వైసీపీ అరాచకత్వానికి పరాకాష్ట
posted on Jun 30, 2023 @ 10:29AM
వైసీపీ అరాచకత్వానికి హద్దులు చెరిగిపోతున్నాయి. తమకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయన్న అక్కసుతో జర్నలిస్టులపైనే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. కొండపిలో గురువారం (జూన్ 29) నియోజకవర్గ ఇన్ చార్జి అశోక్ బాబు మిట్టపాలెంలో గడపగడపకూ కార్యక్రమం నిర్వహించారు. ఆయన యాత్రకు అడుగడుగునా ప్రజా నిరసన సెగ తగిలింది. ప్రజలు అశోక్ బాబును సమస్యలపై నిలదీయడాన్ని చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై ఆయన అనుచరులు భౌతిక దాడులకు పాల్పడ్డారు.
కెమేరా లాక్కొని ధ్వంసం చేశారు. అంతే కాకుండా స్థానిక విలేకరిపై అశోక్ బాబు అనుచరుడి చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఉన్న చట్టాన్ని వైసీపీ నేతలు దుర్వినియోగం చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో ఆందోళన చేస్తున్న అమరావతి రైతులపై కూడా ఈ కేసు బనాయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దళిత రైతులపైనే ఈ కేసు బనాయించిన సంగతి విదితమే. కాగా విలేకరిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఉండగా ప్రజా నిరసనే కాకుండా అశోక్ బాబుకు సొంత పార్టీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సొంత పార్టీ నేతలే బహిష్కరించారు. పోలీసులు అశోక్ బాబును తన కార్యక్రమం వాయిదా వేసుకోవాల్సిందిగా కోరినా ఆయన వినలేదు.
పార్టీ స్థానిక నాయకత్వం లేకుండానే కొద్ది మంది అనుచరులతో ఆయన గడపగడపకూ కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఆయన రాకను నిరసిస్తూ ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మా ఇంటికి రావద్దంటే స్టిక్కర్లు అతికించాయి. ఈ నేపథ్యంలో మిట్టపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ వర్గాల మధ్యే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. ఈ వ్యవహారాన్నంతా రిపోర్టు చేసినందుకు అశోక్ బాబు వర్గీయులు జర్నలిస్టులపై దాడులకు దిగారు.