‘వ్యూహం’ఫలించేనా?
posted on Jun 24, 2023 @ 4:44PM
ఎన్నికల ముందు రాజకీయ ప్రచార చిత్రాలు రావడం కొత్త విషయమేమీ కాదు. రామగోపాల్ వర్మతోనే ఈ ఒరవడి మొదలు కాలేదు. గత ఎన్నికల ముందు యాత్ర నుంచి ఆర్జీవీ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ వరకూ, అలాగే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కథానాయకుడు నుంచి మహానాయకుడి వరకూ రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసిన సినిమాలే.
అయితే వీటిలో ఆర్జీవీ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మినహాయిస్తే.. యాత్ర, కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు సినిమా పరంగా ఉన్నత సాంకేతిక విలువలతో వివాదాలకు దూరంగా చాలా వరకూ ఉన్నదున్నట్లుగా వెలువడిన సినిమాలు. సినిమా లిబర్టీ తీసుకుని హీరోయిక్ బిల్డప్ ఉంటే ఉండొచ్చు కానీ వాటిని ఒక పార్టీకి ప్రచారం కోసం తీసిన చలన చిత్రాలుగా చెప్పడానికి వీలులేదు. అయితే కచ్చితంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏదో మేర ఆయా పార్టీలకు రాజకీయ లబ్ధి చేకూరుతుందన్న భావన ఆయా సినిమాల నిర్మాతలలో ఉన్న మాట మాత్రం వాస్తవం. అయితే వ్యక్తిగత జీవితంలోనే కాదు వృత్తిగత జీవితంలోనూ విలువలూ, పద్ధతులూ పాటించేది లేదని బాహాటంగా చెప్పే రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మాత్రం సినిమా లిబర్టీ హద్దులను దాటేసి.. ఆయన మద్దతు ఇస్తున్న.. లేదా అ సినిమా నిర్మాత రాజకీయ ప్రయోజనాలకోసం ఊహాగానాలు, వదంతుల ఆధారంగా తీసిన సినిమా అనడంలో సందేహం లేదు.
ఆయా సినిమాల జయాపజయాల సంగతి పక్కన పెడితే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా మాత్రం కచ్చితంగా సినిమాకు ఉండాల్సిన ఏ లక్షణం లేకుండా తెరకెక్కిందని సినీ విమర్శకులే కాదు ఆ సినిమా చూసిన అతి కొద్ది మంది ప్రేక్షకులు సైతం కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశారు. చివరాఖరికి ఆయన ఏ పార్టీ ప్రయోజనం కోసం కనీసమైన విలువలకు తిలోదకాలిచ్చేసి ఆ సినిమా తీశారో ఆ పార్టీ వాళ్లు కూడా ఇదేం సినిమా అని ముక్కున వేలేసుకున్నారు. అది పక్కన పెడితే నాలుగేళ్లు గిర్రున తిరిగి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో తొమ్మది నెలలలో జరగననున్నాయనగా.. రామ్ గోపాల్ వర్మ మరో సినిమాను పట్టాలెక్కించారు. ఆ సినిమా పేరు ‘వ్యూహం’ ఆ సినిమా టీజర్ శుక్రవారం (జూన్ 24)న విడుదలైంది.
హెలికాఫ్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించడంతో మొదలైన ఈ టీజర్ జగన్‌పై సీబీఐ ఎంక్వైరీ, అరెస్ట్ వంటి విషయాలను స్పుృశించింది. మంచి టెక్నీషియన్ గా శివ, క్షణ క్షణం, రంగీలా వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రాం గోపాల్ వర్మ ఎక్కడో ట్రాక్ తప్పారు. అక్కడి నుంచి నిజ సంఘటనలంటూ కథా, కథనాలు లేకుండా రీళ్లు చుట్టేయడంతో ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా ఎవరికీ తెలియకుండా వచ్చి వెళ్లిపోతున్నాయి. ఇప్పుడు జగన్ జీవిత ‘వ్యూహం’గా తీసిన ఈ చిత్రం టీజర్ చూస్తే ఇది కూడా అదే కోవలో వచ్చిపోయే సినిమాగానే అనిపిస్తోంది.