ఏపీ నీది.. తెలంగాణ నాది.. జగన్, షర్మిల వ్యూహం?
posted on Jun 24, 2023 @ 10:44AM
పేకాట పేకాటే.. తమ్ముడు తమ్ముడే అన్నది నానుడి. రాజకీయాలలో కూడా సాధారణంగా అదే పరిస్థితి ఉంటుంది. రాజకీయం కోసం అన్నా తమ్ముళ్లు, అక్కా చెళ్లెల్లు, భార్యాభర్తలు పోటీ పడటం కామనే. కానీ వైసీపీ కుటుంబంలో మాత్రం ఆ పోటీ పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నతో తగాదాలు (అవి ఆస్తితగాదాలని పెద్దగా ప్రచారంలో ఉంది) కారణంగా ఏపీ సీఎం వైస్ జగన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పుట్టిల్లు వదిలేసి అంటే ఏపీని వదిలేసి మెట్టినిల్లంటూ తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు.
ఆమె వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, వారానికో దీక్ష చేసినా, తెలంగాణలో అధికార పార్టీ, ఆ పార్టీ అధినేత, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించినా, ఉద్రిక్తతలను పెచ్చరిల్లేలా విమర్శలు చేసి, ధర్నాలు చేసి అరెస్టైనా ఆమెకు కానీ, ఆమె వైఎస్సార్టీపీ కి కానీ పెద్దగా మైలేజీ రాలేదు. దీంతో ఆమె చూపు తండ్రి జీవించి ఉన్నంత కాలం కొనసాగిన కాంగ్రెస్ పార్టీపై పడింది. స్వయంగా ఆమె బెంగళూరు వెళ్లి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో వరుస భేటీల ద్వారా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా అన్న ఊహాగానాలకు తావిచ్చారు. అక్కడ నుంచి వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది, ఆమె ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టి అన్న, ఏపీ సీఎం జగన్ కు పక్కలో బల్లెంగా మారతారన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. అవి పీక్స్ కు చేరేదాకా వేచి చూసిన షర్మిల విలీనం ప్రశక్తే లేదని మెల్లిగా, తన ఆశ, శ్వాస తెలంగాణయే అంటూ గట్టిగా ప్రకటించారు.
ఆమె ఎంతగా విలీనం లేదు మొర్రో అని మొరపెట్టుకుంటున్నా.. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం వార్తలు మాత్రం ఆగడం లేదు. ఆమె తన పార్టీపై పెట్టిన కాన్సన్ ట్రేషన్ ను తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి పాలన, ఆయన కుటుంబ అక్రమాలపై పెట్టండంటూ మీడియాకు హితవు పలికినా.. ఆమె వరుస భేటీలూ, ఆమె తండ్రి కుటుంబానికి సన్నిహితుడైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రినివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోవడం.. ఇటీవలి కాలంలో పొంగులేటి అటు జగన్ తోనూ, ఇటు షర్మిలతోనూ భేటీ కావడం వీటన్నిటినీ చూస్తుంటే.. 2019 ఎన్నికలకు ముందు ఏపీలో ఆమె తన సోదరుడి విజయం కోసం కృషి చేసినట్లే.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి తెలంగాణకే పరిమితం కావడం ద్వారా మరోసారి జగన్ కు ఆమె అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. అయితే షర్మిలను కాంగ్రెస్ ఏపీ పీసీసీ చీఫ్ ను చేస్తుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తాను ఏపీకి వెళ్లేది లేదని.. తెలంగాణ బిడ్డడా.. తుది శ్వాస వరకూ తెలంగాణలో రాజకీయం చేస్తానని కొట్లాడుతానని విస్పష్టంగా చెప్పేయడం ద్వారా ఆమె ఏపీలో జగన్ కు ఇసుమంతైనా నష్టం చేయడానికి రెడీగా లేరన్నది తేటతెల్లం చేశారు.
డీకే శివకుమార్.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే సహా తెలంగాణ సీనియర్లు ఆమె తెలంగాణలో అవసరం లేదని.. ఆమె పార్టీ విలీనానికి ఓకే కానీ ఆమె అవసరం తెలంగాణలో లేదనీ, ఏపీలోనే ఉందని అంటున్నారు. ఆ దిశగా ఆమెను ఒప్పించేందుకు శతథీ ప్రయత్నిస్తున్నారు. కానీ నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగాలని పార్టీ నాయకులకు గట్టిగా చెబుతున్నారు. విలీనానికి ఓకే కానీ..ఏపీకి వెళ్లనని షర్మిల అంటున్నారు. అయితే షర్మిల విలీనానికి మెగ్గు చూపుతూనే ఏపీకి దూరం అనడం వెనుక అన్నాచెల్లెళ్ల వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం షర్మిలను ఎలాగైనా ఒప్పించి ఏపీలో పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. ఏం జరుగుతుందన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది.