విశాఖలో కిడ్నాప్ కల్చర్
posted on Jun 30, 2023 @ 2:28PM
అహ్లాదకర వాతావరణానికి, ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ విశాఖపట్నం. ఓ వైపు సముద్రం, మరోవైపు రిషికొండ....తోట్లకొండ, ఇంకోవైపు యారాడ కొండ ఇలా ప్రకృతి సోయగాల నడుము విశాఖనగరం సురక్షితంగా ఉంది. అయితే అలాంటి శాంతియుత, సుందర నగరంలోకి మైనింగ్, ప్యాక్షన్, రియాల్టీ, గంజాయి, డ్రగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా.. మాఫియాల గ్రాండ్ ఎంట్రీతో.. వాటి పడగ నీడలో ఉక్కు నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
విశాఖపట్నం ఎంపీ, అధికార జగన్ పార్టీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ ఘటన మరపుకు రాకముందే తాజాగా అదే విశాఖలో మరో రియల్టర్ శ్రీనివాస్‌తోపాటు ఆయన భార్య లక్ష్మీ కిడ్నాపయ్యారు. వీరిని విడుదలకు రూ.60 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అయితేనే.. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆందోళనలో గడిపారు. తాజాగా ఆ మహనగరంలో మరో కిడ్నాప్ చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఇలాంటి వేళ అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు గన్ లైసెన్స్‌లు తీసుకోవాలంటూ స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే సూచించడం... అందుకు సంబంధించిన వార్తలు సైతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం.. అందులో ఇప్పటికే 600 మందికి గన్‌లైసెన్స్‌లు ఉన్నాయని పోలీస్ అధికారులు గణాంకాలతో సహా చెబుతున్నారు.
మరోవైపు అధికార పార్టీ ఎంపీ ఫ్యామిలీని రౌడీషీటర్ కిడ్నాప్ చేయడం.. ఆ తర్వాత తాను విశాఖ వేదికగా వ్యాపారం చేయలేనని సదరు ఎమ్మెల్యే చేతులు ఎత్తేయడం.. అనంతరం సాక్షాత్తూ సీఎం జగన్‌తో బేటీ అయి.. విశాఖలో చోటు చేసుకొన్న వరుస పరిణామాల గోడును ఆయన వద్ద వెళ్లబోసుకోవడం చూస్తుంటే.. ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకే దిక్కు లేకుండా ఉండే పరిస్థితి నెలకొందనే ఓ ప్రశ్న అయితే సామాన్యుల మదిలో మొలకెత్తింది.
అంతేకాదు గన్ లైసెన్స్ తీసుకోవాలంటూ వీఐపీలకు పోలీసులే స్వయంగా సూచించడడం గమనార్హం. ఇంకోవైపు విశాఖపట్నం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌లో పరిపాలన సాగిస్తామంటూ సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించేశారు. మరి ఆ లోపు.. సదరు మహానగరంలో శాంతి భద్రతలు కట్టడి చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందా? లేకుంటే.. చూసి చూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తుందా? అనేది తెలియాలంటే.. కొద్ది రోజులు పాటు ఓపిక పట్టాల్సిన పరిస్థితి నెలకొందనే ఓ చర్చ సైతం నడుస్తోంది.
2014 రాష్ట్ర విభజన సమయంలో విశాఖపట్నం నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మ.. లోక్ సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి.. పోటీ చేశారు. ఆ సమయంలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసిన విషయం విదితమే. ఆ క్రమంలో వైయస్ విజయమ్మను గెలిపిస్తే.. శాంతి భద్రతలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న విశాఖనగరం ప్యాక్షన్ రాజకీయానికి అడ్డాగా మారుతుందని.. అలాగే శాంతి భద్రతల సమస్యలు సైతం తలెత్తుతాయంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు .. తన ఎన్నికల ప్రచార వేళ.. తన దార్శనికతతో చెప్పారు.
దీంతో ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి కంభంపాటి హరిబాబు గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల వేళ.. జగన్ వేవ్‌లో శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు లోక్‌సభ స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఫ్యాన్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులే గెలుపొందిన విషయం విధితమే. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 151 మంది ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోనే కాదు.. శాంతి భద్రతలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఉత్తరాంధ్రలోని విశాఖనగరంలో మళ్లీ అలజడి రేగడం.. ఆ నగరంలోని సామాన్య పౌరుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనేది సుస్పష్టంగా గోచరిస్తుందనే ఓ చర్చ సైతం హల్ చల్ చేస్తోంది.