‘ఆంధ్రా బెర్లిన్ గోడ’ కూల్చివేత!

జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి అడ్డుగా కట్టిన గోడ ఇప్పుడు కూలిపోయింది. ‘బెర్లిన్ గోడ’ లాగా అవరోధాన్ని కలిగిస్తున్న ఈ గోడను ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలతో కూల్చేశారు. అసెంబ్లీ దగ్గరకు అమరావతి రైతులు రాకుండా జగన్ ప్రభుత్వం అసెంబ్లీ రెండో గేటుకి అడ్డంగా ఈ గోడ కట్టించింది. మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని ముక్కలు చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐదేళ్ళపాటు అమరావతి రైతులు ఉద్యమించారు. వారి ఆందోళనల నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఈ గోడను కట్టించింది. ఈ గోడను కూల్చేసిన సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ‘‘ప్రజలు వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రజాస్వామ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే వుండాలి. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలకు అందుబాటులో వుండే ప్రభుత్వం. ఇది ప్రజా అసెంబ్లీ’’ అన్నారు.