బెలారస్ లో వాగ్నర్ దళాలు.. ఉక్రెయిన్ కు పెరిగిన ముప్పు!
posted on Jun 30, 2023 @ 10:10AM
రష్యాలో కిరాయి సైనిక మూక వాగ్నర్ బృందం తిరుగుబాటు తరువాతి పరిణామాలతో నాటో కూటమిలో ఆందోళన ఆరంభమైంది. పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించిన గంటల వ్యవధిలోనే వెనక్కు తగ్గిన వాగ్నర్ సేన ఇప్పుడు బెలారస్ లో అడుగుపెట్టింది. అక్కడ వాగ్నర్ బృందం, ఆ బృంద నేత ప్రిగోజిన్ ఆశ్రయం పొందడానికి పుతిన్ అనుమతి ఇవ్వడమే నాటో కూటమి ఆందోళనకు కారణం. బెలారస్ భద్రతపై నాటో కూటమిలో ఆందోళన వ్యక్తమౌతోంది.
దీంతో నాటో కూటమి దేశాలు జులై 11న నాటో దేశాలన్నీ సమావేశం కావాలని నిర్ణయించాయి. మొత్తం 31 సభ్య దేశాలు ఈ సమావేశానికి హాజరు కానున్నాయి. వాగ్నర్ దళాలు బెలారస్ లో ఆశ్రయం పొందడం అంటే అది నాటో దేశాల భద్రతకు ముప్పుగానే భావిస్తున్నామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. నాటో సభ్యదేశాల భూభాగంలోని ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటామనీ, అన్ని దేశాల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడే ప్రశక్తే లేదనీ నాటో దళాల చీఫ్ ఇప్పటికే విస్పష్ట ప్రకటన చేశారు.
రష్యా ప్రభుత్వంపై వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు వార్తలతో నాటో దేశాలలో హర్షం వ్యక్తం అయ్యింది. ఆ తిరుగుబాటుతో తమకెటువంటి సంబంధం లేదని ప్రకటిస్తూనే విస్తరణ కాంక్ష కారణంగానే రష్య పతనం కాక తప్పదని జోస్యాలు కూడా చెప్పాయి. అయితే వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు గంటల్లోనూ చల్లారిపోయినా.. ఈ తిరుగుబాటు ప్రభావం రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయనీ, రష్యాదళాల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయనీ నాటో దేశాలు అంచనా వేశాయి. అయితే ఆ అంచనాలకు భిన్నంగా పుతిన్ కు మద్దతుగానే వాగ్నర్ గ్రూపు నిలవడం, పుతిన ఆ తిరుగుబాటు గ్రూప్ పట్ల అత్యంత ఉదారంగా వ్యవహరించడమే కాకుండా బెలారస్ లో ఆశ్రయం తీసుకోవటానికి పుతిన్, బెలారస్ అంగీకరించటంతో బెలారస్‌ను ఆనుకొని ఉన్న నాటో కూటమి సభ్య దేశాలైన పోలండ్, లాత్వియా, లిథువేనియాలకు ముప్ప ఏర్పడింది.
అలాగే రష్యాతో రణం చేస్తున్న ఉక్రెయిన్ కూడా బెలారస్ సరిహద్దు దేశమే. అయితే ఇప్పుడు నాటో కూటమిని వేధిస్తున్న అనుమానం ఏమిటంటే పుతిన్, ప్రిగోజిన్ లు వ్యూహాత్మకంగానే వ్యవహరించి వాగ్నర్ మూకలను బెలారస్ లో మోహరించారని నాటో దేశాలు భావిస్తున్నాయి. అంతే కాకుండా ఈ పరిణామంతో ఉక్రెయిన్ కు ముప్పు మరింత పెరిగిందని సైనిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. పుతిన్ పై వాగ్నర్ దళాల తిరుగుబాటు విషయంలో ఉన్న అనుమానాలు ఇప్పటికిప్పుడు నివృత్తి అయ్యే అవకాశాలు లేకపోయినప్పటికీ.. బెలారస్‌లోకి వాగ్నర్ మూకల రాక మాత్రం ఏ విధంగా చూసినా ఆందోళనకరమేననీ, రష్యా గడ్డపై నుంచి కంటే బెలారస్ నుంచి ఉక్రెయిన్‌పై దాడి తేలిక అని సైనిక నిపుణులు అంటున్నారు. అన్నిటికంటే ప్రధానంగా ఈ తిరుగుబాటుకు రోజుల ముందే రష్యా కొన్ని అణ్వాయుధాలను బెలారస్ కు తరలించడాన్ని నిపుణులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.