జగన్ క్రిస్టియానిటీయే ఆయుధం... 2024కి బీజేపీ-జనసేన ఉమ్మడి వ్యూహం..!

  2024 నాటికి ఇటు తెలంగాణలోనూ... అటు ఏపీలో కూడా బలపడాలనుకుంటోంది బీజేపీ. అయితే, తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితులు అంత ఆశాజనంగా లేవు. ఎందుకంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒక్క శాతం ఓట్ షేర్ కూడా రాలేదు. అయితే, ఎన్నికల తర్వాత బీజేపీలోకి వలసలు పెరగడం... నలుగురు టీడీపీ ఎంపీలు... పార్టీలో చేరడంతో... ఏపీ బీజేపీలో కొంత ఊపు వచ్చింది. ఇక, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు... ఒకరిద్దరు వైసీపీ ఎంపీలు కూడా బీజేపీలో చేరతారనే టాక్ నడుస్తోంది. అయితే, పవర్ ఫుల్ మాస్ లీడర్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు పవన్ ను సంప్రదించినా... జనసేనాని నో చెప్పారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించినా ఆయనా సున్నితంగా తిరస్కరించారు. అయితే, ఎన్నికల తర్వాత పరిస్థితులు తారుమారు కావడంతో... ఇప్పుడే పవనే... బీజేపీ వైపు చూస్తున్నాడని అంటున్నారు. ఇక, బీజేపీకి ఎలాగూ పవన్ లాంటి క్రౌడ్ ఫుల్లర్ అవసరం ఉంది. ఉందుకే వీళ్లిద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ఆమధ్య అమెరికాలో పర్యటనలో బీజేపీ కీలక నేత రామ్ మాధవ్... జనసేనాని పవన్ కల్యాణ్ చర్చలు జరిగాయట. బీజేపీ-జనసేన కలిసి పనిచేయడంపైనే వీళ్లిద్దరి మధ్య చర్చలు సాగాయి. అయితే, ఇప్పుడు జగన్ లక్ష్యంగా పవన్ విరుచుకుపడటం వెనుక బీజేపీ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇసుక ఇష్యూ... ఆ తర్వాత ఇంగ్లీష్ వివాదంపై విమర్శలు ఎలాగున్నా... మతపరమైన అంశాలను తెరపైకి తేవడం వెనుక మాత్రం బీజేపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. జగన్ క్రిస్టియానిటీని పదేపదే ప్రస్తావించడం... తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం.... తిరుమలలో సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్ లో వినిపించాలనడం వెనుక కాషాయ వ్యూహం ఉందంటున్నారు. జగన్ అసలు తిరుమల లడ్డూ తింటారా అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించడం వెనుక బీజేపీ మత రాజకీయం ఉందని అంటున్నారు. మతపరంగా జగన్ ను టార్గెట్ చేయడం వెనుక జనసేన-బీజేపీ ఉమ్మడి వ్యూహం ఉందంటున్నారు. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా జగన్ ను మతపరంగానే టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం జగన్ ను మతపరంగా విమర్శిస్తున్నారు. అయితే, పవన్ మాత్రం బీజేపీ అజెండానే అమలు చేస్తున్నారనే మాట గట్టిగా వినబడుతోంది. జగన్ క్రిస్టియానిటీని పదేపదే తెరపైకి తీసుకొచ్చి హిందువులను తమవైపు తిప్పుకోవాలన్నదే బీజేపీ-జనసేన వ్యూహంగా తెలుస్తోంది. అందుకే అదేపనిగా జగన్ పై మతపరంగా అటాక్ చేస్తున్నారని అంటున్నారు. ఢిల్లీ పర్యటనలో పవన్... కాషాయ పెద్దలను కలిసి ఇదే అంశంపై చర్చించారని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రభావం లేకపోయినా, పదేపదే జగన్ క్రిస్టియానిటీని తెరపైకి తేవడం ద్వారా 2024 నాటికి ప్రజల్లో ఎఫెక్ట్ ఉంటుందనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి, బీజేపీ మతపరమైన అజెండాను జనసేనాని నెత్తిన పెట్టుకుని మోస్తారా? లేక విధానపరమైన అంశాలపై మాత్రమే పోరాడతారో చూడాలి. అయితే, ఉత్తరాది తరహా మతతత్వ ఫార్ములా ఏపీలో వర్కవుట్ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

ఎలక్ట్రిక్ బస్సులకు నిధులు లేవు.. డీజిల్‌వే నడుపుకోండి... ఏపీఎస్ఆర్టీసీకి జగన్ పిలుపు

ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పై ఏపీ సర్కారు వెనుకడుగు వేస్తుంది. డీసిల్ బస్సుల నిర్వహణ ఖర్చుల కంటే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చులే ఎక్కువ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాంటప్పుడు ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు ఎందుకు ఆహ్వానించి రద్దు చేశారనేది ప్రశ్నగా మారింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై ఏపీఎస్సార్టీసీ వెనకడుగు వేసింది. కొనుగోలు చేయాలంటే కోట్లల్లో ధర.. డీజిల్ బస్సులతో పోల్చితే నిర్వహణ వ్యయం ఎక్కువ. అలాంటప్పుడు కొనుగోలుకన్నా వదులుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అద్దెకు తీసుకుందామని అనుకున్నా.. డీజిల్ బస్సులతో పోల్చితే ఎలక్ట్రిక్ బస్సుల అద్దె ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు తాత్కాలికంగా ఆపేసింది. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసే రవాణా సంస్థలకు.. ప్రైవేటు వ్యక్తులకు భారీ సబ్సిడీ ప్రకటించింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని భావించింది.  మొదటి విడతలో భాగంగా 350 బస్సులు కొనాలనుకుంటే బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులతో ఆగస్టులో ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఒక్కో బస్సు ధర రూ.కోటి 80 లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉంటుందని కంపెనీలు పేర్కొన్నాయి. ఇది ఎంతో భారమని భావించిన ఉన్నతాధికారులు ప్రైవేటు కంపెనీల నుంచి అద్దెకు తీసుకోవాలనుకున్నారు. కర్ణాటక , తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అద్దె కిచ్చిన సంస్థలను ప్రీపెయిడ్ కు ఆహ్వానించి చర్చలు జరిపారు.కిలో మీటరుకు రూ.60 రూపాయల వరకు ఇవ్వాలని కొన్ని కంపెనీలు అంతకు ముందే చెప్పడంతో అందుకు అప్పటి ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు ససేమిరా అన్నారు. తాము బస్సు నడిపితే కిలోమీటరుకు వచ్చే ఆదాయమే రూ.32 రూపాయలకు మించదని.. అలాంటప్పుడు రూ.60 రూపాయలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు.  ప్రీ బిడ్ సమావేశానికి ముందు రోజు ప్రభుత్వం ఆయనను బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంచార్జి ఎండీగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబును నియమించింది. దీని పై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ షాక్ అనే శీర్షికతో సెప్టెంబర్ 25 న ఒక కథనం ప్రచురించింది. దీనిని ప్రభుత్వం ఖండించింది. అనంతరం అద్దె ప్రాతిపదికన 1350 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్ లు పిలిచింది. ఈ నెల 4వ తేదీ వరకు గడువు విధించింది. అయితే రాష్ట్రంలో వంద కోట్ల రూపాయల దాటిన పెద్ద టెండర్లన్నీ జుడిషియరీ కమిషన్ కు పంపి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టెండర్ లను 4వ తేదీనే రద్దు చేశారు. ఈ నెల ( నవంబర్ ) 15 లోపు మళ్లీ టెండర్ లు పిలుస్తామని అధికారులు చెప్పిన అలాంటిదేమీ జరగలేదు. ఎలక్ట్రిక్ బస్సులు కొనడమో అద్దెకు తీసుకోవడమో చేసే కంటే డీజిల్ బస్సులు కొనడం మేలని రవాణామంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రతిపాదించినట్లు తెలిసింది. 4వ తేదీన టెండర్ లు రద్దు చేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఎలక్ట్రిక్ బస్సులు అంశంపై సమీక్షించారు. ఈ బస్సుల ధర కోట్లల్లో ఉండటం.. నిర్వహణ డీజిల్ కన్నా భారంగానే ఉండటం.. రీచార్జి స్టేషన్ ల ఏర్పాటుకు రూ.200 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఉన్నతాధికారులు చెప్పడంతో కొనుగోళ్లు వద్దని సీఎం అన్నట్లు తెలిసింది. అద్దెకు తీసుకున్న భారమేనని చెప్పడంతో మరింత లోతుగా అధ్యయనం చేయాలని జగన్ ఆదేశించినట్టు తెలిసింది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు పై ప్రభుత్వం ప్రస్తుతానికి ఆసక్తిగా లేదని మంత్రి మంగళవారం ( నవంబర్ 19న) తెలిపారు. జ్యుడీషియల్ కమిషన్ కు పంపిన తరవాతే తక్కువకు ఎవరూ ముందుకు వస్తారో వాళ్లకు అవకాశమిస్తామని తెలిపారు.ఈ నెల 23 లోపు ముఖ్యమంత్రితో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎంతో భేటీ తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు ఇన్ చార్జ్ ఎంటీ కృష్ణబాబు.

జగన్ కి కోపమొచ్చింది.. ఏపీ కేబినెట్ నుంచి నలుగురు మంత్రులు ఔట్!!

  నాన్ వెజ్ కి రుచి మరిగిన పులితో.. ఇక నుంచి నువ్వు ప్యూర్ వెజిటేరియన్ వి, నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదు అని చెప్తే వింటుందా? చెప్పండి. వద్దన్నా నాలుక నాన్ వెజ్ వైపు లాగేస్తుంది. ఏపీలో కొందరి పొలిటీషియన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వద్దన్నా అవినీతి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కి తలవంపులు తీసుకొస్తున్నారు. జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత బలంగా చెప్పిన మాట.. అవినీతిరహిత పాలన అందిస్తా, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పారు. అంతేకాదు అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అవినీతి చేయడానికి వీల్లేదని, అవినీతి చేస్తే అస్సలు సహించనని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కొందరు నేతల్లో మార్పు కనిపించట్లేదు. అధికారంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఉన్నప్పుడే అందినకాడికి దోచుకోవాలి అనుకుంటున్నారు. ఏదైనా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాత సామెతను చెప్తున్నారట. అయితే నేతల అవినీతి వ్యవహారం జగన్ వరకు చేరడంతో.. ఇప్పటికే వారిని పిలిచి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు కొందరు మంత్రులను అసలు కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు.. అవినీతికి పాల్పడుతున్నారట. ఆ లిస్ట్ జగన్ కి చేరడంతో గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. ఈ ఐదు నెలల్లో అవినీతిలో టాప్ లిస్ట్ లో ఉన్న ఓ నలుగురు మంత్రులని పదవి నుంచి తప్పించాలి అనుకుంటున్నారట. అలా చేయటం వల్ల మిగతా మంత్రులు.. ఎక్కడ తమ మంత్రి పదవి కూడా పోతుందేమోనన్న భయంతో అవినీతి చేయడం మానేస్తారు. ఎమ్మెల్యేలు కూడా తమకి మంత్రి పదవి దక్కదేమోనన్న భయంతో అవినీతి మానేస్తారు. అందుకే జగన్ ఆ నలుగురు మంత్రులని టార్గెట్ చేసారని తెలుస్తోంది. మరోవైపు ఆ  నలుగురు మంత్రులు ఎవరా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ నలుగురిలో.. ఇద్దరు బీసీ మంత్రులు, ఒక ఓసీ మంత్రి, ఒక ఎస్సీ మహిళా మంత్రి ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు కోస్తా ఆంధ్రాకు చెందిన వారని సమాచారం. ఈ మంత్రుల అవినీతిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక బీసీ మంత్రిపై అవినీతి ఆరోపణలతో పాటు, ఆయన వ్యవహారశైలిపై కూడా సొంత పార్టీ నేతలే జగన్ కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నలుగురిలో మొదట హిట్ లిస్ట్ లో ఆ మంత్రే ఉన్నారు అంటున్నారు. ఇక మహిళా మంత్రి విషయానికొస్తే.. ఆమె పదవిని అడ్డుపెట్టుకొని ఆమె భర్త వసూళ్లకు పాల్పడుతున్నట్లు.. కొందరు జగన్ దృష్టికి తీసుకెళ్లారట. అంతేకాదు ఒకసారి ఆ దంపతులు ఎవర్నో డబ్బులు డిమాండ్ చేసారని తెలియడంతో.. జగన్ స్వయంగా ఆ మహిళా మంత్రికి ఫోన్ చేసి.. ఎంత కావాలమ్మా డబ్బులు అన్నారట. దీంతో హడలిపోయిన మంత్రి.. జగన్ కి ఎదురుపడాలంటేనే భయపడుతున్నారట. మొత్తానికి టాప్ 4 లిస్ట్ లో మహిళా మంత్రి రెండో ప్లేస్ లో ఉండగా.. ఒక బీసీ మరియు ఒక ఓసీ మంత్రి.. తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారట. ఇప్పటికే ఆ నలుగురు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన జగన్.. ఏ క్షణమైనా వారిని తప్పించి వేరే వారికి అవకాశమిచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.

కేసీఆర్, జగన్ ల మధ్య దూరం పెరగడానికి కారణమేంటి?

  ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పగ్గాలు చేపట్టాక కేసీఆర్, జగన్ ఇద్దరూ సఖ్యతగా మెలిగారు. పలుసార్లు భేటీ అయ్యారు. ఒకరికొకరు కితాబులిచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కథ కంచికి చేరినట్లు తెలుస్తొంది. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని తెలంగాణ అధికార వర్గాలంటున్నాయి. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించటం, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం, కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారం కేసీఆర్ కు మంట పెట్టింది. ఏపీ తరహాలో తెలంగాణలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు 40 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది, ఈ అంశం కేసీఆర్ కు కొరుకుడుపడటంలేదు. అవగాహన లోపంతో ఆర్టీసీ విలీనం పై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు.ఈ తేనెతుట్టెను కదిలించి తమకు నష్టం కలిగించారని అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు. మరోవైపు కేసీఆర్ అన్నందుకైనా ఆర్టీసీ విలీనం ఆరు నెలల్లోనే సక్సెస్ చేసి చూపుతామని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు.  తెలంగాణ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన అధికారులు, కేసీఆర్ అంటే గిట్టనివారికి జగన్ పెద్ద పీట వేయడం కూడా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోవటానికి కారణమని అంటున్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించి వీఆర్ఎస్ తీసుకున్నారు. వెంటనే ఆయన్ను ఏపీ విద్యాశాఖ సలహాదారుగా జగన్ నియమించుకున్నారు. ఇంక కేసీఆర్ అంటే గిట్టని జర్నలిస్టులు అమర్, రామచంద్రమూర్తికి పెద్ద పీట వేయడం కూడా కేసీఆర్ కు నచ్చలేదని చెబుతున్నారు. స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి విషయంలోనూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. కేంద్రం నుంచి పూర్తిగా ఆదేశాలు రాక ముందే ఈ ఇద్దరినీ అనధికారికంగా విధుల్లోకి తీసుకోవటం కేసీఆర్ కు కోపం తెప్పించిందట. చివరికి స్టీఫెన్ రవీంద్ర వెనక్కొచ్చి అభాసుపాలయ్యారు. అటు గోదావరి జలాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. గోదావరి జలాలను ఉమ్మడిగా క్రిష్ణకు తరలించాలని ఇద్దరూ కలిసి నిర్ణయించారు. కేసీఆర్ ఉదారంగా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తాం అంటున్నారని జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించేశారు కూడా. అయితే ఆ తర్వాత తత్వం బోధపడిందో ఏమో ఆ ఆలోచనను విరమించుకున్నట్టు కనిపిస్తోంది. సొంతం గానే పోలవరం నుంచి కృష్ణాకు నీళ్ళు తరలించే ప్రతిపాదనలను చేస్తోంది ఏపీ ప్రభుత్వం.  ఇక ప్రగతి భవన్లో ఇద్దరు ముఖ్య మంత్రుల సమావేశంలో మాట్లాడుకున్న అంశాలు మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఈ విషయంలో కేసీఆర్ జగన్ కలిసి కేంద్రంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్టు మీడియాలో వచ్చింది. దీంతో జగన్ ఉలిక్కిపడ్డారు. ఈ విషయాలు మాట్లాడుకోలేదని ప్రకటన కూడా విడుదల చేశారు. కేసీఆర్ తో సఖ్యతగా మెలగడంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దూరం పెడుతోందన్న అభిప్రాయానికి వచ్చారు జగన్ .అనవసరంగా తొందరపాటుతో కేసీఆర్ తో సఖ్యతగా మెలిగి కేంద్రంతో దూరం పెంచవల్సి వచ్చిందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. అందుకే అమిత్ షా తో అపాయింట్ మెంట్ కోసం ఇబ్బంది పడాల్సి వచ్చిందని సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దొరకలేదని అంచనాకొచ్చారు. అందుకే కేసీఆర్ తో దూరం పాటించేందుకు జగన్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. మళ్లీ ఈ మధ్య కాలంలో జగన్,కేసీఆర్ మధ్య భేటీలు ఉండక పోవచ్చని ఉమ్మడి ప్రాజెక్టుపై అసలు చర్చలు ఉండవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.ఇక ముందు ముందు వీరి సఖ్యత ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

ఆర్ముర్ పాలిటిక్స్... విఠల్ రావు దెబ్బకి జీవన్ రెడ్డిలో పెరుగుతున్న అభద్రత!!

  ఎంత వెలుగుకు అంత చీకటి అన్నట్లుగా ఉంది నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిస్వార్థంగా, నిరాడంబరంగా ఆయన ఉద్యమకారుల పక్షాన కదం తొక్కారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏదైనా రాజకీయ గుర్తింపు ఉంటుందని ఆశించారు కానీ ఓ దఫా ప్రభుత్వ పాలన పూర్తయినప్పటికీ ఆయనకి ఎలాంటి పదవి రాలేదు. ఈ లోపు తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారిని తప్పకుండా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత మాటపై నమ్మకముంచి విఠల్ రావు ఓపిక పట్టారు. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో మక్లూర్ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనపై వ్యక్తిగత అభిమానంతో కాంగ్రెస్.. బీజేపీలకు చెందిన అభ్యర్థులు కూడా పోటీలో నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మెజారిటీ జడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కూడా టీఆర్ఎస్ కే దక్కింది. అప్పటికే నిజామాబాద్ జడ్పీ పీఠం విఠల్ రావ్ కు కేటాయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులకు సంకేతాలిచ్చారు. కేసీఆర్ ప్రతిపాదనకు అందరూ ఆమోదం తెలపడంతో విఠల్ రావు ఎంపిక లాంఛనప్రాయంగా ముగిసింది.  మక్లూర్ మండలానికి చెందిన దాదన్నగారి విఠల్ రావు జడ్పీ పీఠం అయితే ఎక్కారు కానీ తన సొంత నియోజక వర్గంలోనే స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన మక్లూర్ ఆయన సొంత గ్రామం. ఆయన సొంత మండలం నుంచే జిల్లా పరిషత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాప్రతినిధి హోదాలోగాని.. పార్టీ నేతగా కానీ ఆయన తన సొంత మండలంలో క్యాడర్ ను పెంచుకోవలసి ఉంటుంది. భవిష్యత్ రాజకీయాల్లో నిలదొక్కుకోవడం కోసం ప్రజలకు చేరువ కావాల్సి ఉంటుంది. ఈ ఆలోచనతో ఆయన మక్లూర్ మండలంతో పాటు నందిపేట , ఆర్మూర్ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పథకం చేపట్టినా అక్కడి శిలాఫలకంపై జడ్పీ ఛైర్మన్ పేరు రాయాల్సి ఉంటుంది. ఈ మర్యాద కోసమైనా విఠల్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి విఠల్ రావు దూకుడు నచ్చడం లేదు. తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించడం సభలు సమావేశాలు పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే బాస్ అని స్వయాన కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని జీవనరెడ్డి ఫాలో అవుతున్నారు. ఈ పాయింట్ ఆధారంగానే తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా తిరగవద్దని విఠల్ రావును ఆదేశించారు. విఠల్ రావు సన్నిహితులకు పలుమార్లు ఫోన్ చేసి కూడా ఇదే ఆంక్షలు విధించారు. ఇంతకీ వీరిద్దరికీ ఎక్కడ చెడిందో అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  రెవిన్యూ డివిజన్ ల పునర్విభజన సమయంలో మక్లూరు మండలాన్ని ఆర్మూర్ డివిజన్ లో కలపాలని ఎమ్మెల్యే జీవనరెడ్డి ఆశించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ పెద్దలకు ప్రతిపాదన పంపారు. అయితే మక్లూర్ మండలం నిజామాబాద్ కు దగ్గరలో ఉంటుందని.. దాన్ని నిజామాబాద్ లోనే కొనసాగించాలని ఆ మండల నాయకులు పట్టుబట్టారు. గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులంతా తమ మండలాన్ని ఆర్మూర్ లో కలుపవద్దంటూ పోరాటం చేశారు. దీనికి దాదన్నగారి విఠల్ రావు నాయకత్వం వహించారు. కేసీఆర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన హైదరాబాద్ లెవల్ లో పావులు కదిపారు. మక్లూర్ మండలంలోని ప్రజాప్రతినిధులు.. నాయకులందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి అనుకున్నది సాధించారు.అయితే తనకు వ్యతిరేకంగా పని చేసి.. తన నిర్ణయాన్ని ధిక్కరించారంటూ అప్పట్నుంచే విఠల్ రావు పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కోపం ఉంది. ఈ క్రమంలో ఆయన జడ్పీ చైర్మన్ కావడంతో చేసేది ఏమి లేక అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మొదలు జడ్పీ చైర్మన్ అయ్యే వరకు మౌనంగా ఉన్న జీవన్ రెడ్డి.. తీరా ఆయన దూకుడు పెంచాక తన ప్రతాపం చూపించడం మొదలెట్టారు. విఠల్ రావును తన నియోజకవర్గంలోనూ తిరగవద్దంటూనే ఇతర మండలాల నాయకులు కూడా ఆయన వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశించారు. ఎమ్మెల్యే సూచన మేరకు తన సొంత మండలమైన మక్లూరు నేతలు కూడా ప్రస్తుతం జడ్పీ చైర్మన్ ను కలవాలంటే జంకుతున్నారు.  ఇటీవల ఆర్మూర్ పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై జడ్పీ చైర్మన్ విఠల్ రావు పేరు కూడా రాయించలేదు. ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సిన గౌరవ మర్యాదలను కూడా పాటించడం లేదని స్వయాన కేసీఆర్ రికమెండ్ చేసిన విఠల్ రావును తన సొంత నియోజక వర్గ ఎమ్మెల్యేనే టార్గెట్ చేయడం ప్రస్తుతం అన్ని రాజకీయ పక్షాలలో హాట్ టాపిగ్గా మారింది. ఇప్పటికే విఠల్ రావుతో ఉన్న పాత వివాదాలకు తోడు రాబోయే రోజుల్లో తన టిక్కెట్ కు ఎసరు పెడతాడన్న భావనతోనే ఎమ్మెల్యే జీవనరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. టీఆర్ఎస్ పెద్దల వద్ద జీవన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని.. ప్రత్యామ్నాయంగా విఠల్ రావును వారు ప్రోత్సహిస్తున్నారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. కారణమేదైనా తన సొంత నియోజకవర్గంలో తనకు స్వేచ్ఛ లేకుండా పోయిందని విఠల్ రావు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని పార్టీ పెద్దల చెవిన కూడా వేశారు. ఆర్మూర్ లో ఏం జరుగుతోందన్న విషయమై గులాబి పార్టీ పెద్దలు సైతం ఆరా తీస్తున్నారు. చూద్దాం హైకమాండ్ ఎలాంటి కమాండ్ జారీ చేస్తుందో.

మాజీ ఎమ్మెల్యే మిస్సింగ్ అంటూ కొవ్వూరులో కార్యకర్తల ఆవేదన.. మాజీ మంత్రి రీఎంట్రీ!!

  ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. ఏ రాజకీయ పార్టీ అయినా ఇది ఎదురుకోవాలిసిందే. ఓడిన నేతలు పరాభవం నుంచి బయటపడి పార్టీ పటిష్టత కోసం పనిచేయాల్సి ఉంటుంది. తమ పార్టీ పరాజయం పాలైందన బాధతో ఉండే పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఓడిన వారిపైనే ఎక్కువగా ఉంటుంది. అంతేకానీ ఎలాగో ఓడిపోయాం.. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు కదా మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు రంగంలోకి దిగుదాం అనుకుంటే రాజకీయంగా తమకు తాము నష్టం చేసుకోవడమే కాకుండా.. పార్టీ క్యాడర్ ను కూడా చేజారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ టిడిపి కార్యకర్తలు ఎన్నికల్లో తమ పార్టీ వైపు నిలుచున్న అభ్యర్థి ఎవరు అనేది కూడా సంబంధం లేకుండా పార్టీ గెలుపుని భుజాన వేసుకుంటారాని టాక్ ఉంది. తెలుగు దేశం పార్టీ ఏర్పడిన తరువాత 2009 వరకు కొవ్వూరు శాసన సభ స్థానంలో 9 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 2 సార్లు మాత్రమే టిడిపి ఓటమి చెందింది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం ఉన్న 2004,2009 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఓటర్లు టిడిపికే పట్టం గట్టారు. దీన్ని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. కంచుకోట లాంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ నాయకత్వ లేమి నెలకొంది. 2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసిన వంగలపూడి అనిత ఓటమి చెందారు. ఆ తర్వాత ఆమె కొవ్వూరు నియోజకవర్గంపై పూర్తిస్థాయి లో సీతకన్ను వేశారని స్థానిక పార్టీ కేడర్ లో గట్టి గానే వినిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు టిడిపిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సొమ్ము చేసుకోడానికి పావులు కదుపుతూ ఉండటం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. దీంతో తాము ఎవరి నాయకత్వంలో పని చేయాలో తెలియని స్థితిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు.. కార్యకర్తలు.. సతమతమవున్నారు. అసలు ఇలాంటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీస్తే అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కొవ్వూరు టిడిపిలో రకరకాల సంక్షోభాలు తలెత్తాయి. అప్పటి మంత్రి జవహర్ కు అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా ఒక వర్గం తయారై ఎవరికి వారు పోటా పోటీగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఒక వర్గం జవహర్ కు టికెట్ ఇవ్వాలని రోడ్డెక్కితే మరో వర్గం ఇవ్వడానికి వీల్లేదని వీధి కెక్కింది. ఇలా నాడు ఇరువర్గాల మధ్య నిత్యం రచ్చ జరుగుతుండడం పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కూడా అక్కడ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే ఎన్నికల సమయంలో ఆమెకు కొవ్వూరు టికెట్ ఇచ్చి.. జవహర్ కు తిరువూరు టిక్కెట్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. అయినా కూడా రెండు చోట్ల వీరిద్దరూ ఓటమిని చవి చూసారు. ఇక రాష్ట్రాంలోనూ టిడిపి పరాజయం చెంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కొవ్వూరులో రాజకీయ పరిణమాలు చకచక మరాయి.  ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడినప్పటికీ పార్టీ హైకమాండ్ కుంగిపోకుండా నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోధైర్యం దెబ్బ తినకుండా ఎప్పటికప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అంతే కాకుండా పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన వారిని అదే నియోజకవర్గ ఇన్ ఛార్జిలుగా నియమించింది. ఇంఛార్జి గా వంగలపూడి అనిత కొవ్వూరు బాధ్యతలను చూడాల్సి ఉండగా నియోజకవర్గంలో అసలు ఆమె ప్రస్తానమే అయోమయంగా మారిందని స్థానిక నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. నిజానికి ఎన్నికల ముగిసిన తర్వాత కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే వంగలపూడి అనిత కొవ్వూరు నియోజకవర్గం ముఖం చూశారని కొందరంటున్నారు. నియోజవర్గాన్ని ఆమె పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లేనన్న గుసగుసలు  కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో జవహర్ తో విభేదించి అనితతో కలిసి పని చేసిన ఒక వర్గం నాయకులు పూర్తి గా డీలా పడిపోయారట. తమ నాయకురాలు తరచుగా వస్తే తమకు మనోధైర్యం ఉంటుందని వారు అనుకుంటున్నా.. ఆమె నియోజకవర్గం వైపు చూసే అవకాశాలే తక్కువ  ఉన్నాయనేది మరో వర్గం టాక్. కొవ్వూరులో నెలకొన్న ఈ పరిణామాలే మళ్లీ జవహర్ వర్గానికి జీవం పోశాయి. ఆయన తిరిగి కొవ్వూరు తీసుకురావటానికి అడుగేసేలా చేశాయి. అందుకు జవహర్ కూడా పచ్చ జెండా ఊపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు కొవ్వూరు నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడి నుంచి పోటీ చెయ్యడానికి జవహర్ గట్టి ప్రయత్నమే చేశారు. కానీ అప్పటి పరిస్థితుల్లో అధిష్టానం ఆయనకు తిరువూరు టికెట్ కేటాయించింది. కానీ ఇప్పుడు అనిత పాయకరావుపేట పై మళ్లీ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ కొవ్వూరును పట్టించుకోవడం లేదని టిడిపి వర్గాలు అనుకుంటుంన్నాయి. ఈ పరిణామాలన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జవహర్ ప్రయత్నిస్తున్నారని మరో ప్రచారం నడుస్తుంది. తిరువూరు నుంచి కొవ్వూరు తిరిగొచ్చి మళ్లీ చక్రం తిప్పాలని జవహర్ గట్టి గా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరి ప్రయత్నాలు ఎలా వున్నప్పటికీ కొవ్వూరు టిడిపికి మాత్రం నాయకత్వ లేమి ఏర్పడిందనేది సుస్పష్టంగా కమిపిస్తున్నాయి. మరి తెలుగు దేశం అధిష్టానం ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి.

ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అవుతున్న మంత్రులు...

  వాళ్లు రాష్ట్రానికి మంత్రులు కానీ సొంత నియోజకవర్గం దాటి బయటికి వెళ్లలేని పరిస్థితి. పక్క నియోజకవర్గంలో కాలు పెట్టాలంటే జంకుతున్నారు, కొద్దిమంది మంత్రులైతే ఉంటే సొంత నియోజకవర్గం లేదంటే హైదరాబాద్ కే పరిమితం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీలో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మంత్రులు, రాష్ట్రానికి మంత్రులైనా వాళ్ల నియోజకవర్గాలు దాటి బయట కాలు పెట్టలేకపోతున్నారు. పక్క నియోజక వర్గాల్లో కూడా మంత్రులు తమ ప్రాబల్యాన్ని చూపించలేకపోతున్నారు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే మంత్రుల రాకను వ్యతిరేకిస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆధిపత్య పోరుతోనే మంత్రులు, ఎమ్మెల్యేల గ్యాప్ కు కారణంగా తెలుస్తోంది. నియోజక వర్గాల్లో మంత్రుల జోక్యాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. తమ నియోజక వర్గాలకు మంత్రులు రావటాన్ని ఇష్టపడని కొంత మంది శంకుస్థాపనను కూడా వాయిదా వేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు అనే చర్చ పార్టీలో జరుగుతోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలతో మంత్రికి పొసగడం లేదని సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దగ్గరగా ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. వాళ్లు మంత్రి వస్తే ఎలాంటి హడావుడి చేయొద్దని కార్యకర్తలు అనుచరులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సొంత నియోజక వర్గాలకు వెళ్లడం లేదని, హైదరాబాద్ కే పరిమితమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి, నిరంజన్ రెడ్డికి మధ్య బాగా గ్యాప్ పెరిగిందనే చర్చ నడుస్తోంది. ఇక హైదరాబాద్ లో హల్ చల్ చేసే మంత్రి తలసానికి ఇప్పటికే ఎమ్మెల్యేల రూపంలో షాక్ తగిలింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తనయుడు ఓటమికి కొంత మంది ఎమ్మెల్యేలు కారణమని చర్చ అప్పట్లో జరిగింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు మంత్రులున్నారు. వారు కూడా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. అటు ఆదిలాబాద్ లోనూ ఇదే పరిస్థితి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత చెడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో మంత్రులు నియోజకవర్గాలకు వస్తున్నారంటే ఎమ్మెల్యేలు అటు వైపు కూడా చూడడం లేదని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీనిపై మంత్రులు ఎమ్మెల్యేలపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జిల్లాలో పరిస్థితులపై అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

తెలంగాణలో  భూ పంపిణీ పథకం కనుమరుగు అవ్వబోతోందా?

  తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భూమి కొనుగోలుకు బ్రేక్ పడింది. భూమి కొనుగోలు బాధ్యత చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కొన్ని నెలలుగా భూములను కొనుగోలు చేయటం లేదు. ఎకరాకు సర్కారు ఇస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలకు రాష్ట్రంలో ఎక్కడా భూముల దొరక్క పోవడమే ఇందుకు కారణం. భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో సర్కారు దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి దశలో గుంట భూమి కూడా లేని వారికి మూడెకరాలను ఒకట్రెండు ఎకరాలున్న వారికీ మూడు ఎకరాలకు సరిపోయేంతగా భూమి ఇస్తామని ఆ తర్వాత నీటి సదుపాయం, డ్రిప్ సౌకర్యం, విత్తనాలూ, ఎరువులూ, పురుగు మందుల రూపంలో సమగ్ర ప్యాకేజీని కూడా ఇస్తామని అప్పట్లో సర్కారు వెల్లడించింది. గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు కేవలం ఆరు వేల యాభై ఒకటి మంది దళిత కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా రెండు వందల యాభై మూడు మందికి ఐదు వందల తొంభై తొమ్మిది ఎకరాలను పంపిణీ చేశారు. అయితే ఏటికేడు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది.  2014-15, 2017- 18 ఆర్థిక సంవత్సరంలో మినహా ఎప్పుడూ వెయ్యి మందికి మించి భూ పంపిణీ జరగలేదు. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది దళితులు, టీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం సర్కారు ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భూమి దొరికే పరిస్థితి లేదు. చిన్న జిల్లాల కావడం, సాగు నీటి వసతి పెరగటం, రియలెస్టేటుతో ధరలకు రెక్కలు రావడంతో రైతులెవ్వరూ భూములను అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు భూములను కొనేవారున్నారు తప్ప అమ్మేవారు కరువయ్యారని ఎస్సీ సంక్షేమ శాఖలో పని చేసే ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎకరాకు పది లక్షలు వెచ్చించిన రాష్ట్రంలో ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేకపోవటంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తాజాగా సర్కార్ కు ఒక ప్రతిపాదన పంపారు. ఎకరా భూమికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని అలా ఇవ్వగలిగితేనే భూ కొనుగోళ్లు చేయగలుగుతామని అందులో స్పష్టం చేశారు. అయితే భూములు దొరికే పరిస్థితి లేకపోవటంతో ఈ పథకం అధికారికంగా ప్రకటించకుండానే కనుమరుగయ్యే అవకాశం కన్పిస్తోంది. టీఆర్ఎస్ నేతల మాటలు కూడా దీనికి మంగళం పాడినట్టే అనేలా ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇలా అంటుంటే అధికారులు ప్రభుత్వం ఈ పథకం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ప్రజలు వారంతట వారే ఈ పథకం గురించి మరిచిపోయేలా చేయడమే సర్కార్ అభిప్రాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.దీని పై ప్రభుత్వం ఏం స్పందిస్తుందో వేచి చూడాలి.

వైసీపీ మాస్టర్ ప్లాన్.. ఉప ఎన్నికలకు సై!!

  వైసిపి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి ప్రతిపక్షం టిడిపిలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది గోడ దూకుతారు అనే చర్చ జరుగుతూనే ఉంది. మాజీలుగా ఉన్నవాళ్లు టిడిపిని వీడడానికి ఎలాంటి ఇబ్బందులూ ఆటంకాలు ఉండవు. కానీ ఎమ్మెల్యే గానో ఎంపీగానో కొనసాగుతున్న వారు పార్టీ మారాలంటేనే సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో మాదిరి అయితే ఈపాటికే పెద్ద ఎత్తున పార్టీలు మారే వ్యవహారం రసకందాయంలో పడేదేమో. అయితే పార్టీ మారాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తీరాల్సిందేనని స్వీయ నిబంధన పెట్టుకున్న క్రమంలో వైసీపీలోకి ఆశించిన స్థాయిలో టిడిపి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపిలు వెళ్ళలేదనే చెప్పాలి. ఇదే సందర్భంలో వైసిపి నేతలు సదరు టిడిపి ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారో వారితో మాత్రం వైసీపీ పెద్దలు  సన్నిహిత్యం లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అవసరమైన సమయంలో వీలు చూసుకుని పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ అందాక ఒక్కొక్కరినీ తెరమీదకు తెచ్చేలా వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అప్పటి వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకుండా మాజీలపై ఫోకస్ పెట్టి వరసలపై దృష్టి సారించే దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే వంశీని వెంటబెట్టుకొని మంత్రులు నాని ద్వయం సీఎంను కలవడం ద్వారా వరస ఎపిసోడ్ కు తెరలేపినట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో నెమ్మదిగా తమతో టచ్ లో ఉన్న ఇంకొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఇదే బాట పట్టించే దిశగా పావులు కదిపేందుకు వైసీపీ రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉంది. గంటా కూడా పార్టీ కార్యకలాపాలలో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే భావన అటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమవుతున్న క్రమంలో గంటా రూట్ బిజెపినా లేక వైసిపినా అనే చర్చ జరుగుతున్నప్పటికీ ఉత్తరాంధ్ర వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే వైసిపికి చెందిన ఓ పెద్దాయనతో గంటా మాట్లాడుకోవలసిన అంశాలన్నీ మాట్లాడేశారని అంటున్నారు. ఈ క్రమంలో వంశీ ఎపిసోడ్ ఓ కొలిక్కి వచ్చాక గంట కూడా ఇదే తరహాలో తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.  ఇక వీరిద్దరే కాకుండా ఇంకొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహాలో తెర మీదకు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.  టిడిపిలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు కొందరు చాప కింద నీరులా వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో బలంగా జరుగుతోంది. ప్రస్తుతం టిడిపి అధినాయకత్వం మీద అసంతృప్తి, చంద్రబాబు వారసుడు లోకేష్ పై అపనమ్మకం ఉన్న వారిని గుర్తించే పనిలో సదరు టిడిపి నేతలు సీరియస్ గానే నిఘా పెట్టారని వైసీపీ నేతలు గట్టిగానే చెబుతున్నారు.  హైదరాబాద్ కేంద్రంగా సదరు టిడిపి నేతలు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కీలకంగా ఉన్న వారిని ఒక్కొక్కరిగా పిలిపించుకుని మాట్లాడుతూ పార్టీలో పరిస్థితేంటి ఇలాగే ఉంటే భవిష్యత్తు రాజకీయం ఎలా అనే అంశాల పై వివిధ స్థాయిల్లోని కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పుకారులు కూడా వెల్లడవుతున్నాయి . అయితే ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా జరగాలంటే హైదరాబాద్ కేంద్రంగానే మొత్తం వ్యవహారం నడపాలని నిర్ణయించుకుని ఉమ్మడి రాజధాని కేంద్రంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మంత్రాంగం కనుక ఫలిస్తే టిడిపి నుంచి భారీ స్థాయిలో వలసలు ఉండే అవకాశం ఉందటున్నారు వైసీపీ వర్గాలు. ఇదంతా జరిగితే ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.  అధికారంలోకి వచ్చి నిండా అయిదు నెలలు కాకుండా భారీ స్థాయిలో వ్యతిరేకత ప్రస్తుత ప్రభుత్వం పై గూడుకట్టుకొని పోయిందనే ప్రచారం ప్రతిపక్షం పెద్దఎత్తున చేస్తోంది. ప్రతిపక్ష ప్రచారానికి చెక్ చెప్పాలంటే ఉప ఎన్నిక ద్వారానే సమాధానం చెప్పొచ్చు అనేది కొందరి వైసిపి నేతల వ్యూహంగా కనిపిస్తోంది. పనిలో పనిగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది కాబట్టి ఇదే ఊపులో తమతో టచ్ లో ఉన్న ఇంకొందరు టిడిపి ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి తీసుకునే దిశగా అడుగులు వేస్తే అన్ని నియోజక వర్గాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరిగే విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం అధికార పక్ష శ్రేణుల్లో కనిపిస్తుంది. ప్రభుత్వ పని తీరు మీద రిఫరెండం అటు ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచి సత్తా చాటాలని కొందరు సూచిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పార్టీ పెద్దల వద్ద నిర్ణయం జరగాల్సి ఉంది. ఏది ఏమైనా ఏపి టిడిపిలో వచ్చే రెండు మూడు నెలల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ వైసీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.ఇక ఈ రెండు మూడు నెలల్లో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి.

టీఆర్ఎస్ లో మున్సి-పోల్స్ రగడ... టికెట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి

    ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో గతేడాది తెలంగాణలో మొదలైన ఎన్నికల హడావిడి దాదాపు ఏడాదిగా కొనసాగుతోంది. రెండు మూడు నెలల గ్యాప్ తో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు... ఆ తర్వాత సార్వత్రి ఎన్నికలు... అనంతరం జెడ్పీ, పంచాయతీ ఎన్నికలు జరగ్గా... ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతోంది. తెలంగాణలో మున్సిపోల్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మున్సిపోల్స్ నిర్వహణపై సమీక్ష నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మున్సిపోల్స్ కు రంగంసిద్ధమవుతుండటంతో ప్రధాన పార్టీల్లో హడావిడి మొదలైంది. టికెట్ల కోసం ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నోటిఫికేషన్ కంటే ముందుగా తమ టికెట్ ను కన్ఫ్మామ్ చేసుకునేందుకు పైరవీలు మొదలుపెట్టారు. ప్రతి వార్డు, డివిజన్ నుంచి కనీసం అరడజను మంది టికెట్ కోసం పోటీపడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. వార్డు మెంబర్ నుంచి మేయర్ పీఠం వరకు టికెట్లు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. ఎప్పట్నుంచో మీ గెలుపు కోసం పనిచేశాను... ఇఫ్పుడు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, అనుచరుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలో తెలియక టీఆర్ఎస్ ముఖ్యనేతలు తలల పట్టుకుంటున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే, టికెట్ల కేటాయింపు తమ చేతిలో ఉండదని, అధిష్టానమే నిర్ణయిస్తుందంటూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో, మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.      మొత్తానికి నవంబరు నెలాఖరులోపే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో.... అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అసెంబ్లీ, జెడ్పీ, పంచాయతీల్లో ఎన్నికల మాదిరిగానే అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో గులాబీ పార్టీ ముందుకెళ్తోంది. అయితే, టికెట్ల లొల్లి... ప్రతి వార్డు, డివిజన్ లో మూడేసి గ్రూపులు ఉండటం.... టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని అంటున్నారు.   

వంశీ ఎపిసోడ్‌లో వైసీపీ రియాక్షనేంటి? యార్లగడ్డపై జగన్‌కు సానుభూతి ఉందా?

వల్లభనేని వంశీ అసలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారో లేదో తెలియదు కానీ... గన్నవరం నియోజకవర్గ వైసీపీలో మాత్రం కాకరేపుతోంది. వంశీ వైసీపీలోకి వస్తున్నాడన్న ప్రచారంతో గన్నవరం ఇన్ ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు రగిలిపోతున్నాడు. ఇక యార్లగడ్డ అనుచరుల నుంచైతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో వంశీ, యార్లగడ్డ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. వ్యక్తిగతంగా ఇద్దరూ తలపడ్డారు. అయితే, కేవలం 800 ఓట్ల స్వల్ప తేడాతో వంశీ చేతిలో యార్లగడ్డ ఓటమి పాలయ్యారు. కానీ, ఒకానొక టైమ్ లో గెలుపుపై వంశీ ఆశలు వదిలేసుకున్నారు. అందుకే, ఫలితాలకు ముందే యార్లగడ్డకు ఫోన్లు చేయడం, ఇంటికి అనుచరులను పంపడంలాంటి పనుల ద్వారా వంశీ బెదిరింపులకు సైతం పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఫలితాల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, గన్నవరం మాత్రం అనూహ్యంగా వంశీ గెలవడంతో... ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే, స్వల్ప తేడాతో ఓడిపోయిన యార్లగడ్డపై జగన్ కు మంచి అభిప్రాయం ఉందని అంటారు. ఎందుకంటే జగన్ ఆదేశాలతోనే గన్నవరం నుంచి బరిలోకి దిగిన యార్లగడ్డ... అతితక్కువ టైమ్ లోనే వల్లభనేని వంశీకి గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా ముచ్చెమటలు పట్టించాడు. దాదాపు గెలుపు అంచులదాకా వచ్చి... స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే, యార్లగడ్డను ఇబ్బంది పెట్టడం జగన్ కు ఇష్టం లేదనే మాట వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వంశీ రాకకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. మొన్న జగన్ ను కలిసిన వంశీ... తాను వైసీపీలో చేరితే... గన్నవరంలో యార్లగడ్డ ఉండొద్దని ప్రతిపాదన పెట్టారట. అయితే, వంశీ కండీషన్ కు జగన్ ఒప్పుకోలేదని, వంశీ ఇష్యూ హోల్డ్ లోకి వెళ్లిందని అంటున్నారు. అయితే, వంశీపై జగన్‌కు సాఫ్ట్‌ కార్నర్‌ ఉందంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో బెజవాడ నడిబొడ్డున జగన్ ను వంశీ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. వీళ్లిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే మాట కూడా వినిపించింది. అయితే, వల్లభనేని వంశీ... తన లేఖలో వైసీపీ మీద కూడా విమర్శలు చేయడం... ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని... అలాగే తన అనుచరులపై దాడులు పెరిగిపోయాయని... స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించడం చూస్తుంటే... వైసీపీలోకి వెళ్లే ఉద్దేశం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే, వైసీపీలోకి వెళ్లాలనుకుంటే, అదే పార్టీ మీద ఎందుకు విమర్శలు చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, అదంతా వంశీ వ్యూహమనే వాళ్లూ ఉన్నారు. మరి వంశీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.

వలస నాయకులతో ఇంకెంత కాలం బండి లాగిస్తారు బాబు గారు!!

  2019 సార్వత్రిక ఎన్నికల ఘోర పరాయజంతో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. గెలిచిందే 23 ఎమ్మెల్యేలు అంటే.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ సంఖ్య రెండు ప్లస్ మూడు.. ఐదుకి పడిపోయినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలువురు టీడీపీ నేతలు వైసీపీ, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చేరిపోయారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిసిన వంశీ.. పార్టీ మార్పు అంశంపై త్వరలో ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో ఆయన పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వల్లభనేని వంశీ వైసీపీలో చేరితే గన్నవరం రాజకీయాలు కీలక మలుపు తిరిగే అవకాశముంది. ఇక్కడ వంశీకి వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడటమే కాకుండా, ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఓ రకంగా వీరి పోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాంటిది ఇప్పుడు వంశీ వైసీపీలో చేరనున్నారని వార్తలు రావడంతో.. యార్లగడ్డ వర్గంలో ఆందోళన మొదలైంది. నియోజకవర్గంలో తాము పట్టు కోల్పోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం వంశీని ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రమ్మన్నారని, రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. మరి వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరితే.. రాజ్యసభకు వెళ్తారా? లేక వైసీపీ గుర్తుపై తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వంశీ పార్టీ మార్పు వార్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు అలెర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమాని రంగంలోకి దింపిన బాబు.. యార్లగడ్డను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారట. అయితే బాబు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు తప్పుపడుతున్నారు. బాబు ఇంకెప్పుడు మారతారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అంటే నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీ అని పేరుండేది. ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్నో రంగాలకు చెందిన వారు, మధ్యతరగతి వారు, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాదరణ పొంది మంచి నాయకులుగా పేరుతెచ్చుకున్నారు. టీడీపీ లో నాయకులుగా ఎదిగి ఇతర పార్టీల్లో చేరి మంచి స్థానాల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం.. నాయకులను తయారుచేయటం సంగతి మరిచి, వలస నేతల వెంట పరుగెడుతున్నారు. అధికారంలో ఉన్నపుడు అవసరం కోసం ఎందరో నేతలు టీడీపీలో చేరి, తర్వాత పార్టీని వీడారు. వలస నేతలను నెత్తిన ఎక్కించుకోవద్దని కార్యకర్తలు మొత్తుకుంటున్నా బాబు తీరులో మార్పు కనిపించడంలేదు. వంశీ పార్టీని వీడుతున్నారని వార్తలు రాగానే, యార్లగడ్డతో మంతనాలు మొదలు పెట్టడంతో కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బాబు తన తీరు మార్చుకోకపోతే పార్టీ పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వలస నేతలతో పబ్బం గడిపి పార్టీ పరిస్థితిని దిగజార్చకుండా.. ధైర్యంగా పోరాడి పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చేలా చేయాలని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వంశీ పొతే ఏంటి? పార్టీనే నమ్ముకొని ఉన్న నిజాయితీపరుడైన కార్యకర్తను నాయకుడిని చేయండి లేదా యువ నాయకుడు నారా లోకేష్ ని బరిలోకి దింపండని కార్యకర్తలు కోరుతున్నారు. నారా లోకేష్.. మంగళగిరి నుంచి బరిలోకి దిగినప్పుడు.. నియోజకవర్గం ఎంపిక సరైన నిర్ణయం కాదని అప్పట్లోనే కార్యకర్తలు పెదవి విరిచారు. దానికి తగ్గట్టే ఫ్యాన్ గాలికి లోకేష్ కుప్పకూలిపోయారు. అయితే ఇప్పుడు లోకేష్ కి మంచి అవకాశం వచ్చిందని కార్యకర్తలు అంటున్నారు. నిజంగానే లోకేష్ తనని తాను నాయకుడిగా పరిచయం చేసుకోవాలంటే.. ఇదే సరైన సమయమని చెప్తున్నారు. గన్నవరం ప్రజలు ఐతే స్థానికులకు లేదా సౌమ్యులకు పట్టం కడతారు.. మిగతా వారిని పక్కన పెడతారని పేరుంది. అందుకే సౌమ్యుడిగా పేరున్న లోకేష్ గన్నవరం నుంచి పోటీచేసి గెలిస్తే.. అటు పార్టీకి, ఇటు లోకేష్ కి మంచి మైలేజీ వస్తుంది. పార్టీ భవిష్యత్తుకి భరోసా కలుగుతుంది. ఒకవేళ లోకేష్ ఓడిపోయినా.. పోరాట పటిమ కనబరిచారని, కార్యకర్తలు ఆయన వెంట ధైర్యంగా నడిచే అవకాశముంది. కానీ చంద్రబాబు ఇవేం పట్టించుకోకుండా.. తనకు అలవాటైన దారిలోనే వెళ్తూ.. వలస నాయకుల వెంట పరిగెడితే పార్టీ కోలుకోవడం కష్టమనే అంటున్నారు. బాబుకి రిటైర్మెంట్ టైం వచ్చింది, లోకేష్ పై ఇంతవరకు ప్రజల్లో పూర్తి నమ్మకం కలగలేదు. బాబు ఇంకా అలాగే భయంభయంగా పోరాడితే లోకేష్ పై పడిన పప్పు అనే ముద్ర పోదు. ఇలాంటి సమయంలోనే కార్యకర్తల్లో ధైర్యం నింపేలా లోకేష్ ని బరిలోకి దింపితే.. అటు పార్టీకి, ఇటు లోకేష్ కి మంచిదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు గన్నవరం విషయంలో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.

మొన్న నాని, నిన్న నార్నె, నేడు వంశీ.. వైసీపీలోకి ఎన్టీఆర్ వర్గం.. పక్కా వ్యూహమేనా?

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. 2009 అసెంబ్లీ ఎన్నికలు. అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, వరుసగా రెండోసారి ప్రతిపక్షానికి పరిమితం కాకుండా ఉండాలని టీడీపీ, మరోవైపు మెగాస్టార్ పీఆర్పీ. ఇలా అధికారం కోసం పార్టీల హోరాహోరా పోటీ, హోరాహోరీ ప్రచారం. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రచారంలో ఓ కొత్త ఉత్సాహం కనిపించింది. ఆ ఉత్సాహం పేరే జూనియర్ ఎన్టీఆర్. చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్.. పాతికేళ్లకే తన వాక్చాతుర్యంతో ప్రచారంలో దూసుకెళ్లారు. ఆయన ప్రచారానికి వచ్చిన విశేష స్పందన చూసి.. రాజకీయ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ ఎన్నికల ప్రచారం సమయంలోనే ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయింది. అయినా హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా టీడీపీకి ఓట్ వేయాలని కోరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా కూడా.. ఎన్టీఆర్ కి పార్టీలో, ముఖ్యంగా యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత కారణాలేమైనా టీడీపీకి, ఎన్టీఆర్ కి మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడింది. తన ప్రచారానికి వచ్చిన స్పందన చూసి.. టీడీపీకి నేనే దిక్కు, నెక్స్ట్ సీఎంని నేనే అన్నట్టు ఎన్టీఆర్ ఫీలయ్యేవారని.. అందుకే ఎన్టీఆర్ ని టీడీపీ అధినాయకత్వం దూరం పెట్టిందని.. ఒక వర్గం చెప్పుకొచ్చింది. కాదు, ఎన్టీఆర్ కి వస్తున్న ఆదరణ చూసి భవిష్యత్తులో తన కుమారుడికి అడ్డుగా వస్తాడని చంద్రబాబే ఆయన్ని కావాలని దూరం పెట్టారని మరో వర్గం వాదన. నిజమేంటో తెలీదు కానీ ఎన్టీఆర్ కి, టీడీపీతో గ్యాప్ వచ్చిందనేది మాత్రం వాస్తవం. దీంతో టీడీపీలోని ఓ వర్గం ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు, చిరకాల మిత్రుడు కొడాలి నాని.. టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో.. ఎన్టీఆరే కొడాలి నానిని వైసీపీలోకి పంపించారని, ఎన్టీఆర్ వైసీపీకి మద్దతిస్తున్నారని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ మీద విమర్శలు కూడా తీవ్రతరమయ్యాయి. దీంతో ఎన్టీఆర్ మీడియా ముందుకొచ్చి.. కొడాలి నాని తనకు మిత్రుడే కానీ, పార్టీ మార్పు అనేది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన నిర్ణయంతో నాకు సంబంధం లేదని, కట్టే కాలే వరకు టీడీపీ లోనే ఉంటానని స్పష్టం చేసారు. ఆ తరువాత ఎన్టీఆర్ తన దృష్టంతా కేవలం సినిమాల మీదే పెట్టారు. ఆయన మీద విమర్శలు కూడా తగ్గిపోయాయి. సరిగ్గా పదేళ్ల తరువాత 2019 ఎన్నికల సమయంలో మళ్లీ ఎన్టీఆర్ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకు పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. దీంతో ఎన్టీఆర్ కి తెల్సే నార్నె శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లారని ప్రచారం మొదలైంది. అయితే నార్నె రాజకీయాల్లో అంత క్రియాశీలకంగా లేకపోవడం, ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. ఈ విషయాన్ని ఎవ్వరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా రాజకీయాలతో తనకేం సంబంధం లేనట్టు దూరంగా ఉంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం కాదు కదా.. కనీసం టీడీపీకి ఓట్ వేయమని ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఇక ఆయన ప్రస్తుతానికి సినిమాలకే పరిమితమయ్యారని అనుకున్నారంతా. అయితే అయన రాకపోయినా ఆయన పేరు మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంది. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ని కలిశారు. దీంతో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం మొదలైంది. వంశీ కూడా ఈ ప్రచారాన్ని ఖండించలేదు. పార్టీ మార్పు అంశంపై దీపావళి తరువాత ప్రకటన చేస్తానన్నారు. అంటే పార్టీ మారే ఆలోచన ఉందని చెప్పకనే చెప్పేసారు. దీంతో ఎన్టీఆర్ పేరు మళ్లీ రాజకీయ వర్గాల్లో మారుమోగుతోంది. కారణం, వంశీ.. కొడాలి నానికి చిరకాల మిత్రుడు. ఎన్టీఆర్ కి సన్నిహితుడు. దీంతో ఎన్టీఆర్ తెర వెనుక ఏదో చేస్తున్నారని ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ సన్నిహితులు ఒక్కఒక్కరిగా సైలెంట్ గా వైసీపీలో చేరుతుండంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్లానింగ్ ప్రకారమే తన వర్గాన్ని వైసీపీలోకి పంపి తన భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నారని అంటున్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ కూడా వైసీపీలో చేరినా ఆశ్చర్యం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొన్న కొడాలి నాని, నిన్న నార్నె శ్రీనివాస్, నేడు వంశీ.. ఎన్టీఆర్ సన్నిహితుల వైసీపీ బాట. మరి ఇది యాదృచ్చికమో, వ్యూహమో తెలీదు కానీ.. ఎన్టీఆర్ సన్నిహితులు వైసీపీలో చేరటం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

మొన్న అఖిలప్రియ... ఇఫ్పుడు జేసీ... సీమలో జగన్ సైలెంట్ ఆపరేషన్

  రాయలసీమలో కేవలం మూడే మూడు స్థానాలు మినహా మొత్తం క్లీన్ స్వీప్ చేసిన జగన్మోహన్ రెడ్డి... తనను విమర్శిస్తున్నవాళ్లను, తన ప్రత్యర్ధులను సైలెంట్ టార్గెట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శ చేయకుండా... ఆరోపణలకు కౌంటర్ ఇవ్వకుండానే... కేసులు, దాడులతో కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర మొదలుకొని కోస్తాంధ్ర వరకు పలువురు టీడీపీ ముఖ్యనేతలపై కేసుల మీద కేసులు పెట్టడమే కాకుండా కోడెల ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు రాయలసీమపై ఫోకస్ పెట్టారని అంటున్నారు. ముఖ్యంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తనను, తన కుటుంబాన్ని దూషించిన జేసీ బ్రదర్స్ టార్గెట్ గా ఆపరేషన్ మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా జేసీకి చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారని చెబుతున్నారు. అయితే, దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్ పై ఘాటు రియాక్టయిన జేసీ దివాకర్ రెడ్డి... జగన్ పై సెటైర్లు వేశారు. ఎన్నో ట్రావెల్స్ ఉండగా జగన్‌‌కు నా బస్సులే కనిపిస్తున్నాయా అంటూ జేసీ ప్రశ్నించారు. ఎందుకు నా బస్సులనే భూతద్దంలో చూస్తున్నారని అన్నారు. కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయన్న జేసీ దివాకర్ రెడ్డి.... బస్సుల సీజ్ పై కోర్టును ఆశ్రయిస్తానన్నారు. 70ఏళ్లుగా వాహనరంగంలో ఉన్నామన్న జేసీ.... చిన్నచిన్న లోటుపాట్లు ఉండటం సహజమని, కేవలం ఫైన్‌లతో సరిపోయే తప్పిదాలకు సీజ్‌లు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇక, ఇదే తరహా ఆరోపణలను మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిలప్రియ చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యురేనియంపై పోరాడుతున్నందుకే తప్పుడు కేసులతో తన కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. తన భర్తకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిది, కర్నూలు ఎస్పీదే బాధ్యతంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక, అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఉన్న పరిటాల సునీత కూడా జగన్ ప్రభుత్వంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భద్రతను వన్ ప్లస్ వన్ కి కుదించారని, గతంలో మాదిరిగా 2 ప్లస్ 2 భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, రాయలసీమలో ఇలా ఒకరి తర్వాత మరొకరిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి... రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది.

గవర్నర్ దూకుడుతో టీఆర్ఎస్ కు కష్టాలు.. మరో సచివాలయంగా మారుతున్న రాజ్ భవన్!!

  తెలంగాణ గవర్నర్ తమిళసాయి దూకుడు పెంచారు. సమస్యలపై ప్రభుత్వ పెద్దల కంటే వేగంగా స్పందిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చే వారిని నిరాశ పరచడం లేదు, భరోసా ఇచ్చి పంపుతున్నారు. ప్రజా దర్భార్ నిర్వహించబోతున్నారు, తండాల్లో బసకు రెడీ అవుతున్నారు. తమిళిసాయి ఇంత చురుగ్గా వ్యవహారాలు చక్కబెట్టేందుకు కారణమేంటి. తెలంగాణ గవర్నర్ తమిళసాయి దూకుడులో తనదైన ముద్ర వేస్తున్నారు. రాజ్ భవన్ లో రెస్ట్ తీసుకోవడానికి గవర్నర్ గా రాలేదని చాలా స్వల్ప కాలంలోనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. గవర్నర్ వచ్చీ రాగానే తెలంగాణా పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకునేందుకు సమయం కేటాయించారు. ఆ తర్వాత మెల్లగా తనదైన పాలన ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటికీ గవర్నర్ ఛాన్సలర్ గా ఉంటారు అందుకే ముందు యూనివర్సిటీలపై దృష్టి పెట్టారు. తొలుత వర్సిటీల స్థితిగతులపై సమీక్ష చేశారు, కీలకమైన సూచనలు చేశారు. అప్పుడే తమిళసాయి తనదైన ముద్ర వేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. దీన్ని గవర్నర్ నిజం చేస్తున్నారని తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. రాజ్యాంగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు తెలంగాణాలో ఏర్పడ్డాయి. ఈ విషయంలో తమిళసాయి మొహమాటాలకు పోలేదు, అలాగని వివాదమూ చేయదలచుకోలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఆమె పరిస్థితుల్ని కొన్నాళ్లు పరిశీలించిన తరువాతే రంగంలోకి దిగారు. ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటం, పిలిచి చర్చిస్తే పరిష్కారమయ్యే సమస్యను ప్రభుత్వమే కావాలని పెద్దది చేస్తోందన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే తమిళసాయి నివేదికతో ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ పరిస్థితుల్ని ప్రధాని, హోంమంత్రికి వివరించారు, వారి సలహాలు, సూచనలు తీసుకుని తిరిగి వచ్చారు. వెంటనే ఆర్టీసీ అధికారులని పిలిపించి మాట్లాడారు, రవాణా మంత్రికి ఫోన్ చేశారు, సమ్మె విషయంలో తనకు వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో క్యాబ్ డ్రైవర్ లు సమ్మెకు వెళ్తున్నట్లుగా ప్రకటించారు, దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్న ఆందోళన ప్రజల్లో ఏర్పడింది. ఆర్టీసీ కార్మికులతోనే ప్రభుత్వం చర్చలు జరపటం లేదు, ఇక ప్రైవేటు క్యాబ్ ఆపరేటర్ లతో చర్చలు జరిపే ప్రసక్తే ఉండదు. ఈ విషయం గవర్నర్ ముందుగానే ఊహించి క్యాబ్ డ్రైవర్ సంఘ నేతలను పిలిపించి మాట్లాడారు, సమ్మెను విరమింపజేశారు. దాంతో ప్రజలు కాస్త రిలీఫ్ గా ఫీలయ్యారు, ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉంటున్నారు. ఎప్పుడు అడిగితే అప్పుడు అప్పాయింట్ మెంట్ ఇస్తున్నారు, కార్మికులకు భరోసా ఇస్తున్నారు. కీలకమైన అంశాల్లో మాత్రమే కాదు ప్రజా సమస్యల విషయం లోనూ తమిళసాయి దూకుడుగా ఉంటున్నారు. జూబ్లీహిల్స్ లోని పద్మాలయ, అంబేద్కర్ నగర్ లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇల్లు ఆక్రమణకు గురైంది. దీనిపై ఆయన ప్రభుత్వ విభాగాలన్నింటికి ఫిర్యాదు చేశారు కానీ, ప్రయోజనం లేకపోయింది. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, ప్రయోజనం లేకపోయింది. దాంతో ఆయన గవర్నర్ కు ట్వీట్ ద్వారానే ఫిర్యాదు చేశారు, వెంటనే గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడమే కాదు వివరాలు తెలుసుకుని సమస్యను పరిష్కరించారు కూడా. దీంతో గవర్నర్ కు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ ప్రజా దర్బార్ ను కూడా ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఈ కార్యక్రమం కూడా ప్రారంభమవ్వనుంది. కొత్తగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు. తండాలో ఒక రోజు బస చేయనున్నారు, రాజ్ భవన్ లో గిరిజన సంక్షేమ అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై గవర్నర్ ఆరా తీశారు. ఇలా ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు అన్నింటి లోనూ తనదైన ముద్ర వేసేందుకు తమిళసాయి ప్రయత్నిస్తున్నారు.  తమిళసాయి గత గవర్నర్ నరసింహన్ లా బ్యూరోక్రాట్ కాదు, ఆమె ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్. బీజేపీకి ఏమాత్రం బేస్ లేదని భావించే తమిళనాడులో ఆ పార్టీని నడిపించిన నేత. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు, రాజకీయాలు ఎలా చేయాలో ఆమెకు ప్రత్యేకంగా ఒకరు చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని చేతల ద్వారానే చూపిస్తారని అంటున్నారు. నిజానికి గవర్నర్ కు ఇంత ఛాన్స్ ఇస్తోంది తెలంగాణా ప్రభుత్వమేనన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. తెలంగాణ సర్కార్ ప్రజలకు ఎప్పుడో దూరమైందనే విమర్శలు ఉన్నాయి, ప్రగతి భవన్ ఛాయలకు సామాన్యులకు ప్రవేశం ఉండదు. సచివాలయం ఇపుడు ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. ఈ విషయంలో అధికారులకే అంతంత మాత్రం క్లారిటీ ఉంది, ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పోగుబడిపోతున్నాయి. అధికారుల్లో జవాబుదారీతనం కూడా తగ్గిపోతోంది, ఈ కారణంగా ప్రజలు తమ సమస్యలు పరిష్కరించే వారి కోసం చూస్తున్నారు. వారికిప్పుడు గవర్నర్ రూపంలో ఓ అవకాశం దొరికిందన్న అభిప్రాయం వెల్లడవుతోంది. తమిళసాయి ప్రజల అంచనాలను గుర్తించినట్లే ఉన్నారు అందుకే దూకుడుగా వెళుతున్నారు. ఇప్పుడున్న వేగంలోనే తమిళసాయి విధులు నిర్వహిస్తే రాజ్ భవన్ త్వరలో మరో సచివాలయంగా గుర్తింపు పొందినా ఆశ్చర్యం ఉండదంటున్నారు. గత గవర్నరుతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ప్రభుత్వానికి ప్రస్తుత గవర్నర్ తీరు మింగుడుపడని అంశమే కానీ, వ్యతిరేకించలేని పరిస్థితి. గవర్నర్ పై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభిస్తే అది రాజకీయంగా మారిపోతోంది, ఈ అడ్వాంటేజ్ కూడా తమిళిసాయికి బాగానే ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఉంది.

అంచనాలను తలకిందులు చేసిన ఫడ్నవిస్... మరాఠా రాజ్యంలో దేవేంద్రుడి ముద్ర...

  యువకుడు... పైగా అనుభవం లేదు... మరోవైపు శివసేన పోరు... ఇంకోవైపు సీనియర్ల ఆధితప్యం... ఇన్ని అడ్డంకులు అవరోధాల మధ్య... ప్రభుత్వాన్ని నడపడం అతనికి చేతగాదని అంచనా వేశారు. ముఖ్యంగా శివసేన పోరు పడలేక మధ్యలోనే పారిపోతాడని లెక్కకట్టారు. విపక్షాలతోపాటు సొంత పార్టీ నేతలు కూడా చాలా తక్కువ అంచనా వేశారు. కానీ, వారందరి అంచనాలను దేవేంద్రుడు తలకిందులు చేశాడు. ప్రాంతీయ పార్టీల అధినేతల మాదరిగా మరాఠా ప్రజలపై బలమైన ముద్ర వేశాడు. ఒక్క అవినీతి మరకా అంటకుండా పరిపాలన సాగించాడు. ఎలాంటి సమస్య వచ్చినా ఓర్పుగా నేర్పుగా ఎదుర్కొని పరిష్కరించాడు. అంతేకాదు పక్కలో బల్లెంలా మారిన శివసేనను సైతం దారిలోకి తెచ్చుకుని రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించాడు. అందుకే మహారాష్ట్ర ప్రజలు మళ్లీ దేవేంద్రుడికే పట్టం కట్టారని ఎగ్టిట్ పోల్స్ అన్నీ తేల్చిచెప్పాయి.    ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్లు బీజేపీకి ఆయువుపట్టుగా నిలిచాయని ఎగ్జిట్ పోల్స్ లెక్కగట్టాయి. మహారాష్ట్ర జనాభాలో 30శాతమున్న మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ అత్యంత సాహసంగా తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో... మెజారిటీ మరాఠాల ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయని తేల్చాయి. అందుకే, మరాఠా కాంగ్రెస్‌ పార్టీగా చెప్పుకునే, ఎన్సీపీని సైతం పక్కనపెట్టి మరాఠాలంతా ఏకపక్షంగా బీజేపీకి సై అన్నారని సర్వే సంస్థలు అంటున్నాయి. ఇక, మోడీ-షా మాయాజాలం ఎలాగూ ఉంటుంది. అలాగే బీజేపీకి పేటెంట్ గా మారిన జాతీయవాదం, హిందూత్వం కూడా మరోసారి మహారాష్ట్ర పీఠం దక్కించుకునేందుకు దోహదపడబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇక, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ను... మరోసారి మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. రాహుల్ అధ్యక్ష పీఠం దిగినా, సోనియా అధిరోహించినా, కాంగ్రెస్‌పై ఏమాత్రం సానుభూతి చూపలేదని తెలుస్తోంది. అలాగే, ఎన్సీపీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్‌ను మాత్రం మరాఠాలు చేరదీయలేదని అంచనా వేశాయి.

ఏపీ ఆవిర్భావ దినోత్సవంపై వివాదం... నవంబర్ 1పై జగన్ సర్కార్ మొగ్గు..!

  అవశేష ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై మళ్లీ రగడ మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఆవిర్భావ దినోత్సవం నిర్వహించకుండా, నవ నిర్మాణ దీక్షలు చేపట్టారు. ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా చేసిన విభజనతో ఆంధ్రులు తీవ్రంగా నష్టపోయారంటూ విభజన బాధలను ప్రజలు గుర్తుతెచ్చుకునేలా ఆరోజు కార్యక్రమాలు చేపట్టారు. అయితే, ఇఫ్పుడు ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. దాంతో మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంపై చర్చ మొదలైంది. అయితే, రాష్ట్ర విభజనతో జూన్ రెండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంతో ప్రతి ఏటా జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం అంగరంగ వైభవంగా ఆనందోత్సవాల మధ్య ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఆవిర్భావ దినోత్సవాలకు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం స్వస్తి పలికింది. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కారు... ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ కు మూడు తేదీలతో సంబంధముండటంతో ఏ రోజున నిర్వహించాలనేదానిపై తర్జనభర్జనలు పడింది. అలాగే విస్తృత చర్చలు జరిపింది. చివరికి, 1956లో తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రం విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ నే ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయానికి వచ్చిందట. అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరుపుకున్నట్లే... నవంబర్ 1న ఏపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అయితే, నవంబర్ 1ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన దినాన్ని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం అంత సరైనది కాకపోయినా... తెలంగాణ విలీనంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రోజుని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం కూడా సరికాదంటున్నారు. ఈ రెండు తేదీలను కాకుండా, మద్రాస్ నుంచి వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, జగన్ ప్రభుత్వం ఏ రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తుందో చూడాలి. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా... ముందుగా అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే వివాదాలకు తావు లేకుండా ఉంటుందని అంటున్నారు.

వరుస భేటీలతో పోలవరం రివర్స్ టెండరింగ్ అంశం తుది దశకు చేరనుందా?

  ఏపీ జల వనరుల శాఖ నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీతో హైదరాబాద్ లో భేటీ కానుంది. సమావేశంలో సాగు నీటి ప్రాజెక్టు నిర్మాణ పనుల కార్యాచరణను గురించి ప్రశ్నించనుంది. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయం తీసుకున్నప్పుడు వద్దని వారిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ లేఖ రాసింది. పీపీఏతో సహా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ సూచించింది. తరువాత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. రివర్స్ టెండర్ విధానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ ఒక్కటే పాల్గొన్నప్పటికీ పోలవరం సాగు నీటి ప్రాజెక్టులో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం సాగు నీటి ప్రాజెక్టు, పోలవరం జల విద్యుత్ కేంద్రాలను కలిపి ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండర్ లను జలవనరులశాఖ పిలిచింది. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి రాష్ట్ర హై కోర్టులో వివాదం ఉంది. హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యి తీర్పు రిజర్వులో ఉంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర జల వనరుల శాఖతో పీపీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వాస్తవానికి రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడే న్యాయపరమైన ప్రతిబంధకాలు తలెత్తుతాయని ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని పీపీఏతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలు హెచ్చరించాయి. అయితే నేటి సమావేశంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని రివర్స్ టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని వివరించనుంది. ఒకే ఒక్క సంస్థ బిడ్ ను దాఖలు చేసినందున రీటెండర్ గా పరిగణించాల్సి ఉంటుందని వివరించనుంది. ఈ రీటెండర్ లో రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఆదా అయిందని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ వివరించనుంది. న్యాయస్థానం తీర్పు వెలువడ్డాకే కార్యాచరణను ప్రకటిస్తామని పీపీఏకు రాష్ట్ర జల వనరుల శాఖ స్పష్టం చేయనుంది. న్యాయస్థానం తీర్పును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉటుందని పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుంది. అయితే దీనిపై పీపీఏ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆసక్తి  సర్వత్రా నెలకొంది.  మరోవైపు పోలవరం తుది అంచనాల పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ న్యూఢిల్లీలో రేపు భేటీ కానుంది. ఇప్పటికే పలు దఫాలు ఈ సమావేశాలు జరిగాయి. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర జల సంఘం, పోలవరం తుది అంచనాలు యాభై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్లకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా సంఘం సమ్మతి తెలిపింది. దీన్ని ఆమోదించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఫైలు పంపింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ తుది అంచనాలోని భూ సేకరణ సహాయ పునరావాసం వ్యయంపై ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తూ వస్తోంది. అటు ఇదే సమయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ రెండు వేల పద్నాలుగుకు ముందు ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి ఆడిట్ నివేదికను కోరుతోంది. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం సాగు జల విద్యుత్ కేంద్రాల రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. ఈ రివర్స్ టెండరింగ్ లో ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మేర ఆదా అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే పోలవరం తుది అంచనా యాభై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లకు చేరుతుంది. దీనిపైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఇక పైన అయినా పోలవరంలోని పనులు జోరందుకుంటాయో లేదో వేచి చూడాలి.

రెండు వర్గాలుగా విడిపోతున్న టీఆర్ఎస్ నేతలు.. అసలేం జరుగుతోంది?

  తెలంగాణ ఏర్పడిన తర్వాత అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సంఘంతో పాటు సచివాలయ టీఎన్జీవో విభాగాలు ప్రధాన సంఘంలో విలీనమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యక్ష ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు దానిని విరమింపజేయటానికి జ్యూస్ ను అందించింది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ తొలిగురి ఎమార్పీఎస్ పైనే ఉంది. మంద కృష్ణ మాదిగకు కుడి ఎడమ భుజంగా ఉన్న కీలక నేతలతో రహస్యంగా సమావేశమైన కేసీఆర్ ఎమ్మార్పీఎస్ ను ముక్కలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయానికి కొన్ని ప్రజా ఉద్యోగ సంఘాలు తలో దిక్కున ఉన్నాయి. వాటికి తోడు మరికొన్ని సంఘాలను అప్పట్లో టీఆర్ఎస్ ఏర్పాటు చేయించింది. విడివిడిగా ఉన్న సంఘాలను దగ్గరికి చేర్చి బలమైన తాడుగా పేనింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకం చేసింది. అన్నిటినీ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. సొంత రాష్ట్రం సాకారమై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వివిధ సంఘాలు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలకు ఇది నచ్చటం లేదని ప్రశ్నించే తత్వాన్ని జీర్ణించుకోవడం లేదని ప్రజా, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.  ప్రభుత్వంలోని ముఖ్యులు సంఘాలను నిలువుగా చీల్చే వ్యూహాలకు పదును పెడుతూ చాలా వరకు సఫలీకృతులవుతారనే చర్చ నడుస్తోంది. ఇందుకు సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో చీలిక వర్గం ప్రభుత్వానికి పూర్తి విధేయత ప్రకటిస్తుంది. రెండో వర్గం న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. రాష్ట్ర సర్పంచుల సంఘంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే, మరొక వర్గం అధికార టీఆర్ఎస్ అండగా నిలుస్తోంది.  తాజాగా ఆర్టీసీ సమ్మెకు నేతృత్వం వహిస్తున్న టీఎంయూ చీలికకు తెర వెనుక పావులు కదుపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పైగా ప్రభుత్వం ముందు న్యాయమైన తమ వర్గం సమస్యలను ఉంచి పరిష్కారం కోసం కొట్లాడుతున్న సంఘాల నేతలను వేధింపులు తప్పడం లేదనే ఆందోళన నెలకొంది. అప్రాధాన్య పోస్టులలోకి సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం ప్రభుత్వ సంస్థల ద్వారా వేధింపులకు గురి చేయటం వంటి అనైతిక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ అధినేతకు విధేయత చాటిన వారికి కూడా ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదనే చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్యోగులతో అప్రకటిత యుద్ధం చేస్తున్న క్రమంలోనే ఒకే సంఘానికి చెందిన నేతలు భిన్నస్వరాలు వినిపించటం ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  నిజానికి ఉద్యమ సమయంలో వీరంతా టీఆర్ఎస్ నేతలకు చాలా సన్నిహితంగా మెలిగిన వారే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలకు సహకరించారు. అప్పుడు వారి పోరాటానికి ఆయువుపట్టుగా నిలిచిన సమాచారాన్ని గుట్టుగా అందజేశారు.  హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో భూముల అక్రమ కేటాయింపుల సమాచారాన్ని తెలంగాణ తహసీల్దార్ ల సంఘం అధ్యక్షుడు అయిన వి లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతి నిధుల నుంచే కేసీఆర్ ఆ సమాచారాన్ని సేకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ల అధికారాన్ని తహసీల్దార్ లకు కట్టబెట్టడాన్ని తహసీల్దార్లంతా తీవ్రంగా వ్యతిరేకించగా సీఎం విధేయుడిగా ఉన్న లచ్చిరెడ్డి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అందుకు నజరానాగా లచ్చిరెడ్డికి కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. రెండేళ్ల పాటు అంతా బాగానే ఉన్నా కలెక్టర్ల సదస్సులో ఏం జరిగిందో తెలుసుకోవటానికి మంత్రి ఈటెలతో లచ్చిరెడ్డి భేటీ అయ్యారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటిని సాకుగా చేసుకున్నా ప్రభుత్వం లచ్చిరెడ్డి బదిలీ చేయడమే కాకుండా ఇటీవలే కొందరు డిప్యూటీ కలెక్టర్ లతో ఆయన పెట్టుకున్న సంఘంలో కూడా చీలిక తెచ్చింది. ఆ సంఘంలో కీలక కార్యవర్గ సభ్యులంతా రాజీనామాలు చేశారు.అసలు తెలంగాణ ప్రభుత్వంలో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆర్టీసీ సమ్మె కారణంగా అంతరంగా దాగున్న రహస్యాలు అన్ని బయటకు వస్తున్నాయా అనే అనుమానాలు వెల్లడవుతున్నాయి.