ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లకు మోక్షం.. తక్షణం రిపేర్లు!

ఆంధ్రప్రదేశ్‌లో దారుణంగా వున్న రోడ్ల పరిస్థితి మారనుంది. తక్షణం రిపేరు పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖపై చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు. జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని తెలిపారు. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎవరూ రోడ్లు వేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు వివరించారు. రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి తక్షణం 3 వందల కోట్లు అవసరమని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వెంటనే టెండర్లు పిలిచి, రోడ్ల పనులను తక్షణం ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  

జగన్ ప్రభుత్వం రోడ్లను ఎంతమాత్రం పట్టించుకోలేదని, ప్రజలు ఐదేళ్ళపాటు గతుకుల రోడ్ల మీద నరకం చూశారని చంద్రబాబు చెప్పారు. ఈ పరిస్థితి మారేలా పనులు  మొదలవ్వాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్ల మీద గుంతల సమస్య వుంది. తక్షణం మరమ్మతులు చేయాల్సిన రోడ్లు 2,936 కిలోమీటర్లు వున్నాయి. ఈ 7,087 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు.