ముప్పేట దాడి.. జగన్ ఉక్కిరిబిక్కిరి!
posted on Jun 26, 2023 6:05AM
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ ప్రతిపక్షాలు అధికార పార్టీపై దండయాత్ర మొదలు పెడుతున్నాయి. అధికార పార్టీ అంటే ఎలాగూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రజల మధ్యకి వెళ్తారు. అదే ప్రతిపక్షాలైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షాలు కూడా అదే చేస్తున్నాయి. అయితే, ఈసారి ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుండి ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తుండగా.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కూడా బస్సు యాత్ర మొదలుపెట్టారు. లోకేష్, చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కూడా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.
మరోవైపు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహీ విజయయాత్రతో కార్యకర్తలలో జోష్ నింపుతున్నారు. అధికార పార్టీపై, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ పవన్ యాత్ర కొనసాగుతుంది. జనసేనకి ఓటు బ్యాంక్ ఎంత, పవన్ సభలకు.. యాత్రలకు వచ్చే వారంతా ఓటర్లేనా అన్నది పక్కనపెడితే పవన్ కళ్యాణ్ విజయయాత్రకి భారీ స్పందన వస్తున్నది. కార్యకర్తల ఉత్సాహం చూసి పవన్ లో కూడా రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. అయితే, ఈ యాత్రలు, పర్యటనలను పరిశీలిస్తే ఓ ఆసక్తికర అంశం స్పష్టమవుతుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సైలెంట్ గా ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎండగడుతూ.. హుందాగా రాజకీయాలు చేస్తూ ప్రజలలో బలం పెంచుకొనే పని చేస్తుంది. కానీ, జనసేన కావాలనే చేస్తుందో.. వైసీపీ రియాక్షన్ వలన అలా అవుతుందో కానీ పవన్ వారాహీ యాత్ర వైలెంట్ పాలిటిక్స్ కి దారితీస్తున్నది.
నారా లొకేషన్ పాదయాత్ర మొదలు పెట్టిన తొలి రోజుల్లో ఘాటు విమర్శలు చేసేవాళ్ళు.. వైసీపీ నుండి కూడా అదే స్థాయిలో రియాక్షన్ ఉండేది. ఇప్పుడు లోకేష్ మాటల ఘాటు కంటే ప్రజలతో మమేకమయ్యేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ కలుపుకుంటూ సమయపాలనతో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక చంద్రబాబు ఎలాగూ ఆయన స్థాయికి తగ్గట్లు ప్రజలను ఆలోచింపజేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ, పవన్ మాత్రం మాటలతోనే ఆటం బాంబులు పేల్చేస్తున్నారు. వైసీపీ నుండి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వస్తుండడం, దానికి జనసైనికులు మరింతగా అటాక్ చేయడంతో ఆటోమేటిక్ గా వైలెంట్ అవుతోంది. అయితే, ఇది కూడా ఒకరకంగా రాజకీయ ఎత్తుగడ లాగే కనిపిస్తుంది.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ మూడు ప్రాంతాలలో కార్యక్రమాలు చేపట్టారు. ఒకరి కార్యక్రమానికి మరొకరి కార్యక్రమంతో పోలికే లేదు. కానీ, అందరి ఎజెండా ఒక్కటే. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపడమే. రాష్ట్రంలో ఇంకా పొత్తుల వ్యవహారం తేలలేదు. ఈలోగా అందరూ ఒకే మూస పద్ధతిలో చేపట్టే కార్యక్రమాలు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేవు. పైగా అందరి కార్యక్రమాలకు ఒకేసారి అటెన్షన్ దక్కదు. అందుకే ఇలా తలా ఒక పద్ధతిలో డిజైన్ చేసుకోవడం మంచిదే. అలాగే అందరూ కలిసి ప్రభుత్వంపై దాడి చేస్తున్నారనే నెగటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. ఎన్నికల సమయంలో వైసీపీ కూడా ప్రచారం మొదలు పెట్టి సభలు నిర్వహిస్తుంటే అప్పుడు మూకుమ్మడి అటాక్ చేసినా అది ప్రజలలో నెగటివ్ భావన కలిగించదు. అందుకే ఇలా ఒకరు సైలెంట్ గా ప్రజల మధ్యకి చొచ్చుకుపోతుంటే.. మరొకరు వైలెంట్ గా ప్రభుత్వాన్ని అటాక్ చేస్తున్నారనిపిస్తుంది. మరి ఇది ఎవరిపై ఎంత ప్రభావం చూపిస్తుందో.. ఎవరికి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.