పార్టీ కండువా మార్చేసిన హరీష్ రావు.. దేనికి సంకేతం?

బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కాంగ్రెస్ లోకి చేరిపోతుండగా, ఆ పార్టీకి రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులూ గంపగుత్తగా  కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మనుగడపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ వ్యవహారాలలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. పార్టీ నుంచి వలసలను నిరోధించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన చేతులెత్తేశారు. ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుందన్న ధోరణిలో కేసీఆర్ ఉన్నారు. ఇక ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా అడపాదడపా ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్ పై విమర్శలు, సవాళ్లు వినా, పార్టీలోనూ, పార్టీ క్యాడర్ లోనూ జోష్ నింపడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాగా ఆ పార్టీలో మరో కీలక నేత హరీష్ రావు కూడా జెండా మార్చేస్తున్నారా అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే బీజేపీ ఆయనకు గేలం వేస్తున్నది. బీఆర్ఎస్ లో సమర్థ నేత హరీష్ రావు ఒక్కరే అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు. బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి హరీష్ రావు బీజేపీలోకి వస్తారని సంకేతాలు ఇచ్చేలా ఇటీవల కొన్ని సభలలో ప్రసంగించారు. 

ఈ నేపథ్యంలోనే పటాన్ చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు బీఆర్ఎస్ కండువా ధరించలేదు. దీంతో ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారా అన్న చర్చ మొదలైంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. హరీష్ రావు బీఆర్ఎస్ కండువా ధరించ లేదు సరే.. మరి ఏ పార్టీ కండువా ధరించారు. ఆయన ధరించింది బీజేపీ కండువా కాదు, కాంగ్రెస్ కండువా కూడా కాదు. మరి ఏమిటి? అంటే ఆయన టీఆర్ఎస్ కండువా ధరించారు. దీంతో ఆయన జెండా మార్చేశారన్న అభిప్రాయం గ ట్టిగా వినిపిస్తోంది. తొలి నుంచీ జాతీయ రాజకీయాల కోసం పార్టీలోని తెరాస పేరును తొలగించడాన్ని బాహాటంగా కాకపోయినా పార్టీ వేదికల మీద హరీష్ రావు గట్టిగా అభ్యంతరం తెలిపారు. పార్టీ పేరు మార్పు తెలంగాణ సెంటిమెంట్ ను గాయపరుస్తుందని ఆయన కేసీఆర్ కూ చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సరే ఏమైనా టీఆర్ఎస్ పేరు తొలగించి పార్టీకి బీఆర్ఎస్ అని నామకరణం చేసేశారు కేసీఆర్. అయితే పేరు మార్పు తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఈ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలోనూ బీఆర్ఎస్ ప్రదర్శన మరింత అద్వానంగా మారింది. లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు జీరో రిజల్ట్ వచ్చింది. దీంతో పేరు మార్పు సరికాదు అన్న హరీష్ రావు వంటి నేతల మాటలను ఎందుకు పట్టించుకోలేదా అని కేసీఆర్ భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే పటాన్ చెరు కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు బీఆర్ఎస్ కండువా మార్చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆయన ఏ కండువా కప్పుకున్నారంటే.. టీఆర్ఎస్ కండువా. దీంతో బీఆర్ఎస్ పేరు మళ్లీ టీఆర్ఎస్ గా మారిపోనుందా అంటూ సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.