కమలం కంగారు.. తప్పదు ఇక పోయిరావలె హస్తినకు!
posted on Jun 26, 2023 6:26AM
దేశంలో ఇక మాకు తిరుగే లేదనుకున్న బీజేపీ.. పునాదుల నుండి అంతస్థుల వరకు సహకరించిన మిత్రులను సైతం తొక్కేసి ఇంకా ఇంకా ఎదగాలనుకుంది. ఇదే ప్లానింగ్ లో కొంతమేర సక్సెస్ అయింది కూడా. కానీ, ఇప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కర్ణాటక రూపంలో గట్టి షాక్ తగిలింది. దీంతో ఇప్పుడు నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది. ఈలోగా అదే కర్ణాటక ఇచ్చిన విజయం తాలూకూ ఉత్సాహాన్ని కాంగ్రెస్ రెట్టింపు చేసుకొనేలా మరింతగా ఎదిగే ప్రణాళికలు రచించుకుంది. దీంతో బీజేపీలోఇప్పుడు కంగారు మొదలైంది. అది స్పష్టంగా తెలంగాణ తెలంగాణలో కనిపిస్తున్నది. ఔను.. గత రెండు వారాలుగా చూస్తే ఈ కంగారు స్పష్టం కనిపిస్తున్నది.
తెలంగాణలో ఇక కాంగ్రెస్ కు ఆశలు లేవన్న బీజేపీ త్వరలోనే మరో రాష్ట్రంలో కూడా తమదే హవా అని విర్రవీగింది. రాష్ట్ర నేతలలో కూడా ఆ వ్యవహార శైలిలో కొట్టొచ్చినట్లు కనిపించింది. కానీ, ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులతో అటు ఢిల్లీ పార్టీ పెద్దల నుండి రాష్ట్ర నేతల వరకు మరో రాష్ట్రం కూడా చేజారుతుందా అని కంగారు మొదలైంది. దీంతో రాష్ట్ర నేతలంతా అనివార్యంగా హస్తినకు క్యూ కట్టారు. పట్టారు. మొన్నటికి మొన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి మూడు రోజుల పాటు పెద్దలను కలిసి సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు అంశంపైనే ఇదంతా జరిగిందని ప్రచారం జరిగింది. కానీ, అసలు విషయం రాష్ట్ర పార్టీకి తగలబోతున్న కుదుపుకు నష్ట నివారణే ఈ పర్యటన సారాంశంగా కనిపిస్తుంది.
ఇక, ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలిచారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైనట్లు గత వారం రోజులుగా ముమ్మర ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఈ ఇద్దరికీ ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. ఇక ఈ వీరిద్దరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో హైదరాబాద్ నుంచి ఆయన హడావుడిగా బయల్దేరారు. అధిష్ఠానం నిర్వహించనున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా మళ్లీ పిలుపు వచ్చిందా, రాలేదా అనేది తెలియదు కానీ ఈ ముగ్గురి ఢిల్లీ పర్యటన, పెద్దలతో సమావేశం మాత్రం ఖరారైంది.
కాగా, గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం తన నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులతో రహస్య సమావేశం కూడా నిర్వహించినట్లు కథనాలొచ్చాయి. ఇక దాదాపుగా ఈటల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అంతా ఫిక్సయిపోయారు. అలాంటి సమయంలో ఢిల్లీ నుండి పిలుపొచ్చింది. మరో నేత రాజగోపాల్ రెడ్డిది కూడా అదే పరిస్థితి. ఈటల కంటే ముందే ఈయన కాంగ్రెస్ లోకి చేరాల్సి ఉన్నా.. సరైన సమయం కోసం ఓపికగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆ సమయం రావడంతో ముహూర్తం చూసుకుంటుండగా బీజేపీ పెద్దల నుండి పిలుపు వచ్చింది. మరి ఈ సమావేశంలో ఆ పెద్దలు ఏం చెప్పనున్నారో.. వీళ్ళు బీజేపీలోనే ఉంటారా? లేక అనుకున్నట్లే పార్టీ మార్పుకు మొగ్గు చూపుతారా అన్నది తేలాల్సి ఉంది.