జగన్‌కి ఆస్కార్ అవార్డు?

గౌరవనీయులైన ఆస్కార్ అవార్డుల అకాడమీ వారికి నమస్కారం. ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో మీరు ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి పడితే వాళ్లకి ఇవ్వకుండా, ఒక అంతర్జాతీయ స్థాయి గొప్ప నటుడికి ఇవ్వాలన్న ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాయడం జరుగుతోంది. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో జగన్ అనే ఒక మహా నటుడు వున్నాడు. ఈసారి ఆస్కార్ అవార్డు ఆయనకి ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన సినిమా నటుడు కాదు కదా అనే సందేహం మీకు రావచ్చు.. కానీ, ఆయన సినిమా వాళ్ళకి అమ్మమొగుడు లాంటి నటుడు. అవార్డులకు అర్హత నటనే కావాలిగానీ, సినిమాలు కాకూడదనే అభిప్రాయంతో మీకు ఈ లేఖ రాయడం జరుగుతోంది. దయచేసి ఈసారి అవార్డుల ప్రదానం సందర్భంగా జగన్ అనే మహా నటుడిని పరిగణనలోకి తీసుకోవల్సిందిగా కోరుతున్నాం. 

ఏదో అభిమానం కొద్దీ చెప్పడం కాదు.. మీరు కూడా జగన్‌కి సంబంధించిన వీడియోలు గట్రాలు తెప్పించుకుని చూడండి. ముఖ్యంగా గత ఐదేళ్ళ కాలంలో ఆయన నటనా చాతుర్యం చూసి మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. లేటెస్ట్ వీడియోలు కావాలంటే, మొన్నటి ఎన్నికల ప్రచారం, ఇంటర్వ్యూలు, రీసెంట్‌గా నెల్లూరు సెంట్రల్ జైల్‌కి వెళ్ళిన వీడియోలు, శుక్రవారం నాడు వినుకొండ వెళ్ళిన వీడియోస్ చూడండి.. ఆయన ఎంత మహా నటుడో, మీ హాలీవుడ్ నటుల్ని మడతెట్టి పక్కనపెట్టే నటుడో మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా బాబాయ్ మర్డర్ సమయంలో ఆయన మర్డర్ జరిగిన తీరును వివరించిన వీడియో చూశారంటే, మీరు రాబోయే వందేళ్ళపాటు వరుసగా జగన్‌కే ఆస్కార్ అవార్డు ఇచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు మేం మాటల్లో చెప్పిన దానికంటే, మీరు మా జగన్ వీడియోలు సేకరించి చూడండి సార్.. ఇంత మహా నటుడిని ఇంతకాలం మిస్సయిపోయామని మీరే పశ్చాత్తాపపడతారు. మీరు మా జగన్ వీడియోలు చూస్తారని, ఈసారి ఆస్కార్ అవార్డ్స్.లో ఉత్తమ నటుడి అవార్డు మా జగన్‌కి ఇస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు మహానటుడు జగన్ అభిమాన సంఘం..

Teluguone gnews banner