మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దారెటు?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలకు ఊపిరాడటం లేదు. అధికారంలో ఉన్నంత కాలం అడ్డగోలు దోపిడీకి తెరలేపిన నేతలు ఇప్పుడు కేసుల భయంతో వణికి పోతున్నారు. అరెస్టు తప్పించుకోవడానికో లేదా వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందనో కారణాలేవైనా వైసీపీకి దూరం జరిగేందుకు సిద్ధపడుతున్నారు. అలా వైసీపీ నుంచి బయటకు వచ్చే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఆయన బిజినెస్ మేన్. అవంతి  విద్యాస్థంస్థల అధినేత. ఈయన  2009 ఎన్నిక‌ల్లో తొలిసారి భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. కొంత‌కాలం కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన అవంతి.. 2014లో  తెలుగుదేశంలో చేరి అన‌కాప‌ల్లి ఎంపీగా పోటీచేసి విజ‌యం సాధించారు.  2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన అవంతి.. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో కొద్దికాలం జ‌గ‌న్ క్యాబినెట్ లో మంత్రిగానూ ప‌నిచేశారు.  వైసీపీ అధికారంలోఉన్న కాలంలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన వారిలో అవంతి ఒక‌రు. తాడేప‌ల్లి కార్యాల‌యం నుంచి వెళ్లిన స్క్రిప్ట్ కు అనుగుణంగా టీడీపీ, జ‌న‌సేన పై అవంతి ఇష్టారీతిలో రెచ్చిపోయిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. 2024 ఎన్నిక‌ల్లో మ‌రోసారి భీమిలి నుంచి పోటీచేసిన ఆయ‌న ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఏపీలో తెలుగు దేశం  కూట‌మి   అధికారంలోకి రావ‌టంతో త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు అవంతి శ్రీ‌నివాస్ మ‌ళ్లీ తెలుగుదేశంలో చేరేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం  అధిష్టానం మాత్రం అవంతిని పార్టీలోకి తీసుకునేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. దీంతో ఆయన కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలవైపు పడిందంటున్నారు. మొత్తం మీద అవంతి శ్రీనివాస్ వైసీపీలో కొనసాగే అవకాశాలు మాత్రం లేవని చెబుతున్నారు.  వైసీపీ ఘోర ఓట‌మితో చాలా మంది నేత‌లు ఆ పార్టీని వీడేందుకు రెడీ అయిపోతున్నారు. గ‌త ఐదేళ్ల కాలంలో ఏపీలో ఏ రంగ‌మూ అభివృద్ధికి నోచుకోలేదు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వ‌చ్చి నెల‌రోజులు కాక‌ముందే సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి ప‌రుగులు పెడుతోంది.  ప్ర‌జ‌లలో కూట‌మి పాల‌న‌పై సంతోషం వ్య‌క్తం అవుతోంది. మ‌రోవైపు ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో బ‌లోపేతం అయ్యేందుకు వైఎస్‌ ష‌ర్మిల ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్ అభిమానులుగా వైసీపీలో ఉన్న చాలామంది నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న టాక్ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డితే రాబోయేకాలంలో వైసీపీకి రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావిస్తున్న మాజీ మంత్రులు, వైసీపీ ముఖ్య‌నేత‌లు ఇప్పుడే కూట‌మిలోని ఏదోఒక పార్టీలో చేర‌డం బెట‌ర్ అనే భావ‌న‌కు వ‌స్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రాబోయే కాలంలో వైసీపీని వీడేవారికి సంఖ్య భారీగా ఉంటుంద‌న్న చర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. 

వీరప్పన్ వారసుడు జగన్!

కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఎస్ జగన్‌కి మంచి బిరుదు ఇచ్చారు. జగన్ వీరప్పన్ వారసుడు అని తేల్చేశారు. గురువారం నాడు బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయం నుంచి బయటకి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన వైవసీపీ పాలకులు వీరప్పన్ వారసులు అన్నారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను వీళ్ళందరూ కలసి దోచుకున్నారని, ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘‘శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చింది. జగన్ అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు’’ అన్నారు.

బుగ్గన చూపు బీజేపీ వైపు?!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూట‌మి  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అవినీతిని బ‌య‌ట‌పెడుతూనే.. కేద్రం స‌హ‌కారంతో రాష్ట్రంలోని అన్ని రంగాల‌ను అబివృద్ధి చేసేందుకు చంద్రబాబు సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. మ‌రో వైపు వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని త‌మ అక్ర‌మ‌ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించుకున్న నేత‌ల‌పైనా కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి సారించింది. గ‌త ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేయించిన వైసీపీ నేత‌ల‌పైనా చ‌ట్ట‌రిత్యా చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో వైసీపీలో కొన‌సాగితే ఇబ్బందులు త‌ప్ప‌వని, ఇబ్బందులకు తోడు  రాజ‌కీయం భ‌విష్య‌త్తు లేకుండా పోతుందని భావిస్తున్న కొంద‌రు నేత‌లు ఆ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. అలా వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నవారిలో పలువురు మాజీ  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నార‌ని తెలుస్తోంది. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం బ‌లంగా ఉండ‌టంతో పాటు.. వైఎస్ ష‌ర్మిల నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సైతం బ‌లోపేతం అవుతోంది. కాంగ్రెస్ ఏపీలో బ‌ల‌ప‌డితే వైసీపీ చాప్ట‌ర్ క్లోజ్  అన్న అంచనాకు వైసీపీ నేతలు వచ్చేశారు.   దీంతో వైసీపీని వీడి  అవకాశం ఉన్న ఇతర   పార్టీలోకి జంప్ చేసేందుకు  ప్ర‌య‌త్నాలు షురూ చేసినట్లు వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్న వారిలో మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత బుగ్గన కార్యకర్తలకు  అందుబాటులో ఉండ‌టం లేదు.  ఫలితాల తరువాత ఒక్కసారి మాత్రమే ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎక్కువ స‌మ‌యం ఢిల్లీలోనే గ‌డుపుతున్నార‌ని ఆయన అనుయాయులు చెబుతున్నారు.   వైసీపీ హ‌యాంలో ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఢిల్లీలోని బీజేపీ పెద్ద‌ల‌తో మంచి స‌త్సంబంధాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌స్తుతం వారి ద్వారా బీజేపీలోకి వెళ్లేందుకు బుగ్గ‌న ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతున్నది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ మాజీ మంత్రికి మైనింగ్, సిమెంట్ వంటి వ్యాపారాలు ఉన్నాయ‌నీ అంటున్నారు.  గత ఐదేళ్ల కాలంలో ఆర్థిక శాఖను బుగ్గ‌న‌ విధ్వంసం చేశారని ప్ర‌స్తుత ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఆర్థిక దోపిడీ జరిగిందని లెక్కలతో సహా సీఎం చంద్ర‌బాబు బయటపెట్టారు. దీంతో రాబోయే రోజుల్లో త‌న‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అంచనాకు బుగ్గ‌న వ‌చ్చార‌నీ, తెలుగుదేశం ప్ర‌భుత్వం నుంచి ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను త‌ప్పించుకోవాలంటే బీజేపీలో చేర‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని ఆయ‌న‌ భావిస్తున్నార‌ు. దీంతో ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు. అయితే, బీజేపీవైపు బుగ్గ‌న చూస్తున్నారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న‌ అనుచ‌రులతో పాటు వైసీపీ సోష‌ల్ మీడియా ఖండించింది. అయితే  బుగ్గ‌న మాత్రం మీడియా ముందుకొచ్చి తన పార్టీ మార్పు వార్త‌ల‌ను ఖండించ‌లేదు. దీనికితోడు బుగ్గ‌న తాజా వ్య‌వ‌హార శైలి చూస్తుంటే ఆయన ఇంకెంత మాత్రం వైసీపీలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. బుగ్గన వైసీపీని వీడితే జగన్ మైండ్ బ్లాక్ కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ ది జైలు బాట.. చంద్రబాబుది అభివృద్ధి జాడ!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జగన్ పాలనను జనం ఎంత తీవ్రంగా తిరస్కరించారో తేటతెల్లం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సుపరిపాలన రాష్ట్రానికి ఎంత అవసరమో కూడా జనం గ్రహించారని ఫలితాలు తెలియజేశాయి. అయితే తన పట్ల, తన పాలన పట్ల వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగానే తాను పరాజయం పాలయ్యాననీ, విభజిత ఆంధ్రప్రదేశ్  తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాగించిన సుపరిపాలనను దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాపం కూడా వ్యక్తమైనందునే ఈ స్థాయిలో తన పార్టీని ఓడించారని జగన్ గ్రహించడం లేదు. కాదు కాదు అంగీకరించడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలి ఐదేళ్లు చంద్రబాబు పాలనను, మలి ఐదేళ్ల జగన్ పాలనను పోల్చి చూసుకుని మరీ, రాష్ట్రం బాగుండాలంటే, జగన్ విధ్వంసం నుంచి కోలుకుని ప్రగతి బాట పట్టాలంటే చంద్రబాబు పాలన ఒక్కటే మార్గమన్న కృత నిశ్చయంతో , చంద్రబాబును ను గెలిపించుకోవాలన్న పట్టుదలతో, అలాగే జగన్ ను గద్దె దింపాలన్న కసితో పోలింగ్ బూత్ లకు వెల్లువెత్తారనీ తేటతెల్లమైనా దానికి అంగీకరించి, తప్పులు ఒప్పుకుని పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలన్న ఉద్దేశం జగన్ లో ఇసుమంతైనా కనిపించడం లేదు. పైగా తానేదో తన జేబులో డబ్బులు ఇచ్చినట్లు సంక్షేమం అంటే వేలకు వేల రూపాయలు బటన్ నొక్కి పందేరం చేసినా జనం ఎందుకు ఓట్లు వేయలేదని నెపం వారిపైనే నెట్టేస్తున్నారు. అలాగే గతంలో తాను గట్టిగా సమర్ధించిన ఈవీఎంలే తన ఓటమికి కారణమని చెప్పుకుంటున్నారు.   జగన్ ఓటమికి కారణాలేమిటి అన్న దానిపై పరిశోధనలు, విశ్లేషణలు అవసరం లేదు. చాలా సింపుల్.. రాష్ట్ర విభజన  తరువాత గత పదేళ్లలో రెండు ప్రధాన పార్టీలకు ప్రజలు చెరో  అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ   పార్టీల పాలనను ప్రజలు చూశారు. సీఎంగా చంద్రబాబు పనితీరును, అలాగే జగన్   పనితీరును గమనించారు. దీంతో  అధికారం ఎవరికి ఇవ్వాలి.. మరోసారి సీఎంగా ఎవరు కావాలి అనేది జనం నిర్ణయించుకున్నారు. రాష్ట్రం మొత్తం ప్రాంతాలు,  సామాజిక వర్గాలు, యువత, వయోవృద్ధులు అన్న తేడా లేకుండా జనం దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చేశారు.  ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ పాలన చూసిన తరువాత  ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం, తాము బాగుంటాము అన్న విషయంలో వారిలో కన్ఫ్యూజన్ అన్నది ఇసుమంతైనా కనిపించలేదు.  అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటిని ఖర్చు చేసే ఆవశ్యకత, సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా  అన్ని అంశాలలో జగన్ పాలనను, చంద్రబాబు పాలనతో పోల్చి చూసి జగన్ ను తిరస్కరించారు.  గత ఐదేళ్లలో అరకొర సంక్షేమం తప్ప అభివృద్ధి అన్న మాటకు అర్ధమే లేకుండా, అసలా పదమే వినపడకుండా పాలన సాగించిన జగన్ ను జనం ఛీకొట్టారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమ మాట అటుంచి... ఉన్న పరిశ్రమలే రాష్ట్రం వదిలి పారిపోయిన పరిస్థితిని గమనించిన జనం.. రాష్ట్రం బాగుండాలంటే.. తమ బతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావలసిందేనన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. అందుకే ఏపీలో ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం కూటమికి అంత అనుకూలంగా వచ్చాయి. ఆ ఫలితాలు జనాభిప్రాయానికి పట్టం కట్టాయి.  సరే ఆ విషయాన్ని గ్రహించడానికి జగన్ సిద్ధంగా లేరు. అది ఆయన ఇష్టం. కానీ తన ఐదేళ్ల పాలనలో అధికారాన్ని అడుపెట్టుకుని వైసీపీ నేతలు నిబంధనలను తుంగలోకి తొక్కి సాగించిన అవినీతిపై, అధికార మదంతో పాల్పడిన అక్రమదందాలు, అడ్డగోలు దాడులు, దౌర్జన్యాలపై ఇప్పుడు తెలుగుదేశం కూటమి చర్యలకు ఉపక్రమించింది. అది సహజం కూడా. అవినీతికి పాల్పడిన, నేరాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఉండాలి కూడా. అలా తెలుగుదేశం కూటమి సర్కార్ చర్యలకు పాల్పడుతుంటే జగన్ మాత్రం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసి అరెస్టై జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించి, ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడన్నంత బిల్డప్ ఇచ్చారు. గతంలో ఓదార్పు యాత్రలు చేసిన జగన్ ఇప్పుడు జైలు యాత్రలు చేస్తున్నారు. అది ఆయన ప్రాధాన్యత.  మరో వైపు  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ చంద్రబాబు పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారు. పోలవరం, అమరావతిలలో పర్యటించిన చంద్రబాబు జగన్ అసమర్థ పాలన, అహంకార వైఖరి కారణంగా ఆ రెండింటి విషయంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా.. ఆ రెండింటి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఎండిపోతున్న కృష్ణా డెల్టాకు పట్టిసీమద్వారా నీటిని అందించి ఆదుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో జగన్ హయాంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలతో బిజీగా ఉన్నారు.   బీపీసీఎల్ సంస్థ ఏపీలో 60 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు బందర్ ఎంపీ బాలశౌరి తెలిపారు. మచిలీపట్నం కేంద్రంలో ఈ సంస్థ ఏర్పాటు కానున్నది.   జగన్ సర్కార్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది.  సరికదా రాష్ట్రంలో ఉన్న జాకీ, అమర్ రాజా, లూలూ వంటి సంస్థలను తరిమేసింది.   అదే చంద్రబాబు అధికార పగ్గాలు అందుకున్న నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు బాటలు పరిచారు. దీంతో జనం జగన్ జైలు ములాఖత్ లలో బిజీబిటీగా ఉన్నారు. ఆయన ప్రాధాన్యత అది.  చంద్రబాబు  రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తూ, పారిశ్రామిక వేత్తలతో భేటీలతో  క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఈయన దార్శనికత ఇదీ అని నెటిజనులు పోల్చి చూపుతూ జగన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. 

వాతలు పెట్టకుండానే ‘వాలంటరీ’ ఇచ్చేస్తారా?

వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి, ఓ సందర్భంలో జగన్ కాళ్ళ దగ్గర కూడా కూర్చుని, జగన్ ప్రభుత్వం చేసిన అవినీతికి అన్నివిధాలా సహకరించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ పెట్టుకున్న వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ)కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రవీణ్ ప్రకాష్ గత నెల 25న వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో డిజిటల్ సంతకం వుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. దాంతో ప్రవీణ్ ప్రకాష్ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్‌కి ఆమోదం తెలపదని, ఆయన చేసిన తప్పులకు శిక్ష విధించే దిశగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్న తరుణంలో, ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వీఆర్ఎస్‌కి ఆమోదం తెలిపింది. వైసీపీ హయాంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, కూటమి అధికారంలోకి వస్తే తన ఉద్యోగం వుండదని వ్యాఖ్యానాలు చేసేవారు. తనకు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం వుంటే సూచించాలని తన సహచరుడికి వాట్సాప్ సందేశం కూడా పంపించారు. ప్రవీణ్ ప్రకాష్ చేసిన తప్పులన్నీ చేసి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పశ్చాత్తాప పడుతూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. తన ప్రవర్తన ఎవరికైనా బాధ కలిగించి వుంటే క్షమించాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. వైసీపీ రాక్షస పాలన జరిగిన ఐదేళ్ళలో ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కొన్ని విషయాలను ప్రస్తావించుకుంటే.... * మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఏటీఎంగా పనిచేశారని, ఎన్నో అవకతవకాలకు సహకారం అందించారనే ఆరోపణలు వున్నాయి. * ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపులో మంత్రి బొత్స చెప్పినట్టే చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 150 కోట్ల విలువ చేసే చిక్కీల టెండర్లను మూడేళ్ళపాటు పొడిగింారు. *  2024-25 విద్యాకానుక కొనుగోళ్ళలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆర్థిక శాఖ అనుమతి లేకపోయినా, అప్పటి సీఎంఓ ఆమోదం తెలుపకపోయినా 772 కోట్ల రూపాయలతో కొనుగోళ్ళు చేయడానికి పాత కాంట్రాకర్లకే ఆర్డర్లు ఇచ్చేశారు. * జగన్ సీఎంగా వున్నప్పుడు ఆయన పేషీలో వుండే ప్రవీణ్ ప్రకాష్ ఎవరినీ లెక్కచేసేవారు కాదు. చివరికి చీఫ్ సెక్రటరీని కూడా లెక్క చేయకుండా ప్రవర్తించారు. * కొంతమంది అధికారుల మీద తెలుగుదేశం ముద్ర వేసి ఇబ్బందిపెట్టారు.  * విశాఖ కలెక్టర్‌గా పనిచేసే సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు పట్టించుకోకపోవడం వల్ల ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. * పాఠశాల విద్యా శాఖలో కొండని తవ్వి ఎలుకని పట్టినట్టుగా హడావిడి తనిఖీలు చేశారు. ఉపాధ్యాయులను బెదిరించారు. ఇవి శాంపిలే.. ప్రవీణ్ ప్రకాష్ మీద వైసీపీ అవినీతికి సహకరించారన్న ఎన్నో ఆరోపణలు వున్నాయి. అలాంటి ఆయనకు తగిన శాస్తి చేయకుండా, వీఆర్ఎస్ ఇవ్వడం పట్ల పలువురు నిరాశకు గురవుతున్నారు. 

కృష్ణమ్మ వాకిట్లో గోదారమ్మ సందడి!

గోదావరి జీవ జలాలు ఉప్పునీటి పాలు కాకుండా పట్టిసీమ ద్వారా కృష్ణలోకి మళ్లించిన చంద్రబాబు దార్శనికత  కృష్ణా డెల్టా రైతుల కష్టాలను తీర్చింది. సాగు కష్టాలను పరిష్కరించింది. ఎంతో దార్శనికతో 2014 ఎన్నికలలో విజయం సాధించి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు సరిగ్గా ఏడాది తిరిగే సరికల్లా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి, కృష్ణా నదిలో నీటి లభ్యత సన్నగిల్లడం వల్ల ఎడారిగా మారుతున్న కృష్ణా డెల్టాను సస్య శ్యామలేం చేయాలన్న లక్ష్యంతో గోదావరి నీటిని మళ్లించి పట్టి సీమ ద్వారా సాగునీటిని అందించారు. అయితే 2019లో అధకారంలోకి వచ్చిన జగన్ అహంకారం, అవగాహన లేమి, అసమర్థత కారణంగా నాలుగేళ్ల పాటు పట్టిసీమను నిరుపయోగంగా వదిలేసి కృష్ణా డెల్టాను పట్టించుకోలేదు. అయితే 2024 ఎన్నికలలో చరిత్ర ఎరుగని విజయాన్ని తెలుగుదేశం కూటమి సొంతం చేసుకుంది. చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నేల రోజులలోనే పట్టిసీమ మళ్లీ వినియోగంలోకి వచ్చింది. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణలోకి మళ్లించి ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీటిని బుధవారం (జులై 10) విడుదల చేశారు. గోదావరి జలాలలో కృష్ణా డెల్టా భూములను తడిపారు. పోలవరంలో అంతర్భాగంగా నిర్మించిన పట్టిసీమ చంద్రబాబు దార్శనికతకు, రైతులు నష్టపోకూడదన్న సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తుంది. పట్టి సీమ ద్వారా కృష్ణా నదిలోకి చేరిన గోదావరి జలాలలో బుధవారం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి  మట్టం 11.01 అడుగులకు చేరింది. దీంతో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర కృష్ణా డెల్టా భూములకు నీటిని విడుదల చేశారు.  ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో సాగునీటి రంగం రెండు దశాబ్దాలు వెనక్కు వెళ్లిందని విమర్శించారు. రైతును, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే తెలుగుదేశం లక్ష్యమని ఉద్ఘాటించారు.  పట్టిసీమను వట్టిసీమన్న జగన్‌ రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. కృష్ణాడెల్టాకు నీటి విడుదలతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  

ఎయిమ్స్ మంగళగిరికి జలయోగం!

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... షార్ట్.కట్‌లో ఎయిమ్స్. పేదలకు ఉత్తమ వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో ఏర్పాటు చేసిన వైద్య సంస్థ. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్.ని 1680 కోట్ల రూపాయలతో నిర్మించింది. ఆ ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీ కూడా వుంది. మంగళగిరి ప్రాంతంతోపాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తూ వుంది ఎయిమ్స్. ఇక్కడ నిపుణులైన వైద్యులు, సిబ్బంది వున్నారు. ఇది పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వ సంస్థ. నిర్మాణం, నిర్వహణ బాధ్యత కేంద్రానిదే. 2016లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిమ్స్.కి 2019 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిమ్స్.కి నీటి సరఫరా ఆపేశారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించింది కదా.. అందుకని! నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదువుతున్నాయి మహాప్రభో అని ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఎయిమ్స్.కి నీళ్ళు ఇవ్వడం పెద్ద కష్టమైన పని కూడా కాదు. నాలుగైదు కిలోమీటర్ల దగ్గర్లోనే కృష్ణానది కూడా వుంది. అయితే నీరు ఇచ్చే ఉద్దేశమే లేనప్పుడు నది పక్కనే వున్నా నీళ్ళు ఇవ్వరు కదా.. దాంతో చేసేది లేక ఎయిమ్స్ ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేస్తూ నెట్టుకొస్తోంది. అయితే 900 పడకల స్థాయి వున్న ఆ ఆస్పత్రిని నీటి ఎద్దడి కారణంగా 350 పడకల ఆస్పత్రిగా కుదించి సేవలు అందిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడిగా కూడా వున్నారు. ఆయన కూడా నీటి సమస్య గురించి ఎంతమాత్రం పట్టించుకోలేదు. ఎవరు ఎలాగైనా చావండి.. ఇది చంద్రబాబు హయాంలో కట్టింది కాబట్టి మేం పట్టించుకోం... ఇలా సాగింది జగన్ ప్రభుత్వ వైఖరి.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస ప్రభుత్వం తొలగిపోయి, పనిచేసే ప్రభుత్వం రావడంతో ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్‌లో కొత్త ఆశలు చిగురించాయి. ఆరు రోజుల క్రితం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. ఎయిమ్స్ ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి సమస్యని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆరు రోజులు అలా గడిచాయో లేదో.. ఎయిమ్స్.కి కృష్ణానది నుంచి నీటిని సరఫరా చేసే పైపు లైన్ల ఏర్పాటు పనులు ప్రారంభమై, చకచకా జరుగుతున్నాయి. పనికిమాలిన ప్రభుత్వానికి, పనిచేసే ప్రభుత్వానికి మధ్య తేడా ఇదే.

పాత తుపాకులు... 15 కోట్లు!

యూరప్‌ చరిత్ర మీద బలమైన ముద్ర వేసిన ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్.కి చెందిన అరుదైన వస్తువులను వేలం వేశారు. వీటిలో రెండు తుపాకులు వున్నాయి. వీటిల్లో ఒకదానితో ఒకసారి నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆ తర్వాత విరమించుకున్నాడు. ఇప్పుడు ఆ తుపాకితోపాటు నెపోలియన్ ఉపయోగించిన మరో తుపాకిని కూడా వేలం వేశారు. ఇది 1.69 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యాయి. అంటే మన కరెన్సీలో 15 కోట్ల రూపాయలు. 1814లో ఏప్రిల్ 12న నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈ రెండు తుపాకుల్లో ఒక తుపాకిని చేతిలోకి కూడా తీసుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఎందుకో విరమించుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో నెపోలియనే స్వయంగా వెల్లడించాడు. నెపోలియన్ వాడిన ఈ తుపాకులను మెరైన్ గోస్సెట్ అనే సంస్థ తయారు చేసింది. ఇప్పుడు వేలంలో ఈ తుపాకులకు రికార్డు స్థాయి ధర లభించడం ఆ కంపెనీ వాళ్ళని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్రాన్స్ ప్రభుత్వం నెపోలియన్ వాడిన తుపాకులను జాతీయ సంపదగా ఇటీవలే ప్రకటించింది. అయినప్పటికీ, వీటిని బహిరంగ వేలంలో ఫ్రాన్స్ పౌరుడు ఒకరు కొనుగోలు చేశారు. వీటిని దేశం దాటించడానికి అవకాశం లేదు. ఈ తుపాకులను త్వరలో ప్రభుత్వమే కొనుగోలు చేసే అవకాశం వుంది. ఈ రెండు తుపాకుల తయారీలో బంగారం, వెండిని ఉపయోగించారు. ఇవి నెపోలియన్‌కి వారసత్వంగా లభించాయి.

బల్దియా కోటలో పాగా చంద్రబాబు లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవంపై దృష్టి సారించారు.  తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ కచ్చితంగా తెలంగాణలో పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని  ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. వాస్తవానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఒక బలీయమైన పార్టీ. అందులో సందేహం లేదు. అయితే రాష్ట్ర విభజన తరువాత పార్టీ ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో తెలంగాణలో ఆ పార్టీ ఒకింత బలహీనపడినట్లుగా కినిపిస్తోందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించేందుకు చెప్పుకోదగ్గ నేత లేడు. ఆ పార్టీ నాయకులంతా వేరే వేరే పార్టీల్లో సర్దుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీకి గత ఏడాది జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. అయితే ఆ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంలో తెలుగుదేశం పాత్ర కూడా ఉందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. చంద్రబాబునాయుడిని వైసీపీ సర్కార్ స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన సమయంలో, అప్పటికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కనీసం స్పందించలేదు. ఆయన కుమారుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎన్టీఆర్ అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. కావాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు చేసుకోండి, తెలంగాణ గడ్డపై మాత్రం అనుబతించబోం అని హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఆ కారణంగానే తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్, అభిమానులూ పనిగట్టుకుని మరీ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేశారు. బీఆర్ఎస్ ఓటమిలో తెలుగుదేశం క్యాడర్ ది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.  సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. తెలంగాణలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేంత బలం ఉన్న తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎన్నికల రణక్షేత్రానికి దూరంగా ఉండటం పార్టీ క్యాడర్ కు ఇబ్బందికరమే. గత అసెంబ్లీ ఎన్నికలలోనే పోటీ చేయాలన్న డిమాండ్ క్యాడర్ నుంచి గట్టిగా వినిపించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులు, పార్టీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టై జైలులో ఉండటం వంటి కారణాలతో అప్పట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగకుండా తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది. అయితే ఏపీ ఎన్నికలలో విజయం తరువాత చంద్రబాబు ఇక నుంచి తెలంగాణలో పార్టీ పటిష్టతపై దృష్టి పెడతానని ప్రకటించారు. స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీలో ఉంటుందనీ ఉద్ఘాటించారు. ఆ మాటలకు కొనసాగింపు అన్నట్లుగా తాజాగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకువస్తామని ప్రకటించారు. దీంతో రాజకీయ పరిశీలకులు చంద్రబాబు ఏడాది ఏడాదిన్నర లోగా జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో పార్టీ పోటీ చేస్తుందనీ, చంద్రబాబు ఆ దిశగా పార్టీని సమాయత్తం చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.  గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారింది. స్వయంగా కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఆ పార్టీ ఇటీవలి లోక్ సభ ఎన్నికలలో ఖాతా తెరవలేకపోయింది. బీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి లోక్ సభలో ప్రాతినిథ్యం లేకపోవడం ఇదే మొదటి సారి అంటే ఆ పార్టీ రాష్ట్ర ప్రజలలో విశ్వాసాన్ని ఎంతగా కోల్పోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం పార్టీలతో పొత్తును తెలంగాణకు కూడా విస్తరించాలని భావిస్తున్నారు. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా రంగంలోకి దిగితే.. పోరు ద్విముఖమే అవుతుందని ఆయన భావిస్తున్నారు. ద్విముఖ పోరులో తెలుగుదేశం కూటమి విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందనీ, బీఆర్ఎస్ సోదిలోకి కూడా రాదన్నది ఆయన భావనగా చెబుతున్నారు. ద్విముఖ పోరులో  కాంగ్రెస్ పై పై చేయి సాధించి విజయం సాధించడం ఖాయమని భావిస్తున్న చంద్రబాబు, అదే జరిగితే జీహెచ్ఎంసీ మేయర్ పదవిని తెలుగుశం పార్టీకి దక్కుతుందని, ముందుగా హైదరాబాద్ లో జెండా పాతితే అక్కడ నుంచి రాష్ట్రం మొత్తం పార్టీ విస్తరణ, బలోపేతానికి బాటలు వేయాలని చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.   

చంద్రబాబు నివాసం చుట్టూ జగన్ భక్త ఆంజనేయులు ప్రదక్షిణలు!

ఏ ఎండకాగొడుగు పట్టేసి పబ్బం గడిపేసుకోవచ్చని భావిస్తున్న అధికారులకు చంద్రబాబు ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. జగన్ హయాంలో ఆయన మెప్పు కోసం నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన అధికారులకు చంద్రబాబు అస్సలు అప్పాయింట్ మెంటే ఇవ్వడం లేదు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు చంద్రబాబును కలిసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు చంద్రబాబు దర్శనం కోసం విఫలయత్నం చేశారు. జగన్ అధికారంలో ఉండగా ఆయన మెప్పు కోసం నిబంధనలే కాదు, విలువలను సైతం తుంగలో తొక్కి వ్యవహరించిన పీఎస్సార్ ఆంజనేయులుకు చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వ అనుకూల అధికారిగా ముద్రపడడం తెలుగుదేశం నేతలు, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడమే ఇంటెలిజెన్స్ చీఫ్ విధులు అన్నట్లుగా పని చేశారు.  చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, కోడెల శివప్రసాద్, జేసీ ప్రభాకరరెడ్డిలపై అక్రమ కేసులు నమోదు చేయడంలో కీలక పాత్ర వీఎస్సార్ ఆంజనేయులుదేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన తెలుగుదేశం నాయకులు, శ్రేణులనే కాకుండా, జగన్ ప్రభుత్వ విధానాలపై గళమెత్తిన సామాన్యులను కూడా వదల కుండా వేధింపులకు గురి చేసిన ఆరోపణలు ఉన్నాయి.  ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని  ఆరోపణలపై ఎన్నికల సంఘం ఆయనను విధుల నుంచి తప్పించిన తరువాత కూడా అనధికారికంగా ఆయన వైసీపీ కోసం పని చేశారు.  దీంతో పీఎస్సార్  ఆంజనేయులును తెలుగుదేశం కూటమి సర్కార్ దూరం పెట్టింది. అటువంటి పీఎస్సార్ ఆంజనేయులు ఇప్పుడు  ఏదో విధంగా చంద్రబాబును ప్రసన్నం చేసుకోవాలని శతథా ప్రయత్నిస్తున్నారు.  చంద్రబాబు హైదరాబాద్ పర్యటనలో ఉన్న సమయంలో పీఎస్సార్ ఆంజనేయులు జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. చంద్రబాబును కలిసేందుకు ఆయన రిక్వెస్ట్ చేశారు. అయితే అప్పాయింట్ మెంట్ లేదంటూ భద్రతా సిబ్బంది ఆయనను గేటులోకి కూడా అనుమతించలేదు. అంతటి పరాభవం ఎదురైనా  ఆశ చావక అక్కడే పడిగాపులు కాశారు. ఏదో విధంగా ఆయనను కలిసి తాను జగన్ ఒత్తిడి మేరకే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పుకోవడానికి ఒక్క సారి ఆయనను కలిస్తే చాలని ప్రాధేయపడ్డారు. అయినా ఫలితం లేకపోయింది.   ఇప్పుడే కాదు అమరావతిలో కూడా ఆయన సెక్రటేరియెట్ లో చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేశారు.   

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి చంద్రబాబు మార్గదర్శకత్వమే కీలకం!

చంద్రబాబు మార్గదర్శకత్వం తెలుగు రాష్ట్రాల ప్రగతి, పురోగతికి ఎంతో కీలకమన్న అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో వ్యక్తం అయ్యింది. చందబాబు దార్శనికత, అనుభవం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయన్న భావన వ్యక్తం అయ్యింది. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన ముద్ర చెరగనిదని భేటీలో పాల్గొన్న తెలంగాణ మంత్రులు సైతం అభిప్రాయపడ్డారు. కీలక  ప్రాజెక్టులపై పరస్పర సహకారం అత్యంత అవసరమని, అందుకు చంద్అరబాబు చొరవ తీసుకోవాలని కోరారు.  చంద్రబాబుతో ప్రగతి భవన్ లో జరిగిన భేటీపై రేవంత్ సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారు. కీలక ప్రాజెక్టులపై కలిసి పని చేయడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒక అవగాహనకు వచ్చాయి.  ఇరు రాష్ట్రాల మధ్యా సయోధ్య, సహకారంతోనే రాష్ట్రాలుగా విడిపోయినా అభివృద్ధిలో జమిలిగా ముందుకు సాగడానికి వీలౌతుందన్న ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వచ్చారు.  సమస్యలపై తరచూ మాట్లాడుకుంటూ వీలైనంత వేగంగా ఉభయతారకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నిర్ణయం తీసుకుంది. సానుకూల దృక్ఫథం, పరస్పర సహకారంతో ముందుకు వెడితేనే విభజన సమస్యల పరిష్కారం జరుగుతుందన్న అభిప్రాయం ఆ భేటీలో వ్యక్తం అయ్యింది.   ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం( జులై 6) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   చంద్రబాబు,  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  మధ్య హైదరాబాద్‌లో  చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తరువాత  ఏ వివాదాలూ లేకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలకాంశాల పరిష్కారం కోసం జరిగిన మొదటి సమావేశం ఇదేనని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో వేగంగా పూర్తిచేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్- అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవే, బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే వంటి ప్రాజెక్టులకు భూసేకరణను వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టులను ఆచరణలోకి తీసుకురావాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణలో విమానాశ్రయాలు, విమాన సర్వీసులకు సంబంధించిన అంశాలపై పరస్పరం సహకరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు ఉన్నందున ఆయన సహకారంతో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాల్ని పరిష్కరించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నందున రెండు రాష్ట్రాల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వద్దకు కలిసి వెళితే బాగుంటుందని రేవంత్‌రెడ్డి సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నందున రాజకీయంగా అది సాధ్యం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కలిసి ప్రయత్నం చేయవచ్చన్నారు. రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య వీలైనంత తరచుగా సమావేశాలు జరగాలని, అధికారులు పరస్పరం మాట్లాడుకుంటూ అన్ని అంశాల్నీ వేగంగా పరిష్కరించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం చంద్రబాబు మార్గదర్శకత్వం రెండు తెలుగు రాష్ట్రాల పురోగతి, ప్రగతిని ఎంతగానో దోహదపడుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది.  ఇలా ఉండగా ఇరు రాష్ట్రాల మధ్యా పరస్పర సహకారానికి సంబంధించి తొలి అడుగు పడింది. ఇందుకు తెలంగాణ అభ్యర్థనకు సానుకూలంగా స్పందిస్తూ తొలి అడుగు చంద్రబాబు నాయుడే వేశారు. రెండు తెలుగు రాష్ట్రాలూ తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించడం ద్వారా తన చిత్తశుద్ధిని, తెలుగు రాష్ట్రాల ప్రగతి పట్ల తనకున్న అంకిత భావాన్నీ, తెలుగువారంతా కలిసి ఉండాలన్న తన సంకల్పాన్నీ చాటుకున్నారు.  ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాలన్న రేవంత్ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని రేవంత్ కు సూచించారు. తాను కూడా లేఖ రాస్తానని చంద్రబాబు రేవంత్ కు చెప్పారు. . ఏపీలో కలిపిన ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి  ప్రతిపాదించారు. అలాగే కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ వివాదాలు లేకుండా కేంద్రంతో మాట్లాడి ఇరు రాష్ట్రాలకూ ఆమోదయోగ్యమయ్యే విధంగా పరిష్కరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ అభివృద్ధికి తన వంతు సహకారం అందించనున్నట్లు చంద్రబాబు ఆ సందర్భంగా చెప్పారు. 

అమరావతి అడ్డంకులన్నీ హుష్ కాకీ!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. గత ఐదేళ్లుగా   రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా నవ్వుల పాలు కావడానికి కారణమైన జగన్ పాలన ముగియడంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ హుష్ కాకీ అన్నట్లుగా ఎగిరిపోయాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా తలెత్తుకుని ఠీవీగా నిలిచింది. ప్రపంచ స్థాయి రాజధాని ఇన్ మేకింగ్ అన్న విశ్వాసం అందరిలోనూ బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చి గత ఐదోళ్లుగా అన్ని రకాలుగానూ క్షేభను అనుభవించిన రైతుల కష్టాలూ కడతేరిపోయినట్లే.  అయితే జగన్ అధికారంలో ఉండగా మూడు రాజధానుల డ్రామాకు తెరతీసిన కారణంగా అమరావతిపై కోర్టుల్లో పలు కేసులు విచారణ దశలో ఉన్నాయి. సుప్రీం కోర్టు నుంచి స్థానిక కోర్టుల వరకూ వివిధ దశలలో విచారణలో ఉన్న కేసుల ఉపసంహరణే ఇక మిగిలింది. చంద్రబాబు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని ప్రకటించడంతోనే... వివాదాలన్నీ సమసిపోయినట్లైంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎంత మాత్రం రాజధాని లేని రాష్ట్రం కాదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతివైపే చూస్తోంది. పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. కేంద్ర సంస్థలు తరలిరానున్నాయి. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. అందులో సందేహం లేదు.   అయితే అమరావతిపై వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్న దాదాపు 100 కు పైగా కేసుల ఉపసంహరణే మిగిలింది. వీటిలో  రైతులు వేసిన కేసుల ఉపసంహరణకు వారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా  ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేయడంపై రైతులు వేసిన కేసును  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం అని ప్రకటించడంతో ఆ కేసు ఉపసంహరణకు రైతులు నిర్ణయం తీసుకున్నారు.  ఇక మూడు రాజధానులపై సుప్రీం కోర్టులో ఉన్న కేసును చంద్రబాబు సర్కార్ వెనక్కు తీసుకోవడం ఖాయం. అలాగే అమరావతి రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేసిన రైతులపై జగన్ ప్రభుత్వం పెట్టిన వందలాది కేసులను చంద్రబాబు సర్కార్ వెనక్కు తీసుకోవడం ఖాయం.  మొత్తంగా కేసుల ఉపసంహరణ, పరిష్కారం తదితర అంశాలన్నీ పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇఫ్పటికే కేంద్రం నుంచి అమరావతి నిర్మాణం కోసం సంపూర్ణ సహకారం ఉంటుందన్న స్పష్టత వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి పురోగతిపై ఆసక్తి, హర్షం వ్యక్తం అవుతున్నాయి. 

బీజేపీ ఛీ పొమ్మన్నా.. వైఛీపీ ఊడిగం!

జగన్ వైసీపీ పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక నిబద్ధత ఏవీ లేనట్టుగానే కనిపిస్తోంది. అసలు ఆ పార్టీ ఆవిర్భావమే జగన్  ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో జరిగిందని పరిశీలకులు అప్పట్లోనే చెప్పారు. ఆవిర్భావం నుంచీ వైసీపీ ప్రస్తానం కూడా అలాగే సాగింది. అయితే జగన్ పార్టీ 2019 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జగన్ సీఎం కావాలన్న లక్ష్యం నెరవేరింది. అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కక్ష సాధింపు, జగన్ ఆర్థిక నేరాల కేసుల నుంచి ఉపశమనం పొందడమే పాలన అన్నట్లుగా సాగింది. అందుకే ఐదేళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టింపు లేకుండా వ్యవహరించింది. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ కేసుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ ను ప్రసన్నం చేసుకోవడం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలను వేధించడం, ఇక మరోసారి అధికారంలోకి రావడం కోసం సంక్షేమం పేరిట బటన్లు నొక్కుతూ అరకొరగా సొమ్ములు పందేరం చేయడానికే పరిమితమైంది. ఆ క్రమంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అధమ స్థితికి చేరినా పట్టించుకోలేదు.  సరే జగన్  సర్కార్ అధ్వాన పాలనపై కన్నెర్ర చేసిన ఆంధ్రా జనం ఆయనను తిరస్కరించారు. చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం విపక్ష హోదా కూడా దక్కలేదు.  ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి... కేంద్రం అడిగినా అడగకున్నా అన్ని విషయాలలోనూ బేషరతు మద్దతు ప్రకటించిన వైసీపీ తీరా ఎన్నికల ముందు బీజేపీ తెలుగుదేశం కూటమితో జతకట్టడంతో అనివార్యంగా ఆ పార్టీపై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో తన వైరి పక్షంతో జతకట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి మామూలుగా అయితే ఏ విషయంలోనూ మద్దతు ఇవ్వకూడదు. అయితే జగన్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన ఏ లక్షణమూ లేకపోవడంతో ఇప్పటికీ ఆ పార్టీ బీజేపీకి గులాం గిరీయే చేస్తోంది. అలా చేయకపోతే జగన్ కేసుల విచారణ వేగం పుంజుకుంటాయన్న భయమే అందుకు కారణం.  రాజ్యసభలో నాలుగో అతి పెద్ద పార్టీ వైసీపీ కేంద్రాన్ని ప్రశ్నించే స్థితిలో ఉన్న.. మోడీ సర్కార్ రాష్ట్రంలో వైసీపీ పాలనా కాలంలో చేసిన దుర్మార్గాలను, దుష్టపరిపాలనను దనుమాడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నా.. నిస్సిగ్గుగా కేంద్రంలోని మోడీ సర్కార్ ను ప్రశంసలతో ముంచెత్తుతోంది. అంతే కాదు రాజ్యసభలో మోడీ సర్కార్ పై ఇతర పక్షాలు విమర్శలు చేస్తుంటే వాటిని నిందిస్తోంది.  రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం కూటమితో జతకట్టి ఏపీలో తమ పార్టీ ఘోర పరాజయానికి కారణమైన బీజేపీని నిస్సిగ్గుగా మద్దతుగా నిలబడుతోంది.  ఇంత కంటే రాజకీయ దివాళాకోరుతనం ఉండదన్న రీతిలో  వైపీపీ వ్యవహరిస్తోంది. అయినా జగన్ ఆర్థిక నేరాల కేసుల నుంచి బయటపడగలరా అంటే అనుమానమే అని అంటున్నారు పరిశీలకులు. 

ప్రత్యేక హోదాపై అప్పుడు పెగలని నోరు ఇప్పుడు లేస్తోందా?

ఐదేళ్లు అధకారంలో ఉండి.. రాష్ట్ర విధ్వంసంపై తప్ప మరో అంశంపై దృష్టిపెట్టని జగన్ సర్కార్ కు జనం ఘోర పరాజయాన్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా జగన్ పార్టీకి అర్హత లేదని తమ ఓటు ద్వారా స్పష్టం చేశారు. అయినా జగన్ కు కానీ, వైసీపీ నేతలకు కానీ బుద్ధి వచ్చినట్లు కనిపించడం లేదు. 2019 ఎన్నికలకు ముందు.. పాతిక ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాను అని జగన్ పదే పదే చెప్పడంతో నిజమే కాబోలని భావించిన జనం వైసీపీకి 23 ఎంపీ స్థానాలలో విజయం చేకూర్చారు. అలాగే 151 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఐదేళ్లు అధకారం వెలగబెట్టిన జగన్ రాష్ట్ర ప్రగతిని తిరోగమన బాట పట్టించారు. 23 మంది ఎంపీలు ఉన్నా కేంద్రాన్ని కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి అడగలేదు. పైపెచ్చు కేంద్రంలో మోడీ సర్కార్ కు సంపూర్ణ బలం ఉంది. మన మాట ఎందుకు వింటుంది అంటూ ఎన్నికల సమయంలో తాను చెప్పిన ప్రత్యేక హోదాను అటకెక్కించేశారు. అప్పులు చేయడం, ప్రత్యర్థులపై కక్ష సాధించడమే పాలన అన్నట్లుగా జగన్ ఐదేళ్ల హయాం సాగింది. దీంతీ జనంలో జగన్ పట్ల, ఆయన పార్టీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఫలితం తాజా ఎన్నికలలో ఆ పార్టీకి ఎదురైన ఘోర పరాజయం. అయితే గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మాటెత్తడానికే వణికిపోయిన వైసీపీ అధినేత, ఆయన పార్టీ నేతలు ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా గురించి గళమెత్తుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో నోరెత్తని వైసీపీ ఎంపీలు, ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు.   ఆ పార్టీ ఎంపీ మెడీ రఘునాథ్ రెడ్డి  రాజ్యసభలో విభజన హామీకి కట్టుబడి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తే, ఆ పార్టీకి చెందిన అరకు ఎంపీ తనూజారాణి ఇదే అంశాన్ని లోక్ సభలో లేవనెత్తారు.   ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నందున విభజన హామీని నెరవేర్చాలని కోరారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే కొలువుదీరి ఉంది. అయినా అప్పుడు గొంతుపెగలని వైసీపీ ఎంపీలు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం వింతగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మోడీ..ఇంతలో ఎంత మార్పు... దటీజ్ చంద్రబాబు!

రాజకీయ వైరుధ్యంతో చంద్రబాబును ఇరుకున పెట్టి చోద్యం చూసిన వాళ్లే ఇప్పుడు ఆయన విజన్ కు దాసోహం అంటున్నారు. రాజకీయంగా సమస్యలు చుట్టుముట్టి ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని వారంతా ఇప్పుడు ఆయన మద్దతు కోసం తపిస్తున్నారు.  ఇంతలో ఎంత మార్పు. అవమానించిన వాళ్లే ఇప్పుడు అడుగులకు మడుగులొత్తుతున్నారు. రాజకీయంగా అణిచివేయాలని వ్యూహాలు పన్నిన వారే ఆయన ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. కాలం అన్నిటినీ మార్చేస్తుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విషయంలో అదే జరిగింది. నెలల వ్యవధిలో జాతీయ రాజకీయాలలో ఆయన కేంద్ర బిందువుగా మారిపోయారు. అంతకు ముందు ఐదేళ్లు.. ఐదేళ్లనేమిటి? అంతకన్నా ఎక్కువ కాలమే ఆయనను  తక్కువ చేసి మాట్లాడిన వారు, తక్కువగా చూసిన వారు ఇప్పుడు ఆయన కరుణాకటాక్షాల కోసం అర్రులు చాస్తున్నారు. గతంలో ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించిన వారే ఇప్పుడు చంద్రబాబును హీరోగా అభివర్ణిస్తున్నారు.  కొన్ని నెలల కిందట జగన్ సర్కార్ చంద్రబాబును స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ, రాజకీయ నాయకులు ఆ అరెస్టును ఖండించలేదు. కనీసం ఆయనకు మద్దతుగా గళమెత్తలేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుకు మినహాయింపు అనుకోండి అది వేరే విషయం.  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 విపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని ఒక రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా నిబంధనలకు తిలోదకాలిచ్చి అక్రమంగా అరెస్టు చేస్తే.. ప్రధాని నరేంద్రమోడీ కనీసం స్పందించలేదు. అక్రమ అరెస్టును ఖండించలేదు. తద్వారా జగన్ అరాచకత్వానికి పరోక్షంగా మద్దతు పలికారు. అంతకు ముందు.. అంటే 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏపీలో పర్యటించిన నరేంద్ర మోడీ చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించకుండా లోకేష్ కా బాప్ అంటూ అవమానకరంగా ప్రసంగాలు చేశారు. అయితే అదంతా గతం. ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం కూటమి సర్కార్ ఘన విజయం సాధించింది. అంతే కాదు.. ఎన్డీయే కూటమి మనుగడను శాసించగలిగేటన్ని స్థానాలను దక్కించుకుంది.  దీంతో ప్రధాని మోడీ ఒక్క సారిగా చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా ఇవ్వక తప్పని పరిస్థితి ఆయనకు ఉంది. అందుకే గతంలో చంద్రబాబు పట్ల తాను వ్యవహరించిన తీరును పూర్తిగా మరిచిపోయి.. ఇప్పుడు బాబు భజన చేస్తున్నారు.  గతంలో అంటే 2018 నుంచి ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎంతగా కేంద్రాన్ని కోరారు, ఎన్డీయే భాగస్వామ్యపక్షం అయినప్పటికీ, అప్పట్లో మోడీ  చచంద్రబాబు వినతులకు పూచిక పుల్ల విలువ ఇవ్వలేదు. ఒక రాష్ట్రముఖ్యమంత్రిగా కోరినప్పటికీ చంద్రబాబుకు కనీసం అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. హస్తిన వేదికగా ధర్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది.    ఇప్పుడు రోజులు మారాయి. ఇక మోడీ ఎంత మాత్రం గతంలోలా చంద్రబాబును నిర్లక్ష్యం చేయలేరు.  నోరు తెరిచి అడగకుండానే.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇవ్వాల్సినవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది.  2024 ఎన్నికల ముందే మోడీకి జ్ణానోదయం అయ్యింది. దత్తపుత్రుడు జగన్ ను నమ్ముకుంటే.. ఆయనతో పాటు తానూ మునగక తప్పదన్న తత్వం బోధపడింది. అందుకే  తెలుగుదేశం పార్టీతో పొత్తు అనివార్యమయ్యింది.  అంతే కాదు ఇప్పుడు ప్రధానిగా తాను తీసుకునే విధాన నిర్ణయాలకు చంద్రబాబు ఆమోదమూ తప్పని సరి అయిన పరిస్థితిలో ఆయన ఉన్నారు. అందుకే అవకాశం ఉన్నా లేకపోయినా, సందర్భం వచ్చినా రాకపోయినా మోడీ బాబును పొగడటానికే ప్రయత్నిస్తున్నారు. ఎన్డీయే సభలలో  చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగి తమ మధ్య అరమరకలు లేవని చాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్డీయే సమావేశాలలో తన పక్కను చంద్రబాబు ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. చంద్రబాబు పక్కన నిలబడి ఫొటోలకు పోజులిస్తున్నారు. తాజాగా ఆదివారం (జూన్ 30) మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి ప్రస్తావించారు. అది నిజంగా ఒక అద్భుతం అంటూ.. 2016లో తన విశాఖ పర్యటనలో చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన ఫొటోను షేర్ చేశారు.  

అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి.. మోడీ పిలుపు!

ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలి.. ఆ మొక్కను అమ్మను చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి... ఇదీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన కొత్త ప్రచారం ఉద్దేశం. ఈ ప్రచార కార్యక్రమానికి ఆయన హిందీలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం నాడు నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో వెల్లడించారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తూ, రేడియోలో మాట్లాడారు. ‘‘నేను మా అమ్మ పేరుతో మొక్క నాటాను. ప్రతి ఒక్కరూ తమ తల్లులను గౌరవించేలా ఒక మొక్కను నాటండి’’ అని మోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు ‘స్వచ్ఛ భారత్’ అనే ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడోసారి ప్రధాని అయ్యాక ప్రారంభించిన ప్రచార కార్యక్రమం ‘ఏక్ పేడ్ మా కే నామ్’. మరి మీరు కూడా మీ అమ్మ పేరుతో ఒక మొక్కని నాటి, ఆ మొక్కను అమ్మని చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటారు కదూ!?

మోడీ గొంతులో బీహారీ వెలక్కాయ!

గొంతులో వెలక్కాయ ఇరుక్కుపోతే ఎలా వుంటుందో ప్రాక్టికల్‌గా తెలియకపోవచ్చుగానీ, ఊహించగలం. గొంతులో ఇరుక్కున్న వెలక్కాయని మింగలేం, కక్కలేం. అది అలా గొంతుకు అడ్డంగా పడి వుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొంతులో కూడా వెలక్కాయ ఇరుక్కుంది. వెలక్కాయ అంటే, నిజం వెలక్కాయ అనుకునేరు. సింబాలిక్ వెలక్కాయ.. బీహారీ వెలక్కాయ.. ఆ బీహారీ వెలక్కాయ పేరు నితీష్ కుమార్. గతంలో చంద్రబాబు నాయుడికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎక్కడ విరోధం ఏర్పడిందో అందరికీ తెలిసిందే. ఈయనేమో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు. ఆయనేమో ఇవ్వనంటారు.. అక్కడ వీరిద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్ళపాటు కొనసాగాయి. ఆ తర్వాత తాజా ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది. కలసి పోటీ చేశారు. ఏపీలో విజయం సాధించారు. కేంద్రంలో తక్కువ మెజారిటీ వచ్చిన బీజేపీకి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు నుంచి మోడీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఏమీ లేదు. ఎందుకంటే, ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం. ప్రత్యేక హోదా అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే కాదు.. ఏ రాష్ట్రానికీ ఇచ్చే అవకాశం లేదు. అందుకే ఈ విషయంలో చంద్రబాబు కూడా ఒత్తిడి తెచ్చే ఉద్దేశంలో కూడా ఉన్నట్టు లేరు. అయితే, చంద్రబాబుతోపాటు బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా మోడీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. మోడీ ప్రభుత్వం కేంద్రంలో నిలబడటానికి నితీష్ కుమార్ మద్దతు కూడా కీలకమైనదే. అలాంటి మోడీ వీక్ పాయింట్‌ని పట్టుకున్న నితీష్ కుమార్ ఇప్పుడు బీహార్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీని డిమాండ్ చేస్తున్నారు.  శనివారం నాడు జనతాదళ్ యునైటెడ్ జాతీయ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ డిమాండ్ చేశారు. బీహార్‌కి అర్జెంటుగా ప్రత్యేక హోదా ఇవ్వాలి.. అది కుదరదంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి అని నితీష్ డిమాండ్ చేశారు. అది కూడా కుదరదు అని మోడీ అంటే, మీకు మద్దతు ఇవ్వడం కూడా కుదరదు అని నితీష్ కుమార్ చెబుతారు. దాంతో మోడీ ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే, నితీష్ కుమార్ డిమాండ్‌కి మోడీ ఎస్ చెప్పలేరు.. అలాగని నో అనలేరు. ఎస్ అంటే, దేశంలో అనేక రాష్ట్రాలు మాక్కూడా బీహార్‌కి ఇచ్చిన వరం కావాలని డిమాండ్ చేస్తాయి. నో అంటే, నితీష్ కుమార్ మద్దతు ఉపసంహరిస్తానంటారు.. అందుకే ఇప్పుడు మోడీ గొంతులో నితీష్ కుమార్ వెలక్కాయగా మారారు.

జగన్ హిమాలయాలకు వెళ్తే...?!

ఆలస్యంగా తెలిస్తే తెలిసిందిగానీ, అద్భుతమైన విషయం తెలిసింది. లేటెస్ట్ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత... ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్... తాను ఎందుకు ఓడిపోయానే అర్థం కావడం లేదని, తాను బటన్ల మీద బటన్లు నొక్కి డబ్బు పంచినవాళ్ళంతా తనకు ఓట్లు ప్లస్ ప్రేమ ఎందుకు పంచలేదో అర్థం కావడం లేదని చాలాసార్లు మొత్తుకుంటూనే వున్న విషయం తెలిసిందే. అయితే ఇంతకాలం బయటపడని సరికొత్త పాయింట్ రీసెంట్‌గా బయటికొచ్చింది. జగన్ తన సన్నిహితుల దగ్గర బాధపడిపోతూ, ‘‘ఫలితాలు చూశాక షాకయ్య... ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్స్ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామనిపించింది’’ అన్నారట.  జగన్ భజన బ్యాచ్‌ని ఈ పాయింట్ మీద మాట్లాడమన్నామనుకోండి... జనరల్‌గా ఏం చెప్తారంటే, ‘‘మా జగనన్న హిమాలయాలకు వెళ్తే, హిమాలయాల రేంజే పెరిగిపోతుంది. హిమాలయాలు ఇంకా కూల్‌గా అయిపోతాయి. మా జగనన్న ‘స్వామి జగనానంద మహర్షి’గా మారిపోతారు. హిమాలయాల్లో వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తారు. హిమాలయాల్లో అద్భుతమైన ఆశ్రమాన్ని స్థాపిస్తారు. ఎంతోమందిని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళిస్తారు. ప్రపంచం మొత్తాన్నీ తన తపశ్శక్తితో కాపాడుతూ వుంటారు. ఓ ఐదు లక్షల సంవత్సరాలు జీవించి, ఈ భూమ్మీదకి తాను వచ్చిన కార్యాన్ని నెరవేర్చి, ఆ తర్వాత బొందితోనే మోక్షాన్ని పొందుతారు. అవసరమైతే మరణాన్ని జయించి, హిమాలయాల్లోనే సెటిలైపోతారు’’. చాలా ఓవర్‌గా చెప్పినట్టు అనిపించినప్పటికీ, జగన్ భజన బ్యాచ్ ఆయన్ని ఈ రేంజ్‌లో ఆకాశంలోకి ఎత్తేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు జగన్ హిమాలయాలకు వెళ్ళిపోతే అక్కడ నిజంగా ఏం జరుగుతోందో చూద్దాం.. జగన్ హిమాలయాలకు వెళ్ళగానే ఫస్టుఫస్టు చేసేది ఏంటంటే, అక్కడ మంచులో, గుహల్లో, ఆశ్రమాల్లో తపస్సు చేసుకుంటున్న మునులు, మహర్షులు, యోగులు అందర్నీ అక్కడ నుంచి అర్జెంటుగా తరిమేస్తారు. ఎవరైనా ఇదేంటయ్యా అని ప్రశ్నిస్తే, వాళ్ళని జైల్లో వేసి కుళ్ళబొడిపిస్తారు. తర్వాత హిమాలయాల్లో అన్నిటికంటే ఎత్తుగా వున్న శిఖరం తలని నరికేసి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కడతారు. ఆ ప్యాలెస్‌లో ఫుల్లుగా ఏసీలు బిగిస్తారు. హిమాలయాల్లో ఒక్కో కొండ మీద ఒక్కో పార్టీ ఆఫీసు కడతారు. హిమాలయాలు మొత్తం కబ్జా చేసేస్తారు. పులివెందుల లుంగీ బ్యాచ్‌ని హిహాలయాల మీదకి ఎంటర్ చేసి, లోకల్ వాళ్ళు అక్కడ నుంచి పారిపోయేలా చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ఐదేళ్ళ కాలంలో ఎన్ని దారుణాలు చేశారో హిమాలయాల్లో కూడా అంతకంటే నాలుగు ఎక్కువ దారుణాలే చేస్తారు. హిమాలయాల అదృష్టం బాగుండి జగనన్న హిమాలయాలకు వెళ్ళలేదుగానీ, లేకపోతే... పాపం... హిమాలయాలు ఏమైపోయేవో! ఇదంతా కామెడీయే.. లైట్ తీసుకోండి... జగన్ హిమాలయాలకు వెళ్ళేది లేదు.. ఇవన్నీ జరిగేవీ కావు!

వామ్మో.. హరీష్‌రావుది పెద్ద ప్లానే!

బీఆర్ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బొంద పెట్టేశారు. ఇప్పుడు ఆ పార్టీకి పెదకర్మ పెట్టడానికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు వున్నారు. ఈ రెండు పార్టీలకు పోటీగా బీఆర్ఎస్‌ని గుటకాయస్వాహా చేయడానికి మరో నాయకులు పథక రచన చేస్తున్నారు. ఆయన ఎవరో ఈ ఆర్టికల్ హెడ్డింగ్ చూస్తేనే మీకు అర్థమైపోయి వుంటుంది. ఎస్. ఆయన ఎవరో కాదు.. కేసీఆర్ ముద్దుల మేనల్లుడు హరీష్ రావు.  బీఆర్ఎస్ పార్టీలో ఎంపీలు ఎవరూ లేరు. అసెంబ్లీ ఎన్నికలలో 39 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్‌లో ఇప్పుడు మిగిలింది కేవలం 33 మందే. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఉప ఎన్నికలో ఆ స్థానం కాంగ్రెస్‌ సొంతమైంది. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్‌లో మిగిలిన ఎమ్మెల్యేల సంఖ్య 33 మంది. ఈ 33 మందిలో కేసీఆర్ కుటుంబం ముగ్గుర్ని పక్కన పెడితే, మిగిలింది 30 మంది. ఈ 30 మందిని తమ సొంతం చేసుకోవడానికి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో వున్న అధికారాన్ని ఎరగా చూపించి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో వున్న అధికారాన్ని తాయిలంగా చూపించి బీజేపీ ఈ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేన్నాయి. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా ఆ పనేదో తానే చేస్తే ఓ పనైపోతుందిగా అనే ఆలోచనలో హరీష్ రావు వున్నట్టు సమాచారం. హరీష్‌రావు ఎంత గింజుకున్నా బీఆర్ఎస్‌లో ఆయన స్థానం నాలుగు గానో, ఐదుగానో వుంటుందే తప్ప కేసీఆర్ తర్వాతి స్థానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. టైమ్ బ్యాడ్ అయిందిగానీ, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి, లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ దుమ్ముదులిపి వుంటే, కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ఢిల్లీలో హడావిడి చేసేవారే. తెలంగాణ ప్రజల అదృష్టం బాగుండి అలా జరగలేదు. దీని మీనింగ్ ఏమిటంటే, కేసీఆర్ నీడలో వుంటే హరీష్ రావు ఎన్నటికీ ఎదగరు. అందుకే, మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెసో, బీజేపీనో గద్దల్లాగా ఎగరేసుకు పోకముందే, తానే రంగంలోకి దిగితే మంచిదని హరీష్ రావు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్ని ప్రజలు విశ్వసించే అవకాశం లేదు కాబట్టి, నేను బీఆర్ఎస్‌కి సమర్థమైన నాయకత్వం వహిస్తానని ఎమ్మెల్యేలను ఒప్పించి తన నాయకత్వంలో బీఆర్ఎస్‌ని చీల్చే ఉద్దేశంలో హరీష్ రావు వున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా పార్టీని చీల్చకపోతే తనకు ఫ్యూచర్లో ఇక చాన్సే వుండదనేది హరీష్ రావు ఆలోచనగా పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్‌ని చీల్చి, తనదే అసలు బీఆర్ఎస్ అని నిరూపించుకుని, పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునే ఉద్దేశంలో హరీష్ రావు వున్నట్టు సమాచారం.