మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ దారెటు?
posted on Jul 11, 2024 @ 11:15AM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలకు ఊపిరాడటం లేదు. అధికారంలో ఉన్నంత కాలం అడ్డగోలు దోపిడీకి తెరలేపిన నేతలు ఇప్పుడు కేసుల భయంతో వణికి పోతున్నారు. అరెస్టు తప్పించుకోవడానికో లేదా వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందనో కారణాలేవైనా వైసీపీకి దూరం జరిగేందుకు సిద్ధపడుతున్నారు. అలా వైసీపీ నుంచి బయటకు వచ్చే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు.
ఆయన బిజినెస్ మేన్. అవంతి విద్యాస్థంస్థల అధినేత. ఈయన 2009 ఎన్నికల్లో తొలిసారి భీమిలి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అవంతి.. 2014లో తెలుగుదేశంలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అవంతి.. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో కొద్దికాలం జగన్ క్యాబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. వైసీపీ అధికారంలోఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వారిలో అవంతి ఒకరు. తాడేపల్లి కార్యాలయం నుంచి వెళ్లిన స్క్రిప్ట్ కు అనుగుణంగా టీడీపీ, జనసేన పై అవంతి ఇష్టారీతిలో రెచ్చిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
2024 ఎన్నికల్లో మరోసారి భీమిలి నుంచి పోటీచేసిన ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం ఏపీలో తెలుగు దేశం కూటమి అధికారంలోకి రావటంతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు అవంతి శ్రీనివాస్ మళ్లీ తెలుగుదేశంలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం అధిష్టానం మాత్రం అవంతిని పార్టీలోకి తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో ఆయన కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలవైపు పడిందంటున్నారు. మొత్తం మీద అవంతి శ్రీనివాస్ వైసీపీలో కొనసాగే అవకాశాలు మాత్రం లేవని చెబుతున్నారు.
వైసీపీ ఘోర ఓటమితో చాలా మంది నేతలు ఆ పార్టీని వీడేందుకు రెడీ అయిపోతున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఏపీలో ఏ రంగమూ అభివృద్ధికి నోచుకోలేదు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి నెలరోజులు కాకముందే సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ప్రజలలో కూటమి పాలనపై సంతోషం వ్యక్తం అవుతోంది. మరోవైపు ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో బలోపేతం అయ్యేందుకు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్ అభిమానులుగా వైసీపీలో ఉన్న చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ బలపడితే రాబోయేకాలంలో వైసీపీకి రాజకీయ భవిష్యత్ ఉండదని భావిస్తున్న మాజీ మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు ఇప్పుడే కూటమిలోని ఏదోఒక పార్టీలో చేరడం బెటర్ అనే భావనకు వస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే కాలంలో వైసీపీని వీడేవారికి సంఖ్య భారీగా ఉంటుందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.