ఎవరికీ పట్టని ముద్రగడ సవాల్!
posted on Jun 24, 2023 @ 10:13AM
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసిన ఆయన ఆ ఒక్క అంశం తప్ప ఇప్పటి వరకూ మరే విషయాన్నీ పట్టించుకోలేదు. అందుకే కాపు సామాజిక వర్గంలో ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఔను ఉండేది.. ఇప్పుడు అది లేదు. ఆయన జగన్ కోసం తన సామాజిజక వర్గంలో తనకున్న పరపతిని ఉపయోగించడం మొదలెట్టారని ఆరోపణలు వినవస్తున్నాయి.
అవి ఆరోపణలకు మాత్రమే కాదు పచ్చి నిజాలు అని తాజాగా ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ కు రాసిన రెండు లేఖల ద్వారా బహిర్గతమైంది. అంతే కాదు ఆయన కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఎవరి సొమ్ములతో నడిపారో కూడా ఆయనే స్వయంగా వెల్లడించడంతో సొంత సామాజిక వర్గం నుంచే ముద్రగడపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.
నాడు ఉద్యమం సందర్భంగా మీరు మాకు సరఫరా చేసిన ఉప్మా డబ్బులు వడ్డీతో సహా చెల్లించేస్తున్నాం తీసుకోండి అంటూ కాపు యువత ఆయనకు మనీఆర్డర్లు పంపిస్తోంది. దీంతో ఆయన ఇంత కాలం కాపాడుకుంటూ వచ్చిన కాపు ఉద్యమ నేత గుర్తింపును తన లేఖల ద్వారా ఆయనే చెరిపేసుకున్నట్లైంది. ఇక ఆయన వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని మరీ పవన్ కు సవాళ్లు విసిరారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి పై పోటీ చేయకుంటే పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయనకు ప్రత్యర్థిగా తానే నిలబడతానని ముద్రగడ సవాల్ విసిరారు.
ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతానని గతంలోనే ప్రకటించిన ఆయన ఇప్పుడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని మరీ పవన్ క ల్యాణ్ పై పోటీకి సై అంటున్నారు. ఇంత గట్టిగా సవాల్ విసురుతున్న ముద్రగడ పిఠాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగారంగంలోకి దిగుతానని మాత్రం చెప్పడం లేదు. అన్యాపదేశంగా తాను వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు.
తన కుమారుడి కోసం తనకు సొంత సామాజిక వర్గంలో ఉన్న గౌరవాన్ని, గుర్తింపును వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడిన ముద్రగడ.. ఇప్పుడు అధికార పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని మరీ పవన్ కు సవాళ్లు విసురుతున్నారు. మరీ ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేసి రిజర్వేషన్ల ప్రశక్తే లేదన్న ఏపీ సీఎం జగన్ కు మద్దతుగా మాట్లాడడం, అలాగే కాపు సామాజిక వర్గాన్ని చులకనగా, అసభ్య పదజాలంతో దూషించిన ద్వారంపూడికి వత్తాసుగా జనసేనానిపై విమర్శలకు దిగడమే కాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ భాష సంస్కరించుకోవాలంటూ హితవు పలకడంతో ముద్రగడ పట్ల ఆయన సొంత నియోజకవర్గ నేతలలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
కాపు ఉద్యమానికి ద్వారంపూడి ఆర్ధికంగా సహకారం అందించారని తన లేఖలో పేర్కొనడం కూడా ఆ సామాజికవర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికి కారణమైంది. దీంతో కాపు సామాజిక వర్గ నేతలంతా ఒక్క వైసీపీలోని ఆ సామాజిక వర్గ నేతలను మినహాయిస్తే.. ముద్రగడపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ద్రోహిగా అభివర్ణిస్తూ నిరసనలకు దిగుతున్నారు. అని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ కు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతానంటూ ముద్రగడ విసిరిన సవాల్ ను ఆయన తప్ప ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు.
నిజంగా ఆయన పవన్ కు ప్రత్యర్థిగా నిలబడితో సొంత సామాజిక వర్గం ఆయన మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ముద్రగడ సవాల్ ను వైసీపీతో సహా ఎవరూ సీరియస్ గా పరిగణనలోనికి తీసుకోలేదు. ఉత్తర కంచి ఉద్యమం ద్వారా హీరోగా కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ముద్రగడ ఇప్పుడు అదే సమాజికవర్గానికి ఒక ద్రోహిగా, సామాజికవర్గంలో ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న విలన్ గా కనిపిస్తున్నారు.