రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. రుణమాఫీ !
posted on Jul 18, 2024 @ 11:07AM
సకల రోగాలకూ మందు జాలిమ్ లోషన్ అన్నట్లుగా.. రాజకీయంగా తాను ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ రైతు రుణమాఫీయే విరుగుడు అని రేవంత్ భావిస్తున్నారు. అందుకే రూ. రెండు లక్షల రుణమాఫీని కటాఫ్ డేట్ కంటే ముందే ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నికలలో కూడా చేయనంత ప్రచారం చేస్తున్నారు. గురువారం (జులై 18)న లక్ష రూపాయల వరకూ రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి, రైతుల ఖాతాలలో నిధులను జమ చేయడానికి రెడీ అయిపోయారు.
అసలు తొలుత రుణమాఫీకి రేవంత్ పెట్టిన కటాఫ్ డేట్ ఆగస్టు 15.ఆ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు కూడా. అయితే జులై 18నే రుణమాఫీ నిధులను విడుదల ప్రారంభించేశారు. రెండు లక్షల రుణమాఫీని మూడు విడతలుగా అందిస్తామని ప్రకటించిన ఆయేన తాను చెప్పిన ఆగస్టు 15 గడువు కంటే ముందే రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగా లక్ష రూపాయల వరకూ రుణమాఫీని గురువారం (జులై 18) ప్రారంభించారు. ఇక లక్షన్నర వరకూ ఉన్న రుణాలను ఈ నెలాఖరులోగా, రెండు లక్షల వరకూ ఉన్న రైతు రుణాలను ఆగస్టులో మాఫీ చేస్తామని ప్రకటించారు.
రేవంత్ నిర్ణయంతో ఒక్కసారిగా ఆయన సర్కార్ పట్ల సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతోంది. ఇటీవల రేవంత్ రెడ్డి ఇంటా బయటా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాల నుంచే కాకుండా కాంగ్రెస్ లో కూడా ఆయన తీరు పట్ల ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అలాగే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలాగే నిరుద్యోగుల ఆందోళన కూడా రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారింది. ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగు తోందన్న భావన ఏర్పడుతున్న సమయంలో రేవంత్ రుణమాఫీ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో విపక్షాల నోళ్లు మూతపడే పరిస్థితి కల్పించారు. లబ్ధిదారులలో కోత విధించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాట పట్టడానికి ప్రయత్నించినా అప్పటికే రేవంత్ వారిపై పై చేయి సాధించేశారు. మొత్తంగా రుణమాఫీ పేరుతో రేవంత్ ప్రభుత్వాన్ని ఒకదాని వెనుక ఒకటిగా చుట్టుముడుతున్న సమస్యలను దూరం చేశారు.