జగన్నాటకంలో మడతడిపోయిన ఆర్జీవీ!
posted on Jun 26, 2023 6:37AM
ఆర్జీవీ.. పేరు ఏదైనా కొత్తగా సినీ పరిశమ్రకి వచ్చే దర్శకులకు ఆయనో ఐకాన్. కెమెరాతో ఎన్ని ట్రిక్కులు చేయొచ్చో కెమెరా మెన్లకు సైతం పాఠాలు చెప్పేంత నేర్పరి. మూసబోయిన వెండితెరని మలుపులు తిప్పగల మేధావి. సినిమా అంటే ఇలానే ఉండాలని లిఖించిన చరిత్ర పుస్తకాన్ని చెడామడా నలిపేసి విసిరేసి, చింపేసి.. మరో కొత్త చరిత్రను రాసుకున్న నిపుణుడు. ఇదంతా నిజమే. కానీ.. ఒకప్పుడు. గతమెంతో ఘనకీర్తి ఉన్న ఈ స్వయంకృత మేధావి ఇప్పుడు ఆర్బీఐ బ్యాన్ చేసిన రూ.1000 నోటుతో సమానమైపోయాడు. ఆ రూ.1000 నోటును రిజర్వ్ బ్యాంక్ చెల్లకుండా చేస్తే.. వర్మ అతి తెలివే అతన్ని పనికిరాకుండా చేసింది. అప్పట్లో వరస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఈడ్చి కొడుతుంటే ఏం చేయాలో పాలుపోక.. దెయ్యాలు, భూతాలను చూపించి కొన్నాళ్ళుబతికి బట్టకట్టేశాడు. ఆ తర్వాత వాటికీ ప్రేక్షకులు భయపడకపోవడంతో టెర్రరిస్ట్ అటాక్స్ మీద సినిమా ప్లాన్ చేశాడు. అక్కడే బీజం పడింది రాజకీయ నాయకులతో సహవాసం.
అసలే కోతి ఆపైన కళ్ళు తాగిన చందంగా పొలిటికల్ పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు కొందరు నిర్మాతలుగా మారి వర్మని బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. సాధారణంగా సినిమాను ప్రేక్షకులు చూస్తేనే దర్శకులకు డిమాండ్.. కానీ వర్మ లాంటి వాళ్లకి సినిమా రిజల్ట్ తో పనేముంది. ఆ మాటకొస్తే వర్మ తీసే సినిమా నిర్మాతలే డబ్బు కోసం సినిమాలు తీయరు. పొలిటికల్ పార్టీలకి వీడియో అడ్వర్టైజ్ మెంట్ కోసం ఖర్చు పెట్టినట్లే.. వర్మ సినిమాకి ఖర్చు పెట్టేస్తారు. ఎలాగూ ఇది ఎన్నికల ఖర్చులోకి లెక్క కూడా రాదు. అలా గత 2019 ఎన్నికలకు ముందు వచ్చినవే లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఈ సినిమాల సమయంలో ఏదో ఒక ఊపు ఊపేస్తాయని చాలామంది భ్రమ పడ్డారు. కానీ, ఫలితం శూన్యం. పోర్న్ స్టార్స్ తో సినిమా చేస్తేనే చాలా చూశాంలే ఆర్జీవీ పక్కకి సర్దుకోమన్న ప్రేక్షకులు.. అందరికీ తెలిసిన బాగోతాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇదే నిజం అంటే ప్రేక్షకులు నమ్మేస్తారని ఆశపడ్డ వారు బొక్కబోర్లా పడ్డారు. దీంతో తొలి రోజే థియేటర్లలో బొమ్మ బొరుసయ్యింది.
బొమ్మ ఆడకపోయినా అప్పుడు ఆ ఎన్నికలలో ఆశించిన వారే గెలిచారు. దీంతో వర్మ సినిమానే సెంటిమెంట్ అనుకుంటున్నారో.. లేక అప్పుడు ఆ సినిమానే కళాఖండం అని భ్రమ పడుతున్నారో ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల కోసం తగుదునమ్మా అంటూ మరో సినిమాను తెచ్చారు. అదే 'వ్యూహం'. తాజాగా వచ్చిన ఈ టీజర్ లో హీరో జగన్మోహన్ రెడ్డి, విలన్ చంద్రబాబు. ఇవే పాత్రల పేర్లు. రాజశేఖరరెడ్డి మరణంతో మొదలయ్యే సినిమా జగన్ సీఎం కావడంతో ముగుస్తుంది. వైఎస్ఆర్ మరణం నుండి జగన్ సీఎం అయ్యే వరకు జరిగే కథనే ఇందులో చూపించారని వర్మ అండ్ కో చెప్పుకుంటున్నారు. కానీ, ఇందులో చంద్రబాబు విలన్ ఎక్కడ అయ్యారో టీజర్ చూసిన ఎవరికీ అర్ధం కాదు. ఎందుకంటే ఆ మొత్తం ఎపిసోడ్ అప్పటి కాంగ్రెస్ పెద్దలు, జగన్ మధ్య జరిగినదే. ఇది అప్పటికే కాస్త మూతి మీద వెంట్రుకలొచ్చినా అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవు కదా. బహుశా అందుకేనేమో ఈ సినిమాలో కూడా చంద్రబాబునే విలన్ ని చేసినట్లున్నాడు.
ఒక్కసారి వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కథకు వెళ్తే సినిమా మొత్తం వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అల్లిన కథే కనిపిస్తుంది. ఎన్టీఆర్ హయాంలో జరిగినది తెలిసిన వాళ్ళు ఆ సినిమా చూసి ముక్కున వేలేసుకున్నారు. అప్పటి చరిత్ర విన్న వాళ్ళు సైతం ఇదేదో తేడాగా ఉందే అనుకున్నారు. కానీ, ఇప్పుడు వర్మ వ్యూహం కథ మొత్తం గత 13 క్రితం నుండి నాలుగేళ్ళ క్రితం వరకు జరిగిందే. ఆ తొమ్మిదేళ్లలో ఏం జరిగిందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తుంది. అందుకే టీజర్ లో చంద్రబాబు పాత్రను చూడగానే ఇది వైసీపీ ఎన్నికల ప్రచార సినిమా అని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. దీనికి తోడు సరిగ్గా ఐదు రోజుల క్రితమే వర్మ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇక చెప్పేదేముంది.. ఇది 'వ్యూహం' కాదు జగన్నాటకమని!