ఇంతకూ భారతి ఎందుకు నవ్వింది?
posted on Jun 26, 2023 7:18AM
ఓ వైపు ఎన్నికలు దూసుకొచ్చేస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి.. మన ముఖ్యమంత్రి జగనన్నే ఎప్పటికీ... అనిపించుకోవాలని ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైయస్ జగన్ తాపత్రయపడుతోన్నారు. అందులోభాగంగా జగనన్న వదిలిన మరో బాణం.. వ్యూహం.
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో.. అంటే ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు విడుదల చేయనున్నారని సమాచారం. అయితే ఈ చిత్ర టీజర్ శనివారం (జూన్ 24) విడుదలైంది. 2 నిమిషాల 45 సెకన్ల పాటు సాగిన ఈ టీజర్‌లో... అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు అంటూ జగన్ పాత్రలో అజ్మల్ చెప్పిన ఒక్కే ఒక్క డైలాగ్ తప్ప.. మరో డైలాగ్ లేకపోవడం గమనార్హం.
మరోవైపు మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్‌లో ప్రయాణం చేస్తుండడంతో ప్రారంభమైన ఈ టీజర్.. అజ్మల్ చెప్పే ఒక్కే ఒక్క డైలాగ్‌తో ముగుస్తుంది. దీంతో ఈ టీజర్.. మహానేత మరణం నుంచి జననేత జగన్ ఎన్నికల్లో విజయం సాధించి..ముఖ్యమంత్రిగా కారు ఎక్కే క్రమంలో ప్రజలకు అభివాదం చేస్తుండడం.. అలా ఆలోచించడానికి నేను చంద్రబాబుని కాదంటూ అచ్చుగుద్దినట్లు జగన్ గొంతుతో చెప్పడంతో ఈ టీజర్ ముగుస్తుంది.
ఈ టీజర్ ప్రారంభం నుంచి ముగింపు వరకు.. సీరియస్‌గా సాగిన ఈ టీజర్‌లో కాసిన్ని కన్నీళ్లు, కూసింత ఆందోళన, మరికొంత ఆదుర్ధాతోపాటు వైయస్ జగన్ భార్య వైయస్ భారతీ నవ్వుతూ.. తన భర్తకు మనస్పూర్తిగా.. అదీ తన మామ వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటో సాక్షిగా షేక్ హ్యాండ్ ఇవ్వడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చర్చ వాయువేగంతో ఊపుందుకోవడం విశేషం.
ఈ చిత్రంలో వైయస్ భారతీ నవ్విన నవ్వు దేనికి సాంకేతమని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ షేక్ హ్యాండ్.. తన చిన్న మామ వైయస్ వివేకా దారుణ హత్య వార్త విని.. ఈ విధంగా స్పందించారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు వైయస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సెల్ కాల్ డేటా లిస్ట్‌లో వైయస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే వైయస్ భారతీ పీఏ నవీన్‌ల సెల్ ఫోన్లకు అర్థరాత్రి వేళ.. అంటే వైయస్ వివేకా హత్య జరిగిన సమయానికి ముందు ఆ తర్వాత.. కాల్స్ వెళ్లినట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఓఎస్డీ, భారతీ పీఏ నవీన్‌లను సీబీఐ విచారించిందని... అలాంటి వేళ ఈ షేక్ హ్యాండ్.. ఆ ఫోన్ కాల్స్ వచ్చిన వేళ.. చేసుకొన్న షేక్ హ్యాండ్‌యేనా అని నెటిజన్ల సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుంటే.. ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఇనాడే ఎదురైనట్లు.. అంటే అనుకున్నది అనుకున్నట్లుగా.. ముఖ్యమంత్రి పీఠాన్ని తన భర్త వైయస్ జగన్ అధిరోహించినందుకా? ఈ షేక్ హ్యాండ్ అని నెటిజన్లు మధనపడుతూ ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు ఈ టీజర్‌లో చంద్రబాబును చూపించే ముందు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఫొటోపై కెమెరాను ఫోకస్ చేసి.. ఆ తర్వాత చంద్రబాబును చూపించడం విశేషం. ఇక ఈ టీజర్‌లో ఒకే ఒక్క డైలాగ్.. అదీ జగన్ చెప్పిందీ.. అలా ఆలోచించడానికి నేను చంద్రబాబుని కాదని చెప్పడం.. ఇది అక్షరాల నిజమేనని.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. చంద్రబాబు ఆలోచన తీరు ఎలా ఉంటుందో.. వైయస్ జగన్ ఆలోచన సరళి ఎలా ఉంటుందో వరంగల్‌కు చెందిన కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్ కట్‌గా సోదాహరణతో చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ వ్యూహం.. జగన్‌కు ఫలిస్తుందా? లేక వికటిస్తుందా? అనేది తెలియాలంటే మాత్రం వచ్చే ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు వేచి చూడక తప్పదనేది నెటిజన్లు స్పష్టం చేస్తుండడం మహా విశేషం.