారా అన్న భయం ఉండదని అంటున్నారు.  

కాకినాడ ఎమ్మెల్యే అవినీతి ‘ద్వారం’పూడి అన్న పవన్

కాకినాడ ఎమ్మెల్యే  ద్వారం పూడి చంద్రశేఖర్రెడ్డి పై అనితీని ద్వారం అన్న విమర్శలు చాలా కాలంగా వినవస్తున్నాయి. దాదాపుగా అవే ఆరోపణలను, విమర్శలను వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో  జరిగిన బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్  మరో మారు చేశారు. దేశంలోనే అతిపెద్ద బియ్యం కుంభ కోణం  రేషన్ బియ్యం దారి మళ్లింపు కుంభకోణంగా తెలుగుదేశం ఏళ్ల తరబడి చేస్తోంది. పేదోడి రేషన్‌ బియ్యాన్ని   పక్కదారి పట్టించి  ‘దోపిడీకి ద్వారం.. ద్వారంపూడి’గా మారిపోయాన్న విమర్శలున్నాయి. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా  కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగు మతి చేస్తూ వేల కోట్లు జగన్‌రెడ్డి ఖజానాకు తరలించే క్రతువులో ద్వారంపూడిది కీలక పాత్రగా విమర్శలు ఉన్నాయి. . కేంద్రం ఏటా  రాష్ట్రానికి   సరఫరా  చేస్తున్న రేషన్ బియ్యంలో 2019-20 నుంచి 2022 జూన్‌ వరకు  5.70 లక్షల టన్నుల బియ్యం లెక్కలు తేలలేదని పార్ల మెంటులో స్వయంగా కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ కుండ బద్దలుగిట్టినట్లు చెప్పారు. ఆ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని నిగ్గు తేల్చే విషయంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.  కాగా  ఈ విమర్శలనే జనసేనాని పవన్ కల్యాణ్ మరింత ఘాటుగా చేయడమే కాకుండా..వచ్చే ఎన్నికలలో ద్వారంపూడిని గెలవనిచ్చేది లేదన్నారు.   ద్వారంపూడి దోపిడీదారుడని.. కాకినాడ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్ చేసి రూ. పదిహేను వేల కోట్ల మేర దోచేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ అండ తోనే ద్వారంపూడి దోపిడీ సాగుతోందన్నారు.  వైసీపీ నేతలు దళితుడ్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే పట్టించుకున్న వారు లేరన్నారు. వైసీపీ దళిత నేతలు ఎందుకు నోరెత్తడం లేదని జనసేనాని ప్రశ్నించారు.   కేంద్ర మంత్రి అమిత్ షా  రాష్ట్రంలో శాంతిభద్రతలపై చేసిన వ్యాఖ్యలలో లోతైనా లోతైన అర్థం ఉందన్న జనసేనాని రాష్ట్రంలో మద్యం, మైన్, డ్రగ్స్ ఈ మూడింటి చుట్టూనే కుంభకోణాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయన్నారు.  

తెలంగాణలో హస్తానిదే హవా !?

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో... ఊహించడం కొంచం కాదు చాలా కష్టం.  కానీ రాజకీయాలు చాలా వరకు ఊహాగానాలు, వ్యూహాగానాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఒకటి రెండు నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ఈరోజున్న పరిస్థితి ఏమిటి?  అని అలోచిస్తే.. ఆరోజున్న పరిస్థితికి, ఈ రోజు కాంగ్రెస్ లో కనిపిస్తున్న పరిస్థితులకు ఎక్కడా పొంతన, పోలిక లేదు.  కర్ణాటక  ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. అధికార బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సవాల్ గా మారింది. సవాలు విసురుతోంది. అధికారంలోకి వచ్చేశామనే ధీమా కనిపిస్తోంది. మరోవంక ఒక్కసారిగా బెలూన్ లా  పైకేగిరిన బీజేపీ ... కర్ణాటక ఓటమితో దిగాలు పడిపోయింది. నేలచూపులు చూస్తోంది. నిజానిజాలు ఎలా ఉన్నా కమలం పరిస్థితి మళ్ళీ సింగిల్ డిజిట్ స్థాయికి దిగిపోయిందనే పబ్లిక్ పర్సెప్షన్  బలం పుంజుకుంటోంది. దీంతో  అధికార బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధిగా తెర మీదకు వచ్చింది. అందుకే  ఇంతవరకు ముక్కోణపు పోటీలో మళ్ళీ బీఆర్ఎస్  అధికారంలోకి వస్తుందని లెక్కలు వేసుకున్న విశ్లేషకులు  ఇదే పర్సెప్షన్  ఎన్నికల వరకు కొనసాగితే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య  ముఖాముఖీ పోరు తప్పదని అంటున్నారు.  మరోవంక  కర్ణాటక గెలుపు తెచ్చిన ఊపును నిలుపుకునేందుకు, ఇదే జోష్ ను ఎన్నికల వరకు కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టి కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగుతున్న సంకేతాలు పంపుతున్నారు. ముఖ్యంగా  సోషల్ మీడియాను బేస్ చేసుకుని  కాంగ్రెస్ ఇమేజ్ ని పెచుకునేందుకు తద్వారా అధికార బీఆర్ఎస్ నుండి అసమ్మతి నాయకులను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ  చాలా గట్టి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ  మరో వంక ‘అపరచిత’ /అజ్ఞాత సంస్థల సర్వేలకు ప్రచారం కల్పిస్తోంది. నిజానికి  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంత ‘గొప్ప’ విజయం సాధించిన తర్వాత కూడా, పొంగులేటి, జూపల్లి వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో ఇంకా మీన మేషాలు లెక్కిస్తున్నారు. మీడియా ‘పొంగు’ ను పొంగులేటి పట్టించుకోవడం లేదు. రాజకీయ వ్యాపారంలో లాభ నష్టాలు బేరీజు వేసుకుంటున్నారు. ఆ ఇద్దరు చివరకు ఏమి చేస్తారు, అనేది ప్రస్తుతానికి శేష ప్రశ్న.   అలాగని ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరరని కాదు .అఫ్కోర్స్ చేరతారని కూడా చెప్పలేము. అది వేరే విషయం. ఆ ఇద్దరి సంగతి ఎలా ఉన్నా,ఇతర చిన్నా చితక నాయకులైనా పోలోమంటూ కాంగ్రెస్ పార్టీలో చేరారా అంటే అదీ లేదు. నిజానికి, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన ఊహాజనిత   ఊపు, ఉత్సాహం వచ్చాయేమో కానీ, చేరికల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి కొత్తగా తోడైన వాస్తవ బలం, బలగం దాదాపు శూన్యం. అయితే  అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం అసలే లేదా, అంటే లేదని అనలేము. కానీ, ఉహించుకుంటున్న స్థాయిలో ఉంటుందా ? అజ్ఞాత సర్వే.. లో చెప్పినట్లుగా.. బీఆర్ఎస్ కు సమ ఉజ్జీగా 40 నుంచి 45 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందా? అంటే అనుమానమే. అంటున్నారు విశ్లేషకులు.

సంక్షిప్తం

1.  ఆర్థికశాస్త్రంలో మోడీ నిరక్షరాస్యుడు అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.   విత్త మంత్రి నిర్మల సీతారామన్‌కు ఏం చేయాలో తెలీదంటూ ట్వీట్ చేశారు.  దేశంలో నిరుద్యోగం, పేదరికం మోడీ పుణ్యమేనని పేర్కొన్నారు. 2. కర్ణాటక  ఫార్ములా జాతీయ స్థాయిలో వర్కౌట్ అవుతుందన్న నమ్మకం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు.  జాతీయ ఎన్నికల్లో ఓటర్ల తీరు భిన్నంగా  ఉంటుందన్నారు.  మూడు రాష్ట్రాల్లో గెలిచిన తరువాత 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైందని గుర్తు చేశారు.   3.   పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ పై నమోదైన రాజద్రోహం కేసును ఎత్తివేయాలని  సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హరగోపాల్ తో పాటు మరికొందరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదైన కేసులను ఉపసంహరించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు.  4. హైదరాబాద్‌లో కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో  కొందరు ముస్లిం విద్యార్థినులు తమను హిజాబ్‌ ధరించి పరీక్ష రాసేందుకు అనుమతించలేదని ఆరోపించారు. హిజాబ్‌తో పరీక్ష కేంద్రంలోకి రావద్దని సిబ్బంది అడ్డుకున్నారని వారు చెప్పారు. 5. మహిళల వస్త్రాధారణపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సంచల వ్యాఖ్యలు చేశారు.  హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం తెలెత్తిన నేపథ్యంలో ఆయన  మహిళలు పొట్టి దుస్తులు ధరించడం మంచిది కాదన్నారు. ముస్లీం మహిళలు బుర్ఖా వేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు. 6. బీఆర్ఎస్  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి  నివాసంలో మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులు ముగిశాయి. అనంతరం మంగళవారం విచారణకు రమ్మంటూ పైళ్ల శేఖర్ రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.   7  తెలుగుదేశం హయాంలో కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు వే  సుకుని ప్రగల్భాలు పలుకుతున్నారంటూ సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.  గుడివాడ సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిన్న ప్రారంభించిన సంగతి తెలిసిందే. 8. బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ అని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. తెలంగణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిన్న ఖమ్మంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో ఆ పార్టీ ప్రకటించగలదా అని ప్రశ్నించారు.    9. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో  చేరికకు మూహూర్తం ఖరారైంది. ఈ నెల 30న ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. అంత కంటే ముందు అంటే   ఈనెల 22న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి  కూచూకుళ్ళ దామోదర రెడ్డి, పిడమర్తి రవి తదితరులు భేటీ కానున్నారు. 10.కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా గ‌తంలో త‌న‌ను దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ కోరినప్పుడు తాను తిరస్కరించినట్లు చెప్పారు.   11.తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా  రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు  అడ్డంగా దొరికిపోయారు. పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం వీసీ  డబ్బులు డిమాండ్  చేయడంతో  బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించారు.  ఇలా ఉండగా వీసీ బర్త్ రఫ్ కు సిఫారసు చేస్తూ కేసీఆర్ గవర్నర్ కు లేఖ రాశారు. 12. ఆరుగురు టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 13. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు ఢిల్లీ షరతులతో కూడిన ప్రతిపాదన చేసింది. ఢిల్లీ, పంజాబ్లలో తమకు అండగా ఉంటే, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో తాము పోటీకి దూరంగా ఉంటామని  ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ప్రతిపాదించారు. 14.జూన్ 20న సికింద్రాబాద్‌లో జగ‌న్నాథ ర‌థ‌యాత్ర నిర్వ‌హించ‌నున్న‌ట్లు శ్రీ జ‌గ‌న్నాథ స్వామి రామ్‌గోపాల్ ట్ర‌స్ట్ శుక్రవారం ప్ర‌క‌టించింది.   ఈ  ఆల‌యంలో 130 ఏళ్ల నుండి ర‌థ‌యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. 15.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తరఫు న్యాయవాదికి వివేకా కూతురు సునీత తరఫు న్యాయవాది సాయం చేసేందుకు సీబీఐ కోర్టు   అనుమతి నిచ్చింది.  ఈ నేపథ్యంలో సునీత లేదా ఆమె తరఫు న్యాయవాదులు సీబీఐ పీపీలతో కలిసి పని చేయనున్నారు.  16.జవహర్ లాల్ నెహ్రూ అధికారిక నివాసం తీన్ మూర్తి భవన్ లోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎలాంటి చరిత్రలేనివారే ఇతరుల చరిత్రను చెరిపివేస్తారని మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు.  17. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ కు మేం అభ్యంతరం చెప్పం స్వాగతిస్తామని  కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే  అలా చేయడం వల్ల హైదరాబాద్ కు అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.   18. కేసీఆర్ పాలనను భరించే ఓపిక ఇక తెలంగాణ ప్రజలకు లేదని టీసీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.   కేసీఆర్ నుండి విముక్తి కలిగించేందుకు, తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేన రాష్ట్రంలో కాంగ్రెస్ లో చేరికలన్న ఆయన ఈ చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీకగా అభివర్ణించారు.  19.   ప్రభుత్వ ఉద్యోగులకు   విద్యుత్‌ స్కూటర్లను డిస్కౌంట్‌తో అందించేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ కొసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.  కేంద్రం సబ్సిడీ తగ్గింపు, రాష్ట్రంలో వాహనాల లైఫ్ టాక్స్ పెంపు కారణంగా విద్యుత్ వాహనాల కొనుగోళ్లు మందగించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 20. హుద్ హుద్ తుపానును సైతం తట్టుకున్న విశాఖ ఇప్పడు వైసీపీ   అక్రమార్కులకు చేతిలో విలవిల్లాడుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. విలవిల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు పంచభూతాలను మింగేశారని అన్నారు. ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఇందుకు తాజా ఉదాహరణ అన్నారు.  21. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని, వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 19 తరువాత రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వివరించింది. 22. వచ్చే ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆదిలాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. లేదంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాలు విసిరారు. 23. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవివాష్ రెడ్డి  ఈ రోజు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి  ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరువావాల్సి ఉన్న సంగతి విదితమే.  ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకూ సీబీఐ ఆయనను విచారించింది. 24. ఆదిపురుష్‌  చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ చిత్రం హిందువులకు అత్యంత పవిత్రమైన ఇతిహాస రామాయణాన్ని హేళన చేసేలా ఉందంటూ  హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా  పిల్ దాఖలు చేశారు. 25. ప్రధాన మంత్రి మోదీ వజూన్ 21 నుంచి 24 వరకు అమెరికాలో ర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ  పర్యటనలో భాగంగా జూన్ 22న కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. 26. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ క్రైం కేపిటల్ గా మారిపోయిందని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.  రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయ‌ని, క్రైమ్ రేట్ పెర‌గ‌లేద‌ని  డీజీపీ చెప్పారనీన, అమ‌ర్ నాథ్‌ అనే 10th క్లాస్ అబ్బాయి అత్యంత దారుణంగా కొట్టి త‌గ‌ల‌బెట్ట‌డం దేనిని నిదర్శనమని ప్రశ్నించారు. 27.భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ లో పొందుపరిచి కోర్టుకు సమర్పించారు.   500 పేజీల ఛార్జిషీట్‌లో ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల్లో ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలు, వీడియో రుజువులున్నాయి. 28. రైల్లో ప్రయాణించే సమయంలో  చోరీ జరిగితే అది రైల్వే సేవల లోపం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఓ కేసులో తీర్పు ఇస్తూ రైల్లో ప్రయాణించే వారు  తమ వస్తువుల భద్రత తామే చూసుకోవాలని విస్పష్ట తీర్పు ఇచ్చింది.  29.నేపాల్ దేశ అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్‌కు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల వ్యవధిలో ఆయనకు గుండెపోటు రావడం ఇది రెండో సారి.   రాంచంద్రను త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. 30. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో అమితాబ్ బచ్చన్ అని  ఎన్సీపీ  వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే అన్నారు.  అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నాంటూ వస్తున్న వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు. 31.అసోంను వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో  11 జిల్లాలు వరద ముంపులో  చిక్కుకున్నాయి. వరద ప్రబావిత ప్రాంతాల నుంచి  34వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.  32. ఫ్రాన్స్ ను భారీ భూకంపం వణికించింది.  రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైన ఈ భూకంప ప్రభావానికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. పలువురు గాయపడ్డారు.  విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భవనాలు కూలిన ఘటనల్లో కొందరు గాయపడ్డారు. 33.  కోనసీమ జిల్లామడికి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున గూడ్స్ ఆటో, కారు ఢీకొన్న ప్రమాదంలో  నలుగురు మృత్యువాత పడ్డారు.   చోడవరం నుండి గూడ్స్ ఆటోలో తొమ్మిది మంది మందపల్లికి వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. 34.  రష్యా భూభాగానికి ప్రమాదం వస్తే అణ్వాయుధాల ప్రయోగానికి వెనుకాడేది లేదని ఆ దేశాధ్యక్షుడు పుతిన్  స్పష్టం చేశారు.  మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను ఇప్పటికే బెలారస్‌లో ఉంచామని ప్రకటించారు. ఉక్రెయిన్ తో యుద్ధం లో రష్యా అణ్వాయుధాలను ప్రయోగించే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 35. హైదరాబాద్ ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో ఓ ఫర్నిచర్ వేర్ హౌస్ లో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తినష్ఠం జరిగింది. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.   36. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామన్న భయం వద్దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.   ధరణిలోని లోపాలను సవరించి మరింత సమర్ధవంతంగా అమలు చేస్తామన్నారు. అలాగే ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగిస్తామన్నారు.    37. తెలంగాణ జన సమితిని కాంగ్రెస్ లో విలీనం చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఖండించారు. తమ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటామనీ, అలాగే ప్రజాస్వామ్య తెలంగాణ సాధన కోసం భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.   38.  కోనసీమ జిల్లాలో  ఓఎన్ జీసీ పైప్ లైన్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. కేశనపల్లిలో జీసీఎస్ పైప్ లైన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఈ ఘటన జరిగింది.   ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేశారు. 39. కాంగ్రెస్  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఢిల్లీలో  పార్టీ  కీలక నేతప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు.  భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన వచ్చే నెల  7 తర్వాత తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారని చెప్పారు. తమ భేటీలో భట్టి విక్రమార్క పాదయాత్ర తెలంగాణ ఎన్నికలపై చర్చించినట్లు చెప్పారు.  40.నల్ల బంగారం బొగ్గు, తెల్ల బంగారం పత్తి సమృద్ధిగా దొరికే ప్రాంతం తెలంగాణ మాత్రమేనని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.   తెలంగాణలో పండే తెల్ల పత్తి ఎక్కడా దొరకదన్నారు. వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న కెటిఆర్ పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.   41.  మంత్రుల ఆధ్వర్యంలో కంటి వెలుగు వందరోజుల సంబురాలు ఘనంగా జరిగాయి.   సచివాలయంలో  మంత్రులు హరీశ్ రావు,  ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్,లు కేక్ కట్ చేశారు. కంటి వెలుగు పథకం 100 రోజులు పూర్తి చేసుకోవ‌డం పట్ల  సంతోషం వ్యక్తం చేశారు. 42. ఉగండాలోని ఓ పాఠశాలపై జరిగిన ఉగ్రదాడిలో కనీసం పాతిక మంది మరణించారు. 25మంది చనిపోయిన ఘటన ఉగాండాలో చోటుచేసుకుంది. ఐసీస్ తో  సంబంధాలున్న ఏడీఎఫ్​  సాయుధ తిరుగుబాటుదారులు   కాంగో సరిహద్దుకు   2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలపై దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 43. కృష్ణా జిల్లా వానపాముల గ్రామం వద్ద ఓ ఆర్టీసీ  ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 68మంది ప్రయాణీకులు ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  44. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం అంబేద్కర్ కాలనీలో దుప్పి మాంసం విక్రయిస్తున్న ముగ్గురిని ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు.  వారినుంచి దుప్పి తల, కాళ్ళు, మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 45. గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లిలో రూ. 2 కోట్లతో నిర్మించనున్న గిరిజన భవనానికి  ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బంజారా డిజే పాటలకు గిరిజన మహిళలతో కలిసి వారు నృత్యం చేశారు. 46. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13 కోట్ల విలువ చేసే కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కొకైన్ ను లిక్విడ్ గా మార్చి మద్యం సీసాల్లో  కలిపి తరలించేదుకు ప్రయత్నించిన కెన్యా దేశస్థుడిని అదుపులోనికి తీసుకున్నారు. 47.  ఆదిపురుష్ చిత్ర బృందం క్షమాపణ చెప్పాలంటూ శివసేన  ఉద్దవ్ థాకరే వర్గం  ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.  రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రంలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.  48. జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళగిరిలో విలేకరులతో మాట్లాడిన ఆయ రాష్ట్రంలో నేరాలు తగ్గాయనీ, శాంతి భద్రతల పరిస్థితి భేషుగ్గా ఉందనీ డీజీపీ చెప్పడం ఆయ మూర్ఖత్వానికి నిదర్శనమని కన్నా అన్నారు.  49. బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి మండలంలో  టెన్త్ విద్యార్థి పై  నిప్పంటించి హత్య చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.  నిందితులను పాము వెంకటేశ్వర రెడ్డి , గోపిరెడ్డి, ఎం వీర రాఘవులుగా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడు సాంబిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 50. ఎన్సీపీ అధినేత శరద్ పవార్  తెలంగాణ  కేసీఆర్ జాతీయ బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్  బీజేపీ-బీ టీమ్గా అభివర్ణించారు.  బీఆర్ఎస్ తెలంగాణలో అడుగుపెట్టడంపై విలేకరుల అడిగిన ప్రశ్నకు ఆయన  తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, ఎన్సీపీలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కనిపిస్తోందని అన్నారు.

ఎన్నికల వేళ రెండో రాజధాని రగడ!

దేనిని అయితే చూసుకొని కన్నూ మిన్నూ కానకుండా మిడిసి మిడిసి పడుతున్నారో.. దానిని వారి వద్ద నుంచి బలవంతంగానో.. ఎలాగోలా.. లాగేసుకొంటే.. ఆ తర్వాత వారి పరిస్థితి.. అనంతరం చోటు చేసుకొనే పరిణామాలు అందరికీ తెలిసినవే. చూడబోతే అలాంటి ప్రయత్నానికి కేంద్రంలోని మోదీ సర్కార్ శ్రీకారం చుట్టిందనే ఓ చర్చ అయితే తాజాగా పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా యమ రంజుగాసాగుతోంది.  గులాబీ బాస్ కేసీఆర్‌ను దెబ్బ కొట్టి.. తెలంగాణలో పాగా వేయాలి.. అలాగే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనస్సులను చొరగొనాలి.. ఆ క్రమంలో అందుకు తగ్గట్లు కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్దం చేసుకొని.. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుందా?.. అందులోభాగంగానే  కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు ఆకస్మాత్తుగా తెరపైకి వచ్చి దక్షిణాదిలోని హైదరాబాద్‌ మహానగరం దేశానికి రెండో రాజధాని కావాల్సిన అవసరం ఉంది.. అంతేకాదు దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయి.. తీరుతోందని ఆయన స్పష్టం చేయడం.. అంబేద్కర్ స్మాల్ స్టేట్స్ పుస్తకంలో హైదరాబాద్ రెండో రాజధాని అని ప్రస్తావించిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం.. అదే విధంగా ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలంటూ సన్నాయి నొక్కులు నొక్కడం చూస్తుంటే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏదో మతలబు తెరపైకీ తీసుకు వచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జోరందుకుంది.   అదీకాక గవర్నర్ గిరి పూర్తి అయిన తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉన్న సిహెచ్ విద్యాసాగరరావు.. ఇలా ఒక్కసారిగా తెరపైకి వచ్చి మరీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ  ప్రకంపనలు సృష్టిస్తోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విభజన జరిగి.. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరుగుతోన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోవడంతో.. ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.  అలాంటి వేళ.. ఇటువంటి నిర్ణయం అయితే అందరికీ శ్రేయస్కరమనే భావనలో మోడీ ప్రభుత్వం ఉందని.. అదీకాక హైదరాబాద్ మహానగరం నుంచి పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయిల ఆదాయం వస్తుందని.. దీనిని చూసి కేసీఆర్ అండ్ కో.. కేంద్రంతో డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోందని,  ఆ క్రమంలో భాగ్యనగరాన్ని దేశానికి రెండో రాజధానిగానే కాకుండా..  రెండు తెలుగు రాష్ట్రాలకు రాజధానిగా చేయడం..  అలాగే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే.. దీంతో బీజేపీకే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజల అన్ని సమస్యలకు జిందా తిలిస్మాత్ లా ఔకటే ఔషదం అన్నట్లుగా అవుతోందని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ  వైరల్ అవుతోంది.  అదీకాక దశాబ్దాల కింద కాకినాడ వేదికగా జరిగిన సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం చేసిన కమలనాథులు.. మళ్లీ తాజాగా దేశానికి రెండో రాజధానిగానే కాకుండా... రెండు రాష్ట్రాలకు ఒకటే రాజధాని.. అదీ హైదరాబాద్ అని మోడీ సర్కార్ ప్రకటిస్తే సరిపోతుందనే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అలా అయితేనే   అనుకున్నది  అనుకున్నట్లుగా సాధించగలుగుతామని.. మరోవైపు జమ్ము కాశ్మీర్‌లో గతంలో నిత్యం కాల్పులు, బాంబు దాడులు, కిడ్నాపులు వార్తలతో నిండిపోయి ఉండేదని.. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత సదరు రాష్ట్ర పరిస్థితి ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందేనని .. అదే విధంగా మోదీ సర్కార్.. హైదరాబాద్‌పై ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఒకవేళ అలా చేస్తే.. తెలంగాణలో చక్రం తిప్పుతోన్న కేసీఆర్ అండ్ కో.. తమ వ్యూహాలకు మరింత పదును పెట్టి.. కార్యక్షేత్రంలోని దూకుతొందనడంలో ఎటువంటి సందేహం లేదనే చర్చ సైతం నడుస్తోంది. అదీకాక. . విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతే.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ సైతం దశాబ్ది వేడుకల సాక్షిగా లక్షల కోట్ల ఆప్పులో మునిగిపోయింది. అలాంటి వేళ.. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రం ఎంపిక చేస్తే.. ప్రజలు సైతం సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ సైతం సాగుతోంది.  అదీకాక.. హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రాహావిష్కరణ సందర్బంగా ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సైతం తన తాత గారు దేశనికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలని ఆకాంక్షించారని గుర్తు చేశారు. ఇదే సభా వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కనుండగానే ప్రకాశ్ అంబేద్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం కోసమెరుపు.

నాడు ఊస్టింగ్.. నేడు పోస్టింగ్ !

ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాసాగర్‌కు వైయస్ జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయన్ని మచిలీపట్నం పోర్ట్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మేకతోటి సుచరిత, ఆమె భర్త పార్టీ మార్పుపై జరుగుతోన్న ఊహాగానాలకు ఇక తెరపడినట్లే అంటున్నారు.   జగన్ తొలి కేబినెట్‌లో హోం  మంత్రిగా ఆమెకు పదవి కట్టబెట్టినా.. నామ్ కా వాస్తే అన్నట్లుగా మంత్రి పదవి నిర్వహించారని.. అంతా సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణరెడ్డే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌.. ఓ ఆర్డర్‌లో ఉండేలా చూసేవారు. అలాగే హోం శాఖ వ్యవహారాలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ సైతం ఆయన నిర్వహించేవారు. అయితే ముఖ్యమంత్రి   జగన్ .. తన మలి కేబినెట్‌ కసరత్తులో భాగంగా సుచరిత పోస్టింగ్‌ను కోవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితకు కట్టబెట్టిన విషయం విదితమే.   దీంతో మేకతోటి సుచరిత అలిగారు... బుంగమూతి పెట్టుకొన్నారు. ఇక ఫ్యాన్ పార్టీకి మేకతోటి సుచరిత రాజీనామా చేస్తున్నారంటూ ఆమె కుటుంబ సభ్యులు స్వయంగా మీడియా ముందుకు వచ్చి మరీ ప్రకటించారు. ఆ క్రమంలో సుచరిత నివాసానికి ఫ్యాన్ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెళ్లి మంత్రాంగం నెరిపినా.. ఆమె ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరించడంతో.. ఈ పంచాయతీ  కాస్తా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది.  ఆ క్రమంలో సదరు ప్యాలెస్‌లోని అగ్రనేతల నుంచి సుచరితకు పిలుపు  రావడంతో.. ఆమె వెళ్లక తప్ప లేదు. అందులోభాగంగా వీరి మధ్య చర్చలు జరిగినా.. ఆమె మాత్రం తీవ్ర అసంతృప్తితోనే  ఉన్నారన్న విషయం  అందరికీ తెలిసిందే. ఇటీవల ఓ సమావేశంలో మేకతోటి సుచరితతోపాటు ఆమె భర్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త ఏ పార్లీలోకి వెళ్లినా ఆయన వెంట అడుగులో అడుగు వేసుకొంటూ వెళ్తానని క్లియర్ కట్‌గా చెప్పేశారు. దీంతో తాను పార్టీ మారుతున్నానని   సుచరిత క్లారటీ ఇచ్చేశారని పార్టీ శ్రేణులే చెప్పాయి.  అయితే మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాసాగర్‌కు తాజాగా వైసీపీ పోస్టింగ్ ఇవ్వడంతో సుచరిత అలిగి, ఆగ్రహం వ్యక్తం చేసి తాను కావాలనుకున్నది సాధించుకున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఎందుకంటే... రాష్ట్ర హోం మంత్రిగా మేకతోటి సుచరిత ఉండగా.. ఆమె భర్త మేకతోటి దయాసాగర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో వైసీపీలోని పలువురు కీలక నేతలు విజయవాడలోని ఆయన కార్యాలయానికి క్యూ కట్టి మరీ పుప్పగుచ్ఛాలు అందించి.. ఆయన్ని అభినందించి మరీ వచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియలో అప్పట్లో వైరల్ అయినాయి.  మరోవైపు ఉమ్మడి గుంటూరు జల్లాలోని ఓ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు మేకతోటి దయాసాగర్.. ముందు చూపుతో ఏపీకి బదిలీపై వచ్చారంటూ అప్పట్లో వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో  ఈ విషయాన్ని పసిగట్టిన.. సొంత పార్టీలోని అదే జిల్లాకు చెందిన కీలక నేతలు.. హుటాహుటిన దేశ రాజధాని ఢిల్లీ చేరుకొని.. ఓ రాష్ట్రానికి హోం శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి భర్త అదే రాష్ట్రానికి ఐటీ చీఫ్ కమిషనర్‌గా ఉండడం చట్ట విరుద్దమంటూ..   కేంద్ర హోం, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నతాధికారులకు   వరుసపెట్టి ఫిర్యాదులు చేయడమే కాకుండా.. మేకతోటి దయాసాగర్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసే వరకు.. ఆ కీలక నేతలు ఢిల్లీలోనే ఉండి.. ఆయన బదిలీ ఫైల్‌ను అనుక్షణం ఫాలో ఆప్ చేసి..   దయాసాగర్‌ను మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు పోస్టింగ్ వేసే వరకు ఓ మహా యజ్జమే చేశారనే ఓ చర్చ అప్పట్లో జోరుగా సాగింది. అయితే ఆయన అక్కడ ఆ ఉద్యోగ బాధ్యతలు చేపట్టి..   కొద్ది రోజుల తర్వాత.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి దయాకరరావు ఏపీకి  వచ్చేసిన విషయం తెలిసిందే.  ఆ క్రమంలో వీరిద్దరు పార్టీ మార్పుపై ఊహగానాలు ఊపందుకొన్నా.. ఈ దంపతులు మాత్రం.. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చర్చ సైతం సాగుతోంది. అలాంటి వేళ జగన్ ప్రభుత్వం.. మేకతోటి సుచరిత భర్తకు ఈ పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే మేకతోటి దయాసాగర్ మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని లోక్‌సభ స్థానంపై ఆశలు పెట్టుకొన్నారు. మరి ఆ స్థానాన్ని ఆయనకు కట్టబెట్టాలంటే.. ప్రస్తుతం ఉన్న లోక్ సభ సభ్యుడిని కూల్ కూల్ చేయాల్సి ఉంటుందని.. అయితే సదరు ఎంపీగారు కూల్ అయే పరిస్థితి ప్రస్తుతానికి లేదనే ఓ టాక్ సైతం వాడి వేడిగా నడుస్తోంది. మరి అలాంటి వేళ.. మేకతోటి వారు ఫ్యాన్ పార్టీలోనే ఉంటారా? లేకుంటే జంప్ జిలానీ రాగం ఆలపించి.. జనసేన లేదా తెలుగుదేశం గూటికి చేరిపోతారా అంటే కొద్ది రోజులు మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.

మళ్లీ తెరపైకి గోరంట్ల మాధవుడు

ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా సంచలనమే. అలాంటి గోరంట్ల మాధవ్.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేసినా.. జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసినా.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాశీ యాత్ర చేసినా.. వైసీపీ  అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ జైత్రయాత్రను ఆపలేరన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొంటామని  ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీ కీలక నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, సత్యకుమార్‌లపై  సైతం విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో ఎంపీ గోరంట్ల కామెంట్లపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు.  మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని.. అలాంటి వేళ ఎంపీ సీటు కోసం గోరంట్ల మాధవ్ చేస్తున్న ఫీట్ల అన్నీ ఇన్నీ కావని వారు పేర్కొంటున్నారు. అయితే గతేడాది ఆగస్ట్‌లో సదరు ఎంపీ గారి న్యూడ్ వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే తాను  జిమ్ చేస్తుండగా ఉన్న వీడియోను ప్రత్యర్థి పార్టీల వారు ఇలా మార్ఫింగ్ చేశారంటూ ఆయన ఆరోపించారు.  వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. పోలీసు కేసు నమోదు చేస్తానని ప్రకటించారని.. మరి కేసులు నమోదు చేశారో లేదో తెలియదు కానీ.. ఓ వేళ కేసు నమోదు చేస్తే.. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఎంపీ గోరంట్ల మాధవ్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గోరంట్ల  న్యూడ్ వీడియో ఒరిజనల్ అంటూ అమెరికాలోని ఓ ల్యాబ్స్ సైతం సర్టిఫై చేసిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అయితే ఇదే అంశంపై అప్పుడే.. ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రికి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకి, జాతీయ మహిళా కమిషన్‌కు సైతం గోరంట్ల మాధవ్‌పై ఫిర్యాదులు అందాయని... కానీ ఆ వీడియో తాలుకు రహస్యం మాత్రం ఇప్పటికి బహిర్గతం కాలేదని వారు వివరిస్తున్నారు. మరీ వచ్చే ఎన్నికల్లో గోరంట్ల మాధవ్.. మళ్లీ టికెట్ దక్కుతోందా లేక.. ఈ సారికి.. అంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదనే చర్చ సైతం సాగుతోందని వారు చెబుతున్నారు.   ఎందుకంటే.... గోరంట్ల వారిదిగా చెప్పబడుతోన్న న్యూడ్ వీడియో గట్టిగానే వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల వరకు సైలెంట్‌గా ఉంటే.. మళ్లీ జగన్ ప్రభుత్వం గద్దెనెక్కితే.. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చనే ఓ ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందనే ప్రచారం సాగుతోందని నెటిజన్లు చెబుతున్నారు. మరి గోరంట్ల వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందనేది మరికొద్ది నెలల్లో తెలిసిపోతోందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. 

గడ్కరీకి కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఆయనేమన్నారంటే?

కేంద్ర  రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి  విలక్షణ రాజకీయ నాయకునిగా పేరుంది. ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ప్రతిపక్షాలు సైతం వేలెత్తి చూపని, చూపలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క గడ్కరీనే. కేంద్ర కేబినెట్ లో స్వతంత్రంగా , స్వేచ్ఛగా వ్యవహరించే మంత్రి ఎవరంటే వినిపించే మొదటి, ఏకైక పేరు గడ్కరీదే.   అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో  దేశం ఏమి సాదించింది అంటే  ముందుగా చెప్పేది, చెప్పుకునేది మౌలిక సదుపాయాల కల్పన గురించే . అందులోనూ గడ్కరీ నేతృత్వంలో అత్యంత వేగంగా సాగుతున్న  జాతీయ, గ్రామీణ రోడ్ల నిర్మాణం గురించే ముందుగా చెప్పుకోవడం జరుగుతుంది. అందుకే పార్లమెంట్ లోపలా, బయటా కూడా ప్రతిపక్ష పార్టీలు గడ్కరీ వైపు వేలెత్తి చూపే సాహసం చేయవు. అంతే కాదు  మోదీ ప్రభుత్వాన్ని అడ్డు అదుపు లేకుండా విమర్శించే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా పార్టీ  మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ఒకటి రెండు సందర్భాలలో లోక్ సభలో గడ్గరీని మెచ్చుకున్నారు. ఆయనను అభినందించారు. అలాగే ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా  బీజేపీని, మోడీని విమర్శించినంతగా గడ్కరీని విమర్శించే సాహసం చేయరు.    అలాగే  గడ్కరీ మీడియా సమావేశాల్లో ప్రవర్తించే తీరు కూడా భిన్నంగానే ఉంటుంది. ఒకా నొక సందర్భంలో ఆయన బీజేపీ ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించినంత సమర్ధవంతంగా అధికార పార్టీ పాత్రను పోషించేలేక పోతోందని అంగీకరించారు. అంతే కాదు తమ డీఎన్ఏనే అలాంటిందని చమత్కరించారు.  అలాగే ఇప్పుడు గడ్గరీ మరో సంచలన ప్రకటన చేశారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి తనకో బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ ఆఫర్‌ను తిరస్కరించిన నితిన్ గడ్కరీ.. సదరు నేతకు తన దైన శైలిలో సమాధానం ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే అది ఇప్పటి విషయం కాదు. గతంలో ఎప్పుడో  కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్రకు చెందిన దివంగత శ్రీకాంత్ జిచ్‌కార్ ఓసారి తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు గడ్కరీ గుర్తుచేసుకున్నారు. శ్రీకాంత్ జిచ్‌కార్ తనను కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించినట్లు చెప్పారు. పార్టీ కోసం చాలా కష్టపడతానని తనను పొగిడాడనీ,  తాను మంచి కార్యకర్తే కాకుండా మంచి నాయకుడిని అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఇలాంటి నాయకుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే,  మంచి భవిష్యత్ ఉంటుందని సూచించినట్లు చెప్పారు. అయితే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరడం కంటే బావిలో దూకడం చాలా బెటర్ అని శ్రీకాంత్ జిచ్‌కార్‌కు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ఎందుకంటే తనకు బీజేపీపై, బీజేపీ ఐడియాలజీపై   సంపూర్ణ విశ్వాసం ఉందనీ.. అందు కోసమే తన పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్‌కు విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో ఉన్నపుడు తనకు విలువలు నేర్పించినందుకు ఆర్ఎస్ఎస్‌పై పొగడ్తలు కురిపించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హస్తం పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి చాలా సార్లు చీలిపోయిందని ఆరోపించారు. మనం మన దేశ ప్రజాస్వామ్య చరిత్రను మరిచిపోకూడదనీ, మెరుగైన భవిష్యత్ కోసం గతం నుంచి నేర్చుకోవాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గరీబీ హటావో (పేదరిక నిర్మూలన) అనే నినాదాన్ని ఇచ్చిందని.. కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఇదే సమయంలో గడ్కరీ ... ప్రధాని మోడీతో తనకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలకు సమాధానం చెప్పారు. భారత్‌ను ఆర్థికంగా ప్రపంచంలోనే సూపర్‌పవర్‌గా మార్చాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలను నితిన్ గడ్కరీ ప్రశంసించారు. మోడీ నేతృత్వంలో దేశ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ చేసిన పనుల కన్నా.. అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నారు. ఏమైనా  బీజేపీ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన గడ్కరీ ... ఎదో ఒక రోజున దేశ ప్రధాని అయినా ఆశ్చర్య పోనవసరం లేదని బీజేపీ నేతలు  కొందరు గట్టిగా విశ్వసిస్తారు.

సైకిలు జోరు.. కారు బేజారు!

అవును, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగు దేశం పార్టీ, గత వైభవాన్ని కోల్పోయింది. అది నిజం. తెలుగుదేశం అంటే ఏపీ పార్టీ అనే ముద్ర పడింది. ముఖ్యంగా, తెలంగాణ సెంటిమెంట్ ను సొంతం చేసుకున్న బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్) అధినేత ముఖ్యమంత్రి కేసేఆర్ అదే సెంటిమెంట్ ను అస్త్రంగా చేసుకుని, రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరిట  ప్రత్యర్ధి పార్టీలను ముఖ్యంగా కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను నిర్వీర్యం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపారు.  రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి  వచ్చిన తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనూ సత్తా చాటింది. తెలంగాణ తెచ్చామనే ఊపులో ఉన్న తెరాస (ఇప్పటి బీఆర్ఎస్)ను, తెలంగాణను ఇచ్చామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ దూకుడును ఎదుర్కుని కూడా 14.7 శాతం ఓట్లతో  15 సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత అతికొద్ది కాలానికే, టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి కారెక్కారు.గులాబీ గూటికి చేరారు. 2018 ముందస్తు ఎన్నికల నాటికి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగిలారు. ఇక ఆ తర్వాత ఏంజరిగిందనేది చరిత్ర. 2014 బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, 2018లో తెలంగాణలో కాంగ్రెస్, సిపిఐతో కలిసి పోటీచేసింది. అయినా, టీడీపీ కేవలం రెండంటే రెండే సీట్లు గెలుచుకుంది. అలాగే ఓటు షేర్ 15 శాతం నుంచి మూడున్నర శాతానికి పడిపోయింది. అంతే కాదు, టీడీపీ టికెట్ పై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కి గులాబీ గూటికి చేరుకున్నారు. అలాగే, పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎల్.రమణ సహా సీనియర్ నాయకులు చాలామంది అధికార పార్టీలోకి దూకేశారు. మరి కొందరు బీజేపీలోకి జంపయ్యారు.  ఇది చరిత్ర..ఎవరూ కాదనలేని నిజం. అయితే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులే కాదు, శాశ్వత బాహుబలులు కూడా ఉండరు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఎదురు లేదు, తిరుగు లేదనుకున్న పార్టీ నాయకులు అనూహ్యంగా బొక్కబోర్లా పడతారు. కానీ, ఒకసారి బొక్కబోర్లా పడినంత మాత్రాన, అంతటితో ఆపార్టీ పనై పోయింది అనుకోవడం అయితే అజ్ఞానం, లేకుంటే అహంకారం, అదీ కాదంటే అమాయకత్వం అనిపించుకుంటుంది. పడి లేచిన కెరటంలా, రాజకీయాల్లోనూ పనైపోయింది అనుకున్న పార్టీలు రెట్టింపు బలంతో అధికారంలోకి వచ్చిన సందర్భాలు చరిత్రలోనే కాదు, నడుస్తున్న చరిత్రలోనూ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రెండంటే రెండు లోక్ సభ స్థానాలున్న బీజేపీ ఈరోజు 303 స్థానాలకు చేరుకుంది.  సరే, అదలా ఉంచి  అసలు విషయంలోకి వస్తే, తెలంగాణలో పనైపోయింది అనుకున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ బలంతో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్  అదినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టడమే కాకుండా. ఆయనలో ఓటమి భయం పుట్టించింది. ఉద్దేశం ఏదైనా కావచ్చు తెలంగాణ సెంటిమెంట్  అండగా రాజకీయంగా ఎదిగిన కేసీఆర్  జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం అదే తెలంగాణ సెంటిమెంట్ ను స్వహస్తాలతో తుడిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగామార్చారు. నిజానికి కేసీఆర్  2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన గంటల  వ్యవధిలోనే, తెరాస ఇక ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని ప్రకటించారు.ఆ దిశగానే ఆయన ప్రయాణం ప్రారంభించారు. ఉద్యమ ఆనవాళ్ళను తుడిచేశారు. రాజకీయ పునరేకీకరణ అనే ముద్దు పేరుతొ  తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిబ జేఏసీ చైర్మన్ కొదండరామ్  సహా ముఖ్యనేతలు అందరిని ‘సగౌరవం’గా పార్టీ నుంచి సాగనంపారు. అదే  సమయంలో ఆ ముందు రోజు వరకు ఉద్యమ  ద్రోహులుగా, తెలంగాణ ద్రోహులుగా తామే నిందించిన తలసాని మొదలు సబితా ఇందర రెడ్డి వంటి వారిని  మంత్రిపదవులతో అందలం ఎక్కించారు. అలాగే, తెరాసను కుటుంబ పార్టీగా, తెలంగాణను కుటుంబ సామ్రాజ్యంగా మార్చేశారు.  అయితే తానొకటి తలిస్తే దేవుడి ఇంకొకటి తలిచాడు అన్నట్లుగా, కేసీఆర్  ఉద్దేశం ఏదైనా జాతీయ రాజకీయాలు అసలుకే మోసం తెచ్చాయి. ముఖ్యంగా 2018 అంతగా బలంగా లేని బీజేపీ, 2019 లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుకు పరిమితమైన బీజేపీ, లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఇక  అక్కడి నుంచి బీజేపీ దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా, ఒక రాజకీయ శక్తిగా ఎదిగింది. అలాగే, మొదటి నుంచి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత మరింతగా పుంజుకుంది. .బీజేపీ, కాంగ్రెస్ లలో ఎవరిది పైచేయి అనేది అటూ ఇటూ ఉగుతున్నా, చివరకు రాష్ట్రంలో ముక్కోణపు పోటీ అనివార్యంగా మారింది.  ఈ నేపద్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరేడు మాసాల క్రితం ఖమ్మం సభతో పూరించి శంఖారవం ఇప్పడు తెలంగాణ అన్ని జిల్లాలలో మారు మోగుతోంది. చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి పెట్టడంతో, బీఆర్ఎస్ లో  భయం పట్టుకుంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు, కేసీఆర్ గుడ్నేల్లో రైళ్ళు పరిగెతిస్తున్నాయి. నిజానికి, టీడీపీ రేసులో నిలిస్తే, కాంగ్రెస్ బీజేపీలకంటే తెలుగు దేశం పార్టీనే  బీఆర్ఎస్ ను బలగా దెబ్బతీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే సైకిల్ జోరు పెరుగుతుంటే కారు బేజారౌతోందని అంటున్నారు.  అందుకే కేసీఆర్, ఏపీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతున్నారని చెబుతున్నారు.

తమిళనాడు కోడలు కాబట్టే ఆ ఆపేక్ష

చిత్తూరు జిల్లాలో పుట్టిన మంత్రి రోజాను తమిళనాడు అక్కున చేర్చుకుంటుంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ దర్శకుడు సెల్వమణిని ఆమె వివాహం చేసుకున్న తర్వాత తమిళ ప్రజలు మా ఇంటి కోడలిగా భావిస్తున్నారు. రోజా తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. అది వేరే విషయం. రోజా ఆరోగ్యం గూర్చి తమిళనాడు సీ ఎం స్టాలిన్ ఆరా తీయడం చర్చనీయాంశమైంది. ఏపీ మంత్రి రోజా కొన్నిరోజుల కింద అస్వస్థతకు గురై చెన్నై ఆసుపత్రిలో చేరారు. ఉన్నట్టుండి మంత్రి రోజా ఆసుపత్రిలో చేరడంతో ఆమెకు ఏమైందన్న ఆందోళన నెలకొంది. అయితే, రోజా వెన్నెముక, కాలు నొప్పితో బాధపడుతున్నట్టు తెలిసింది.  కాగా, ఇవాళ మంత్రి రోజా ఆసక్తికర ట్వీట్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనకు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. ఆయన మానవీయ స్పందనకు ముగ్ధురాలినయ్యానని రోజా తెలిపారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలని కూడా సలహా ఇచ్చారని వివరించారు.  "గతంలో తాను కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యతోనే బాధపడినట్టు సీఎం స్టాలిన్ వెల్లడించారు. అంతేకాదు, ఆ సమస్యను ఎలా అధిగమించారో కూడా ఆయన చెప్పారు. నా ఆరోగ్యం పట్ల ఆయన చూపిన శ్రద్ధ, ప్రతి ఒక్కరి పట్ల ఆయన చూపించే ఆపేక్ష ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన గొప్ప పాలకుడే కాదు, ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకునే మనసున్న మనిషి కూడా. థాంక్యూ వెరీమచ్ సర్" అంటూ రోజా ట్వీట్ చేశారు.

కాదేది లంచానికి అనర్హం 

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. వాళ్ల ప్రవర్తన స్పూర్తిదాయకంగా ఉండాలి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు  సహజంగా లంచాలకు దూరంగా ఉంటారు. కానీ ఈ ప్రబుద్దుడు కాదేది లంచానికి అనర్హం అంటూ అభాసుపాలయ్యాడు.  తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వర్సిటీ తరఫున పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఓ వ్యక్తి వద్ద డబ్బు తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం వీసీ రవీందర్ గుప్తా ఇంట్లో ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. తెలంగాణ వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ శాఖల అధికారులు వర్సిటీలో సోదాలు జరిపారు. వర్సిటీలో అక్రమ నియామకాలకు సంబంధించిన ఆధారాలను ఈ సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వర్సిటీ తరఫున పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనలతో వీసీకి లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని వీసీ రవీందర్ గుప్తా ఇంటికి వెళ్లిన బాధితుడు.. వీసీకి రూ.50 వేలు అందించాడు. పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వీసీని పట్టుకున్నారు. వీసీని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఆయన ఇంట్లో సోదాలు జరిపి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై అధికారులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.

కర్ణాటక నుంచి హైదరాబాద్ పాకిన హిజాబ్ వివాదం 

కర్ణాటకలో నిరుడు ప్రారంభమైన హిజాబ్ వివాదం తెలంగాణకు పాకింది. హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం తలెత్తింది. ఐఎస్ సదన్ చౌరస్తాలోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు హాజరైన కొందరు ముస్లిం విద్యార్థినులు తమను హిజాబ్‌ ధరించి పరీక్ష రాసేందుకు అనుమతించలేదని ఆరోపించారు. హిజాబ్‌తో పరీక్ష కేంద్రంలోకి రావద్దని సిబ్బంది తేల్చి చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు, కాలేజీ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగినట్టు కూడా తెలిసింది. చివరకు కొందరు హిజాబ్ తీసేసి పరీక్షకు హాజరైనప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మిగతా వారిని హిజాబ్‌తోనే పరీక్షకు అనుమతించినట్టు సమాచారం. ఈ వివాదం కారణంగా తాము అరగంట ఆలస్యంగా పరీక్ష ప్రారంభించామని విద్యార్థినులు చెప్పారు. తదుపరి పరీక్షకు హిజాబ్ లేకుండా రావాలని కూడా సిబ్బంది ఆదేశించారని అన్నారు. మరోవైపు, ఈ వార్తలను కాలేజీ యాజమాన్యం ఖండించింది. హిజాబ్ ధరించిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది.  ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కాలేజీ నిర్వాహకులతో మాట్లాడతామని కూడా విద్యార్థినుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 2022 ప్రారంభంలో, మన దేశంలోని కర్నాటక రాష్ట్రంలో తొలిసారి హిజాబ్ ఉల్లంఘన నిబంధన వచ్చింది. పాఠశాల యూనిఫామ్‌లకు సంబంధించిన వివాదం అట్టుడికింది. తరువాతి వారాల్లో, ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పాఠశాలలు,  కళాశాలలకు వ్యాపించింది, కాషాయ కండువాలు ధరించాలని డిమాండ్ చేస్తూ హిందూ విద్యార్థులు రెచ్చిపోయారు.   అనేక విద్యాసంస్థలు హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. కర్ణాటకలో సద్దుమణిగిన ఈ వివాదం మరో పొరుగునే ఉన్న తెలంగాణకు పాకింది. 

హరగోపాల్ పై కేసు ఎత్తి వేత దిద్దు బాటే 

పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌‌పై కేసు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హరగోపాల్ సహా ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. హర గోపాల్, లేట్ జస్టిస్ సురేష్, జర్నలిస్ పద్మజా షాలపై ఉపా కేసులు ఎత్తి వేయాలని కేసీఆర్ ఆదేశించారు. మొత్తం 152 మందిలో కేవలం ముగ్గురు మీద మాత్రమే కేసు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మిగితా వారికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. సెంట్రల్ యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ బాల గోపాల్ పై కేసులు పెట్టడం పట్ల అభ్యుదయ వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కెసీఆర్ నక్సలైట్లను వెనకేసుకొచ్చి ప్రస్తుతం పౌరహక్కుల నేతల మీద కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. హరగోపాల్ మీద కేసులు బనాయించడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో  తెలంగాణ ప్రభుత్వం మీద బ్యాడ్ నేమ్ రావడాన్ని కేసీఆర్ సరి చేసుకోవాలని ప్రయత్నించారు. అందులో భాగంగా హరగోపాల్ పై కేసు ఎత్తి వేయడానికి కారణమైంది. 

గోషామహల్ ఓటెవరికి ?

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24  హైదరాబాద్ ,సికింద్రాబాద్  పరిధిలో 15 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అయితే  సిటీలో ఉన్న అన్ని నియోజక వర్గాలలో  హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న గోషామహల్ నియోజక వర్గానికి  ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మినీ ఇండియా గా పేరొందిన గోషామహల్ నియోజక వర్గంలో అన్ని వర్గాలు, అన్నీ రాష్ట్రాల ప్రజలు ఉంటారు. వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ నియోజక వర్గంలో గెలుపు ఎవరికీ అంత ఈజీ వ్యవహారం కాదు. అయితే, కాశీ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉండే ఈ నియోజక వర్గంలో ప్రాంతీయ భావాలకంటే జాతీయ భావాల వైపే కొంచెం ఎక్కువ మొగ్గు కనిపిస్తుంది.  అదలా ఉంటే  2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రాజా సింగ్  వరసగా రెండవ సారి ఈ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. అంతే కాదు ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక నియోజకవర్గం గోషామహల్. బీజేపీ టికెట్ పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజ్ సింగ్. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలిచినా, 2018 ఎన్నికల్లో గెలిచిన ఏకైక బీజేపీ ఏమ్మేల్యేగా రాజా సింగ్ చరిత్ర సృష్టించారు. ఆవిధంగానూ గోషామహల్  అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అయితే  రాజాసింగ్ రెండవసారి గెలిచినప్పటి నుంచీ, ఆయన్ని వివాదాలు చుట్టూ ముడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో వివాదాస్పద  స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫరూఖీ నిర్వహించిన షోకు వ్యతిరేకంగా అయన చేసిన వ్యాఖ్యలు, విడుదల చేసిన వీడియో వివాదాస్పదం కావడంతో బీజీపీ అధినాయకత్వం  ఆయన్ని గత ఆగష్టు లో పార్టీ నుంచి  సస్పెండ్ చేసింది. ఇప్పటికీ సస్పెన్షన్ కొనసాగుతోంది. అదే కేసులో ఆయన అరెస్టయ్యారు ..మూడు నెలలకు పైగా జైలు జీవితం అనుభవించి, బెయిల్ పై విడుదలయ్యారు. కేసు ఇంకా నడుస్తూనే వుంది. ఈ నేపధ్యంలో  బీజేపీ ఎన్నికలలోగా సస్పెన్షన్  ఎత్తి వేస్తుందా?  ఆయనకు మళ్ళీ బీజేపీ టికెట్ ఇస్తుందా? అనే అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఆయన  మాత్రం పోటీకి సిద్దమవుతున్నారు. వరసగా మూడవసారి గెలిచి, హ్యాట్రిక్ సాధిస్తానని  ధీమా వ్యక్త పరుస్తున్నారు. అదలా ఉంటే ఈసారి ఎలాగైనా గోషామహల్ పై గెలుపు జెండా ఎగరేయాలని..  అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం పార్టీలు  తహతహలాడుతున్నాయి. ఈ మేరకు  రెండు పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి.మరో వంక  పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ తహతహలాడుతోంది. అయితే  గో సంరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణకు పెట్టింది పేరుగా నిలిచిన రాజాసింగ్ ను ఓడించడం ఇటు బీఆర్ఎస్, ఎంఐఎం జోడీకి, అటు దేశ వ్యాప్తంగా హిందూ వ్యతిరేక లౌకిక వాద అజెండాతో పోతున్న కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదని అంటున్నారు. అయినా  గోషామహల్‌లో గెలుపు కోసం అన్ని పార్టీలు చాలా చురుగ్గా పావులు కదుపుతున్నాయి. దాంతో.. రాజాసింగ్ ఇలాకాలో తడాఖా చూపే పార్టీ ఏదన్నది ఆసక్తిగా మారింది. 2009లో గోషామహల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్, బీజేపీలదే హవా. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో.. వరుసగా బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుస్తూ వస్తున్నారు. అలాగే  ఇప్పటివరకు ఎంఐఎం నేరుగా ఇక్కడి నుంచి పోటీ చేయలేదు. గోషామహల్ అంటే.. రాజాసింగ్ అడ్డా అనే పేరుంది.  మరి రేపటి ఎన్నికల్లో గోషామహల్  ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో  చూడవలసి వుందని అంటున్నారు.  కాగా   గోషామహల్ బీజేపీ టికెట్ రేసులో.. ఇద్దరు, ముగ్గురు కీలక నేతలున్నారు. వారిలో.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు, జీహెచ్ఎంసీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న శంకర్ యాదవ్ కమలం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురిలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ రాజాసింగ్‌ను ఎంపీగా పోటీ చేయిస్తుందని, దాంతో.. తమకే పోటీ చేసే అవకాశం వస్తుందని.. ఆశావహులు లెక్కలు వేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత రెండు ఎన్నికల్లో గోషామహల్ బరిలో నిలిచినా గెలవలేకపోయింది. దాంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది కేసీఆర్ పార్టీ. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో నందకిశోర్ వ్యాస్, ఆశిష్ కుమార్ యాదవ్ , ముఖేష్ సింగ్, ఆనంద్ కుమార్ గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ విషయానికొస్తే.. గోషామహల్ నుంచి మెట్టు సాయికుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ బీజేపీలో చేరడం మెట్టు సాయికి కలిసొస్తుందనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. గోషామహల్‌లో గెలుపు జెండా ఎగరేసేందుకు.. ఏ పార్టీకి ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.మరి ఓటరు దేవుడు ..ఎవరిని కరుణినిస్తారో చూడవలసిందే..అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా డీకే.. రేవంత్‌ రెడ్డి ఆటలు ఇక సాగవా..?

కర్ణాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ లో మంచి ఊపు  కనిపిస్తుంది. సీనియర్లు తమ దూకుడును పెంచినట్లు కనిపిస్తోంది.  టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇటీవల కర్ణాటకకు వెళ్లి సలహాలు సూచనలు స్వీకరించారు. అంతర్గత సమస్యలు సమసిపోయేలా ఏం చేయాలనే ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.  ఈ క్రమంలో పలువురు సీనియర్లు కూడా డీకే శివకుమార్ తో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్నాళ్లుగా కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం పైకి సమసిపోయినట్లు కనిపిస్తున్నా.. లోలోపల రగులుతూనే ఉంది. అనాదిగా...కాంగ్రెస్‌ అంటేనే కయ్యాలు.. అంతర్గత కుమ్ములాటలు.. అసంతృప్తులు.. అలకలు.. ముఠా తగాదాలు.. వగైరా..వగైరాలు..   రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత ఈ కయ్యాలు ఎక్కువయ్యాయి. సీనియర్లు సహాయ నిరాకరణ ప్రకటించారు. రేవంత్‌ సారథ్యంలో పనిచేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో అసలైన కాంగ్రెస్‌ వాదులం అంటూ మరో గ్రూపుగా ఏర్పడ్డారు. రేవంత్‌ను వెనక్కు లాగేందుకు పార్టీకి కూడా నష్టం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణపైన ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో బీజేపీ బలం పెరగకూడదని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ దారు తామేనని భావిస్తోంది. ఈ సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. కర్ణాటక విజయంతో పార్టీలో విభేదాలు సమసిపోయినట్లు కనిపిస్తున్నా.. అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతన్నట్లు గుర్తించింది. అవి నివురు కప్పిన నిప్పులా ..లోలోన మండుతున్నాయి.   దీంతో కర్ణాటక తరహాలో అంత కలిసి పనిచేసేలా చూడాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పార్టీలోని సీనియర్లకు సన్నిహితుడైన ప్రస్తుతం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను తెలంగాణ ఇన్‌చార్జిగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక, మహరాష్ట్ర, రాజస్థాన్ లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడానికి డికె శివకుమార్ పాత్ర అంతా ఇంతా కాదు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాళ్లకు చక్రాలు కట్టుకుని బొంగరంలా తిరిగారు. అదే ఫార్ములాను మిగతారాష్ట్రాల్లో ప్రయోగించాలని అధిష్టానం భావిస్తోంది.  ట్రబుల్‌ షూటర్‌గా డీకేకు గుర్తింపునిస్తూ.. కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా అయిన ఆయనకే ఇన్ చార్జ్ బాధ్యతలు కట్టబెడుతూ.. అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.  శివకుమార్‌కు ట్రబుల్‌ షూటర్‌గా గుర్తింపు ఉంది. కష్టాల్లో పార్టీని గట్టెక్కించగల సమర్థుడుగా అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణపై ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా డీకేను తెలంగాణలో దించాలని భావిస్తోంది. సీనియర్లతో డీకేకు మంచి సంబంధాలు ఉన్నందున ఆయన అంతర్గత సంక్షోభానికి తెరదించుతారని అధిష్టానం భావిస్తోంది. బీఆర్ఎస్, బిజెపీల నుంచి వచ్చే నేతల చేరికల బాధ్యత డికె కు అప్పగించాలని యోచిస్తోంది.  రేవంత్‌ నాయకత్వాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల వీరు కర్ణాటకకు వెళ్లి డీకేను కలిశారు. కర్ణాటక ఎన్నికల సమయంలోనూ వీరికి బాధ్యతలు అప్పగించారు. దీంతో డీకేతో సాన్నిహిత్యం పెరిగింది. ఈ నేపథ్యంలో సీనియర్లు డీకేను తెలంగాణ ఇన్‌చార్జిగా తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంబించారు. ఈమేరకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు. ఈ ప్రదిపాదనను అధిష్టానం కాదనే నమ్మకం సీనియర్లలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే డీకే సలహాలు.. కర్ణాటక విజయంతో తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఈ క్రమంలో డీకే సూచనలు కూడా స్వీకరిస్తోంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇటీవల కర్ణాటకకు వెళ్లి సలహాలు సూచనలు స్వీకరించారు. అంతర్గత సమస్యలు సమసిపోయేలా ఏం చేయాలనే ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో పలువురు సీనియర్లు కూడా డీకేతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. సమన్వయం..వ్యూహాలు.. డీకే శివకుమార్‌ నియామకం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని కాంగ్రెస్‌ అధిష్టానం అంచనా వేస్తోంది. పార్టీలో సీనియర్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. పార్టీ వేగంగా ముందుకు వెళుతున్న ప్రతిసారీ ఈ అంతర్గత విభేదాలతో తలనొప్పులు ఎదురవుతున్నాయి. మరోపక్క ఇతర పార్టీలకు చెందిన సీనియర్‌ నేతల చేరికల విషయంలో కూడా తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. సోనియా, రాహుల్, ప్రియాంకలతో డీకేకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఇక్కడి పార్టీ వ్యవహారాలను ఆయన స్వతంత్రంగా, సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధిష్టానం అంచనాల మేర.. అన్నీ సక్రమంగా జరిగితే.. కాంగ్రెస్ తెలంగాణలో ఊపిరి పోసుకోవచ్చు.

మోడీ ముందస్తు మంత్రం నిజమేనా?

కేంద్ర పభుత్వం ముందస్తు యోచన చేస్తోందా? కర్నాటక ఎన్నికల ఫలితం తరువాత మూడో సారి విజయంపై బీజేపీలో అనుమానాలు మొదలయ్యాయా. కర్నాటక ఫలితం తరువాత జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీల ఐక్యతా యత్నాలు సవ్యదిశలో సాగడం, ఐక్యత విషయంలో విపక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు అవకాశాలు మెరుగయ్యాయన్న భావనతో.. అదే జరిగితే మోడీ సర్కార్ హ్యాట్రిక్  కల నెరవేరడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకే విపక్షాల ఐక్యతా యత్నాలు కొలిక్కి వచ్చేలోగానే  ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు పచ్చ జెండా ఊపేస్తే... రాజకీయంగా లబ్ధి చేకూరుతుందన్న నమ్మకంతో బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి   2014లో ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జమిలి మంత్రం జపిస్తూనే ఉంది.  అయితే  రాజకీయ సంక్లిష్టతల  ఆ తరువాత 2019లో మోడీ సారథ్యంలోని బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించినా ఆ ఆలోచనను అమలులో పెట్టలేకపోయింది. అయితే జమిలితోనే కేంద్రంలో అధికారాన్ని సుస్థిరం చేసుకోగలమన్న భావన మాత్రం ఆ పార్టీలో గట్టిగా ఉందని ఆ పార్టీ అగ్రనేతలే కాదు మోడీ కూడా పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు, ప్రకటనల ద్వారా తేటతెల్లమైంది. జమిలి కోసం కసరత్తు చయడమూ మానలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా కార్యాచరణ చేస్తున్నదని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు ప్రకటించే అవకాశం మాత్రం ఇసుమంతైనా లేదు.  ఇక జమిలి ఎన్నికలకు అనుకూలంగా  మేథావులు, సామాజిక, రాజకీయ విశ్లేషకుల నుంచి సానుకూల స్పందన లభించే విధంగా కేంద్రం తన ప్రయత్నాలను తాను సాగిస్తూ వస్తోంది. అది పక్కన పెడితే.. తొమ్మిదేళ్ల మోడీ పాలన తరువాత.. కేంద్రం ఎంతగా భారత్ దూసుకుపోతోంది లాంటి నినాదాలతో ఘనతను చాటుకుంటున్నా.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. గతంలో వాజ్ పేయి ప్రభుత్వం భారత్ వెలిగిపోతోంది నినాదంతో ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతిని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇక మోడీ సర్కార్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను గుర్తించిందనీ, దీంతో 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయం కోసం కొత్త కొత్త వ్యూహాలను రూపొందించుకునే క్రమంలో భాగంగానే ముందస్తు సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడంపై సమాలోచనలు జరుపుతోందని పోలిటికల్ సర్కిల్స్ లో ఓ స్థాయిలో చర్చ జరుగుతోంది.   ఈ ఏడాది చివరిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగాల్సిన ఎన్నికలతో పాటే సార్వత్రిక ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందన్న దానిపై బీజేపీ కేంద్ర కమిటీ చర్చోపచర్చలు జరుపుతోందని కేంద్రానికి సన్నిహితంగా ఉండే వర్గాలు విశ్వసనీయంగా చెబుతున్నాయి.  అలాగే ఈ ఏడాది జూలైలో  పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం చేసిన కీలక ప్రకటననూ గుర్తుచేస్తున్నాయి. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం లా కమీషనర్ పరిశీలనలో వుందని కేంద్రం పార్లమెంటు వేదికగా చేసిన ప్రకటనను ప్రస్తావిస్తున్నాయి.   అప్పటికి కేంద్రంలోని మోడీ సర్కార్ కు ప్రభుత్వ వ్యతిరేకత స్థాయి ఇప్పటంత తీవ్రంగా లేకపోవడం, 2024 సార్వత్రిక ఎన్నికలలో విజయంపై ధీమా అధికంగా ఉండటంతో ..2029 ఎన్నికల నాటికి జమిలి ఎన్నికలను కార్యరూపంలోకి తీసుకువస్తే సరిపోతుందని భావించింది. అయితే.. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం, విపక్షాలు ఐక్యంగా ఉంటే విజయం సులభ సాధ్యం కాదన్న గ్రహింపునకు రావడంతో.. ఆ ఐక్యతా యత్నాలు ఓ కొలిక్కి వచ్చేలోగానే  సార్వత్రిక ఎన్నికలను ముందస్తుగా జరిపించేసి విజయాన్ని ఖాతాలో వేసుకోవాలన్న దిశగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ యోచిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.