ఔను డీఎంకే కుటుంబ పార్టీయే.. సీఎం స్టాలిన్ కొత్త భాష్యం
posted on Jun 30, 2023 @ 3:09PM
తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమ పార్టీ కుటుంబ పార్టీయే నంటూ కుండ బద్దలు కొట్టారు. ఆవిర్భావం నుంచీ డీఎంకే కుటుంబ పార్టీయేనని స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ కుటుంబ పార్టీ ఎందుకు అయ్యిందీ, ఎలా అయ్యిందీ అన్న దానికి మాత్రం ఆయన కొత్త భాష్యం చెప్పారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై పార్టీ నేతలనూ, కార్యకర్తలను తమ్ముడూ అంటూ పిలిచేవారని గుర్తు చేసిన స్టాలిన్, తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిథి కూడా పార్టీ సభ్యులను తోబుట్టువులారా అని సంబోధించే వారని గుర్తు చేసిన ఆయన ఆ విధంగా డీఎంకే కుటుంబపార్టీయే అన్నారు. కుటుంబ పార్టీ అంటూ విపక్షాల విమర్శలకు ఆయనీ విధంగా చెక్ చెప్పారు. మరీ ముఖ్యంగా కుటుంబ పార్టీ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ డీఎంకే సభ్యులమంతా ఒకే కుటుంబమని చెప్పారు.
డీఎంకే ఉన్నత కార్యాచరణ మండలి సభ్యుడు గుమ్మిడిపూండి వేణు మనవరాలి వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి స్టాలిన్.. ప్రధాని మోడీ..
డీఎంకే కుటుంబ పార్టీ అనీ, ఏ డీఎంకే కుటుంబ రాజకీయాలు నడుపుతోందని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అలాగే డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో జరిగే మహానాడు వంటి కార్యక్రమాలకు, ప్రజాందోళనా కార్యక్రమాలకు డీఎంకే కీలక నేతలందరూ కుటుంబ సమేతంగా హాజరు కావడం ఆనవాయితీగా వస్తున్న సంగతిని స్టాలిన్ గుర్తు చేశారు.
డీఎంకేకి ఓటేస్తే కరుణానిధి కుటుంబమే అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించడమే కాకుండా కరణానిథి కుటుంబం అంటే మొత్తం రాష్ట్ర ప్రజలు అని అన్నారు. ఐదు దశాబ్దాలుగా తమిళనాట ద్రావిడ పార్టీలే అధికారంలో ఉన్నాయనీ, వారి ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందనీ స్టాలిన్ అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిస్తున్న రాష్ట్రమైన మణిపూర్లో 50 రోజులకు పైగా కల్లోల పరిస్థితులు నెలకొన్నా ఇప్పటివరకు ప్రధాని అక్కడికి వెళ్లలేదని విమర్శించారు. మోడీ దృష్టిలో దేశం అంటే కేవలం గుజరాతేనా అని ప్రశ్నించారు. విపక్షాల ఐక్యతా యత్నాలు మోడీని భయపెడుతున్నాయనీ, బీజేపీ పార్టీలు ఐక్యంగా ఉంటే కేంద్రంలో తన అధికార పీఠం కూలిపోతుందన్నఆందోళన నుంచే మోడీ నుంచి అసందర్భ విమర్శలు వస్తున్నాయన్నారు.