జగన్ నిర్ణయం ఫ్యాక్షనిస్ట్ ధోరణా?

  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజా వేదిక విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దాన్ని కూల్చేయాలని జగన్‌ ఆదేశించారు. ప్రజావేదిక నుంచే రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభిద్దామని, సమావేశం ముగియగానే కూల్చివేత పనులు మొదలుపెట్టాలని జగన్ కలెక్టర్ల సమీక్షలో స్పష్టం చేసారు. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్.. ప్రజా వేదిక విషయంలో కూడా సంచలన నిర్ణయం తీసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఏదో తన హీరోయిజం చూపించుకోవడం కోసం జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ప్రజా వేదిక కూల్చివేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజా వేదిక కూల్చివేయడం అంటే ప్రజా ధనాన్ని వృథా చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ చెప్పినట్టు అది అక్రమ నిర్మాణమే అవ్వొచ్చు. కానీ అది దాదాపు రూ.10 కోట్ల ప్రజాధనంతో కట్టిన నిర్మాణం. మరి ఇప్పుడు ఉన్నపళంగా దాన్ని కూల్చేస్తే ఆ డబ్బంతా వృథానే కదా. దానికి తోడు ఇప్పుడు కూల్చడానికి కూడా ప్రజాధనమే ఖర్చు చేయాలి. మరి ఇదంతా నష్టమే కదా. మంగళవారం కలెక్టర్లతో సమీక్ష ముగుస్తుంది. బుధవారం నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టమన్నారు. మరి కలెక్టర్లతో తదుపరి సమీక్షలు ఎక్కడ నిర్వహిస్తారు. వాటి కోసం మరో నిర్మాణం చేపడతారా. ఏదైనా భవనం అద్దెకి తీసుకుంటారా?. మరి ఇవన్నీ అదనపు ఖర్చులే కదా. ప్రజావేదిక కూల్చివేత పుణ్యమా అని పది కోట్లు బూడిద పాలు అవ్వడమే కాక.. మళ్ళీ ఇవన్నీ అదనపు ఖర్చులు. అంటే జగన్ ఇదంతా ఆలోచించకుండా అక్రమ కట్టడం కూల్చాలంటూ తొందరపడి నిర్ణయం తీసుకొని ప్రజా ధనాన్ని వృధా చేసినట్లే అవుతుంది కదా అంటున్నారు. సరే అవినీతి మీద, అక్రమ కట్టడాల మీద జగన్ ఉక్కుపాదం మోపుదాం అనుకుంటున్నారు అనుకుందాం. మరి ప్రజావేదిక విషయంలో చూపిన దూకుడు మిగతా కట్టడాల మీద చూపుతారా?. కరకట్ట సమీపంలో పలు అక్రమ కట్టడాలు ఉన్నాయి. ప్రజావేదికను వెంటనే కూల్చేయమని చెప్పిన జగన్.. మరి మిగతా అక్రమ కట్టడాలను కూడా వెంటనే కూల్చేయమని చెప్తారా?. ఒకవేళ ప్రజావేదిక విషయంలో చూపిన చొరవ, ఉత్సాహం మిగతా అక్రమ కట్టడాలపై చూపకపోతే మాత్రం జగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. ఎందుకంటే ప్రజావేదికను ప్రతిపక్ష నాయకుడిగా తనకి కేటాయించాలని చంద్రబాబు లేఖ ద్వారా జగన్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఏపీ ప్రభుత్వం ఆ లేఖకు బదులివ్వకుండానే ప్రజావేదికను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు కూల్చడానికి సిద్దపడింది. మరి ఇప్పుడు జగన్ సర్కార్ ప్రజావేదికను మాత్రమే కూల్చి మిగతా అక్రమ నిర్మాణాల విషయంలో చూసీచూడనట్టు వదిలిస్తే.. ఇది కచ్చితంగా బాబు మీద కక్ష సాధింపు చర్య అనే అభిప్రాయం వ్యక్తమయే అవకాశముంది. దానికితోడు అసలే జగన్ ది ఫ్యాక్షన్ ధోరణి అని టీడీపీ ఆరోపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజావేదిక ఒక్క నిర్మాణాన్ని మాత్రమే కూల్చితే.. నిజంగానే జగన్ ది ఫ్యాక్షన్ ధోరణి అని టీడీపీ మరింత ప్రచారం చేసే అవకాశముంది. మరి జగన్ వారికి ఆ అవకాశం ఇస్తారో లేదో చూడాలి. 

ఒక పరాజయం 100 తప్పులు.. లోకేష్ తాను ఓడిపోయి పార్టీని ఓడించాడు!!

  'నాయకుడు వారసత్వంలోనుంచి పుట్టడు. ప్రజల్లోనుంచి పుడతాడు. అలా పుట్టిన నాయకుడే ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు.' ఈ విషయాన్ని 4 దశాబ్దాల అనుభవమున్న చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. తండ్రికి కొడుకు మీద ప్రేమ ఉండడం, కొడుకుని గొప్ప స్థాయిలో చూడాలనుకోవడం సహజం. కానీ తన కొడుకు అసలు ఈ రంగంలో రాణించగలడా లేదా అన్న ఆలోచన లేకుండా.. వారసత్వమే తన కొడుకుని నిలబెడుతుందన్న భావనతో బాబు లోకేష్ ని అందలం ఎక్కించారు. తీరా ప్రజా తీర్పు చూసి ఏడుపు మొహం పెట్టారు. ఎందరో వారసులు రాజకీయాల్లోకి వచ్చారు.. కొందరు రాణించారు. వారసులు రాజకీయాల్లోకి రావడంలో తప్పులేదు. కానీ ఆ వచ్చే విధానంలోనే మార్పు కనపడాలి. ముందు పార్టీ గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ద్వితీయ శ్రేణి నేతలతో, కార్యకర్తలతో టచ్ లో ఉంటూ.. క్షేత్రస్థాయిలో పని చేయాలి. ప్రజల్లో ఉండాలి. కానీ లోకేష్ రాజకీయ ప్రవేశం ఎలా ఉంది?. అంతా హైటెక్ మయం. మీడియా, సోషల్ మీడియాలో కనిపించడమే తప్ప ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండానే డైరెక్ట్ గా మంత్రి పదవి పొందారు. దీంతో సహజంగానే ప్రజల్లో లోకేష్ మీద వ్యతిరేక భావన ఏర్పడింది. దీనికి తోడు లోకేష్ తన చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకొని నిజమైన కార్యకర్తలను దూరం పెట్టారు. భజన చేసేవారిని, నాలుగు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడేవారిని, సోషల్ మీడియానే నిజమైన సమాజం అనుకునేవారిని లోకేష్ తన చుట్టూ పెట్టుకున్నారు. దీంతో ఆయన కార్యకర్తలకు, ప్రజలకు దగ్గరవ్వలేకపోయారు. ఇక లోకేష్ మాటల తడబాటు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నాయకుడికి చేతలతో పాటు వాక్చాతుర్యం కూడా ఉండాలి. తన ప్రసంగాలతో కార్యకర్తలను ఉత్తేజ పరచాలి, ప్రజలను ఆకట్టుకోవాలి. వాక్చాతుర్యంతో ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టాలి. కానీ లోకేష్ మైక్ పడితే  ప్రత్యర్థి పార్టీలకు పండగే. పదాలను సరిగ్గా పలకకపోవడం లేదా ఒక పదానికి బదులు మరో పదం పలకడం.. ఇలా పదాలతో విన్యాసాలు చేసి ప్రత్యర్థులను కూడా నవ్వించి తాను నవ్వులపాలయ్యాడు. పప్పు అనే పేరు తెచ్చుకున్నాడు. దీన్ని ప్రత్యర్థులు లోకేష్ పేరు వింటే పప్పు అని గుర్తొచ్చే అంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సరే మాటలు తడబాటు సహజం. మిగతా నాయకులు అప్పుడప్పుడు తడబడితే ఈయన ఎక్కువసార్లు తడబడతారు అనుకోవచ్చు. ఇక్కడ లోకేష్ చేసిన ప్రధాన తప్పు.. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం. క్షేత్రస్థాయిలో పార్టీలో పనిచేస్తూ కార్యకర్తలకు దగ్గరై, ప్రజల్లోకి వెళ్తే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన మాటలు తడబడినా ఆయన చేతలు చూసి ఆయన వెంట కొందరైనా నడిచేవారు. కానీ లోకేష్ అలా చేయలేదు. డైరెక్ట్ గా మంత్రి అయ్యి తనకి తిరుగు లేదు అనుకున్నారు. తనకి తాను యువరాజులా ఫీలయ్యారు. ఇదే ప్రత్యర్థులకు వరమైంది. ఒక్కసారి గెలిపిస్తే బాబు కొడుకుని మంత్రిని చేసాడు, మరోసారి గెలిపిస్తే ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తారని ప్రజలకు పదే పదే చెప్పారు. దీంతో ప్రజలు లోకేష్ ని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించకుండా ఇంటికి పంపారు. పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేసారు. మరి ఈ అనుభవాల నుంచైనా లోకేష్ తన పద్దతి మార్చుకొని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.  

అన్నదమ్ముల మధ్య అగాధం!!

  ఒక్క మంత్రి పదవి ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందా? ఎవరీ అన్నదమ్ములెవరు? ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో మంత్రి పదవుల రేసులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఐదుగురు పేర్లు విన్పించగా, అందులో ముఖ్యులుగా ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం నిలిచారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎంపిక చేసారు. సీనియారిటీ, గత అనుభవాల దృష్ట్యా ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పదవి లభిస్తుందని ఆయనతో పాటు ఆయన వర్గం ముందు నుంచే ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అయితే పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ధర్మాన ప్రసాదరావుకు కాక ధర్మాన కృష్ణదాస్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. ధర్మాన ప్రసాదరావుకు కాకుండా కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చే జరుగుతోందట. మంత్రిగా అనేక పర్యాయాలు పనిచేసి, సుధీర్ఘ అనుభవం కలిగిన ధర్మాన ప్రసాదరావును కాకుండా ధర్మాన కృష్ణదాస్‌ను మంత్రిగా నియమించడంపై జిల్లా పార్టీలో వ్యతిరేక స్వరం మొదలయ్యిందట. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య అగాథం పెంచిందట. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి జిల్లాకు విచ్చేసిన ధర్మాన కృష్ణదాస్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసారు. రైల్వే స్టేషన్ నుంచి పార్టీ కార్యాలయం చేరుకునే వరకు ధర్మాన కృష్ణదాస్ కు స్వాగతం పలికేందుకు ఎక్కడా ధర్మాన ప్రసాదరావు రాలేదు. పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ధర్మాన ప్రసాదరావు వస్తారని కొద్దిసేపు కార్యక్రమాన్ని వాయిదా వేసినా ఆయన రాకపోవడంతో చేసేదేమిలేక కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యాలయంలోనే ఉండి కూడా కార్యక్రమానికి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాదు ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోగానే ధర్మాన ప్రసాదరావు అనుచరులు ధర్మాన కృష్ణదాస్‌ ఫ్లైక్సీలను వెంటనే తొలగించారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ధర్మాన ప్రసాదరావు వర్గీయులు ఇలా చేసారని జిల్లాలో కొందరు నాయకులు గుసగుసలాడుకుంటున్నారట. మొత్తం మీద ఇప్పటికే జిల్లాలో పలుచోట్ల అంతర్గత విభేదాలతో పార్టీ బలహీన పడుతుందన్న చర్చ ఒకవైపు నడుస్తుండగానే తాజాగా తెరపైకి వచ్చిన అన్నదమ్ముల పదవీ వైరం ఎటువైపు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయట. మరి సోదరుల పంచాయితినీ, వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

బీజేపీలోకి హరీష్ రావు.. టీఆర్ఎస్ లో చీలిక!!

  బంతిని నేలకి ఎంత బలంగా విసిరితే.. నింగికి అంత బలంగా ఎగురుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇదే జరగబోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే కేసీఆర్ తరువాత హరీష్ రావు పేరు వినిపించేది. కష్ట కాలంలో కేసీఆర్ కి అండగా ఉంటూ పార్టీని బలపరచడానికి హరీష్ కృషి చేసారు. గెలుపు అసాధ్యం అనుకున్న స్థానాల్లో కూడా హరీష్ పార్టీని గెలిపించి చూపించారు. ట్రబుల్ షూటర్ గా పేరుతెచ్చుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు లెక్క పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేసీఆర్ కి పార్టీలో ఏ వ్యవహారమైనా ముందుగా మేనల్లుడు హరీష్ పేరు గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఈ మార్పు ఇటీవల స్పష్టంగా కనిపిస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసాధ్యమనుకున్న స్థానాల్లో హరీష్ టీఆర్ఎస్ జెండా ఎగిరేలా చేసారు. అయితే అప్పటికే కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ కోసం హరీష్ ని పక్కన పెడుతున్నారనే ప్రచారం జరిగేది. ఎన్నికల తరువాత ఆ ప్రచారం మరింత బలపడింది. హరీష్ కి మంత్రివర్గంలో చోటులేదు, పార్టీలో సరైన స్థానంలేదు. దీంతో హరీష్ అభిమానుల్లో ఆవేదన మొదలైంది. అయితే హరీష్ మాత్రం ఎప్పుడూ కేసీఆర్ కి కానీ, పార్టీకి కానీ వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. తన విధేయత చూపుతూ వస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంతో.. హరీష్ కి అన్యాయం జరుగుతుందనే చర్చ మళ్ళీ తెర మీదకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కోసం ఎంతో శ్రమించిన హరీష్‌కు.. కనీసం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పార్టీ శ్రేణుల్లోనూ, అటు సామాన్య ప్రజల్లోనూ హరీష్ పై సానుభూతి వ్యక్తమవుతోంది. అయితే హరీష్ మాత్రం ఇంత జరుగుతున్నా తన విధేయత చాటుకుంటూనే ఉన్నారు. సిద్దిపేటలో ఘనంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించి.. ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా కేసీఆర్ దే అనేసారు. దీంతో హరీష్ మీద ప్రజల్లో మరింత సానుభూతి, అభిమానం పెరిగాయి. అయితే ఇవన్నీ మౌనంగా భరిస్తూ విధేయత చూపుతున్న హరీష్.. ఎప్పుడో అగ్నిపర్వతంలా పేలి పార్టీలో ప్రళయం సృష్టిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ చూపు కూడా ఇప్పుడు హరీష్ పై పడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. తెలంగాణలో 2023 లో అధికారమే లక్ష్యంగా పార్టీని బలపరచాలని అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలను కూడా పార్టీలో చేర్చుకుంది. అయితే బీజేపీ ఇలా నెమ్మది నెమ్మదిగా బలపడటం కంటే ఒకేసారి కుంభస్థలాన్ని కొట్టాలని చూస్తోందట. అందుకే ఇప్పుడు హరీష్ ని పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోందట. హరీష్ చేరితే టీఆర్ఎస్ లో చీలిక వచ్చి బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనేది ఆ పార్టీ పెద్దల భావనగా తెలుస్తోంది. ఎలాగూ ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకొనే పరిస్థితి లేదు. హరీష్ వస్తే టీఆర్ఎస్ బలం కూడా తగ్గుతుంది. దీంతో 2023 అధికారంలోకి రావాలనే ఆశ నెరవేరుతుంది. ఇదే ప్రస్తుతం బీజేపీ ప్లాన్ అని తెలుస్తోంది. మరి హరీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఒక పరాజయం 100 తప్పులు.. మల్లెపూల గురించి మాట్లాడేవారు అధికార ప్రతినిధులా?

  నాయకులు చేసే పనులు మాత్రమే కాదు, వారి మాటలు కూడా.. వారి మీద, వారి పార్టీ మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే నాయకులకు నాలుక అదుపులో ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. కానీ టీడీపీ అధికార ప్రతినిధులు ఈ విషయాన్ని మరచి మీడియా ముందు నోటికొచ్చినట్లు వాగి పార్టీ ప్రతిష్టను దెబ్బ తీశారు. అలాంటి వారిని పార్టీ అధికార ప్రతినిధులుగా ఎంపిక చేసిన చంద్రబాబు పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. అసలు పార్టీ అధికార ప్రతినిధులంటే ఎలా ఉండాలి? పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలను ఉత్తేజ పరిచేలా ప్రసంగించాలి. కానీ టీడీపీ అధికార ప్రతినిధులు ఎలా ఉన్నారు?. బాబు, లోకేష్ లకు భజన చేయడం, ఇతర పార్టీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, బూతులు తిట్టడం. వీళ్లా అధికార ప్రతినిధులు?. యామిని సాధినేని ఏమో మల్లెపూలు అంటారు, సీఎం రమేష్ 'నీ అమ్మ' అంటారు, రాజేంద్ర ప్రసాద్ ఏమో ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే వాళ్ళ అమ్మ, చెల్లెలే చేశారు అంటారు. ఇలా వీరు నోరు అదుపులోలేకుండా మాట్లాడిన మాటలు కోకొల్లలు. బూతులు మాట్లాడేవారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసే వారు అధికార ప్రతినిధులా? అసలు వీరికి ఏ అర్హత ఉందని అధికార ప్రతినిధులుగా నియమించారు?. బాబుకి, లోకేష్ కి డప్పు కొట్టడమేనా వీరికున్న అర్హత?. గతంలో టీడీపీ శిక్షణ తరగతులు నిర్వహించేది. పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవారిని, అద్భుతంగా ప్రసంగించే వారిని అధికార ప్రతినిధులుగా నియమించేవారు. కానీ ఇప్పుడు.. బాబు, లోకేష్ లు మెచ్చేవారు, వాయిద్దరికి భజనచేసేవారు అధికార ప్రతినిధులు అయ్యారు. వారేం చేశారు?. నోటిదూలతో పార్టీ ప్రతిష్ట దెబ్బదీసారు, ప్రజల్లో పార్టీపై చులకన భావం వచ్చేలా చేశారు. మొత్తానికి పార్టీ ఓటమికి కారణమయ్యారు.  

చంద్రబాబుకు మోదీ మార్క్ దెబ్బ!!

  కేంద్రంలో అఖండ మెజార్టీతో రెండోసారి గద్దెనెక్కిన బీజేపీ ఇప్పుడు తమ శత్రువైన చంద్రబాబుని టార్గెట్ చేసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ప్రాంతీయ పార్టీల కూటమి కట్టి కాంగ్రెస్ కు సపోర్టుగా రాజకీయం చేసిన చంద్రబాబుకు తమ దెబ్బ రుచి చూపిస్తున్నారు. అటు కేంద్రంలో మోదీ, ఇటు ఏపీలో వైపీపీ అధికారంలోకి రావ‌టంతో త‌మ‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని టీడీపీ నేత‌లు ముందుగానే ఊహించారు. అయితే ఇంత త్వ‌ర‌గా బీజేపీ ఆప‌రేష‌న్ మొద‌లు పెడుతుంద‌ని, చంద్ర‌బాబును ఇంత త్వ‌ర‌గా కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఎవ‌రూ ఊహించ‌లేదు. త‌న‌ను అవ‌మానించిన చంద్రబాబును అదే స్థాయిలో మోదీ ఇప్పుడు దెబ్బ కొడుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో మోదీ, చంద్రబాబు మిత్రులు. ప్ర‌త్యేక హోదా పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం నుండి టీడీపీ బ‌యటకు వచ్చి ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది. ఏపీకి మోదీ, అమిత్ షా వ‌చ్చిన స‌మ‌యంలో టీడీపీ నేత‌ల నిర‌స‌న‌లు శృతి మించాయి. ఏపీకి మోదీని శ‌త్రువుగా క్రియేట్ చేయ‌టంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. అదే మోదీకి ఆగ్ర‌హం తెప్పించింది. ఏపీలో తాను తిరిగి అధికారంలోకి రావ‌టం కోసం నాడు చంద్ర‌బాబు మోదీని ప్ర‌ధాన ముద్దాయిగా చూపించి, మోదీని తాను మాత్ర‌మే ఎద‌ర్కోగ‌ల‌న‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పుకొన్నారు. మోదీ ఏపీకి ఏమీ చేయ‌లేద‌ని, మోదీని ఏపీలో విల‌న్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు. ఇక‌, మోదీని ప‌దేప‌దే త‌న‌కంటే జూనియ‌ర్ అనీ, గోద్రా అల్లర్లలో మోదీ రాక్ష‌సంగా వేలాది మంది మైనారిటీలను చంపించార‌ని చంద్ర‌బాబు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. గోద్రా కేసులో మోదీని అరెస్ట్ చేయాల‌ని తొలుత డిమాండ్ చేసింది తానే అంటూ చంద్ర‌బాబు ప‌లు మార్లు చెప్పుకొచ్చారు. మోదీ ఎన్నిక‌ల్లో ఈవీఎంల‌ను మేనేజ్ చేస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. చంద్ర‌బాబుని మోదీ ఈ స్థాయిలో టార్గెట్ చేయటానికి కార‌ణం ఆయన మోదీపైన చేసిన వ్య‌క్తిగ‌త ఆరోపణలే కారణం అని సమాచారం. ఏపీలో టీడీపీ లేకుండా చేట‌య‌మే ల‌క్ష్యంగా ఇప్పుడు మోదీ, అమిత్ షా ప‌ని చేస్తున్నారు. దీనిలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడ్డ సన్నిహిత పారిశ్రామికవేత్తలు - టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్ లతోపాటు మరో ఇద్దరు ఎంపీలు గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ లు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. వీరు త‌మ నలుగురిని ప్రత్యేక గ్రూపుగా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌ వెంకయ్యనాయుడి కి లేఖ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఈ నలుగురు ఎంపీలను బీజేపీలో చేర్చుకునే బాధ్యతను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ అధినాయ‌క‌త్వం సూచ‌న‌ల మేర‌కే జరుగుతున్నట్లు స‌మాచారం. మ‌రో ఇద్ద‌రు స‌భ్యులు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌బాబు, సీతారామ‌ల‌క్ష్మి మాత్ర‌మే టీడీపీలో కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే వీరిద్దరిని కూడా బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. రాజ్యసభ ఎంపీలతో పాటు లోక్‌సభ ఎంపీలను కూడా లాక్కునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని ఆయన కలిసొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే నాని కమలం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బుధవారమే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. మరి ఈ సంక్షోభ స‌మ‌మంలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచేదెవరో వేచి చూడాలి!!

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు ఓటమిలో కీ రోల్ ప్లే చేసిన అగ్రిగోల్డ్!!

  అగ్రిగోల్డ్ విషయంలో చంద్రబాబు& కో వేసిన తప్పటడుగు కొన్ని లక్షల ఓట్లు టీడీపీకి వ్యతిరేకంగా పడేలా చేశాయని చెప్పవచ్చు. అగ్రిగోల్డ్ సంస్థలో కొన్ని లక్షల కుటుంబాలు డిపాజిట్ చేసి మోస పోయాయి. అయితే అప్పుడు బాబు సర్కార్ అమలు కానీ హామీని ఇచ్చి సమస్యని నెత్తి మీదకు తెచ్చుకుంది. డిపాజిటర్ల డబ్బులన్నీ ప్రభుత్వమే తిరిగిస్తుందని చెప్పింది. దీంతో విపక్షాలు ఈ విషయంలో బాబుని టార్గెట్ చేశాయి. బాబు సర్కార్ డబ్బులు చెల్లించలేకపోవడం, విపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండడంతో.. డబ్బులు వస్తాయన్న ఆశతో ఉన్న డిపాజిటర్లకు బాబు సర్కార్ మీద వ్యతిరేకత మొదలైంది. అసలు డిపాజిటర్లకు డబ్బులు ప్రభుత్వం తిరిగి ఇవ్వాలన్న సలహా బాబుకి ఎవరు చెప్పారో కానీ.. ఎంతో అనుభవం ఉన్న బాబు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సలహాను పాటించడం ఆయన చేసిన పెద్ద తప్పు. అసలు ఓ ప్రైవేట్ సంస్థ మోసం చేస్తే ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి?. అంటే ప్రైవేట్ సంస్థలు మోసం చేసుకుంటూ పోతుంటే.. ప్రభుత్వం అవి చెల్లించుకుంటూ ఖజానా ఖాళీ చేసుకుంటూ రావాలా?. అసలే లోటు బడ్జెట్.. దానికి తోడు ఇలాంటి హామీలు ఇచ్చి కొత్త తలనొప్పులు తెచ్చుకున్నారు. అగ్రిగోల్డ్ విషయంలో నిజంగా బాధితులకు న్యాయం చేయాలనుకుంటే.. అది ఆ సంస్థ ముక్కు పిండి వసూలు చేసి ఆదుకోవాలి. చట్టం ద్వారా ఆ సంస్థ ఆస్తులు, అప్పులు అంచనా వేసి.. ఆస్తులను వేలం వేసి బాధితులకు డబ్బు చెల్లించాలి. కానీ ముందుకి ముందే పోయేదేముంది మాటేగా అనుకొని డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు. తీరా అది సాధ్యపడక.. విపక్షాల నుంచి విమర్శలు, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అంతేకాదు అగ్రిగోల్డ్ ఆస్తులపై అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల కన్ను పడిందని కూడా ఆరోపణలు వచ్చాయి. వీటిని తిప్పికొట్టడంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. మొత్తానికి అగ్రిగోల్డ్ వ్యవహారం పుణ్యమా అని టీడీపీ.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొని ఎన్నో లక్షల ఓట్లను దూరం చేసుకుంది. అధికారానికి దూరమైంది.  

కేసీఆర్ కు తలనొప్పిగా మారిన జగన్ నిర్ణయం!!

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడుగా వెళ్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, అధికారం లోకి వచ్చిన వెంటనే ఆయా వర్గాల వారికి మేలు చేసేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ లో ప్రభుత్వ, ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొనడం కేసీఆర్ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ నూతన మంత్రి వర్గ సమావేశం లో ప్రభుత్వ ఉద్యోగులకు ఐ ఆర్ ప్రకటించిన జగన్ , సీపీస్ రద్దుకు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు తక్షణమే తమకు ఐ ఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సీపీస్ పెన్షన్ స్కీమ్ రద్దుకు సిఫార్స్ చేయాలని కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, తమ డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశించిన ఉద్యోగ సంఘాలకు నిరాశే ఎదురయింది. మంత్రి వర్గ సమావేశ అనంతరం మీడియా తో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఉద్యోగుల సమస్యల అంశాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించగా లేనిది, తెలంగాణ సర్కార్ ఎందుకు ప్రకటించదని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ ఏపీ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోవడంతో , తెలంగాణ ఉద్యోగులు మౌనంగా ఉన్నారు. కానీ జగన్ ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించడంతో తమకు కూడా ఐఆర్ ప్రకటించాల్సిందేనని తెలంగాణ ఉద్యోగులు భీష్మించుకు కూర్చున్నారు. అదేవిధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ సదుపాయం కల్పిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది నేటి నుంచే అమలులోకి వచ్చింది. క్షణం తీరికలేకుండా పగలు, రాత్రి, ఎండ, వాన అని తేడా లేకుండా విధినిర్వహణలో ఉండే ఏకైక ప్రభుత్వ శాఖ పోలీస్‌ శాఖ. వీక్లీ ఆఫ్ లేకపోవడంతో ఉద్యోగ రీత్య మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కుటుంబజీవితాన్ని కూడా కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు జగన్ వీక్లీ ఆఫ్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. ఏపీ పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం కూడా కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ అంటూ కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు కానీ దానిని ఆచరణలోకి తీసుకురాలేదు. ఇప్పుడు ఏపీ సీఎం ఆచరణలోకి తెచ్చి చూపడంతో.. తెలంగాణ పోలీసు వర్గాలు మాకెప్పుడు వీక్లీ ఆఫ్ అంటూ కేసీఆర్ సర్కార్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు కొంపముంచిన అశోక్ బాబు!!

  చంద్రబాబుకి మెజారిటీ ఉద్యోగులు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆ విషయం రుజువైంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు.. ఉద్యోగులు తమకి అనుకూలంగా ఉన్నారని, ఈసారి వారంతా టీడీపీ పక్షానే నిలుస్తారని భావించారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక బాబు అంచనా తప్పని తేలిపోయింది. పోస్టల్ బ్యాలెట్ లో కూడా వైసీపీనే సత్తాచాటింది. ఉద్యోగులు బాబుకి వ్యతిరేకంగా ఉన్నారని తేలిపోయింది. అయితే బాబు.. ఉద్యోగులు తమ పక్షాన ఉన్నారని నమ్మడానికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ అశోక్ బాబు అని చెప్పాలి. ఉద్యోగ సంఘాల నేత అని, ఉద్యోగులంతా తమ పక్షాన నిలుస్తారన్న ఆశతో.. బాబు అశోక్ ని నెత్తిన పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ కట్టబెట్టారు. అశోక్ కూడా 'మీకు నేను ఉన్నాను.. ఉద్యోగులంతా మనవైపే ఉంటారు' అని చెప్పారు. ఇంకేముంది బాబు ఆహా ఓహో అంటూ గాలిలో తేలిపోయారు. గంపగుత్తగా ఓట్లన్నీ తమకే పడతాయి అనుకున్నారు. కానీ ఫలితాలు పూర్తీ భిన్నంగా వచ్చాయి. పార్టీ వల్ల అశోక్ కి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కానీ, అశోక్ వల్ల పార్టీకి అసలు ఓట్లే రాలేదు. ఆయన ఉద్యోగుల ఓట్లు గానీ, తన సామజిక వర్గం ఓట్లు గానీ రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. బాబు ఆయన్ని గుడ్డిగా నమ్మి భ్రమల్లోకి వెళ్లారు. తీరా ఫలితాలు చూసాక కళ్ళు బైర్లు కమ్మాయి. బాబు మీద ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు కానీ.. గడిచిన ఐదేళ్ళలో ఒక సంఘటన మాత్రం ఉద్యోగుల మీద బాగా ప్రభావం చూపిందనే అభిప్రాయం ఉంది. అదే ఎమ్మార్వో వనజాక్షి పై చింతమనేని ప్రభాకర్ వర్గం దాడి చేయడం. ఆ విషయంలో బాబు.. చింతమనేని పక్షాన నిలిచారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అశోక్ బాబు వంటి వారిని గుడ్డిగా నమ్మకం, చింతమనేని వంటి వారిని వెనకేసుకురావడం వంటివి బాబు కొంపముంచాయనే చెప్పాలి.  

ఒక పరాజయం 100 తప్పులు.. బాబుకి రాజయోగం దూరం చేసిన రాజధాని!!

  "పేరు గొప్ప.. ఊరు దిబ్బ" అనే సామెత వినే ఉంటారు. ఏపీ రాజధాని విషయంలో చంద్రబాబు ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన బాబు.. ప్రపంచంలోని గొప్ప రాజధానుల్లో ఒకటిగా అమరావతి నిలుస్తుందని.. అమరావతిని ఓ సింగపూర్, ఓ జపాన్ చేసి చూపిస్తానని చెప్పారు. దీంతో రాజధానిపై ఏపీ ప్రజలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ బాబు ఆ అంచనాలు అందుకోలేకపోయారు. దీంతో టీడీపీ ఓటమిలో రాజధాని కూడా ఓ కారణంగా మిగిలిపోయింది. తాత్కాలిక భవనాలు పేరిట పలు భవనాలు నిర్మించారు. అయితే వాటి నిర్మాణం కూడా నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. మన దేశంలో ఎంతో ప్రతిభ ఉన్న ఇంజినీర్లని కాదని విదేశాల నుండి ఇంజినీర్లను తెప్పించారు. పోనీ వారితో అయినా పూర్తిగా డిజైన్లు చేయించారా అంటే అదీ లేదు. వాస్తు నిపుణులను, సినీ దర్శకులను రాజధాని డిజైన్లలో భాగమయ్యేలా చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. సినిమాలో సెట్లు బాగున్నాయి కదా అని రాజధానికి డిజైన్లు గీయండి అని అడిగేసరి.. బాబుపై సెటైర్లు వచ్చాయి. దానికి తోడు వాస్తు ఒకటి. అసలు రాజధాని నిర్మాణంలో వాస్తు ఏంటి?. ఇంజినీర్లు అక్కడి పరిస్థితులను బట్టి డిజైన్ చేస్తారు. అంతేకాని వాస్తు పేరిట ఎవరో వచ్చి అక్కడ ఇది, ఇక్కడ అది అని ఏదేదో చెప్తుంటే ఇక ఇంజినీర్లు డిజైన్లు ఏం చేస్తారు?. ఒకవేళ బాబు రెండోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. అమరావతిని ఎంతలా అభివృద్ధి చేసేవారో తెలీదు కానీ.. మొదటి టర్మ్ లో మాత్రం డిజైన్ పేరిట కాలయాపన చేసారని, గ్రాఫిక్స్ రాజధాని అని.. అసలు అది అమరావతి కాదు భ్రమరావతి అని విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు రాజధాని భూములు విషయంలో కూడా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. వీటిని తిప్పి కొట్టడంలో బాబు & కో విఫలమయ్యారు. మరోవైపు విపక్షాలు.. అమరావతి అంతా భ్రమరావతి అని, అసలు ఒక్క ఇటుక కూడా పడలేదని పదేపదే విమర్శలు చేసాయి. ఈ విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. మొత్తానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానన్న బాబు.. ఏమీ చేయలేదన్న పేరు మూటగట్టుకొని పరాజయం పాలయ్యారు.

బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి.. ఇదంతా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్లానా!!

  కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. "రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే!’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా రాజగోపాల్‌రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుసుకునేందుకు వెళ్లిన రాజగోపాల్ రెడ్డికి.. ఆ పార్టీ పెద్దలు బంపరాఫర్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని, బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని బీజేపీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. రాష్ట్రం నుంచి పార్లమెంట్ లో ప్రాతినిధ్యాన్ని పెంచితే, ప్రజల్లోకి మంచి సంకేతాలు వెళ్లి, తదుపరి ఎన్నికల్లో లాభం కలుగుతుందని రాజగోపాల్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడి పదవిని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న పక్షంలో ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంట్‌రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ మొదలైంది. అయితే వెంట్‌రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెబుతున్నారు. మీ సోదరుడు పార్టీ మారాలనుకుంటున్నారు మీ సంగతేమిటి అనే ప్రశ్నకు వెంకట్ రెడ్డి ఏది ఎమైనా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాబోయే రోజుల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదే అన్నారు. పార్టీ మార్పుపై తుది నిర్ణయం సోదరుడిదేనని, అయినా ఒక కుటుంబంలోని వ్యక్తులు వేరు వేరు పార్టీల్లో ఉండటం సహజమేనని వెంట్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా కోమటిరెడ్డి సోదరులు వారి భవిష్యత్తు కోసం వేసిన ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ద్వితీయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఎవరైనా సరే భవిష్యత్తులో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాగలరు. అందుకే రెండు పార్టీల్లోనూ తమ కుటుంబం ఉంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని కొమటిరెడ్డి సోదరులే ఈ ప్లాన్ వేశారని.. ఒక్కసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరిది పైచేయి అనేది తేలగానే ఇరువురు అదే పార్టీలో ఉండిపోవాలనేది వారి ప్లాన్ అయ్యుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒక పరాజయం 100 తప్పులు.. ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న యూటర్న్ బాబు

  ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే మాట మార్చడం కూడా టీడీపీ ఘోర ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. విభజన గాయం మానాలంటే ప్రత్యేకహోదానే ఔషదమని ఏపీ ప్రజలు భావించారు. విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని, ఏపీకి న్యాయం జరగాలంటే హోదా కావాల్సిందేనని ఏపీ ప్రజలు బలంగా కోరుకున్నారు. మొదట్లో బీజేపీతో దోస్తీ సమయంలో ప్రజలతో పాటు బాబు కూడా హోదా కావాలన్నారు. బీజేపీ కూడా పార్లమెంట్ సాక్షిగా, తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి మాట మార్చి.. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నది. దీన్ని వ్యతిరేకించి హోదా కోసం పట్టుపట్టాల్సిన బాబు.. బీజేపీ నిర్ణయానికి తలొగ్గి ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీతో పాటు, ఉద్యమ సంఘ నేతలు, విద్యార్థులు.. ప్యాకేజీని వ్యతిరేకిస్తూ.. హోదా గళాన్ని బలంగా వినిపించారు. అయితే బాబు మాత్రం హోదా ఏమన్నా సంజీవనీనా అంటూ వారి మీద విరుచుకుపడ్డారు. ఇక కొందరు టీడీపీ నేతలైతే హద్దుదాటి చులకన వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేనా.. హోదా కోసం పోరాడిన వారిని బాబు అరెస్ట్ లు కూడా చేయించారు. మరోవైపు అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చారంటూ బీజేపీ నేతలను ఆకాశానికెత్తడాలు, సన్మానాలు చేయడాలు సరేసరి. ఈ చర్యలతో.. హోదా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు.. బాబు మీద, టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది. రోజులు గడిచాయి. హోదా మీద ఏపీ ప్రజలకు ఆశ మాత్రం చావలేదు. ఇంతలో కొన్నాళ్ళకు ఎన్డీయే నుంచి టీడీపీ బయటికి వచ్చింది. అప్పటి నుంచి చంద్రబాబు స్వరం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు బీజేపీ నేతలను పొగుడుతూ, సన్మానాలు చేసిన బాబు.. బీజేపీ మోసం చేసిందని, రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ పోరాటం మొదలు పెట్టారు. హోదా ఏమన్నా సంజీవనీనా అని అడిగిన బాబు.. బీజేపీకి దూరమైన తరువాత హోదా కావాల్సిందే అంటూ అడగడం మొదలు పెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీజేపీ ఏమో తాము ఏపీకి ఎంతో చేసామని, లెక్కలు అడిగేసరికి బాబు మాట మర్చి మా మీద విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చింది. మరోవైపు విపక్ష నేతలు కూడా యూ-టర్న్ బాబు అంటూ పదేపదే విమర్శలు చేశారు. దీంతో బాబు మాటలు మారుస్తున్నారన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదీగాక గతంలో హోదా అడిగిన వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసి, వారిని అరెస్ట్ లు చేయించిన బాబు.. తరువాత హోదా కావాలని అడిగితే ప్రజలకు నమ్మకం కలగలేదు. అదే బాబు బీజేపీ ప్యాకేజీ ఇస్తామని చెప్పినప్పుడే.. దాన్ని వ్యతిరేకించి కచ్చితంగా హోదానే కావాలని పట్టుబట్టి పోరాడి ఉంటే.. ప్రజలను నిజమైన నాయకుడిలా కనిపించేవాడు. ఇలా యూటర్న్ బాబు అని పేరు తెచ్చుకునేవాడు కాదు.  

ఒక పరాజయం 100 తప్పులు.. ఆ 60 మంది ఎమ్మేల్యేలే కొంప ముంచారు

  టీడీపీ ఘోర పరాజయానికి కారణమైన వంద తప్పుల్లో.. అభ్యర్థులను మార్చకపోవడం కూడా ఒకటని చెప్పవచ్చు. ఎంతసేపూ చంద్రబాబు 175 నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని.. నేను కష్టపడ్డాను, నన్ను చూసి ఓటేయండి అన్నారు. అంటే బాబు చెప్పాడుగా అని నియోజకవర్గంలో ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టినా ప్రజలు ఓటేస్తారా?. వారికి స్థానికంగా అందుబాటులో ఉండాల్సింది బాబా? ఎమ్మెల్యేనా?. వివాదాలు, అవినీతి ఆరోపణలు, దందాలు, ఎన్నికలు వచ్చినప్పుడే కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులోకి రావడం. ఇలాంటి వారు అభ్యర్థులైతే బాబు చెప్పారుగా అని ప్రజలు ఎందుకు ఓటేస్తారు?. ఈ మాత్రం ఆలోచన 40 ఏళ్ళ అనుభవం ఉన్న బాబుకి రాలేదా?. గత ఐదేళ్లల్లో ఎందరో ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కున్నారు. ఎందరి మీదనో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇలా రకరకాల కారణాలతో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వారికి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారని కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ బాబు ఇవన్నీ పట్టించుకుంటేనే కదా. ప్రజలు నన్ను చూసి ఓటేస్తారు అంటూ అతి నమ్మకంతో అభ్యర్థులను మార్చకుండా ఎన్నికల పోరులోకి దిగారు. ప్రజాతీర్పు చూసి డీలా పడిపోయారు. బాబు.. ముందే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత గుర్తించి అభ్యర్థులను మార్చి ఉంటే టీడీపీకి ఘోర ఓటమి ఎదురయ్యేది కాదుగా. ముందు నుండి పార్టీలో ఉంటూ, పార్టీ కోసం కష్టపడుతూ, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేవారిని అభ్యర్థులగా నిలబెడితే.. ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అలా కాకుండా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారిపోయి తన మీద విమర్శలు చేస్తాడేమో అన్న భయంతో కొందరికి, ఇతనైతేనే ఆర్థికంగా బలవంతుడు అని మరికొందరికి టికెట్లు ఇచ్చారు. అలాంటి వారి కోసం కార్యకర్తలు మనస్ఫూర్తిగా పని చేయగలరా? ప్రజలకు వారికి ఓటేయాలని అనిపిస్తుందా?. ఖచ్చితంగా అనిపించదు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడుతూ.. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటే.. అలాంటివారి కోసం కార్యకర్తలు నిజాయితీగా కష్టపడతారు. అలా కాకుండా పార్టీలు జంప్ చేసేవారిని, కేవలం డబ్బే ఉన్న వారిని తీసుకొస్తే.. వీళ్ళు గెలిచినా పార్టీలో ఉంటారో లేదో తెలీదు. ప్రజలకూ అందుబాటులో ఉండరు అని కార్యకర్తలు పని చేయడం మానేస్తారు. ఆ అభ్యర్థులను కార్యకర్తలే నమ్మకపోతే ఇక సాధారణ ప్రజలు ఎలా నమ్ముతారు?. అందుకే బాబు అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థినని చెప్పినా.. ప్రజలు మాత్రం వారి నియోజకవర్గాల్లోని అభ్యర్థులనే చూసారు. టీడీపీకి ఘోర ఓటమి రుచి చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. క్రికెట్ లో కోహ్లీ ఒక్కడే బాగా ఆడినంత మాత్రాన ప్రతిసారి మ్యాచ్ గెలుస్తామా? మిగతా బ్యాట్స్ మెన్, బౌలర్ల సపోర్ట్ కూడా ఉండాలి. టీం ఎఫర్ట్ ఉండాలి. మరి వీక్ టీం ని పెట్టుకొని బాబు 'నేను కష్టపడ్డ, నన్ను చూసి ఓటేయండి' అంటే ప్రజలు పార్టీని ఎలా గెలిపిస్తారు?. ఇది చంద్రబాబు ఆలోచించలేకపోయారు. అందుకే ఓడిపోయారు.  

ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీని ముంచిన సీబీఎన్ ఆర్మీ

  టీడీపీ పరాజయానికి కారణమైన వంద తప్పుల్లో సీబీఎన్ ఆర్మీ కూడా ఒకటని చెప్పొచ్చు. ఆర్మీ అంటే యుద్ధం చేసి రక్షణగా ఉండాలి. కానీ ఈ ఆర్మీ అతి చేసి పార్టీ నాశనానికి కారణమైంది. అసలు ఈ ఆర్మీ వల్ల పార్టీకి ఒరిగిందేంటి?. ఎన్నికల ముందు సోషల్ మీడియాలోనూ, బయటా తెగ హడావుడి చేశారు. కానీ ఏం లాభం పట్టుమని పది ఓట్లు కూడా తీసుకురాలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ఉన్న ఓట్లనే పార్టీకి దూరం చేశారు. చంద్రబాబు మీటింగ్ జరిగితే చాలు సీబీఎన్ ఆర్మీ పేరిట కొందరు టీ షర్టులు వేసుకొని వచ్చి హడావుడి చేసేవారు. దాని వాళ్ళ ఏం లాభం పార్టీకి? టీ షర్టులు వేసుకొని గోల చేస్తేనో, బైక్ ర్యాలీలు చేస్తేనో ప్రజలకు మంచి జరుగుతుందా? పార్టీకి ఓట్లు పడతాయా?. ఇవేమి పట్టించుకోకుండా చంద్రబాబు సీబీఎన్ ఆర్మీకి అండగా ఉంటూ వారిని నెత్తిన ఎక్కించుకున్నారు. ఇంకా ఈ సీబీఎన్ ఆర్మీలో ఒక సామజిక వర్గానికి చెందిన కొందరి అత్యుత్సహం కూడా పార్టీ కొంపముంచింది. బాబు, లోకేష్ లతో చనువుగా ఉంటూ.. పార్టీ మాకే సొంతం అన్నట్టుగా వ్యవహరించడం. మిగతా కార్యకర్తలను చిన్న చూపు చూడటం, కొందరు నేతలను బెదిరించడం చేసేవారు. వీరి వల్ల ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని నిజాయితీగా పనిచేసిన వారు పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అంతేకాదు ఈ సీబీఎన్ ఆర్మీ మూలంగా తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు వంటి టీడీపీ అనుబంధ సంస్థలు మనుగడ కోల్పోయాయి. దీంతో నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే వారు, ప్రజా సమస్యల మీద పోరాడేవారు పార్టీకి దూరమై.. టీ షర్టులు వేసుకొని హడావుడి చేసేవారే పార్టీలో ఎక్కువయ్యారు. ఇప్పుడు పార్టీ ఈ పరిస్థితికి రావడానికి కారణమయ్యారు. పోనీ పార్టీ ఓడిపోయాక అయినా తప్పు తెలుసుకొని పార్టీకి పునర్వవైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది లేదు. మాకేం సంబంధం లేదంటూ టీ షర్టులు విప్పేసి సైడ్ అయిపోయారు. ఇకనైనా చంద్రబాబు ఇలా హడావుడి చేసే వారిని కాకుండా.. నిజాయితీగా పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తిస్తే మంచిది.  

ఒక పరాజయం 100 తప్పులు.. జన్మభూమి కమిటీ సభ్యుల ఇష్టారాజ్యం

  టీడీపీ ఘోర పరాజయానికి కారణమైన 100 తప్పుల్లో జన్మభూమి కమిటీలు కూడా ఒకటి. ప్రభుత్వ పథకాలను అర్హులైన అందరికీ చేర్చాలనే ఉద్దేశంతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. సరైన అవగాహన లేకపోవడం, కమిటీ సభ్యులుగా అర్హత లేని వారిని నియమించడం వంటివి టీడీపీ కొంపముంచాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాల్సిన కమిటీ సభ్యులు.. మా పార్టీ, మా వర్గం అంటూ ప్రభుత్వ పథకాలను కొందరికే పరిమితం అయ్యేలా చేశారు. వారి ప్రవర్తన పుణ్యమా అని టీడీపీ ప్రభుత్వం కొందరి ప్రభుత్వం అనే ముద్ర పడిపోయింది. అంతేకాదు ఈ కమిటీ సభ్యుల వైఖరి వల్ల ఎన్నో ఏళ్లుగా టీడీపీని నమ్ముకొని ఉన్నవారు కూడా టీడీపీకి వ్యతిరేకమయ్యారు. ఇలా ఈ జన్మ భూమి కమిటీ సభ్యుల మూలంగా.. గ్రౌండ్ లెవెల్ లో టీడీపీ మీద బాగా వ్యతిరేకత ఏర్పడింది. ఈ వ్యతిరేకతను గుర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అసలు పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల.. కార్యకర్తల్లో, సాధారణ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని.. బాబు గ్రౌండ్ లెవెల్ లో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు తన చుట్టూ చేరి భజన చేసే నాయకుల మాటలే నమ్మారు. కొందరు నేతలు.. బాబు, లోకేష్ ల మెప్పు పొందడం కోసం వారి చుట్టూ చేరి.. మీరు సూపర్, మన పార్టీ బంపర్ అంటూ డప్పు కొట్టారు. మెప్పు కోసం అలా డప్పు కొట్టారు కానీ పార్టీకి ఇలా ముప్పు వస్తుందని వారు కూడా ఊహించి ఉండరు. అదే ఆ నాయకులు.. వారి వారి నియోజకవర్గాల్లో, జిల్లాల్లో.. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు వారి పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. కొందరు నేతలకు జన్మభూమి కమిటీల మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలిసినప్పటికీ.. ఆ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోకపోగా.. కమిటీ సభ్యులకే అండగా ఉంటూ వారు మరింత రెచ్చిపోయేలా చేశారు. అందుకే ప్రజలు వారికి ఓట్లతో బుద్ధి చెప్పారు. ఒకవేళ బాబు గ్రౌండ్ లెవెల్ అసలు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసుంటే.. ఇప్పుడిలా బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదుగా. ఇకనైనా బాబు తన చుట్టూ డప్పు కొట్టే నేతల్ని కాకుండా.. పార్టీ కోసం నిజాయితీగా కష్టపడుతూ, తప్పుఒప్పులని కరెక్ట్ గా చెప్పేవారిని, పొగడ్తతో పాటు విమర్శ కూడా చేసే వారిని పక్కన పెట్టుకుంటే మంచిది. అలా కాకుండా ఇప్పటిలాగానే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కాస్తా మూడుకి పడిపోయినా ఆశ్చర్యం లేదు.    

ప్రతి పనిలో జగన్ మార్క్... క్లారిటీ మిస్సవుతున్న జగన్..?

  దాదాపు పదేళ్ల కష్టం, తండ్రి చావు నుండి మొదలు నేటి సిఎం కుర్చీ దాకా సాగింది జగన్ ప్రస్తానం. అయితే ఆయన సిఎం స్థానం ఎంత కష్టపడి సంపాదించాడో ఆ సీటులో ఉండి చేసే పనుల ద్వారా అంతే పేరు తెచ్చుకోవాలని తద్వారా తన సిఎం స్థానం పదిలపరచుకోవాలని ఆయన చూస్తున్నాడు, హామీల పేరుతో నవరత్నాల మొదలు ఆయన చేపట్టిన చేపడుతున్న హామీలు జనాల్లోకి గుర్తుండిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నిన్న జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మొదటి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో జగన్ కొత్తగా ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు, ముందుగా తీసుకున్నవి అమలు పరుద్దామని ఫిక్స్ అయినా నిర్ణయాలలో కొన్నిటిని ఆమోదింపచేసి, కొన్నిటికి కమిటీలు నియమించాలని తీర్మానించారు, అయితే తీసుకునే ప్రతి నిర్ణయం జనాల్లో మంచి పేరు తెచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు జగన్. నిజానికి నిన్న తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే ముందుగా ప్రమాణ స్వీకారం రోజున సంతకం పెట్టిన పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని ఆమోదించారు, అయితే ఈ 250 పెంపకం అనే అంశం ఎన్నో విమర్శలకి తావిచ్చినా ఆయన దాని మీదే కట్టుబడి ఉన్నారు. ఇక ఆశా వర్కర్ల జీతాల పెంపు విషయానికి వస్తే కొద్దీ రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా బాబు ప్రభుత్వం వారి జీతాలను 8500 చేసింది, ఇప్పుడు జగన్ పెంచింది పదిహేను వందలే అయినా దానిని ప్రమోషన్ ఆబ్ జెక్టివ్ గా వాడుకోడానికి ఫిక్స్ అయ్యింది జగన్ ప్రభుత్వం. అంతేకాక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ గురించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే నిజాం రైల్వేస్ సంస్థ నుండి ఈ ఆర్టీసీ ఏర్పడింది, విలీనానికి సాధ్యం కానీ ఎన్నో లొసుగులు ఈ వ్యవహారంలో ఉన్నాయి, సో ఇప్పటికిప్పుడు ఆర్టీసీ సంఘాలు సమ్మెకు దిగకుండా కమిటీ పేరు చెప్పి ఆ సంఘాల నోరు మూయించారని చెప్పచ్చు. ఇక కేబినెట్ లో తీసుకున్న మరో నిర్ణయం రేషన్ డోర్ డెలివరీ, ఇప్పటికే ఏపీలో పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తున్నారు. అదే పద్దతిని ఇప్పుడు రేషన్ సరుకుల విషయంలో కూడా ఫాలో కానున్నారు. ఈ దెబ్బకి జనాల్లో మంచి పేరు రావడం ఖాయం, ఎందుకు అనగా ఒకప్పుడు రేషన్ కోసం క్యూలలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది, టెక్నాలజీ పుణ్యమా అని ఆ క్యూలు తగ్గినా మిషన్లు సరిగ్గా పని చేయక గంటల తరబడి ఆ రేషన్ షాపుల ముందు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, కానీ కొత్త ప్రభుత్వ నిర్ణయంతో జనాలు ఈ మేరకు ఉపశమనం పొందనున్నారు. ఇక వాలంటీర్ల విషయానికి వస్తే ఇదే కాస్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ ఈ విషయంలో క్లారిటీ మిస్సవుతున్నారు. మొదట నుండి ఈ విషయం మీద కన్ఫ్యూషన్ అలాగే ఉంది, అదేంటంటే తొలుత ఊరికి పదిమంది అన్నారు, తర్వాత వార్డుకు ఒక్కరు అన్నారు, ఇప్పుడు 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ అంటున్నారు. దీంతో ఈ వ్యవస్థ ఏర్పాటు, పని తీరు మీద ఇంకా ఏర్పడక ముందే నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. నిజానికి ఇలాంటి తప్పిదమే చేసిన తెలుగుదేశం ఘోరంగా దెబ్బతిన్నది. జన్మభూమి కమిటీల పేరుతో తమ పార్టీ వారికి అధికారాలు ఇచ్చ్చిన ప్రభుత్వ పెద్దలు, సామాన్య జనాల్లో చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ జాగ్రత్త పడకుంటె ఈ వ్యవస్థ కూడా వైసీపీని అంతే దెబ్బ తీసే అవకాశం కనిపిస్తోంది. ఇక జగన్ ఎంతో గొప్పగా చెప్పుకున్న నవరత్నాల లో ఒకటయిన బడికి పిల్లల్ని పంపిస్తే తల్లితండ్రులకి వేతనం ఇచ్చే పధకం కూడా ఒకటి, అయితే ఈ పధకం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకి మాత్రమే పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా పాలనలో జగన్ మార్క్ చూపడానికి పనికొచ్చేదిగా ఉంది, ఎందుకంటే ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నో కష్టాలు పడుతున్నా ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల శాతం చాలా తక్కువ కానీ జగన్ నిర్ణయంతో ఆ శాతాన్ని పెంచవచ్చు, అది పెరిగితే ప్రయివేట్ స్కూల్స్ డబుల్ రేట్లు అదుపులోకి వస్తాయి. అలా ఒకే దెబ్బకి రెండు పిట్టలు పడేలా జగన్ ప్లాన్ చేసినట్టు ఇక్కడ అర్ధం చేసుకోవచ్చు. అంతేకాక ఎప్పుడూ వినపడే కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్దీకరణ అంశం కూడా ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా కమిటీ వేసి సైడ్ అయ్యారు. ఇలా ఒక్కటి కాదు ఏపీ రైతు కమిషన్, పంటకు గిట్టుబాటు ధర, ఉచిత బోర్లు, లాంటి ఎన్నో నిర్ణయాలలో జగన్ తన మార్క్ చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  

ఒక పరాజయం 100 తప్పులు.. ఆ 'కులమే' కొంప ముంచిందా..?

  'కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు' అన్నట్టుగా ఏపీలో టీడీపీ ఘోర పరాజయానికి నూరు కారణాలు ఉన్నాయి. నూరు కారణాలు అనడం కంటే 'చంద్రబాబు నూరు తప్పులు' అనడం కరెక్టేమో. ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతం టీడీపీకి కర్త, కర్మ, క్రియ అన్నీ బాబే. అన్నీ తానే అనుకునే బాబు చేసిన తప్పులు పుణ్యమా అనే టీడీపీకి ఇన్ని తిప్పలు వచ్చాయి. ఏపీలో కుల రాజకీయాలు జరుగుతుంటాయి. కానీ బాబు కుల సమీకరణలు చేయడంలో విఫలమయ్యారు. అంతేకాదు మొదటి నుండి పార్టీకి అండగా ఉన్న కులాలను సైతం దూరం చేసుకున్నారు. ఆయనకు తోడు సీనియర్లు సైతం వారి వారి కులాలను ఆకర్శించడంలో విఫలమయ్యారు.  టీడీపీలో పార్టీలో నెంబర్ 2 గా ఉన్న యనమల రామకృష్ణుడు తన సామాజికవర్గమైన యాదవ కులాన్ని ఏమన్నా ఆకర్షించగలిగారా? అస్సలు లేదు. కొల్లు రవి మత్స్యకారి వర్గానికి చెందిన నేత. మరి ఆయన వారిని ఆకర్షించే ప్రయత్నం చేసారా? లేదు. కమ్మ సామజికవర్గానికి చెందిన దేవినేని ఉమా మంత్రిగా చేసారు. కృష్ణ జిల్లాలో కమ్మ వారు దాదాపు సగం మంది టీడీపీకి దూరమయ్యారు. వారిని ఆకర్షించడంలో ఉమా విఫలమయ్యారు. ఎంత సేపూ నేతలు స్వలాభం కోసం కాంట్రాక్టర్లు, దళారులతో సత్సంబంధాలు కొనసాగించడమే తప్ప.. వారి వారి సామజికవర్గాన్ని ఆకర్షించలేకపోయారు. అసలు మంత్రులు అనేవాళ్ళు కనీసం ఓ జిల్లాని శాసించేలా ఉండాలి. కులాల ఓట్లు అనే కాదు, సాధారణ ప్రజలకు కూడా దగ్గరై జిల్లాలో పార్టీ గెలుపుకి కృషి చేయాలి. కానీ మంత్రులు సొంత నియోజకవర్గంలో గెలవలేక చతికిలపడ్డారు. ఇక టీడీపీకి ప్రధాన బలమైన బీసీలను బాబు దూరం చేసుకున్నాడు. కాపులకి దగ్గరవ్వాలని కాపు కార్పొరేషన్ పెట్టాడు. కాపులు దగ్గరవ్వకపోగా, 1983 నుంచి పార్టీకి బలం అనుకున్న బీసీలు దూరమయ్యారు. వారికి టికెట్ల పరంగానో, వేరే విధంగానే భరోసా ఇచ్చి వారిని పార్టీ నుండి దూరం కాకుండా చేసుకోలేకపోయారు. బ్రాహ్మణులకు దగ్గరవుదామని బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాడు. కానీ వారి ఓట్లు మాత్రం గెలుచుకోలేకపోయాడు. అదేవిధంగా టీడీపీకి కమ్మ సామాజికవర్గం అండగా ఉంటుంది అంటారు. కానీ కమ్మ సామాజిక వర్గ నేతలు, కమ్మ యువతే టీడీపీ కొంపముంచారు. టీడీపీ ఘోర ఓటమికి కారణమయ్యారు.  

తెలంగాణలో ఖాళీ అయినట్లే ఏపీలో కూడా టీడీపీ ఖాళీ కానుందా?

  ఆంధ్రప్రదేశ్ లో పసుపుని కాషాయం కమ్మేయబోతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో.. బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో బలపడగలమనే నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా ఏపీలో టీడీపీ ప్లేస్ ని భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్రంలో బీజేపీని ఓడించాలని కోరుతూ, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే ప్రజలు మరొకటి తలిచారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీనే అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీలో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. అందుకే ఇప్పుడు బీజేపీ.. ఏపీలో టీడీపీని ప్లేస్ ని టార్గెట్ చేస్తోంది. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటుంది. దానివల్ల తమని వ్యతిరేకించిన చంద్రబాబుని దెబ్బకొట్టినట్టు ఉంటుంది, అలాగే దక్షణాది రాష్ట్రంలో బలపడినట్టు అవుతుంది. ఇప్పటికే ఈ దిశగా బీజేపీ అడుగులు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ.. వేయబోయే మొదటి అడుగు ఆపరేషన్ కమలం. మొదటగా టీడీపీని దెబ్బతీసేందుకు బీజేపీ పక్కవ్యూహంతో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలకు గ్యాలం వేయనుందట. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తమదే కాబట్టి అన్ని విధాలుగా అండగా ఉంటామనే భరోసా కల్పిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట. ఇప్పట్లో టీడీపీ కోలుకునే అవకాశం లేదని భావిస్తున్న కొందరు నేతలు సైతం.. తమ భవిష్యత్‌ కోసం బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీతో కలిసి సాగితే, తమ వ్యాపార వ్యవహారాలకు ఇబ్బందులు ఉండవని లెక్కలేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్ కమలానికి ఓ టీడీపీ కీలక నేత సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన గుంటూరు జిల్లాకి చెందిన ఓ సీనియర్ నేత. ఆయన మొన్నటివరకు మంత్రిగా కూడా పనిచేసారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య వ్యాపార బంధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బంధమే ఇప్పుడు ఆపరేషన్ కమలానికి సహకరిస్తోందట. ఆ మాజీ మంత్రి.. బీజేపీ, టీడీపీ నేతల మధ్య రాయబారం నడుపుతూ.. టీడీపీ నేతలను బీజేపీలో చేర్చే ఓ వారధిలా పనిచేస్తున్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కమలం కండువా కప్పుకొనే అవకాశముంది అంటున్నారు. అయితే బీజేపీ కేవలం ఎమ్మెల్యేలనే కాకుండా సీనియర్ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పరిటాల కుటుంబం, జేసి కుటుంబం, కేశినేని నాని వంటి వారితో సంప్రదింపులు కూడా జరుపుతన్నారట. ఈ సంప్రదింపుల్లో కూడా ఆ టీడీపీ మాజీ మంత్రి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ నేతలు.. కొందరు కక్ష సాధింపు చర్యలకు భయపడి, కొందరు రాజకీయ భవిష్యత్తు కోసం, కొందరు వ్యాపారాలు కోసం ఇలా రకరకాల కారణాలతో బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆపరేషన్ కమలం ఫలించి వారంతా బీజేపీలో చేరితే.. ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో తుదిశ్వాస విడవడానికి దగ్గరగా ఉన్న టీడీపీ.. ఇప్పుడు బీజేపీ పుణ్యమా అని ఏపీలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొనే ప్రమాదముంది. చూద్దాం మరి టీడీపీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో.

బాబాయ్-అబ్బాయ్ ల మధ్య మళ్ళీ మొదలైన మ‌న‌స్ప‌ర్థ‌లు!!

  ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి వైఎస్ జగన్ టికెట్ ఇవ్వని విషయం తెలిసిందే. దీంతో మొదట అలకబూనిన వైవీ.. తరువాత జగన్ బుజ్జగింపుతో కాస్త మెత్తబడి ఎన్నికల్లో పార్టీ గెలుపుకు తనవంతు కృషి చేశారు. అయితే తాజాగా మరోసారి బాబాయ్-అబ్బాయ్ ల మ‌ధ్య తేడాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం త‌న బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు సమాచారం. అయితే అది వైవీ సుబ్బారెడ్డికి ఏమాత్రం ఇష్టం లేద‌ని, ఆయ‌న టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విపై సుముఖంగా లేర‌ని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి రాజ్య‌స‌భ సీటునే ఆశిస్తున్నారట. అయితే ప్ర‌స్తుతానికి టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వితో స‌ర్దుకోవాల‌ని, అవ‌కాశాన్ని బ‌ట్టి రాజ్య‌స‌భ‌కు పంపిస్తాన‌ని జ‌గ‌న్ ఆయ‌న‌ను బుజ్జిగిస్తున్నార‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అప్పుడు లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో అల‌క బూనిన వైవీ సుబ్బారెడ్డి.. జ‌గ‌న్ బుజ్జ‌గించ‌డంతో మ‌ళ్లీ పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. అలాగే రాజ్యసభ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా జ‌గ‌న్ రాజ్యసభ తర్వాత చూద్దామంటూ, టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఆఫ‌ర్ చేయ‌డంతో మ‌ళ్లీ ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు పెరిగే అవ‌కాశం వుంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతోంది.