టీఆర్ఎస్ బిల్డప్! 600 కార్ల కాన్వాయ్‌తో మహారాష్ట్రకి సీఎం కేసీఆర్
posted on Jun 27, 2023 @ 9:42AM
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా తన సత్తా చాటుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తాపత్రయ పడుతున్నారు. ఇందులో భాగంగానే మరో తెలుగు రాష్ట్రమైన ఏపీతో పాటు తెలంగాణతో సరిహద్దుల్ని కలుపుకొని ఉన్న మరికొన్ని రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మహారాష్ట్రలో పార్టీని విస్తరించేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటంతో ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు నేతల్ని పార్టీలో చేర్చుకోవటం.. భారీ ఎత్తున ప్యాకేజీలతో వారిని ఉక్కిరిబిక్కిరి చేసిన గులాబీ బాస్.. మహారాష్ట్రకు చెందిన మీడియా సంస్థలకు కోట్లాది రూపాయిల ప్రకటనలతో వారిని ఆనందానికి గురి చేశారు. ఇక ఇప్పుడు గ్రాండియర్ అంటే ఏమిటో అక్కడ ప్రజలకు చూపిస్తున్నారు.
సీఎం కేసీఆర్ సోమవారం (జూన్ 26) మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో సీఎం మహా పర్యటనకు వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు కూడా ఉన్నారు.
బీఆర్ఎస్ కార్ ర్యాలీతో ముంబాయి రహదారి మొత్తం గులాబీమయమైంది. గులాబీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ముంబాయి రహదారిపై వస్తున్న కేసీఆర్ కాన్వాయిపై గులాబీ పువ్వులు, గులాబీ కాగితాలను వెదజల్లుతూ స్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో ర్యాలీ వెళ్లే ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. కాగా మధ్యాహ్నం 1 గంటకు మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా ఒమర్గాకు చేరుకోగా.. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4.30కి సోలాపూర్ బయలుదేరారు. రాత్రి సోలాపూర్‌లోనే బస చేసి మంగళవారం (జూన్ 27) ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి పండరీపురం చేరుకున్నారు.
అయితే, పక్కనే ఉన్న మహారాష్ట్రకి వెళ్లేందుకు 600 వందల కార్లు ఏంటి? అవి కాకుండా రెండు హైక్లాస్ లగ్జరీ బస్సులలో మంత్రులు, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలను తీసుకెళ్లడం ఏంటి? కేసీఆర్ అసలేం చేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తిగా మారింది. 600 కార్ల కాన్వాయ్‌తో ర్యాలీగా వెళ్లాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియాలో చర్చ మొదలవగా.. కేసీఆర్ సార్ ఈసారి ఎలాంటి స్కెచ్ వేశారో? కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వెనక అసలు కారణం ఏంటో? అసలు ఈ బిల్డప్ ఏంటి బాబాయ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కానీ, కేసీఆర్ లెక్కలు కేసీఆర్ కు ఉంటాయి. రాజకీయాలలో, అందునా తన పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో కేసీఆర్ కు తెలిసినంతగా టక్కు టమార విద్యలు మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు నిరూపించారు కేసీఆర్. గడిచిన కొన్ని నెలలుగా మహారాష్ట్రలో స్పెషల్ ఫోకస్ చేయటమే కాదు.. అక్కడి నేతల్ని తెలంగాణకు తీసుకొచ్చి.. వారికి ఊహించని రీతిలో ఆహ్వానం పలకడం నుండి వారిని సాగనంపే వరకు చేసిన సేవతో వారి మనసు దోచుకున్నారు. ఇప్పటికే నాగపూర్ లో పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. తన ఎత్తులతో తాను అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇప్పుడు ఇదీ నా సైన్యం అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను తీసుకెళ్లగా.. ఇదీ నా సత్తా అంటూ 600 కార్ల ర్యాలీతో మహారాష్ట్రలో అడుగుపెట్టారు. ఇంత భారీతనం మరాఠా రాజకీయాలకు పెద్దగా పరిచయం లేదు. అందుకే కేసీఆర్ ఇప్పుడు అందరి కన్ను తన మీద పడేలా చేసుకొనే ప్రణాళికలో భాగంగా ఇంత గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారనిపిస్తుంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.