చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని... ముందు నుయ్యి వెనుక గొయ్యి

సామాన్యుల స్థలంలో బలమున్నోళ్లు బోర్డులు పాతేసి ఈ స్థలం మాదని దౌర్జన్యంగా ఆక్రమించడం చూస్తుంటాం. ఇప్పటికీ పలుచోట్ల కబ్జా భాగోతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వంద కోట్ల విలువైన ఓ భూ వివాదం తెరమీదకు వచ్చింది. ఇది స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నమో లేక తెలియక ఇరు వర్గాలు ఒకే స్థలం కొని మోసపోయాయో తెలియదు కానీ.. ఈ వివాదంలో కర్నూల్ జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని తుఫ్రాన్‌పేట శివారు ప్రాంతంలో గల కోట్ల విలువైన భూమి వివాదాస్పదంగా మారింది. ఇరు వర్గాలూ తమదంటే తమదని వాదిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం... తుఫ్రాన్‌పేటలోని సర్వే నంబరు 72, 74, 85, 87, 88, 89లో సుమారు 50 ఎకరాల్లో శివప్రియ నగర్‌-2 పేరుతో రెండు దశాబ్దాల క్రితం వెంచర్ వేశారు. సర్వే నంబరు 88, 89లో ఉన్న దాదాపు 40 ఎకరాల స్థలంలో ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. స్థానిక పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి జిపిఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించగా.. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పలువురు వీటిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం, ఈ ప్రాంతంలో ఎకరం రూ. 2 కోట్లకు పైగా పలుకుతుండటంతో.. మొత్తం దీని విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.  అయితే, ఈ భూమి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి చెందినదంటూ ఇటీవల బోర్డు వెలిసింది. అంతేకాదు, ఈ ఏడాది ఏప్రిల్‌లో వెంచర్‌లో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. ఆ భూమిలోకి ఎవరూ వెళ్లకుండా కందకాలు కూడా తవ్వారు. దీంతో స్థలాలు కొన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ అంశంపై కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వే నంబరు 89లోని పదెకరాల భూమిని 2008లో నా భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించానని అన్నారు. నెల రోజులుగా కొంత మంది తనకు ఫోన్‌ చేసి ఇందులో తమకు ఫ్లాట్లు ఉన్నాయని అంటున్నారని తెలిపారు. అయితే, మా కంటే ముందే ఈ భూమిని వారికి అమ్మి ఉంటే వాళ్లకే ఇచ్చేస్తామని అన్నారు. కానీ ఈ వెంచర్‌పై మొదట్నుంచీ వివాదం ఉందని.. అప్పట్లో వెంచర్‌ వేసిన చంద్రమౌళీశ్వర్‌ తండ్రి శివారెడ్డిపై పలు కేసులున్నాయని, గతంలో సీబీసీఐడీ విచారణలో ఆయన జైలుకు కూడా వెళ్లారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, తమ వద్ద భూమి కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. భూమి కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని కాటసాని అంటున్నారు. ఆ వివాదాస్పద 40 ఎకరాల స్థలంలో పదెకరాల స్థలం తనదని బల్లగుద్ది చెప్తున్నారు. సరే తుఫ్రాన్‌పేటలో సర్వే నంబరు 89లోని పదెకరాల భూమి కాటసానిదే అనుకుందాం. మరి ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఆ భూమి వివరాలు ఉండాలిగా?. ఆయన సబ్మిట్ చేసిన ఎన్నికల అఫిడవిట్ లో ఆయన పేరు మీద కానీ, ఆయన భార్య పేరు మీద కానీ.. తుఫ్రాన్‌పేటలో సర్వే నంబరు 89 తో పదెకరాల భూమి ఉన్నట్టు వివరాలు లేవు. పలు సర్వే నెంబర్ల పేర్లతో తెలుగు రాష్ట్రాలలో ఉన్న భూమి వివరాలను పొందుపరిచిన ఆయన.. మరి ఈ పదెకరాల భూమి వివరాలను ఎందుకు పొందుపరచలేదు. భూమి కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయంటున్న ఆయన ఎన్నికల అఫిడవిట్ లో భూమి వివరాలను తెలియజేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అఫిడవిట్ లో ఆస్తులు, కేసులు ఇలా అన్నీ వివరంగా ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలు దాచి చట్టపరంగా పదవి కోల్పోయిన వారు కూడా పలువురు ఉన్నారు. ఇక ఇప్పుడు కాటసానికి కూడా చట్టపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూమి తనది అంటే అఫిడవిట్ లో ఎందుకు పొందుపరచలేదని అడుగుతారు. భూమి తనది కాదు అంటే బోర్డు ఎందుకు పాతావు అని అడుగుతారు. మొత్తానికి కాటసాని పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది.

అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ నిజంగా జరిగిందా?.. ఇవిగో ఆధారాలు!!

అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రధానంగా ఈ ఆరోపణలతోనే రాజధాని తరలింపు నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అసలు అమరావతిలో నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? నిజంగానే అమరావతి ఒక కులం గుప్పిట్లో ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014 లో అప్పటి అధికార పార్టీ టీడీపీ నేతలు రాజధాని అమరావతిని 29 గ్రామాల్లో ఏర్పాటు చేస్తారని ముందే తెలుసుకొని.. అధికార ప్రకటనకు ముందే రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి వేల ఎకరాల భూమి కొన్నారని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా.. ప్రభుత్వం సేకరించిన 33,771 ఎకరాల భూమిలో 15,000 ఎకరాలు పైగా భూమిని రైతులు అమ్ముకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. CRDA వెబ్ సైట్ లో ఎవరెవరి నుంచి ఎంతెంత భూమి సేకరించింది పూర్తీ వివరాలు ఉన్నాయి. 2015 కౌలు లిస్టును గమనిస్తే... 81 శాతం భూమి ఐదు ఎకరాల లోపు ఉన్నవారి చేతిలో ఉంది. 13 శాతం భూమి 5 నుండి 10 ఎకరాలు ఉన్నవారి చేతిలో ఉంది. 3 శాతం భూమి 10 నుండి 15 ఎకరాలు ఉన్నవారి చేతిలో ఉంది. 2.88 శాతం భూమి 15 ఎకరాలకు పైగా ఉన్నవారి చేతిలో ఉంది. 15 ఎకరాల కన్నా ఎక్కువగా పొలం ఉన్న భూయజమానులు సంఖ్య యాభై. వారి చేతిలో ఉన్న మొత్తం పొలం 973 ఎకరాలు. ఈ 973 ఎకరాలలో దేవుడి మాన్యం 447 ఎకరాలు. వక్ఫ్ బోర్డు భూమి 21 ఎకరాలు. అంటే బడా బాబుల వద్ద వందలు వేల ఎకరాలు ఉన్నాయనేది అసత్యమని ఈ లిస్ట్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే 15 ఎకరాలకు పైగా పొలం ఉన్నవారి పేర్లను గమనిస్తే ఆ లిస్ట్ లో అన్ని కులాల వారు ఉన్నారు. అంటే  973 ఎకరాలలో దేవుడి మాన్యం, వక్ఫ్ బోర్డు భూమి పోగా మిగిలిన ఆ కొద్ది భూమి కూడా ఒక్క కులం చేతిలో లేదనేది స్పష్టమవుతోంది. ఇక 2019 కౌలు లిస్టుని గమనిస్తే.. ప్లాట్లు అమ్ముకున్న వారికి కౌలు ఇవ్వరు. అందుకే 2019 కౌలు లిస్టులో రైతుల సంఖ్య 4564 మంది తక్కువగాను, మొత్తం పొలం విస్తీర్ణంలో 5083 ఎకరాలు తక్కువగాను ఉంది. అంటే గడచిన 4-5 సంవత్సరాలలో అమ్మకం జరిగింది 5083 ఎకరాలు మాత్రమే. అంటే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టు ప్రభుత్వం సేకరించిన 33,771 ఎకరాలలో 15,000 ఎకరాల అమ్మకం జరిగింది అనేది అసత్యం. దీనిబట్టి చూస్తే అమరావతి లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అన్న ఆరోపణల్లో నిజం లేదని అర్థమవుతోంది.

మోడీకి పోటీగా చాపకింద నీరులా ఎదుగుతున్న యువ నాయకుడు!!

రాజకీయ నాయకులు ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే వారి ప్రసంగం ఆకట్టుకునేవిధంగా ఉండాలి. ప్రసంగంతో ప్రజల్ని ఉత్తేజపరచాలి.. ఆలోచనలో పడేయాలి.. వారి వెంట నడిచేలా చేసుకోవాలి.. అలాంటి వారే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. బలమైన నాయకుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, ఎన్టీఆర్, కరుణానిధి వంటివారు ఆ కోవలోకే వస్తారు. వారి ప్రసంగం ప్రజల్ని ఉత్తేజ పరిచేది. వారి ప్రసంగం వినడం కోసం అప్పట్లో ప్రజలు కొన్ని కిలోమీటర్లు కూడా నడిచి వెళ్లేవారు. అయితే ఈ తరంలో ఆ స్థాయిలో ప్రసంగించే నేతలు కరువయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న అతి తక్కువ మంది నాయకుల్లో నరేంద్ర మోడీ ఒకరని చెప్పుకోవచ్చు. ఆయన ప్రసంగం ప్రజల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అసలు విపక్ష పార్టీల నేతల్లో ఆ స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకునే నేతలు లేకపోవడమే మోడీకి కసిసొచ్చిందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అయితే ఇప్పుడొక యువ నాయకుడు మోడీకి పోటీగా చాపకింద నీరులా బలమైన శక్తిగా ఎదుగుతున్నాడని అంటున్నారు. ఆ యువ నాయకుడు ఎవరో కాదు కన్నయ్య కుమార్. గతంలో ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా పనిచేసిన కన్నయ్య కుమార్... ఏఐఎస్ఎఫ్ జాతీయ నేతగా, సిపిఐ శక్తివంతమైన నేతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. విద్యార్థి సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై పోరాడటంలో కన్నయ్య ముందుంటాడు. ఎందర్నో ఆ పోరాటంలో నడిచేలా చేస్తాడు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం నుండి పౌరసత్వ సవరణ బిల్లు వరకు ఇలా ఎన్నో అంశాలపై కన్నయ్య పోరాటం చేసాడు, చేస్తున్నాడు. కన్నయ్య ప్రభావం ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తోంది. ఆయన ప్రసంగం వినడానికి యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన మాటలతో యువతలో కొత్త ఉత్తేజం, ఉత్సాహం ఉప్పొంగుతున్నాయి. ఇక ఇటీవల ఆయన ఆజాదీ నినాదం యువతలోకి బలంగా వెళ్లింది. ఆయన గొంతు వినిపిస్తే చాలు వేల గొంతులు జత కలుస్తున్నాయి. మొత్తానికి ఈ 32 ఏళ్ళ దళిత యువ నాయకుడు.. తన ప్రసంగాలతో యువతని కదిలిస్తూ బలమైన శక్తిగా ఎదుగుతున్నాడు. అతని ప్రస్థానం ఇలాగే కొనసాగితే.. కాన్షీరాం, మాయావతి వంటి శక్తివంతమైన దళిత నాయకుల సరసన చేరినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడు రాజధానుల ప్రకటన వెనుక బీజేపీ.. జగన్ తో కలిసి మాస్టర్ ప్లాన్!!

ఏపీలో ఏం జరుగుతోందో.. అసలేం జరగబోతోందో.. అర్థంగాక టీడీపీ కార్యకర్తలు తలలుపట్టుకుంటున్నారు. ఏపీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులకి.. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటా అని టీడీపీ కార్యకర్తలు కలవరపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలను ఎక్కువగా కలవరపెడుతోన్న అంశం మూడు రాజధానులు. అసెంబ్లీ సాక్షిగా ఏపీకి మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన ప్రకటన.. చంద్రబాబుకి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. జగన్ ప్రకటనని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీకి నష్టం. స్వాగతిస్తే పరువుప్రతిష్ఠలకు నష్టం. ఇలా ఎటుచూసినా చంద్రబాబు ఇరుకున పడ్డారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కలవరపడుతున్నారు. అయితే జగన్ మూడు రాజధానుల ప్రకటన వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సపోర్ట్ తోనే ఏపీలో టీడీపీని దెబ్బకొట్టడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల తరువాత వైసీపీ, బీజేపీల మధ్య దూరం పెరిగిందని.. అందుకే ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్తే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మీడియాలో తెగ వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అంటున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడు జగన్ అమిత్ షాని కలిశారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ సమయంలో మూడు రాజధానుల అంశం గురించి చర్చించారట. అమిత్ షా అంగీకారంతోనే జగన్ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. దీనికి తెరవెనుక విజయసాయి రెడ్డి చక్రం తిప్పారని తెలుస్తోంది. అందుకే మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ నుండి అంతగా వ్యతిరేకత వ్యక్తమవట్లేదని అంటున్నారు. నిజానికి అమరావతి భూమి పూజకి ప్రధాని మోడీ వచ్చారు. పవిత్ర మట్టిని, గంగ జలాన్ని ఇచ్చి.. అమరావతిని ఢిల్లీ కంటే పెద్ద నగరంగా తీర్చిదిద్దటంలో పూర్తీ సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోడీ మాట ఇచ్చారు. ఇప్పుడూ ప్రధానిగానే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మాటని మట్టిలో కలిపేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ బీజేపీ సపోర్ట్ లేకుండా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  మూడు రాజధానుల నిర్ణయం వల్ల బీజేపీకి ఒరిగేదేముంది అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ప్రభ తగ్గుతోంది. పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. జార్ఖండ్ లో కూడా బీజేపీకి చేదు ఫలితాలు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఉత్తరాదిలో మొదలైన వ్యతిరేకతను దక్షిణాదితో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. దక్షిణాదిలో బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగానే ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో జగన్ ని పావుగా వాడుకొని పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. జగన్ మెడకి బెయిల్ కత్తిని వేలాడదీసి గ్రిప్ లోకి తెచ్చుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొద్దిరోజులుగా జగన్ ని జైలుకి పంపి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోందని ప్రచారం జరిగింది. కానీ బీజేపీ మాత్రం.. జగన్ జైలు కి వెళ్లడం కంటే.. బయట ఉంటేనే తమ పార్టీకి ప్రయోజనమని భావిస్తోందట. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారిలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. ఒకవేళ జగన్ జైలుకి వెళ్లి.. వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే.. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారు కానీ బీజేపీ వైపు చూడరు. అంటే ఏపీలో కాంగ్రెస్ కి బీజేపీనే జీవం పోసినట్టు అవుతుంది. అసలు కాంగ్రెస్ బలపడటం బీజేపీకి ఏమాత్రం నచ్చదు. అందుకే జగన్ ని తమ గ్రిప్ లో పెట్టుకొని గేమ్ ఆడాలని చూస్తోందట. ఏపీలో టీడీపీ ప్లేస్ ని భర్తీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. ఈ మూడు రాజధానుల ప్రకటనతో టీడీపీ ఇరుకున పడింది. వ్యతిరేకించినా నష్టమే, సమర్ధించినా నష్టమే. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ మనుగడకే ప్రమాదం వచ్చి పడింది. అదే బీజేపీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. ఈ మూడు రాజధానుల దెబ్బతో మరింతమంది టీడీపీ నుండి బీజేపీకి క్యూ కడతారు. ఓ రకంగా ఏపీలో వైసీపీకి ప్రత్యమ్నాయ శక్తిగా ఎదిగే అవకాశముంది. జగన్ మెడ మీద బెయిల్ కత్తి వేలాడుతుండటంతో.. ఆయన బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్నారని అంటున్నారు. ఓ రకంగా బీజేపీ అజ్ఞాత మిత్రుడిగా మారిపోయి సాయం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ మూడు రాజధానుల ప్రకటనతో టీడీపీ పునాదులను కలిదించి ఆ ప్లేస్ లోకి రావాలని బీజేపీ చూస్తోందని.. టీడీపీని లేకుండా చేయడం జగన్ కి ఇష్టం, జైలుకి వెళ్లడం కష్టం కాబట్టి పూర్తిగా సహకరిస్తున్నారని అంటున్నారు.

ఏపీకి మూడు రాజధానులు... జగన్ వ్యూహంలో చిక్కి విలవిల్లాడుతున్న చంద్రబాబు!!

ప్రస్తుతం ఏపీలో మూడు ముక్కలాట జరుగుతోంది. నిజంగానే రాజధాని మూడు ముక్కలు కానుందా అని ఏపీలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. అసలు ఈ రాజధాని సెగ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉంది. వైఎస్ జగన్ సీఎం అయితే రాజధానిని అమరావతి నుండి మారుస్తారని టీడీపీ ఎన్నికల ముందే ఆరోపించింది. కానీ వైసీపీ మాత్రం అలాంటిదేం లేదని కొట్టిపారేసింది. తీరా ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చాక.. కొద్దిరోజులకే రాజధాని గురించి ట్విస్ట్ లు ఇవ్వడం మొదలుపెట్టింది. మొదటగా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజధాని సెగకు ఆజ్యం పోశాయి. రాజధానికి అమరావతి సరైన ప్లేస్ కాదని, స్మశానంతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజధానిపై ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆ తరువాత కూడా పలువురు వైసీపీ నేతలు అమరావతి గురించి అటువంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో రాజధాని ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇక తాజాగా సీఎం జగన్ కూడా అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు తగ్గట్టే జీఎన్ రావు కమిటీ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో మూడు చోట్ల రాజధాని ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇక అమరావతి ప్రాంతంలో అయితే తీవ్ర ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే విశ్లేషకులు మాత్రం మూడు చోట్ల రాజధాని అనేది అసాధ్యమని.. ఈ మూడు రాజధానుల వ్యాఖ్యల వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ ఉందని అభిప్రాయపడుతున్నారు. జగన్ టీడీపీని, చంద్రబాబుని దెబ్బకొట్టి.. ఏపీలో అసలు టీడీపీ మనుగడే లేకుండా చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దానికోసం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫార్ములాని ఫాలో అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా చంద్రబాబును, టీడీపీని ఎంత ఇరుకున పెట్టారో అందరికీ తెలుసు. జై సమైక్యాంధ్ర అంటే తెలంగాణలో పార్టీకి నష్టం, జై తెలంగాణ అంటే ఆంధ్రాలో పార్టీకి నష్టం అనే విధంగా ఎత్తుగడలు వేశారు. టీడీపీ అంటే తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేసేలా ప్రజల్లో సెంటిమెంట్‌ను రగిల్చారు. కేసీఆర్ దెబ్బకి ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. ఇప్పుడదే ఫార్మూలాను జగన్‌ కూడా అప్లై చేయనున్నారని తెలుస్తోంది. జగన్ మూడు రాజధానుల ప్రకటన చేస్తూ… అమరావతిలో రాజధాని ఉంటూనే, కర్నూల్‌తో పాటు విశాఖను కూడా రాజధానిగా చేయబోతున్నాం అంటూ ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిణామం ఎదురవుతోంది. విశాఖకు రాజధాని వద్దు అంటే.. ఉత్తరాంధ్రలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కర్నూల్‌కు హైకోర్టు వద్దని అంటే రాయలసీమలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంటే.. జగన్ ఒక్క ప్రకటనతో రెండు ప్రాంతాల్లో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితిని సృష్టించారు. ఓ రకంగా ఇది టీడీపీ మనుగడకే ప్రమాదం. పోనీ ఈ విషయాన్ని గుర్తించి..  జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించినా కూడా టీడీపీకే నష్టం. జగన్ నిర్ణయం కరెక్ట్ అయినప్పుడు మరి మీరు అప్పుడు రాజధాని అమరావతిలో ఒక్క చోటే ఎందుకు పెట్టారని ప్రజలు ప్రశ్నిస్తారు? ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముంది. ఇక.. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమలో టీడీపీ మీద వ్యతిరేకత రాదేమో కానీ.. ఆ ప్రాంతాల ప్రజలు మాత్రం జగన్ కే జై కొడతారు. ఎందుకంటే నిర్ణయం జగన్ దే కదా. ఇలా ప్రాంతీయ విభేదాలు, సెంటిమెంట్ తో చంద్రబాబుని ఇరుకున పెడుతున్నారన్నమాట. మొత్తానికి జగన్.. చంద్రబాబుని, టీడీపీని దెబ్బకొట్టడానికి.. కేసీఆర్ వాడిన 'ముందు నుయ్యి.. వెనక గొయ్యి' ఫార్ములాని వాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ మూడు రాజధానుల వ్యాఖ్యల వెనుక కొందరు మరోకోణం కూడా ఉందంటున్నారు. జగన్ వైసీపీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించాలనే ఈ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. రాయలసీమలో వైసీపీకి మంచిపట్టుంది. ఇప్పుడు కర్నూల్ లో హైకోర్టు ప్రకటనతో.. రాయలసీమలో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశముంది. ఉత్తరాంధ్రలో వైసీపీ అంతగా బలంగా లేదు. ఇప్పుడు విశాఖలో రాజధాని ప్రకటనతో.. ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభ పెరిగే అవకాశముంది. ఇక అమరావతిలో ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను అడ్డుకోవడానికి కుల రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. అమరావతిలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు వందలు, వేల ఎకరాల్లో భూములు కొన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. నిజానికి వ్యాపారాలు చేయడం, స్థలాలు కొనడంలో ఎప్పుడూ ఒకటిరెండు కులాలే ముందుంటాయి. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టినా వారే ముందుంటారు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి కూడా స్థలాలు కొని వ్యాపారాలు చేస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ వైసీపీ మాత్రం ఒక్క కులానిదే రాజధాని అని ఆరోపిస్తోంది. వైసీపీ ఆరోపిస్తున్నట్టు.. 20 శాతం స్థలం ఒక కులం చేతిలో ఉందనుకున్నాం.. మరి మిగతా 80 శాతం స్థలం ఎవరి చేతిలో ఉంది?. అది ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే అసలు ఆ ఆలోచనే రాకుండా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దానిద్వారా మిగతా కులాలకు దగ్గరవ్వాలని చూస్తోంది. అంటే మూడు రాజధానుల ప్రకటనతో మూడు ప్రాంతాల్లోనూ టీడీపీని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండు చోట్ల ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం, ఒక చోట కుల రాజకీయం చేయడం ద్వారా అసలు టీడీపీ మనుగడకే ప్రమాదం తీసుకొస్తున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని కథ ఇంతటితో ముగియలేదు. మూడు చోట్ల రాజధాని ఏర్పాటు చేయడం అంత సులభం కాదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టంలో రాజధాని ఎంపిక అధికారం మొదటి సీఎంకి ఉంటుందని స్పష్టంగా ఉంది. విభజన తరువాత ఏపీ మొదటి సీఎం గా చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అసెంబ్లీ తీర్మానం జరిగింది. కేంద్రం అంగీకారం తెలిపింది. ప్రధాని అమరావతిలో శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అక్కడ పలు నిర్మాణాలు కూడా జరిగాయి. మరిప్పుడు మూడు చోట్ల రాజధాని అంటే రాజ్యాంగపరంగా చిక్కులు వచ్చే అవకాశముంది. కేంద్రం కూడా అంగీకరించకపోవచ్చు. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్పు అంటే రాష్ట్ర మనుగడకే ప్రమాదం అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు. అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్ భవన్ ఇలా వేరు వేరు చోట్ల అంటే పాలకుల నుండి ప్రభుత్వ అధికారుల వరకు అందరికి ఇబ్బందే. దీనిబట్టి ఆలోచిస్తే మూడు రాజధానుల అంశం కేవలం ప్రకటనకు పరిమితమైనా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ మూడు రాజధానులు ఆచరణ సాధ్యం కాకపోయినా.. జగన్ చంద్రబాబుని ఇరుకున పెట్టగలరని అంటున్నారు. ఎందుకంటే మూడు రాజధానుల కోసం నేను కృషి చేశాను.. కానీ చంద్రబాబే వ్యతిరేకించి ఆచరణ సాధ్యం కాకుండా చిక్కులు సృష్టించారని చెప్పే అవకాశముంది. ఇలా ఏ కోణంలో చూసినా జగన్.. చంద్రబాబుని పక్కా ప్లాన్ ప్రకారం ఇరుకున పెట్టారని విశ్లేషకులు అంటున్నారు. మరి దీని నుండి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాలి.  

మండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు..! కేంద్రం ఒప్పుకుంటుందా?

శాసనమండలి రద్దు దిశగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. 50శాతం ఓట్లు, 151మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చినా, శాసనమండలిలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం బలమే ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జగన్ సర్కారు ప్రవేశపెట్టిన బిల్లులను శాసనమండలిలో చుక్కెదురు కావడం... రెండు బిల్లులను తిప్పిపంపుతూ మండలి తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు... అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ల ఏర్పాటు బిల్లుల ఆమోదం మండలి కారణంగా ఆగిపోవడంతో ఏకంగా శాసన మండలినే రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బిల్లులను మండలి ఆమోదించకుండా తిప్పిపంపడంతో మరోసారి శాసససభలో ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, రెండోసారి కూడా మండలి తిరస్కరించి పంపితే అప్పుడు శాసనసభ నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లులను మండలి ఆమోదించకుండా తిప్పిపంపడాన్ని జగన్ సర్కారు అత్యంత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో, ఏకంగా మండలినే రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  58మంది సభ్యులున్న ఏపీ శాసనమండలిలో టీడీపీకి 26మంది మెంబర్స్ ఉండటంతో ప్రతిపక్షానిదే పైచేయిగా ఉంది. అధికార వైసీపీకి కేవలం 9మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దాంతో, మండలిలో అనేక విషయాల్లో ప్రతిపక్ష తెలుగుదేశానికే పైచేయిగా ఉంటుంది. శాసనసభలో వైసీపీ సభ్యులు.... టీడీపీని ఆడుకున్నట్లే.... మండలిలో అధికారపక్షాన్ని... తెలుగుదేశం వాళ్లు ఆటాడుకుంటున్నారు. దాంతో, ముఖ్యమంత్రి, మంత్రులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక, నారా లోకేష్ మండలిలో ఉండటం కూడా సీఎం జగన్ కు ఇబ్బంది మారిందనే మాట వినిపిస్తోంది. నారా లోకేష్ కు ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉండటంతో... అన్నేళ్లు మండలిలో అతడిని చూడటం జగన్ కు ఇష్టంలేదని, అందుకే రద్దు దిశగా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే, శాసనమండలిని రద్దు చేయాలంటే లోక్ సభ, రాజ్యసభల్లో చర్చ జరిపి తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్రాన్ని ఒప్పించుకుంటే ఇది ఈజీగా జరిగిపోయే పనే. అయితే, ప్రస్తుతమున్న మోడీ ప్రభుత్వం అందుకు ఒప్పుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు... ఎన్టీఆర్ కూడా శాసనమండలి రద్దు చేశారు. అయితే, ఆనాడు కాంగ్రెస్ నేతలంతా రాజీవ్ కు మొరపెట్టుకున్నా... ఎన్టీఆర్ సూచన మేరకు మండలిని రద్దు చేశారు. ఇక, ఇప్పుడు కూడా ఆర్ధిక భారం పేరుతో మండలిని రద్దు చేయాలంటూ కేంద్రాన్ని కోరితే జరిగే అవకాశముందంటున్నారు.

వైజాగ్ లో అప్పుడే కేపిటల్ పనులు ప్రారంభం... ఏప్రిల్ నుంచే కార్యకలాపాలు...!

రాజధానిపై జగన్ సర్కారు నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇంకా రానే లేదు... కానీ, అసెంబ్లీ వేదికగా ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ ముందే ప్రభుత్వ నిర్ణయాన్ని దాదాపు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... అప్పుడే పనులు కూడా ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టుకోవచ్చన్న జగన్....  అక్కడ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలకు కావాల్సిన పనులను    ప్రారంభించేశారు. అయితే, ప్రభుత్వ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం మేరకు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల కోసం పరదేశిపురం ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ కోసం విశాఖ పరిసరాల్లో దాదాపు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా గుర్తించారు.  అంతేకాదు ఇప్పటికిప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలను విశాఖ నుంచి జరిపేందుకు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన రెండున్నర లక్షల చదరపు అడుగుల క్యాంపస్ ను వినియోగించుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సకల సౌకర్యాలతో అత్యాధునికంగా నిర్మించిన ఈ భవనాలను ఇమిడియట్ యూజ్ కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే, ఆంధ్రా యూనివర్శిటీలో ఖాళీగా ఉన్న భవనాలను ప్రభుత్వం గుర్తించింది. అవసరమైతే ఈ బిల్డింగ్స్ ను కూడా అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల కోసం వినియోగించుకోవాలని చూస్తోంది. ఇక, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ నివాసం కోసం భీమిలి దగ్గర సముద్ర తీరంలో మూడు ఎకరాల భూమిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే, భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించనుండటంతో ఎయిర్ కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది.  మూడే మూడు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2020 ఏప్రిల్ లోపే మొత్తం ఏర్పాట్లు పూర్తిచేసి అధికార యంత్రాంగాన్ని తరలించనుంది. ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా పర్ ఫెక్ట్ గా సాగేందుకు పార్టీలో ఐదుగురు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక, రాజ్ భవన్ కోసం కూడా అనువైన ప్రాంతాన్ని గుర్తించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

భర్త తీరు వల్లే మంత్రి పదవి పోగొట్టుకున్న గొంగిడి సునీత.. అయినా మారని తీరు!

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీత గెలిచారు. ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి మాత్రం పెత్తనమంతా తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మహేంద్రరెడ్డి షాడో ఎమ్మెల్యేగా మారటంతో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. పాలనా వ్యవహారాల్లో తలదూర్చడం ఆయనకు బాగా అలవాటు. రియల్ సెటిల్ మెంట్లు చేస్తారని ఇక్కడి ప్రజలలో బలంగా టాక్ వినిపిస్తోంది.  నిజానికి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీ కావడం, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం గుర్తించిన కేసీఆర్ 2014 లో ఆలేరు ఎమ్మెల్యే టికెట్ సునీతకి ఇచ్చారు. కేసీఆర్ ప్రభంజనంలో సునాయాసంగా గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు సునీత. ఇక అక్కడి నుంచి ఆమె భర్త మహేందర్ రెడ్డి దూకుడు పెంచారు. అధికారుల పై పెత్తనం చెలాయిస్తున్నారు. వారిని తన కనుసన్నల్లోనే ఉండేటట్లు చేస్తున్నారు గొంగిడి మహేందర్ రెడ్డి.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి టెంపుల్ విస్తరణ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపించింది. ఫలితంగా యాదాద్రి చుట్టు పక్కల ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. లక్షల రూపాయల వున్న భూములు కాస్తా ఇప్పుడు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయి. దీంతో ఇక్కడ రియల్ వ్యాపారాలూ చెయ్యాలంటే ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేందర్ రెడ్డిని కలవాల్సిందే, ఆయన అనుమతి, వ్యాపారంలో వాటా లేకుండా ఇక్కడ రియల్ వ్యాపారం జరిగే పరిస్థితి లేదు. సెటిల్ మెంట్ లు కూడా బాగానే చేస్తారనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. షాడో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి సెటిల్ మెంట్ల గురించి బాధితులు ఆయన పై అనేకసార్లు ఆలేరు నియోజకవర్గం లోనే లోకల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ఆ ఫిర్యాదుల గురించి పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇక 2018 లో ఆలేరు నుంచి మరోసారి గొంగిడి సునీత ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. ఇటీవల ఓ ఐసీడీఎస్ అధికారిణి బాల్య వివాహం అడ్డుకున్నందుకు షాడో ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి ఆమెను బెదిరించాడు. తన విధులకు ఆటంకం కలిగించాడని ఏకంగా ఎమ్మెల్యే భర్తపైనే ఐసిడిఎస్ ఆఫీసర్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. అంటే ఆయన పెత్తనం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అధికారులను పోలీసులను తన గుప్పిట్లో పెట్టుకుని ఎమ్మెల్యే భర్త చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ప్రజలలో బాగానే వినిపిస్తున్నాయి. అయితే గొంగిడి మహేందర్ రెడ్డి ప్రవర్తించే తీరు చూసి ఎమ్మెల్యే సునీతనా, మహేందర్ రెడ్డి నా అని కొందరు అనుకుంటున్నారు. ఎమ్మెల్యే షాడో అని మరికొందరంటున్నారు. మహేందర్ రెడ్డి ప్రవర్తనతో ఎమ్మెల్యే సునీతకు చెడ్డ పేరు వస్తుందని నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.2018 ఎన్నికల ప్రచారంలో సునీతను గెలిపిస్తే ఈ సారి పెద్ద పదవి ఇస్తానని గులాబీ బాస్ కేసీఆర్ ఇక్కడి ప్రజలకూ చెప్పారు. అయినా ఎమ్మెల్యే భర్త దూకుడు చూసి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రభుత్వ విప్ తో సరిపెట్టారని ఆలేరు నియోజక వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబే టార్గెట్... వైసీపీ వ్యూహమిదే? 

ఒక్కొక్కడ్ని కాదు షేర్ ఖాన్... వంద మందిని ఒకేసారి పంపించనే సినీ డైలాగ్ మాదిరిగా... టీడీపీ చంద్రబాబు కూడా ఏపీ అసెంబ్లీలో పంచ్ డైలాగ్ లు పేల్చారు. యాభై మంది కాదు... నూటా యాభై మంది ఒకేసారి వచ్చినా ఎదుర్కొగల శక్తి సామర్ధ్యాలు... సమాధానం చెప్పగల దమ్ము తనకుందంటూ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఈ మాట ఎందుకన్నారంటే... ఏపీ శాసనసభలో చంద్రబాబు టార్గెట్ గా అధికారపక్షం గేమ్ ఆడుతోంది. చంద్రబాబు మానసిక స్థైర్యాన్ని మనో బలాన్ని దెబ్బతీసేందుకు... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకొని... కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే వరకూ అందరూ బాబే టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. సందర్భమైనా, అసందర్భమైనా ఏ అంశంలోనైనా చంద్రబాబును కార్నర్ చేస్తూ వ్యక్తిగత దూషణులకు దిగుతున్నారు. దాంతో, చంద్రబాబు ఎంతగా మనో నిబ్బరం ప్రదర్శించినా... వైసీపీ ఎమ్మెల్యేల మాటల తాలుకూ ప్రభావం టీడీపీ అధినేత ముఖంలో కనిపిస్తూనే ఉంటుంది. ప్రజల కోసమే అవమానాలన్నీ భరిస్తున్నానని చంద్రబాబు అంటుంటారు. అసెంబ్లీలో సీన్ చూస్తే నిజమే అనిపిస్తుంది. చంద్రబాబు...లేదంటే లోకేష్‌. అధికార వైసీపీ టార్గెట్ ఈ ఇద్దరే. అందుకే, టాపిక్‌ ఏదైనా, ఇద్దర్నీ టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ మొదలుకొని... పలువురు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు... చంద్రబాబుపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు. కొడాలి నాని, అనిల్ కుమార్, బొత్స, బుగ్గన, పేర్ని నాని, కన్నబాబు తదితర మంత్రులు... బాబు అండ్ లోకేషే టార్గెట్ గా మాటల తూటాలు పేల్చుతున్నారు. చంద్రబాబును తిట్టడంలో పోటీ పెట్టినట్టుగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరుగుతున్నారు. అయితే, బాబుని ఈవిధంగా టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. టీడీపీకి చంద్రబాబే బలం. ఆ బలాన్నే దెబ్బకొడితే మొత్తం పార్టీనే దెబ్బతీయొచ్చన్న వ్యూహంతోనే బాబుపై పర్సనల్ అటాక్ కి దిగుతున్నారని అంటున్నారు. బాబునే సైలెంట్ చేస్తే, ఇక మిగతా నేతలందరూ నోరు మూసుకుంటారనే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఇక, బాబు వయసు పైబడటంతో, భవిష్యత్ నాయకుడిగా భావిస్తున్న లోకేష్ ను టార్గెట్ చేయడం ద్వారా, అతని ఆత్మస్థైర్యం దెబ్బతీసి టీడీపీకి భవిష్యత్తే లేదనే చర్చను తెలుగుదేశం కేడర్ లోకి, అలాగే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే వైసీపీ వ్యూహమని చెబుతున్నారు. మొత్తానికి బాబు అండ్ లోకేష్ ను టార్గెట్ చేయడం వెనుక... తెలుగుదేశంలో సంక్షోభం తేవడమే లక్ష్యమంటున్నారు. అయితే, గతంలో పదేళ్లపాటు గడ్డుపరిస్థితులను ఎదుర్కొన్నా తన పోరాట పటిమతో 2014లో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు... ఒంటరి పోరాటంచేసైనాసరే ఈ క్లిష్ట పరిస్థితి నుంచి తెలుగుదేశాన్ని గట్టెక్కిస్తారని టీడీపీ కేడర్ భావిస్తోంది. ఇక, చంద్రబాబు కూడా తనపై జరుగుతోన్న పర్సనల్ అటాక్ ను... ప్రజల్లో సానుభూతిగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి, భవిష్యత్తులో ఏం జరగనుందో చూడాలి.

జనసేనలో అసలేం జరుగుతోంది? రాపాక, రాజు ఆరోపణలు నిజమేనా?

జనసేనలో కొన్నిరోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, జన సైనికులను గందరగోళం చేస్తున్నాయి. పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ పార్టీ లైన్‌కు విరుద్దంగా మాట్లాడటం క్యాడర్‌ను‌ కన్‌ఫ్యూజ్ చేస్తుంటే, పార్టీ సిద్దాంతకర్తలు, కీలక నాయకులు, వరుసగా రాజీనామాలు సమర్పిస్తూ బయటకు వెళ్లిపోతుండటం మరింత కలకలం రేపుతోంది. ఇప్పటికే, రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, అద్దేపల్లి శ్రీధర్, పార్టీ కోశాధికారి, మెగా ఫ్యామిలీకి బంధువు రాఘవయ్య, శివశంకర్‌లు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తాజాగా పార్టీ సిద్దాంతకర్త, వ్యూహకర్త, పవన్‌ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజు రవితేజ, తాజాగా జనసేనకు రాజీనామా సమర్పించి, పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేయడం మాత్రం సంచలనంగా మారింది. అయితే, జనసేన వ్యవస్థాపనలో రాజు రవితేజ కీలకంగా వ్యవహరించారు. జనసేన మొదటి జనరల్‌ సెక్రటరీ కూడా ఈయనే. పార్టీ రాజ్యాంగం రచన చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడు. పవన్‌ సిద్దాంతాల సమాహారం ఇజం పుస్తకం రచయిత. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ అంతరంగాన్ని ఎరిగిన వ్యక్తి. అలాంటి రాజు రవితేజ జనసేనకు రాజీనామా చేశారు. జనసేన స్థాపన టైంలో కులాలను ఏకం చేద్దాం, మతాలకు అతీతంగా నడుద్దామంటూ ప్రారంభమైన పార్టీ ప్రస్థానం, ఇప్పుడు దానికి విరుద్దంగా వెళుతోందని, అందుకే తాను పార్టీ నుంచి బయటికి వచ్చానని రవితేజ ప్రకటించారు. అంతేకాదు బీజేపీకి దగ్గరయ్యేందుకు పవన్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దాడులు, విద్వేష ప్రసంగాలు చేసిన పవన్... ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయారని, పార్టీ మూల సిద్దాంతాలకు విరుద్దంగా, కులమతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని  రాజు రవితేజ చెబుతున్నారు. రాజు రవితేజ రాజీనామా వ్యవహారం అటుంచితే, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ సైతం, పార్టీ లైన్‌కు విరుద్దంగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్‌ మీడియం వద్దని పవన్ కల్యాణ్‌ అంటే, కావాలని ఏకంగా అసెంబ్లీలోనే అన్నారు రాపాక. అనవసరమైన కారణాలతో పవన్ దీక్షలు, ధర్నాలు చేస్తున్నారని అన్నారు. పవన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకినాడ రైతు సౌభాగ్య దీక్షకు సైతం వెళ్లలేదు రాపాక. అంతేకాదు, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాపాక. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలంతా తాము పార్టీని వీడటానికి మనోహరే కారణమని చెబుతున్నారని అన్నారు. పార్టీకి సంబంధించిన అన్ని అంశాలపై తమ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే సంప్రదించుకుంటారని, మరెవరితోనూ మాట్లాడరని రాపాక తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీనామాల నుంచి రాపాక వరప్రసాద్ వ్యాఖ్యల దాకా, జనసేనలో జరుగుతున్న పరిణామాలు, జనసైనికులను గందరగోళం చేస్తున్నాయి. పార్టీలో ఏం జరుగుతుందో ఏమో, ఎవరెప్పుడు పార్టీ మారతారోనన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. పవన్ కల్యాణ్‌ కుల, మతాల గురించి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాజు రవితేజ ఆరోపిస్తే, ఇటు పవన్‌పై పెద్దగా విమర్శలు చేయకపోయినా, పార్టీలో నాదెండ్ల పెత్తనం పెరగడమే అశాంతికి దారి తీస్తోందని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వ్యాఖ్యానించడం, రెండు అంశాలను స్పష్టం చేస్తోంది. అది పవన్‌ కల్యాణ్‌లో మార్పు, పార్టీలో నాదెండ్ల మనోహర్‌ వ్యవహారం. మరి, నిజంగానే, నాదెండ్ల మనోహర్‌ పెత్తనంపైనా నేతలు గుర్రుగా ఉన్నారా?. అలాగే, పవన్‌లో మార్పొచ్చిందా...వస్తే మార్పు మంచికేనని పవన్‌ చెబుతారా....లేదంటే ఈ కన్‌ఫ్యూజ్‌నే కంటిన్యూ చేస్తారో చూడాలి.

రాజ్యసభలో విజయసాయిరెడ్డికి చుక్కెదురు.. పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నించి అబాసుపాలయ్యారు

ఏపిలో టిడిపిని ఏదో ఒక విధంగా బోనెక్కించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెగ ఆరాటపడుతున్నారు. ఈ వైఖరి శృతిమించి వారికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవాలి. తాజా విషయం లోకి వస్తే ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్న సంధించారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా గత కాంట్రాక్టర్ కు రూ.2,343 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు జరిగినట్టుగా తెలిసిందన్నారు. పోలవరం హైడల్ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా రూ.787 కోట్ల రూపాయలను నవయుగ కంపెనీకి చెల్లించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఈ అంశాలు నిజమైతే సంబంధిత వివరాలివ్వాలని విజయసాయిరెడ్డి కోరారు.  తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అంటారే విజయసాయిరెడ్డి విషయం లోనూ ఇదే జరిగింది. ఆయన ఆశించింది ఒకటైతే సంబంధిత మంత్రి ఇచ్చిన వివరణ మరో రకంగా ఉంది. విజయసాయిరెడ్డి ప్రశ్నపై రాజ్యసభలో జలశక్తి శాఖ మంత్రి రతన్ లాల్ కఠారియా బదులిచ్చారు. కేంద్ర జల సంఘానికి ఏపీ ప్రభుత్వం నుంచి అందిన తాజా సమాచారాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో 2,346 కోట్ల 85 లక్షల రూపాయల అదనపు చెల్లింపులు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు 787 రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లుగా కూడా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే 2019 నవంబర్ 13 వ తేదీ న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ పంపిందని కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియా చెప్పుకొచ్చారు. నిపుణుల కమిటీ అభిప్రాయం కేవలం ప్రాథమిక నిర్థారణ మాత్రమేనని నిధుల విడుదలలో కాని వ్యయంలో కాని ఎటువంటి నిబంధనల ఉల్లంఘింపు జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో పేర్కొన్నదని కేంద్ర మంత్రి చదివి వినిపించారు.  దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కూడా కాంపిటెంట్ అథారిటీ అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని కూడా రతన్ లాల్ కఠారియా స్పష్టం చేశారు. ఈ అంశాల పై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దర్యాప్తు కూడా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో అదనపు చెల్లింపులు గురించి కేంద్రమంత సీరియస్ గా లేదని కేంద్ర మంత్రి సమాధానం ద్వారా విజయసాయిరెడ్డికి బోధపడింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయమూ ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని రతన్ లాల్ కటారియా విస్పష్టంగా పేర్కొనడంతో సభలో ఉన్నవారు సైతం ఆశ్చర్యపోయారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అదనపు చెల్లింపుల గురించి ప్రస్తావించారేగానీ ఆ ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వమే సదరు లేఖలో పేర్కొన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు బయటపెట్టారు. ఈ అంశాన్ని టిడిపి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు సదరు లేఖను తెప్పించుకుని చూసి ఆశ్చర్యపోయారు. ఇదండీ ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న బూమరాంగైన విచిత్ర సన్నివేశం.

కొత్తవారికి స్వాగతం.. పాతవారికి న్యాయం.. జగన్ రాజకీయం అమోఘం

కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుక పోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటిది కృష్ణాజిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. నిజానికి రాజకీయ చైతన్యానికి మారుపేరు కృష్ణా జిల్లా అని అంటూ ఉంటారు. కానీ అక్కడ రాజకీయంగా ఎప్పుడూ ఏదో ఒక కలకలం జరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు గన్నవరం నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేశారు. ఆయనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి వీరిద్దరూ ఒకనాడు మంచి స్నేహితులు అయినప్పటికీ రాజకీయాల్లో ఇరువురి మధ్య వైరం పెరిగింది. వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన గుడివాడ ఎమ్మెల్యే పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చొరవ చూపడంతో ఎట్టకేలకు వీరిరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ మోహన్ టిడిపికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన వాట్సప్ లో పంపించిన లేఖ ఆ తర్వాత చేసిన వ్యతిరేక వ్యాఖ్యల పై టిడిపి హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ తన పై టిడిపి సస్పెండ్ వేటు వేయడానికి ముందే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారని తెలుసుకున్న గన్నవరం పార్టీ శ్రేణులు యార్లగడ్డ వెంకట్రావు నివాసం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వెంకటరావుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి బాలశౌరిలు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయనను జగన్ తో కూడా మాట్లాడించారు. వంశీని పార్టీలో చేర్చుకునేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ యార్లగడ్డ వెంకట్రావును వదులుకునేందుకు మాత్రం ససేమిరా ఇష్టపడలేదు. ప్రస్తుతానికి వంశీ శాసన సభలో తటస్థ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు. అవసరమైనపుడు ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గన్నవరం నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలా లేదా అనేది నిర్ణయం తీసుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది. ఇదిలా వుంటే జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తవారొచ్చినా పాతవారిని వదులుకోకూడదు అనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానంగా కనిపిస్తుంది. తను ఇచ్చిన మాట ప్రకారం యార్లగడ్డ వెంకట్రావుని వెంటనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా జగన్ నియమించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఘన చరిత్రే ఉంది. ఇలాంటి బ్యాంకు చైర్మన్ గా నియామకం కావడం వెంకట్రావు కూడా సంతృప్తినిచ్చింది. ఆయనకు పదవి ఇవ్వడంతో పాటు వల్లభనేని వంశీకి కూడా ఎలాంటి తలనొప్పి లేకుండా జగన్ లైన్ క్లియర్ చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారు. అలాగే గన్నవరం నియోజక వర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న యార్లగడ్డ వెంకట్రావు కూడా న్యాయం చేశారని వారు చెప్పుకుంటున్నారు. ఇక పెడన లోనూ ఇదే విధానాన్ని సీఎం జగన్ అనుసరించారు. ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకు పార్టీ టిక్కెట్ ని ఆశించి భంగపడిన ఉప్పాల రాంప్రసాద్ కి కూడా సంతృప్తి కలిగేలా వ్యవహరించారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని రాంప్రసాద్ కు కట్టబెట్టారు. నిజానికి పెడనకు గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన జోగి రమేష్ కు చివరి నిమిషంలో పార్టీ టికెట్ ఇచ్చారు. అప్పట్లో రాంప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎంపీ బాలశౌరి రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించారు. అధికారం లోకొచ్చిన తర్వాత రాంప్రసాద్ కు న్యాయం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని ఉప్పాల రాంప్రసాద్ కు ఇచ్చారు. దీంతో జోగి రమేష్ కి కూడా పెడన నియోజకవర్గంలో పార్టీ పరంగా తలనొప్పి తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న వారికి సీఎం జగన్ న్యాయం చేయడంతో పాటు పార్టీలోకి రావాలనుకునే వల్లభనేని వంశీ వంటి ఎమ్మెల్యేలకు మార్గం సుగమం చేస్తున్నారు. ఈ పరిణామం పై పార్టీ కేడర్ లో కూడా ఎటువంటి సందిగ్ధం లేకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. మరి ఆ వ్యూహాలు మున్ముందు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి.

చొప్పదండి తలనొప్పి రాజకీయం.. వ్యక్తిగత విమర్శలతోనే కాలం గడిపేస్తున్నారు

  కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలుస్తాయి. అక్కడి ప్రజాప్రతినిధులు ఒకరి పై ఒకరు చేసుకునే ఆరోపణలు రాజకీయంగా వేడి రాజేస్తాయి. రాజకీయపరంగా విమర్శలు.. ప్రతివిమర్శలు..ఉంటేనే రాజకీయం కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా రాజకీయ విమర్శలన్ని ఆస్తులు.. అవినీతి ఆరోపణల చుట్టూ తిరుగుతుంటాయి. చివరికీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగించడమే కాదు రాజకీయంగా ఇరకాటంలో పడవేస్తుంటాయి. ఇలాంటి వ్యవహారాలు గతంలో కూడా చాలానే జరిగాయి.  రాష్ట్ర విభజన అనంతరం.. చొప్పదండి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడిగ శోభపై కూడా ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలే ఎక్కుపెట్టాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఎమ్మెల్యే మాములు వసూలు చేసే వారని.. కమీషన్ లేనిదే సంతకాలు పెట్టేవారు కాదంటూ.. ఆరోపణలొచ్చాయి. ఇది రెండేళ్ళ క్రితం నాటి కథ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆమె స్థానంలో సుంకె రవిశంకర్ తెరమీదకొచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. అవినీతి ఆరోపణలతో చొప్పదండి నియోజక వర్గ రాజకీయాలు మళ్లీ రెండేళ్లు వెనక్కి వెళ్లాయి. రవిశంకర్ పై కూడా అక్రమాస్తులకు సంబంధించి ఆరోపణలు రావడంతో చర్చ మొదలైంది. శోభకు ఎదురైన పరిస్థితులే ఇప్పుడు రవిశంకర్ కు ఎదురవుతున్నాయి. మరిప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడనే డిస్కషన్ కార్యకర్తల్లో మొదలైంది.  మరోవైపు ప్రతిపక్షాలకు తమ పార్టీ నుంచే ఎవరో ఒకరు లీకులిస్తున్నారనే అనుమానాలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో కలుగుతున్నాయి. ఎక్కడి నుంచి లీకయిందనే విషయం తెలిసినా బయటకు చెప్పలేకపోతున్నారు. దీనిని ఉపయోగించుకొని కాంగ్రెస్ తన వద్ద ఉన్న సమాచారంతో ఎమ్మెల్యే పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. ఎమ్మెల్యే రవిశంకర్ పాత ఎమ్మెల్యేనే ఫాలో అవుతున్నారనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ నేతల సైతం కౌంటర్ ఎటాక్ చేయడం మొదలెట్టారు. తమ ఎమ్మెల్యే నీతి నిజాయితీని శంకిస్తే సహించేది లేదంటూ మండిపడుతున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలను పక్కనబెడితే ఇదంతా అధికార పార్టీ నుంచే కాంగ్రెస్ కు సమాచారం వెళుతుందని అనుకుంటున్నారు. ఓవరాల్ గా చొప్పదండిలో వస్తున్న అవినీతి ఆరోపణల విషయం మాత్రం ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. దీంతో ఆ పదవిలో ఉండేవాళ్లు ఇదేం ఖర్మరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.

ఎల్లారెడ్డిలో చీలిన గులాబీ.. కాంగ్రెస్ నుండి వలస వచ్చిన నేతలతో మొదలైన ముసలం!

  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగిన నాయకులు.. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన రవీందర్ రెడ్డి పక్కా టీఆర్ఎస్ కాండిడేట్ అని చెప్పుకోవచ్చు. 2004 లో రాజకీయ అరంగేట్రం చేసిన రవీంద్రరెడ్డి ఇంతవరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్థానానికి ఆరుసార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలిచారు, రెండుసార్ల ఓడిపోయారు. 2008 ఉప ఎన్నికల్లో ఓసారి, 2018 ఎన్నికల్లో మరోసారి పరాజయం పాలయ్యారు. మిగతా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఇతర పదవులు పదోన్నతులు మాత్రం పొందలేకపోయారు. పార్టీ అధిష్టానంలో ఆయన పట్టు సాధించలేకపోవడం ఒక కారణమైతే జనంలో వ్యతిరేకత పెరగడం మరో కారణంగా మారింది. దీంతో గత ఎన్నికల్లో రవీందర్ రెడ్డి పరిస్థితి ఆశాజనకంగా లేదని నిఘా వర్గాలు ముందుగానే సంకేతాలిచ్చాయి. అభ్యర్థిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఎల్లారెడ్డి స్థానం గెలిచే అవకాశం లేదని గులాబీ బాస్ కు ముందస్తుగా వర్తమానం కూడా అందింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఎల్లారెడ్డిలో మాత్రం పరాజయం పాలైంది. ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన నల్లమడుగు సురేందర్ చేతిలో సుమారు 34 వేల ఓట్ల తేడాతో రవీందర్ రెడ్డి పరాజయం పాలయ్యారు.  రాష్ట్రమంతటా అనుకూల పవనాలు వీచినప్పటికీ ఎల్లారెడ్డిలో మాత్రం ఎదురుగాలి తగలడంతో పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. ఇది కేవలం రవీందర్ రెడ్డి స్వయంకృతాపరాధమేనని తేల్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. తన మనుగడ కోసమో తెలీదు కానీ నల్లమడుగు సురేందర్ గులాబీ గూటిలో చేరడంతో ఎల్లారెడ్డి రాజకీయం రంజుగా మారింది. స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో టిఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ రెడ్డి తన ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 15 ఏళ్లుగా తన వెంట ఉంటున్న అనుచరుల కోసం గట్టిగా పని చేయాలని ఆయన భావించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వర్గీయులకు టికెట్లు ఇప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ వర్గాన్ని ఢీకొనేందుకు సొంతంగా ప్రతి మండలంలో తన అనుచరులను రంగంలోకి దింపారు. ఈ ఇరువర్గ పోరు కారణంగా నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఎల్లారెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాగిరెడ్డిపేట ఎంపిపి కుర్చినీ స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మిగతావన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడినప్పటికీ వారంతా ఎమ్మెల్యే సురేందర్ వర్గీయులు కావడం విశేషం. అప్పటి నుంచి రవీందర్ రెడ్డి తన పంథా మార్చారు. మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని భవిష్యత్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. వారి అనుచరుడిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.  ప్రధానంగా తాను హరీశ్ రావు వర్గియుడనని చాటుకునే ప్రయత్నాలను ఏనుగు రవీందర్ రెడ్డి ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని తన వర్గీయులను హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. ఇటీవల వరుసగా 3 రోజుల పాటు తన వారిని తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కల్పించారు. ఎల్లారెడ్డి, లింగంపేట, సదాశివనగర్, గాంధారి మండలాలకు చెందిన నాయకులను పరిచయం చేసి ఇదంతా తన వర్గమని చూపించారు. హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇలా దూకుడు పెంచారు. దీంతో పాటు ఎల్లారెడ్డిలో తన వర్గీయులతో ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక శిబిరం నడుపుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే పార్టీ సమావేశాలు చర్చలు రవీందర్ రెడ్డి శిబిరంలోనే జరుగుతున్నాయి. అధికారికంగా ఎమ్మెల్యే సురేంద్ర నడుపుతున్న ఆఫీస్లో ఈయన వర్గీయులెవరూ కనిపించడం లేదు. రవీందర్ రెడ్డి వర్గీయులు ఇంత వరకు ఎమ్మెల్యే ఆఫీసు గడప కూడా తొక్కలేదు,అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, ఎమ్మెల్యే నిర్వహించే పార్టీ సమావేశాలు సభలకు హాజరవడం లేదు, రవీందర్ రెడ్డి వచ్చినపుడు మాత్రమే వారు ఎల్లారెడ్డిలో దర్శనమిస్తున్నారు, అది కూడా రవీందర్ రెడ్డి వెంట ఆయన ఉన్నంత సేపు హడావుడి చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇరువర్గాల పోరు నానాటికీ ముదురుతున్నట్టు కనిపిస్తోంది.  ఇక త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరు ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళనకు చెందుతున్నారు. కౌన్సిలర్ ల టికెట్ లు మొదలు వారిని గెలిపించుకునే వరకు ఇటు నల్లమడుగు సురేందర్, అటు ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించే సూచనలున్నాయి. ఇప్పటికే రవీందర్ రెడ్డి తన అనుచరుల్ని మున్సిపల్ చైర్మన్ చేయాలని భావిస్తున్నారు, ఆ అభ్యర్థి పేరు కూడా ఖరారు చేశారు. దీనిపై హరీశ్ రావు ద్వారా అంతర్గత ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సురేంద్ర మాత్రం కేటీఆర్ ద్వారా తన పరువు ప్రతిష్ట కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. మొదటి నుంచి హరీశ్ రావు అనుచరుడిగా ఉన్న రవీంద్రరెడ్డిపై సహజంగానే కేటీఆర్ కు సానుభూతి లేదు. దీనికి తోడు ఆయన ఇటీవల హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వెంట తిరగడంతో కేటీఆర్ దృష్టిలో బలంగా నాటుకుపోయారు. ఈ వర్గపోరు కారణంగా ఏనుగు రవీందర్ రెడ్డిని మరింత దూరం చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్ పావులు కదుపుతున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే అయోమయంలో స్థానిక గులాబీ దళం ఉండగా అన్నీ కలిసొస్తే హరీశ్ రావు నీడను మళ్లీ అందలం ఎక్కుతాననే ఆశ విశ్వాసం మాత్రం ఏనుగు రవీందర్ రెడ్డికి ఉంది. మరి ఎవరి ఆశలు నెరవేరుతాయో ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాలి.

కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాసిన కండెక్టర్... ఆత్మభిమానాన్ని చంపుకొని చేసే ఉద్యోగం నాకొద్దు

రెండు మాసాలు సమ్మె చేశారు.. రెక్కాడితే కానీ డొక్కాడదని తెలిసి కూడా ఫలితం కోసం ముందడుగు వేశారు. ప్రభుత్వానికి.. విపక్షాలకి.. మధ్య కార్మికులు అనిగిపోయారనే విధంగా అనుకునే స్థాయిలో సమ్మె ముగింపు దారితీసింది. ఇదిలా ఉండగా.. సూర్యాపేట డిపో , ఎల్.కృష్ణ అనే ఆర్టీసీ కండెక్టర్.. సమ్మె కాలంలో తాను అనుభవించిన క్షోభను..మనోవేధనను ఒక లేఖలో సీఎం కేసీఆర్ గారికి రాసాడు. ఆ లేఖలో ఇలా రాసాడు." గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి , తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదామనుకున్నా..కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై.. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మీకు మాట తప్పడం మాయ మాటలు చెప్పి మోసం చేయడం తెలుసని మా కార్మికలోకం లేటుగా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దీనికి కారణం లేకపోలేదు సార్.. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సారూ ఉన్నారు కదా అనుకున్నాను. ఆంధ్రా పాలకులు నిజంగా మోసం చేశారేమో మనల్ని ఈయన బాగా చూసుకుంటారని అనుకున్నా కానీ సార్.. 20 మందికి పైగా కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సార్ అప్పుడనిపించింది సార్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణ కేవలం మీలాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఊహించలేదు సార్.. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైంది. సార్ నా చెల్లెళ్లు ఏడుస్తుంటే.. రోజూ నా సోదరులు బాధపడుతుంటే.. తట్టుకోలేకపోతున్నా.. సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం సార్ నా ఆర్టీసీ అక్కాచెల్లెళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. సార్ నేను సూర్యపేట డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మీలాంటి ఒక్క మోసకారి, ఒక్క మాటకారి, ఒక్క మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా నా పేరు ఎల్ కృష్ణ, నా స్టాఫ్ నెంబర్ 176822, సూర్యాపేట డిపో సార్ నాది, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను మీ సంస్థ నుండి నాకు రావలసిన బకాయిలు ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి. అయ్యా సీఎం సార్ గారూ మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి, పాపం సార్ ఆర్టీసీ వాళ్లు మిమ్మల్ని చాలా అభిమానించారు సార్. కానీ మీరు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. సార్ ఆర్టీసీ కార్మికులు వాళ్లకొచ్చే రూ.16,000 రూపాయల జీతం తీసుకుని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బతుకుతున్నారు సార్.మీరు వాళ్ళకేమీ ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలిచ్చే వారు సార్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను, కనీసం మా తల్లితండ్రులను అయినా సంతోషంగా ఉండేటట్లు నెలనెలా వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ నివ్వండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి.. మా కేసీఆర్ అని ఓటు వేశారు సార్. ప్రతి రోజూ ఈ అరెస్ట్ లేంది, ఈ లాఠీ దెబ్బలు ఏంది సార్, నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారని ఇంకా ఎంతమందిని ఆత్మహత్యలూ చేసుకునేటట్టు చేస్తారు. అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మాభిమానాన్ని చంపుకునే ఉద్యోగం చేయలేను, అందుకే నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు, మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని, నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లితండ్రులకు వృద్ధాప్య పింఛను ఒకటి ఇవ్వండి. పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడెకరాల పొలం, అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్ లో చదువు, నాకు ఉండటానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వండి ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు. ఇట్లు ఎల్ కృష్ణ, స్టాఫ్ నెంబర్ 176822, ఆర్టీసీ కండక్టర్ సూర్యాపేట డిపో. " ఇలా తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ గారికి పంపించాడు. ఇలా అందరూ రాస్తే రోజు పుస్తకాలు చదవడం మానేసి లెటర్లు చదువుకోవాలని కొందరు అంటుంటే.. అలా చదివితేనైనా మానవత్వం అనేది పుట్టుకొస్తది మా కేసీఆర్ కి అని కొందరు అంటున్నారు.

నారదునిగా మారిన కొడాలి నాని.. ధర్మాన సోదరుల మధ్య దూరం పెంచే వ్యాఖ్యలు!

  2019 ఎన్నికల్లో శ్రీ కాకుళం జిల్లాలో ఫ్యాన్ గాలి బలంగానే వీచింది. సిక్కోలులో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 8 చోట్ల వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వీచిన వ్యతిరేక పవనాలు సిక్కోలును తాకాయి. దీంతో టిడిపి డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీ నేతల్లో మంచి జోష్ కనిపించింది. ఇక సిక్కోలులో పార్టీకి తిరుగులేదనే తీరులో ఉన్నారు నేతలు. మెజారిటీ సీట్లు సాధించమన్న ధీమా వారిలో ఏర్పడింది. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చి 6 నెలలు గడవక ముందే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయని లోకల్ టాక్.  వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధర్మాన కుటుంబం పెద్ద దిక్కుగా చెప్పాలి. పార్టీ ఆవిర్భావ సమయంలో జిల్లాలో వైసీపీ జెండా చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని వదిలేసి ధర్మాన కృష్ణదాస్.. వైయస్ జగన్ కు బాసటగా నిలిచారు. అంతేకాదు ఆ పార్టీకి మేమున్నామంటూ కృష్ణదాస్ భార్య పద్మప్రియ పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కృష్ణదాస్ కుటుంబానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సముచిత స్థానం కల్పించారు.తన క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా క్రిష్ణదాసును నియమించారు. దీంతో విధేయతకు జగన్ పట్టం గట్టారన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది.  ఇక రాజకీయ అనుభవం విషయానికొస్తే ధర్మాన సోదరుల్లో ప్రసాదరావు సీనియర్.. గతంలో ధర్మాన ప్రసాదరావు , క్రిష్ణదాసు వేర్వేరు పార్టీలు ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రసాదరావు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. మొన్నటి ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో, క్రిష్ణదాస్ నరసన్నపేట అసెంబ్లీ స్థానంల్లో విజయం సాధించారు. సీనియర్ కాబట్టి ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పీఠం దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ జగన్ వ్యూహాత్మకంగా ఈ సోదరుల్లో పెద్దవాడైన కృష్ణదాస్ కి మంత్రి కుర్చీ వేశారు.అంతే అప్పటి నుంచి ఈ ధర్మాన సోదరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.  సిక్కోలులో ఏదైనా ప్రభుత్వం  పథకాన్ని లేదా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జిల్లా కేంద్రంలో శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. అందులో జిల్లా మంత్రిగా ఉన్న కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం సహజం. అయితే కృష్ణదాస్ అటెండవుతున్న కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొడుతుండటం కొత్త చర్చకు దారితీస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు జారీ, సన్న బియ్యం పంపిణీ, అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, వైయస్ఆర్ వాహన మిత్ర వంటి పలు కార్యక్రమాలనూ జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళంలో అట్టహసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ప్రసాదరావు జాడ కనిపించలేదు.  ఇటీవల జరిగిన ఓ పరిణామం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమితులైన కొడాలి నాని నవంబర్ 14 న సిక్కోలు పర్యటనకు వచ్చారు. అయితే జిల్లా కేంద్రానికి వచ్చిన కొడాలి నాని స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అదే సమయంలో మంత్రి క్రిష్ణదాస్ సైతం కొడాలి వెంట ప్రసాదరావు ఇంటికెళ్లారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఈ అన్నదమ్ములిద్దరి మధ్య మరింత దూరం పెంచాయని స్థానికంగా కొందరు చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో మంత్రి క్రిష్ణదాస్ ఉండేమి లాభం? స్పీకర్ తమ్మినేని తప్ప మిగతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలెవరూ తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేయడం లేదు అంటూ కొడాలి నాని చురకలంటించారు. అక్కడితో ఊరుకోకుండా అక్కడే ఉన్న కృష్ణదాస్ వైపు చూస్తూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ కూడా తమ్మినేని గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయనను చూసైనా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న మంత్రి కృష్ణదాస్ అక్కడ్నించి వెళ్లిపోయారు. బయటకు వెళుతున్న సమయంలో కృష్ణదాస్ ను ధర్మాన ప్రసాదరావు చిరునవ్వుతొ ఆపి అన్న బయటకు వెళ్లాల్సిన దారి అటుకాదు ఇటూ అంటూ కాస్త వెటకారం ప్రదర్శించారు. అప్పటికే ఆవేశంతో ఉన్న క్రిష్ణదాసు ఆ దృశ్యాలను కెమెరాలో క్లిక్ మనిపిస్తున్న మీడియా వారిపై మండిపడ్డారు.  వాస్తవానికి కృష్ణదాస్ కి సున్నిత మనస్కుడని పేరుంది. అయితే ఇసుక వారోత్సవాలకు హాజరైన మంత్రి కృష్ణదాస్ తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. టిడిపి నేతలను ఉద్దేశించి అసభ్య పదాలు వాడేశారు. కృష్ణదాస్ నోటి వెంట అలాంటి మాటలు రావటం చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. అయితే లోతుగా ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ అన్నదమ్ముల మధ్య కొడాలి నాని ఆజ్యం పోశారని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చర్చించుకుంటుంది.నిజానికి మంత్రి కృష్ణదాస్ కు సిక్కోలులో సహాయనిరాకరణ జరుగుతోందనే చర్చ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. జిల్లా కేంద్రంలో జరుగుతున్న మంత్రి పర్యటనల్లో నరసన్నపేట కార్యకర్తల మినహా ప్రసాదరావు అనుచరులెవరూ కనిపించటం లేదు. ఈ తరుణంలో ధర్మాన సోదరుల మధ్య పెరుగుతున్న అంతరం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఆందోళన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

అన్నీ అప్పులే.. ఆదాయం పెంచే ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్న వైసీపీ సర్కార్!

  కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక శాఖ కూరుకుపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేసి వాటికి యూసీలు చెల్లిస్తే తిరిగి నిధులు తెచ్చుకోవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్థిక శాఖనే తన అంచనాల్లో గణాంకాల రూపంలో అంగీకరించడం గమనార్హం. భూములు అమ్మడం, అప్పులు చేయటం ఈ నిధులను పథకాలకు మళ్లించటం తప్ప ఆదాయం పెంచుకునే మార్గం ఒక్కటి కూడా ఈ శాఖకు కనిపిస్తున్నట్లుగా లేదు. బడ్జెట్ లో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 32,040 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మార్చి చివరికి ఈ పద్దు కింద రూ.14,235 కోట్లు వస్తాయని ఆ శాఖ భావిస్తోంది. అంటే దాదాపు రూ.17,805 కోట్లు తగ్గుతున్నాయి.  రాష్ట్ర ఆదాయ వనరుల తీరుతెన్నులపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ రూ.2.26 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వచ్చే మార్చి నాటికి కేవలం రూ.1.4 లక్షల కోట్ల ఆదాయం వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయం మధ్య తేడా రూ.86,000 ల కోట్లకు పైగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం లోటును పూడ్చడం అసాధ్యం. కేంద్రం నుంచి ఏకంగా గ్రాంట్ల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని బడ్జెట్ లో ప్రతిపాదించారు. మార్చి నాటికి ఆ పద్దు కింద రూ.17,665 కోట్లే వస్తాయని ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేశారు. అంటే గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయమే రూ.43,406 కోట్లు తగ్గిపోతుంది. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం రూ.18,230 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.3,539 కోట్లు, పబ్లిక్ రుణాలు రూ.3,000 ల కోట్లు, కేంద్ర పథకాల నిధులు రూ.17,805 కోట్లు, పన్నుల్లో వాటా రూ.9,000 కోట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఈ లోటు నిధుల మొత్తం రూ.94,000 కోట్లకు పైగా ఉంది.  కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.34,883 కోట్లు వస్తాయని బడ్జెట్ లో పేర్కొన్నారు. కానీ మొదటి త్రైమాసికంలో ఈ పద్దు కింద రూ.6,398 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.6,623 కోట్లు వచ్చాయి, మూడో త్రైమాసికంలోని మొదటి రెండు నెలల్లో రూ.4,440 కోట్లు వచ్చాయి. డిసెంబర్ లో రూ.2,200 ల కోట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగవ త్రైమాసికంలో మాత్ర పన్నుల్లో వాటా అమాంతం రూ.15,188 కోట్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ భావిస్తున్నది. వాస్తవానికి నాలుగో త్రైమాసికం లోనూ పన్నుల్లో వాటా రూ.6,600 ల కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం రూ.82,792 కోట్లు వస్తుందని బడ్జెట్ లో పెట్టారు. ఈ ఆదాయం రూ.18,230 కోట్ల మేర తగ్గి, రూ.64,562 కోట్లకు పరిమితమవుతుందని ఆర్ధిక శాఖ భావిస్తోంది. పన్నేతర ఆదాయం రూ.7,354 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అది కూడా రూ.3,539 కోట్లకు తగ్గుతుందని అంటున్నారు. పబ్లిక్ రుణాల రూపంలో రూ.32,417 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ కేంద్రం మొదటి మూడు త్రైమాసికాలకు రూ.29,000 ల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు డిసెంబరుతో ముగుస్తుంది. నాలుగో త్రైమాసికానికి కేంద్రం అనుమతి లభిస్తేనే ఇంకో రూ.3,417 కోట్లు అప్పు రూపంలో తెచ్చుకోగలం. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పబ్లిక్ రుణాలు తీసుకునే అవకాశం ఉండదు.

మంత్రుల బండ్లు యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి?... అసలు కాన్వాయ్‌లో ఏం జరుగుతుంది ?

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంత్రి కాన్వాయిలో వెనుక వస్తున్న వాహనం బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మంత్రుల కాన్వాయ్ లో తరచూ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయని సమస్య మొదలైంది. కాన్వాయ్ లో ఏం జరుగుతోంది అని ఆరా తీస్తే అసలు విషయాలు బయటికొచ్చాయి. కాన్వాయ్ లో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు. లేటెస్ట్ వెర్షన్ ఫార్చునర్ వాడుతున్నారు, అయితే ఇచ్చిన కారు సౌకర్యంగా లేదని మంత్రులు తమ సొంత కార్లలో ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని వదిలి ఓల్వో, బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. ఈ కార్లల్లో హై ఎండ్ ,సెకన్ లలో వంద కిలోమీటర్ల స్పీడ్ దాటి పరుగుపెడతాయి.దీంతో ఈ కారును స్పీడ్ ను కాన్వాయ్ లోని ఇతర వాహనాల్లో అందుకోలేకపోతున్నాయి. మంత్రి కారును అందుకోవాలని స్పీడుగా వెళ్లి పైలట్ ఎస్కార్ట్ సిబ్బంది వాహనాల ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా జరిగిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ప్రమాదంలోనూ ఇదే జరిగింది. తన సొంత బెంజ్ కారులో ఎర్రబెల్లి ప్రయాణం చేస్తే ఆయన కారును అందుకోవాలని స్పీడ్ గా కాన్వాయ్ వాహనం వెళ్ళిందని తెలిసింది. చివర్లో స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదానికి గురైంది. గతంలో ఈటల రాజేందర్ కాన్వాయ్ లో వాహనం కూడా బోల్తా పడింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడం వల్ల ఆయన సురక్షితంగా బయట పడ్డారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ లు కూడా అప్పుడప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వదిలి సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో మంత్రులందరూ ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మళ్లి కొంత మంది మంత్రులు సొంత వాహనాన్ని వాడుతున్నారు. రూరల్ ఏరియా లో సింగిల్ రోడ్ల పై మంత్రుల కాన్వాయ్ కు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు కంట్రోల్ తప్పి సామాన్యుల పై దూసుకెళుతున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాల చూసైనా మంత్రుల తీరు మార్చుకోవాలని బయటికి చెప్పుకోలేక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

జీవీఎల్ సైలెన్స్‌కి కారణమేంటి? మోడీ-షాకి ఫిర్యాదు చేసిందెవరు?

జీవీఎల్ నరసింహరావు... బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్... ఇక జీవీఎల్ స్టైలే వేరు... ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ఒక సంచలనం ఉండి తీరుతుంది... 2014కి ముందు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా... ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చాక... చంద్రబాబుపైనా, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంపైనా తీవ్ర ఆరోపణలు చేయడంతో జీవీఎల్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. జీవీఎల్ ఏ ఆరోపణ చేసినా నిజమేననిపించేలా ఉండేవి. ఎక్కువగా టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసేవారు. ఇవిగో ఆధారాలంటూ లెక్కలతో సహా వివరించేవారు. దాంతో, జీవీఎల్ ను ఎదుర్కోవడానికి టీడీపీ నేతలు నానా తిప్పలు పడేవారు. ప్రతి అంశంలోనూ లోతైన విషయ పరిజ్ఞానంతోపాటు వాగ్ధాటి మరో అడ్వాంటేజ్ గా ఉండటంతో టీవీ డిబేట్స్ లో ప్రత్యర్ధులపై మాటల తూటాలతో విరుచుకుపడేవారు.  అయితే, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ కొద్దిరోజులుగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఏపీలో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, రాజధాని వివాదం, మత వివాదం.... ఇలా అనేక బర్నింగ్ ఇష్యూస్ తో విపక్షాలన్నీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే... జీవీఎల్ మాత్రం తనకేమీపట్టనట్టు మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ప్రత్యర్ధులపై పదునైన మాటలతో విరుచుకుపడుతూ బీజేపీ తరపున బలమైన వాయిస్ వినిపించే జీవీఎల్ ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే, జీవీఎల్ మౌనం వ్యూహాత్మకమా? లేక అధిష్టానం ఆదేశమా అనే చర్చ జరుగుతోంది. జీవీఎల్ సైలెన్స్ కి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అండ్ జగన్ సర్కారుపై బీజేపీ హైకమాండ్ ఇంకా స్పష్టమైన స్టాండ్ తీసుకోలేదని... అందుకే మౌనంగా ఉన్నారని అంటున్నారు. అయితే, రాజధాని ఇష్యూలో ఆమధ్య జగన్ సర్కారుకు అనుకూలంగా జీవీఎల్ మాట్లాడరనే విమర్శలు వచ్చాయి. ఏపీ బీజేపీ నేతలకు భిన్నంగా జీవీఎల్ మాట్లాడటంతో అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని, దాంతో సైలెన్స్ అయ్యారని అంటున్నారు. మరోవైపు ఏపీ బీజేపీలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు జరిగిన తర్వాత, వైసీపీ అండ్ జగన్ సర్కారుపై ఎలా వ్యవహరించాలో స్పష్టత వస్తుందని, ఆ తర్వాత తన వాయిస్ వినిపించాలని జీవీఎల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, టీడీపీ, జనసేనతో మళ్లీ కలిసి సాగే అవకాశముందని ప్రచారం జరుగుతుండటంతో... దీనిపైనా క్లారిటీ కోసం చూస్తున్నారట. మొత్తానికి ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చే జీవీఎల్... వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారని... వన్స్ ఏపీ పొలిటికల్ స్టాండ్ పై అధిష్టానం క్లారిటీ ఇచ్చిందంటే మాత్రం మళ్లీ సూపర్ యాక్టివ్ అవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.