ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
posted on Jun 30, 2023 @ 12:48PM
వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి చేతి దగ్గరకొస్తే చేతి దెబ్బ.. కాలి దగ్గరకొస్తే కాలి దెబ్బ అన్నట్లుగా తయారైంది. జగన్ సర్కార్ అస్తవ్యవస్థ విధానాలు, ఆర్థిక అరాచకత్వం కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతున్నది.
జగన్ సర్కార్ తీవ్రమైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోందన్నది రాజకీయ విశ్లేషకులే కాదు, వైసీపీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ మాట పట్టుకుని గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వెళుతున్న వారికి ప్రజల నుంచి ఛీత్కారాలూ, పరాభవాలే ఎదురౌతున్నాయి. ముందస్తు ప్రణాళిక వేసుకుని జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులను జనంలోకి పంపాలని నిర్ణయించుకున్న నాటి నుంచే వైసీపీలో బయటపడకపోయినా తీవ్ర అసంతృప్తి నెలకొందన్నది వాస్తవం. ఆ విషయాన్ని జగన్ ఒక్కడే గ్రహించడం లేదని పార్టీలో కీలక నేతలు సైతం అంతర్గత సంభాషణల్లో బయటపడిపోతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవం తరువాత జగన్ ధోరణి బెదరింపుల నుంచి బుజ్జగింపుల వరకూ రావడంతో.. ఇక గడపగడపకూ నరకం నుంచి బయటపడినట్లేనని మంత్రులూ, ఎమ్మెల్యేలూ ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు ప్రశక్తే లేదని జగన్ తనను తాను సమాధాన పరుచుకుని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతాం అని ప్రకటించారు. సరిగ్గా ఈ ప్రకటన తరువాత నుంచే ఇంకా తొమ్మదినెలలకు పైగా సమయం ఉంది కనుక ఎమ్మెల్యేలు, మంత్రులను జనంలోకి పంపి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని జగన్ ఆదేశించారు. అన్ని రోగాలకూ ఒకటే మందు జిందా తిలస్మాత్ అన్నట్లు అన్ని వర్గాల ప్రజలలో నెలకొన్న ఆగ్రహం, అసంతృప్తిని పారద్రోలడానికి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమమే దివ్యఔషధమన్న ఐ ప్యాక్ సూచనలకు అనుగుణంగా మళ్లీ జగన్ ఎమ్మెల్యేలను ప్రజాగ్రహానికి బలి చేసి వ్యక్తిగత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కాలంటే.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జనం మనసులు గెలుచుకోవాలని ఆదేశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓ 19 మందిని గుర్తించాననీ, వారు తమ తీరు మెరుగుపరుచుకోకపోతే టికెట్ ఉండదనీ ఇటీవల హెచ్చిరించి పంపారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి ముందుకు వెడితే నుయ్యి వెనక్కు వెడితే గొయ్యి అన్న చందంగా తయారైంది. పార్టీలోనూ, ప్రజలలోనూ కూడా వారు ముఖం చూపలేక, ముఖం చాటేయలేకా నానా యాతనకు గురౌతున్నారు. మొండిగా ప్రజలలోకి వెళ్లిన వారు జనం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సహనం కోల్పోతున్నారు. వార్నింగ్ లకు, బెదరింపులకు, బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికే ఈ పరిస్థితి ఎదురైంది. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ప్రజాగ్రహ జ్వాలను ఎదుర్కొన్నారు.
ఇరువురూ కూడా జనంపై ఆగ్రహం వ్యక్తం చేసి వారిలోని ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగేందుకు మాత్రమే దోహదపడ్డారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే.. మా తీరు ఇంతే మేం మారం మీ దిక్కున్న చోట చెప్పుకోపో అని ఓటర్ ను..అదీ ఓ మహిళా ఓటర్ పై అగ్రహంతో విరుచుకుపడ్డారు. దాదాపు ఇదే సీన్ రాష్ట్రం అంతా కనిపిస్తోంది. జగన్ ను ఏం అనలేని ఎమ్మెల్యేలు.. ప్రజలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చే ఎన్నికల్లో తమ ఓటమిని.. అలాగే పార్టీ ఓటమిని ఇప్పుడే కన్ఫర్మ్ చేసేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ బాధలన్నీ పడలేక కేవలం లబ్ధిదారుల ఇళ్లకే వెడదామని నిర్ణయించుకుని ఆ ప్రకారమే చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పథకాల లబ్ధి దారుల్లో సైతం ఆగ్రహం వ్యక్తం అవుతుండటం ఎమ్మెల్యేలు, మంత్రులకు మింగుడుపడటం లేదు.
రూ. పదివేలు ఇచ్చి.. రూ. ఇరవై వేలు లాక్కుంటున్నారని లబ్ధిదారులు మంత్రులు, ఎమ్మెల్యేల ముఖం మీదే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం విధానంపై కూడా ఓ రేంజ్ లో నిరసన వ్యక్తం అవుతోంది. రోడ్లు, నీళ్లు, విద్యుత్, పన్నులు ఇలా ఒక్క విషయం అని కాదు.. అన్ని అంశాలలోనూ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ బాధ పడలేక గడపగడపకూ కార్యక్రమానికి వెళ్లకుండా డుమ్మా కొట్టేద్దామంటే అడుగడుగునా ఐ ప్యాక్ నిఘా. వెళ్లి ప్రజా వ్యతిరేకత చవిచూసినా, ప్రజలలో ఆదరణ లేదన్న ఐప్యాక్ నివేదికలు క్షణాల్లో జగన్ చేతికి వెళ్లిపోతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు ఏ రాయి అయితేనేం పళ్లు రాలగొట్టుకోవడానికి అన్న నిర్వేదంలో పడిపోయారు. వీటన్నిటికంటే ఐప్యాక్ సభ్యులను మేనేజ్ చేసుకుంటే మేలన్న ఉద్దేశంతో కొందరు ఆ ప్రయత్నాలూ చేశారు, చేస్తున్నారు. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, క్యాడర్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న భావనే వ్యక్తమౌతోంది.