నిర్మలాపై పరకాల ఎఫెక్ట్... కేంద్రంలో కలకలం రేపుతోన్న కామెంట్స్

నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్ధికమంత్రి... పరకాల ప్రభాకర్, పొలిటికల్ ఎకనామిస్ట్... ఇద్దరూ భార్యాభర్తలు... ఒకరు దేశ ఆర్ధిక వ్యవహారాలను చూస్తుంటే.... మరొకరు ఆ ఆర్ధిక విధానాల్లో మంచిచెడ్డలను విశ్లేషిస్తుంటారు. అయితే, దేశ ఆర్ధిక పరిస్థితిపై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ భర్తగా... ఎన్డీఏ ప్రభుత్వంపై పరకాల ప్రభాకర్ చేసిన హాట్ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దేశంలో పరిస్థితి నానాటికీ దిగజారుతుంటే, ఆ వాస్తవాన్ని అంగీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ పరకాల చేసిన కామెంట్స్... కలకలం రేపుతున్నాయి. నెహ్రూ సోషలిజాన్ని విమర్శించే బదులు సరళీకృత ఆర్ధిక విధానాలకు బాటలు చూపిన పీవీ, మన్మోహన్ నమూనాలను అనుసరించాలన్న పరకాల.... పీవీ, మన్మోహన్ ఆర్ధిక విధానాలు ఇఫ్పటికీ సవాలు చేయలేనివిధంగా ఉన్నాయంటూ పొగడటంపై దేశమంతా చర్చ జరుగుతోంది. సాక్షాత్తూ భార్య కేంద్ర ఆర్ధికమంత్రిగా ఉండగా, పరకాల ప్రభాకర్ ఈ కామెంట్స్ చేయడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, భర్త చేసిన విమర్శలపై నిర్మలా సీతారామన్ నేరుగా స్పందించకపోయినా, మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటరిచ్చారు. యూపీఏ హయాంలో... కాంగ్రెస్ నేతలు ఫోన్లు చేయడంతోనే కొంతమందికి బ్యాంకర్లు లోన్లు ఇచ్చారని, దాని ఫలితమే ఇప్పుడు బ్యాంకింగ్ రంగ సంక్షోభమని నిర్మల ఆరోపించారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై పరకాల ప్రభాకర్ విమర్శలు... కౌంటర్ గా నిర్మలా సీతారామన్ కామెంట్... కలకలం రేపుతున్నాయి. అయితే, పరకాల ప్రభాకర్ కాకుండా, ఇంకెవరైనా బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసుంటే... ఇంత చర్చ, రగడ జరిగేది కాదు... కానీ భార్య ఆర్ధికమంత్రిగా ఉండగా, భర్త విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో, పరకాల ప్రభాకర్-నిర్మలా సీతారామన్ డైలాగ్ వార్ దేశమంతా ఆసక్తి రేపుతోంది. అయితే, భార్యాభర్తల నడుమ ఇంటి బడ్జెట్‌పై గొడవలు, వాదనలు కామనే అయినా, ఏకంగా దేశ ఆర్ధిక పరిస్థితిపై వాదులాడుకోవడం మాత్రం సంచలనంగా మారింది.

కేసు మీద కేసు... రిమాండ్ మీద రిమాండ్... చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తాడా?

చింతమనేనిపై కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 11న అరెస్టయిన చింతమనేనిపై ఒకదాని తర్వా మరొకటి బయటికి తీస్తూ దాదాపు నెలన్నరగా జైలుకే పరిమితం చేశారు పోలీసులు. ఒక కేసులో బెయిల్ వచ్చేలోపే మరో కేసులో జైలుపాలవుతున్నాడు. ప్రస్తుతం ఐదు కేసుల్లో అక్టోబర్ 9తో రిమాండ్ పూర్తవడంతో, చింతమనేని బెయిల్ పై బయటకు వస్తారని కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు ఆశించారు. కానీ పీటీ వారెంట్ పై జైల్లోనే మరోసారి అరెస్ట్ చేయడంతో అక్టోబర్ 23వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇలా, ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్ట్ చేస్తుండటంతో చింతమనేని అసలు జైలు నుంచి బయటికి వస్తారా? లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చింతమనేని దాదాపు 60 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం 22 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. చింతమనేనిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో ఒక కేసు తర్వాత మరో కేసులో అరెస్టు చేస్తూ... జైలుకే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, టీడీపీ హయాంలో ఒక్క ఇంచు కూడా ముందుకు కదలకుండా, మరుగునపడిపోయిన కేసులన్నీ తెరపైకి రావడం వెనుక రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కేసులున్నా, చంద్రబాబు హయాంలో ఆడుతూ పాడుతూ తిరుగుతూ, తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించిన చింతమనేనికి... జగన్ సర్కారులో మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. చింతమనేనిపై నమోదైన కేసులన్నీ ఇప్పుడు బయటికి వస్తుండటంతో ప్రభాకర్ ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అయితే, చింతమనేనిపై జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ ఆరోపిస్తూనే ఉన్నా, కేసుల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. అంతేకాదు చేసిన పాపం ఊరికే పోదని వైసీపీ నేతలంటుంటే, కావాలనే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే, కటకటాల వెనుకున్న చింతమనేనిని, ఈ జైలు బాధలోనూ మరో బాధ మరింతగా బాధపెడుతోందట. కష్ట సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నుంచి తనకు ఆశించినంత మద్దతు దొరకడం లేదని, తనను పట్టించుకోవడం లేదని కుమిలిపోతున్నాడట. కష్టకాలంలో అండగా ఉండాల్సిన పార్టీ, దూరం జరిగినట్టు అనిపిస్తోందని అనుచరులతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. దాంతో, ఇలా కోర్టు, జైలు చుట్టూ తిరుగుతుండటంతో అసలు చింతమనేని బయటి వస్తాడా అనే అనుమానాలు అనుచరులకు కలుగుతున్నాయట. మరి, కేసు మీద కేసు, రిమాండ్‌ మీద రిమాండ్‌తో జైలుకే పరిమితమవుతున్న చింతమనేని, ఎప్పడు రిలీజ్ అవుతారో చూడాలి.

జెడ్పీ ఛైర్మన్‌ వర్సెస్ కలెక్టర్... టీఆర్ఎస్ లో కలకలం రేపుతోన్న కొత్త వివాదం 

  ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్ధన్, కలెక్టర్ దివ్య దేవరాజన్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ సంచలన కామెంట్లు చేశారు. జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ‌ఎలాంటి పనులూ కావడం లేదని, దీనికి‌ కలెక్టర్ దివ్యదేవరాజన్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెపై తిరుగుబాటు చేయాలని జెడ్పీటీసీలకు ఛైర్మన్ పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలూ ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు జెడ్పీ ఛైర్మన్. జిల్లా పాలన మొత్తం, కలెక్టర్ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. కనీసం పట్టా పాస్ ఇప్పించలేకపోతున్నామని వాపోయారు. పనులు చేయలేని పదవులు మాకెందుకన్న జనార్ధన్, ప్రజాప్రతినిధుల అధికారాలపై కలెక్టర్ పెత్తనమేంటని మండిపడ్డారు. కనీసం, విరాసత్, పట్టాపాస్ ఇవ్వడాన్నీ కలెక్టర్ పట్టించుకోవడంలేదని వాగ్భాణాలు సంధించారు. కలెక్టర్‌పై తిరుగుబాటు చేయాలని జెడ్పీ ఛైర్మన్‌ ఏకంగా పిలుపునిచ్చారు. అయితే భయపడేది లేదంటోన్న కలెక్టరమ్మ దేనికైరా రెడీ అంటున్నారు. దాంతో ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ వర్సెస్ జడ్పీ చైర్మన్‌ కోల్డ్‌ వార్, రోజురోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. కలెక్టర్ దివ్య దేవరాజన్ ఏజెన్సీ చట్టాలను‌ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇది జెడ్పీ ఛైర్మన్ కు నచ్చడం‌ లేదట. అదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైందట. ఆదివాసీల భూములను, ఒక సామాజికవర్గ నేతలు ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. రికార్డులన్నీ ఆదివాసీల పేరిట ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఒక సామాజికవర్గానికి‌ పట్టాలు కట్టబెట్టడానికి ప్రయత్నించారని, విపక్షాల నుంచీ విమర్శలున్నాయి. అయితే, చట్ట ప్రకారం నడుచుకోవాలని, నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇదే జెడ్పీ ఛైర్మన్‌కు నచ్చక, ఎదురుదాడికి దిగుతున్నారన్న ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారన్నది జడ్పీ ఛైర్మన్‌ అభ్యంతరం. ఇటీవల నియమాకాలు జరిగిన ఫారెస్ట్ అండ్ జూనియర్‌ పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాలను అర్హులైనవారికి వచ్చేలా ‌కలెక్టర్  చర్యలు తీసుకున్నారు. దాంతో భోగస్ ఏజెన్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు దక్కించుకోవాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. చట్టాలు అమలు చేయడం, ఏజెన్సీ సర్టిఫికెట్ల విషయంలో నిబంధనలు పాటించడమే కలెక్టర్‌ తప్పయినట్టుగా వీరంతా చిత్రీకరిస్తున్నారు. దీనివల్ల అక్రమార్కులకు అడ్డుకట్ట పడిందట. అయితే ఎవరికి ఉద్యోగాలు, ఏజెన్సీ సర్టిపికెట్లు దక్కలేదో వారి కోసం కలెక్టర్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ అట్టుడికిన సమయంలో పాలనా వ్యవహారాలను చక్కదిద్దారని మంచి గుర్తింపు తెచ్చుకున్న కలెక్టర్‌పై, అనవసరమైన కామెంట్లు చేస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కలెక్టర్‌పై... జడ్పీ ఛైర్మన్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఈసడించుకుంటున్నారు. రహస్య అజెండాతోనే ఛైర్మన్, ఆయన బృందం బహిరంగ వ్యాఖ్యలు చేస్తోందని, విపక్ష నేతలు మండిపడుతున్నారు. చట్టం ప్రకారం నడుచుకుంటున్న కలెక్టర్‌ను అభినందించాల్సిందిపోయి, తమకు అనుకూలంగా నడుచుకోవడం లేదన్న అక్కసుతో నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు ఫైరవుతున్నారు. అవినీతి, అక్రమాలకు మడుగులొత్తాలని భావించడం సరికాదంటున్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు ఎదురైనా, కలెక్టర్‌ చట్టం ప్రకారమే నడుచుకోవాలని, ఎవరికీ బెదరాల్సిన అవసరంలేదని ప్రజాస్వామ్యవాదులంటున్నారు.

హుజూర్ బైపోరులో టీఆర్ఎస్ కి కొత్త భయం... టెన్షన్ పెడుతోన్న రోడ్ రోలర్, ట్రాక్టర్

  ఒకవైపు ఆర్టీసీ సమ్మె, ఇంకోవైపు కేసీఆర్‌ సభ వర్షార్పణం కావడంతో, టెన్షన్‌ పట్టుకున్న టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, మరో ఇద్దరు తెగ టెన్షన్‌ పెడుతున్నారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచే అయినప్పటికీ... ఓట్ల చీలికతో బీజేపీ, టీడీపీ కూడా ఎంతోకొంత టెన్షన్ పెడుతున్నాయి. అయితే, ప్రధాన పార్టీలే కాకుండా, ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి గుండెల్లో గుబులురేపుతున్నారు. అసలు, వారిద్దరూ అసలు పోటీ కాకపోయినా, వారి గుర్తులు మాత్రం తెగ టెన్షన్ పెట్టిస్తున్నాయి. రోడ్ రోలర్, ట్రాక్టర్... ఈ రెండు గుర్తులూ దాదాపు టీఆర్ఎస్ సింబల్ కారును పోలి ఉంటాయి. ఈ రెండు గుర్తులే ఇప్పుడు టీఆర్ఎస్‌ను తెగ టెన్షన్‌ పెడుతున్నాయి. హుజూర్‌ నగర్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తులు కేటాయింది ఎన్నికల సంఘం. అదీ కూడా జాబితాలో టీఆర్ఎస్‌ కారు గుర్తు తర్వాత అవే ఉండటం, అధికారపక్ష అభ్యర్థిలో మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల నష్టపోయామని, నిరక్షరాస్యులు, వృద్ధులు పొరపడి ట్రక్కు గుర్తుకు ఓటేయడంతో... పదివేల ఓట్లు పడ్డాయని, అందువల్లే టీఆర్ఎస్ ఓడిపోయిందని  అంటున్నారు. ఇప్పుడు హుజూర్ ‌నగర్‌ బైపోరులోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థికి అలాంటి దిగులే పట్టుకుందట. హుజూర్ ‌నగర్‌ బైపోల్ బరిలో మొత్తం 28మంది అభ్యర్థులున్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డికి, నాలుగో నెంబర్‌ అలాట్ చేశారు. ఆయన తరువాత ఐదో నంబర్‌లో రైతుబిడ్డ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అజ్మీర మహేశ్‌ కి... ట్రాక్టర్‌ నడిపే రైతు సింబల్‌ను... అలాగే ఆరో నంబరులో రిపబ్లిక్‌ సేన తరఫున పోటీ చేస్తున్న నిలిచిన వంగపల్లి కిరణ్‌కు రోడ్డురోలర్‌ గుర్తును కేటాయించింది ఎలక్షన్‌ కమిషన్. ఈ రెండు గుర్తులూ కారు గుర్తుకు దగ్గరి పోలికలతో ఉండటంతో, తమకు పడాల్సిన ఓట్లు ఇతరులకు పడతాయేమోనని టెన్షన్‌ పడుతున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కారును పోలిన ఆటోరిక్షా, లారీ చిహ్నాలు ఎవరికీ ఇవ్వవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరింది. అయితే ఇప్పుడు ఆ గుర్తులను అయితే ఈసీ కేటాయించలేదు. కానీ తాజాగా హుజూర్ నగర్ లో కారును పోలిన రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు మాత్రం ఇద్దరు స్వతంత్రులు దక్కించుకున్నారు. దీంతో అధికారపక్షాన్ని గుర్తుల భయం వెంటాడుతోంది. ఇక గతంలోనూ టీడీపీ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది. సైకిల్ ను పోలిన బైక్ గుర్తు, ఆ పార్టీని దెబ్బతీసింది. చాలా కష్టపడి ఈసీతో ఫైట్ చేసి బైక్ గుర్తును ఎన్నికల్లో నిషేధించింది టీడీపీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా తన కారు గుర్తు పోలిన గుర్తులపై పోరాటం మొదలెట్టింది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. పాలేరు..నకిరేకల్, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఓటమి చవిచూసింది. మళ్లీ ట్రాక్టర్, రోడ్‌ రోలర్‌ గుర్తుల రూపంలో బిక్కుబిక్కుమంటున్నాడు టీఆర్ఎస్‌ అభ్యర్థి. అయితే, గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా జనంలో అవేర్‌నెస్‌ తెచ్చేందుకు, గుర్తులపై అవగాహన కల్పిస్తున్నారు టీఆర్ఎస్‌ నేతలు. కారుకు రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులకు తేడాలను చూపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు, హుజూర్ నగర్ లో ఇంటింటికి  వెళ్లి ఓటర్లకు వివరిస్తున్నారు. ప్రతీ ఓటూ అత్యంత కీలకంగా మారిన హుజూర్ నగర్ ఉపపోరులో... మరి, రోడ్ రోలర్, ట్రాక్టర్ గుర్తులు... టీఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో చూడాలి.

ఏపీ బయటా ఆరోగ్యశ్రీ... ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు జగన్ సూత్రాలు

వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమంపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఏపీ బయటా... ఆరోగ్యశ్రీ చికిత్సలకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ ఒకటి నుంచి ఏపీలోనే కాకుండా... హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లో కూడా ఆరోగ్యశ్రీ చికిత్సలకు అనుమతిస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. అలాగే, పశ్చిమగోదావరిలో 2వేల వ్యాధులకు... మిగతా జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక, డెంగ్యూ, సీజనల్ వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక, కిడ్నీ రోగులకు ఇస్తున్నట్లే.... తలసేమియా, హీమోఫీలియో, ఎనీమియా పేషెంట్స్‌కు కూడా నెలకు 10వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా, తీవ్ర వ్యాధులుంటే ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఆపరేషన్స్ తర్వాత కోలుకునేంతవరకు ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. వీళ్లందరికీ నెలకు 5వేలు లేదా రోజుకి 225 రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. అదేవిధంగా 5వేల రూపాయల పెన్షన్ కేటగిరిలోకి పక్షవాతం, కండరాల క్షీణతలాంటి మరో నాలుగు వ్యాధులను చేర్చారు. వైద్యారోగ్యశాఖలో మొత్తం ఖాళీలను భర్తీ చేస్తామన్న సీఎం జగన్‌.... హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది జీతాలను 16వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక, ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రం ఏర్పాటు.... కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 21నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తామని తెలిపిన వైఎస్ జగన్‌.... కంటి వెలుగు మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, గిరిజన, మారుమూల ప్రాంతాల్లోనూ బైక్స్ ద్వారా వైద్యసేవలు అందిచేందుకు చర్యలు చేపడతామన్నారు. మొత్తంగా ఆరు సూత్రాల అజెండాతో రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌‌గా మార్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ‎ఆదేశించారు.

క్లైమాక్స్‌కి హుజూర్‌నగర్‌ క్యాంపైన్... ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ

హుజూర్‌నగర్‌ బైపోల్‌ క్యాంపైన్ క్లైమాక్స్‌కి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్ధులంతా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా నువ్వానేనా అంటూ తలపడుతోన్న కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హుజూర్‌నగర్‌ ఉపపోరు బరిలో నిలిచిన బీజేపీ, టీడీపీ సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాల నినాదంతో బరిలోకి దిగిన అధికార టీఆర్‌ఎస్‌ ఈసారి ఎలాగైనాసరే హుజూర్‌నగర్‌లో గులాబీ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తుండగా... మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్న కాంగ్రెస్‌ మరోసారి విజయం సాధించి సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక, నియోజవర్గమంతా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డి... తనకు ఒక్క అవకాశం ఇస్తే.... హుజూర్‌ నగర్‌ ను అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలను కోరుతున్నారు. అక్టోబర్ 21న జరగనున్న పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఎక్కడా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకుండా ప్రత్యేక పరిశీలకుడు భాస్కరన్‌ టీమ్‌ డేగకన్నుతో కాపలా కాస్తోంది. అయితే... అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. దాంతో హుజూర్‌నగర్‌ ఫలితం కోసం యావత్‌ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

అగ్ర నేతలతో వరుస భేటీ అవుతున్న మెగాస్టార్ అసలు వ్యూహం ఏమిటి?

'సైరా' తో మెగాస్టార్ ఘన విజయం సాధించిన తరువాత మెగా హీరో పలువురు అగ్రనేతలతో భేటీ అవుతున్నారు.దీనిపై మెగాస్టార్ ఎటువైపు అడుగులు ఎటు వేయబోతున్నారనే అనుమానాలు జోరందుకుంటున్నాయి.కానీ మెగాస్టార్ మాత్రం పెదవి విప్పడం లేదు. చిరంజీవి వరుస భేటీలు ఇప్పుడు చర్చ నీయాంశంగా మారాయి. ఆయన ఈ వరుస సమావేశాలు ఎందుకు జరుపుతున్నారని చర్చ మొదలైంది.మొన్న గవర్నర్ తమిల శ్రీతో భేటీ, నిన్న జగన్ తో ఫ్యామిలీ లంచ్ మీటింగ్, వెంకయ్యనాయుడుతో మర్యాదపూర్వక సమావేశం, రేపు అమిత్ షా, మోదీని కలవబోతున్న మెగా హీరో పై పలు అనుమానాలు వెల్లడవుతున్నాయి. మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారా లేక సైరా ప్రమోషన్ కోసమే ఈ మీటింగుల అనే విషయం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిల శాయిని కలిశారు. ఆ తర్వాత అమరావతి వెళ్లి సతీసమేతంగా ఏపీ సీఎం జగన్ ని కలిశారు. గంటపాటు లంచ్ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్ లో ఏమి చర్చించారనేది హాట్ టాపిక్ గా మారింది.కేవలం మర్యాదపూర్వక భేటీ ఏ అని రాజకీయాలు చర్చించలేదని బయటకి చెప్పారు. కానీ లోపల సమావేశాల్లో చాలా చర్చించారు అనే అనుమానాలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. జగన్ తో మీటింగ్ అలా ముగిసిన వెంటనే చిరంజీవి ఢిల్లీకి పయనమైయ్యారు.ఉపరాష్ట్రపతి వెంక్యనాయుడిని కలిసి ఆయనకు సైరా సినిమాను చూపించారు. రేపో మాపో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాను కూడా కలవబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మీటింగ్ నేపథ్యంలో కొత్త కొత్త వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.బీజేపీ వైపు చూపు పడింది అనే ప్రచారం ఊపందుకుంది. ఏపీలో బీజేపీకి క్రౌడ్ పుల్లర్ కావాలి. బీజేపీకి సరైన లీడర్ దొరకడం లేదు. దీంతో చిరంజీవిని లాగాలని ఎప్పట్నుంచో బీజేపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు. అమిత్ షా భేటీ తర్వాత చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై క్లారిటీ వస్తుందని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే చిరంజీవి వస్తే బీజేపీ, వైసీపీ కూడా రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. కానీ చిరు మనసులో ఏముందో పార్టీలు మాత్రం పసిగట్టలేకపోతున్నాయి. అయితే చిరూ సన్నిహితుల్లో మాత్రం వేరే వర్షన్ వినిపిస్తున్నారు. సైరా సినిమా ముందు నుంచే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని ఆయన ఇక రాజకీయాల వైపు వెళ్లారని అంటున్నాయి. కేవలం సినిమా ప్రమోషన్ కోసమే నేతలను కలుస్తున్నారని వీరు చెబుతున్నారు. ఈ వరుస భేటీలు వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని వివరిస్తున్నాయి. మరోవైపు చిరంజీవి వరుస సినిమాలతో బిజీ కాబోతున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో సినిమాకు ఇప్పటికే ప్రారభించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇలా వరుస సినిమాలతో చిరంజీవి బిజీ కాబోతున్నారని, ఎలాంటి పరిస్థితుల్లో రాజకీయాల వైపు రారనేది ఆయన సన్నిహితుల మాట.మరి చిరంజీవీ మనసులో ఏముందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి.

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్టీ

    ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది పోలవరం ప్రోజెక్టు వ్యవహారం. నిర్మాణ పనులు మొదలై ఇప్పటికి పద్నాలుగు ఏళ్లు గడిచాయి, అయినా నేటికీ అసంపూర్తిగానే మిగిలింది. ఆర్ధిక సాంకేతిక కారణాల సంగతెలా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల పోలవరం పనులు నత్త నడకన సాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు దేశం ప్రభుత్వం ఏర్పడింది, ఈ తరుణంలో పోలవరం పనులను కొలిక్కి తెచ్చేందుకు టిడిపి ప్రయత్నం చేసింది. అప్పటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నాయి. అవన్నీ తట్టుకొని దాదాపు డెబ్బై శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది కదా అనుకుంటున్న సమయంలోనే ఎన్నికలొచ్చాయి.టిడిపి ఓడిపోయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒక్కసారిగా బ్రేక్ పడింది. పైపెచ్చు ప్రాజెక్టు పనుల్లో అనేక అక్రమాలు జరిగే భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు గుప్పించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. పోలవరం విషయంలో తామేదో గొప్పలు సాధించినట్టు అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పలు పోతున్నారు కానీ, ప్రజల్లో మాత్రం అనేక సందేహాలు తలెత్తాయి. ప్రాజెక్టు పనులు తిరిగి ఎప్పుడు మొదలవుతాయో అనేది సస్పెన్స్ గా మారింది రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపడుతుందా లేక కేంద్రానికి వదిలేస్తుందో అన్న సంశయం అటు అధికారవర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చోటుచేసుకుంది. ఇదంతా ఒకెత్తయితే కేంద్రం మాత్రం పోలవరం పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నివేదికలు రప్పించుకుంటూనే మరో పక్క బీజెపీ రాష్ట్ర నేతల ద్వారా కూడా సమాచారం రాబడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు పోలవరంలో అనేక అక్రమా లు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. దీనికి తోడు వర్షాకాలం కావడంతో పనులను ఆపేస్తున్నామని మళ్లీ నవంబర్ లోనే తిరిగి నిర్మాణం మొదలవుతుందని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చారు కానీ, ఎక్కడా ఆశాజనకంగా లేదు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదని ప్రతి పక్ష నేతలు వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొంతకాలంగా బీజేపీ నేతలు చేపడుతున్న పోలవరం యాత్రలు ఆసక్తికరంగా మారాయి. ఆగస్టులో బిజెపి ఎంపీ జీవిఎల్ నరసింహరావు పోలవరాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులతో కాంట్రాక్టు ఏజెన్సీలతో సమావేశమై ప్రాజెక్టు స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలవరం పర్యటనకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పార్టీ అధిష్ఠానానికి పంపించారు. ఈ నెలలో బిజెపి రాష్ట్ర బృందం మరోసారి పోలవరం యాత్రను చేపట్టింది. కొవ్వూరు నుంచి బయలుదేరి వెళ్లిన ఈ బృందంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సహా ఇతర ముఖ్య నేతలు కూడా ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పలు వివరాలు సేకరించారు, ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి ఒక నివేదిక అందజేశారు. ఈ నివేదికలో పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయి, ఎప్పటి నుంచి పనులు నిలిపివేశారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి వంటి పలు అంశాలను ఈ నివేదికలో వారు పొందుపరిచారట. ఆ నివేదికనే అప్పటికప్పుడు అధ్యయనం చేసిన కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ ఇవ్వాలంటూ రాష్ట్ర సర్కారుకు తాఖీదులు పంపారు. తాజా పరిస్థితులలో ఈ నెల ఇరవైయ్యవ తేదీ తరువాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్వహించాలని కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చిందట. ఇదిలా ఉంటే బిజెపి నేతలు పోలవరం టూర్ చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరసపెట్టి కమలనాథులు ఎందుకు పోలవరం యాత్ర చేస్తున్నారు, దీని వెనకున్న మర్మం ఏంటి, అనే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందో అని అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటు టిడిపి వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు మాకి ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయితే చాలని ప్రజలు, ముఖ్యంగా రైతాంగం బలంగా కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ ఎప్పుడు ఊపందుకుంటాడేయో.  

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.! త్వరలోనే యువరాజుకి పట్టాభిషేకం?

కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని... కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోతారంటూ ఎప్పట్నుంచో విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు... ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఎక్కువగా వినిపించింది. ప్రధాని మోడీ సైతం... కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటూ ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలు ఎలాగున్నా, తొందర్లోనే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాట టీఆర్ఎస్ వర్గాల్లోనూ వినిపించింది. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కేటీఆర్ కు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో తిరుగుబాటు రావొచ్చనే భయంతో కేసీఆర్ వెనకడుగు వేశారని చెబుతారు. అందుకే ముందుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి టీఆర్ఎస్ నాయకగణమంతా కేటీఆర్ చుట్టూ తిరిగేలా చేశారని అంటారు. ఒకవిధంగా చెప్పాలంటే, అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేది కేటీఆరే. టికెట్ల దగ్గర్నుంచి... మంత్రి పదవుల వరకు... అన్నింటిలోనూ కేటీఆర్ మార్క్ కనబడుతుంది. అయితే, కేటీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ వారసుడుగా కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపడతారనే మాట వినిపిస్తోంది. కేసీఆర్ కూడా తన పదవికి తనయుడు కేటీఆర్ కు కట్టబెట్టాలని సీరియస్  గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ములాయం-అఖిలేష్ మాదిరిగా... పార్టీకి గౌరవాధ్యక్షుడిగా, ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ... జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ మెల్లగా సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దల నుంచి కేసీఆర్ కు ఊహించని కామెంట్స్ ఎదురైనట్లు తెలుస్తోంది. ఇక, మీ అబ్బాయిని ముఖ్యమంత్రిని చేసి, మీరు గౌరవంగా తప్పుకోండంటూ అమిత్ షా వ్యాఖ్యానించినట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కేంద్ర నాయకత్వం కేసీఆర్ ను టార్గెట్ చేసిందని, దాంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోక తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ సన్నిహితులైన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా ఉండటంతో... అన్నీ చక్కబడగానే... పార్టీలో ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా, యువరాజు పట్టాభిషేకం జరగడం ఖాయమని అంటున్నారు.  

నేతన్నలకు 24వేలు... మత్స్యకారులకు 10వేలు... జగన్ సర్కారు సంచలన నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరిన్ని హామీల అమలు దిశగా తీర్మానాలు చేసింది. ముఖ్యంగా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... మరిన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల కోసం వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో కొత్త పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. మగ్గంపై ఆధారపడి జీవిస్తోన్న ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా 24వేల రూపాయల ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. డిసెంబర్ 21నుంచి వైఎస్సార్ చేనేత నేస్తం పథకాన్ని అమలు చేయనున్నారు. అలాగే, వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు 10వేలు చొప్పున ఆర్ధికసాయం చేయాలని కేబినెట్‌ తీర్మానించింది. అదేవిధంగా మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్‌పై 9 రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని 3వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ మంత్రివర్గం... హోంగార్డుల రోజువారీ వేతనాన్ని 710 రూపాయలకు పెంచింది. దాంతో హోంగార్డుల నెల వేతనం 18వేల నుంచి 21వేల 300కి చేరనుంది. అదేవిధంగా బార్ అసోసియేషన్స్‌లో సభ్యత్వమున్న న్యాయవాదులకు నెలకు 5వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అలాగే, వెయ్యి కోట్ల రూపాయలతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక, జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం... మద్యంపై అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేసిన పలాస ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నియామకానికి కేబినెట్ అనుమతి తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులను గుర్తించి... ప్రభుత్వమే హామీగా ఉండి... రవాణా వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న డిస్కములకు ఊరటనిచ్చేందుకు... 4వేల 471కోట్ల రూపాయల విలువైన బాండ్లను విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

టీఆర్ఎస్ ఎంపీ నిర్వాకం.. ఆర్టీసీ కార్మికులకు తీవ్ర అన్యాయం

  న్యాయం చెయ్యాల్సిన నేతలే తమ ఉపాధిని కోల్పోయేలా చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు. వివరాళ్లోకి వెళ్తే వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిగా మారిన హన్మకొండ హంటర్ రోడ్ లో గజం నలభై వేల రూపాయల పై మాటనే పలుకుతుంది. పాతికేళ్లుగా అక్కడ ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఉండేది. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్ లో నూట యాభై మందికి పైగా కార్మికులు పని చేసేవారు. ఆ సెంటర్ ను ఇప్పుడు మూసేసి  కార్మికులను పంపేశారు. ఇపుడు ఈ స్థలం అధికార పార్టీ ఎంపీ పసునూరి దయాకర్ సొంతచేసుకున్నారు. హన్మకొండ హంటర్ రోడ్ లో ఉండే ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంట్రర్ స్థలానికి టెండర్ పెట్టి సింగిల్ బిడ్ దాఖలు చేసి ఎంపీ పసునూరి దయాకర్ దాన్ని ముప్పై మూడేళ్ళ లీజుకు దక్కించుకున్నారు. కుక్కను చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చికుక్కగా ప్రచారం చేయాలన్న రాజకీయ సూత్రాన్ని అమలు చేసి ఆర్టీసీ ఆస్తులను చెరబట్టారు.  హన్మకొండ హంటర్ రోడ్ లో దాదాపు ఇరవై ఐదేళ్ల కిందట టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది నగరానికి దూరంగా ఉండేది. అరిగిపోయిన టైర్లను తిరిగి ఉపయోగించుకునేందుకు అనుగుణంగా ఇక్కడ రీట్రేడింగ్ చేసేవారు. పరిసర ప్రాంతాలకు చెందిన ఆరు జిల్లాల్లో ఉన్న బస్సులకు చెందిన టైర్లను రిట్రేడింగ్ చేసేవారు. కాలక్రమంలో అనేక వ్యాపార సముదాయాలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. భూముల ధరలు రానురాను ఆకాశాన్నంటాయి.ఇక్కడ ఎకరం విలువ పంతొమ్మిది కోట్ల రూపాయల పై మాటే, అంటే నాలుగు ఎకరాలు కలిపి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అన్నమాట. దాంతో ఈ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఫలితంగా అద్భుతంగా పని చేస్తున్న దశలోనే టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేందుకు ఆర్టీసీ అధికారులు కుట్ర పన్నారు. ఇందుకు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఈ సెంటర్ తో ఎటువంటి ఉపయోగం లేదని దీని కారణంగా ఆర్టీసీకి అపారమైన నష్టం వస్తోందని తొలుత అధికారులు ప్రచారం చేశారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను మూసేశారు. ఆ తర్వాత ఈ భూములను తెగనమ్మడం తప్ప మరో మార్గం లేదని ప్రచారంలో పెట్టారు. ఇక్కడ పని చేసే కార్మికులను దశల వారీగా ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపి పసునూరి దయాకర్ తెరమీదకొచ్చారు. ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు టెండర్ లు పిలిచారు. సింగిల్ బిడ్ తోనే ఏకంగా ముప్పై మూడేళ్లకు ఎంపీ దయాకర్ లీజుకు తీసుకున్నారు. మొత్తం నాలుగు ఎకరాలకు నెలకు అయిదు లక్షల రూపాయల చొప్పున ఏడాదికి అరవై లక్షల రూపాయల అద్దె ఇచ్చేలా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. భారీ వ్యాపార సముదాయాలు మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రీట్రేడింగ్ సెంటర్ లో భవనం ఇతర యంత్రాలు ఉన్నాయి కదా ఆ భవనాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని శుభ్రం చేసేందుకు కూడా ఇటీవల టెండర్ పిలిచారు. ఈ టెండర్ కూడా పదిహేను లక్షల రూపాయలకు పసునూరి దయాకర్ దక్కటం విశేషం. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఇప్పుడు భారీ వ్యాపార సముదాయంగా మారబోతోంది. ఏకంగా మూడు మల్టీప్లెక్స్ థియేటర్ లు షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు ప్రయత్నంలో ఉన్నారు.టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దని దాన్ని ఆధునీకరించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు ఉద్యమ బాట పట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతి నిధుల చుట్టూ తిరిగి టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను కాపాడాలని వేడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల క్రియాశీల పాత్ర గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు జరిగే న్యాయం ఇదేనా అంటూ ప్రశ్నించారు. రీట్రేడింగ్ సెంటర్ ను తరలించవద్దు అంటూ రోజుల తరబడి ధర్నాలు చేశారు. అగ్రిమెంట్ ల స్థాయిలో ఉండగానే రీట్రేడింగ్ సెంటర్ కనుమరుగవుతుందని అంటూ ఉద్యమం చేపట్టారు. ఏకశిలా పార్కు ఎదురుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఇతర రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు వారికి సంఘీభావం ప్రకటించాయి. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగి పోయింది. కానీ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయితే భూదందాలు కబ్జాల నేపథ్యం లేని ఎంపీ దయాకర్ ఈ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ను దక్కించుకున్నాడంటే కార్మికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెనుక ఎవరో ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన తర్వాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంది సారూ మాకు అండగా నిలవాల్సింది పోయి అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. టైర్ రీట్రేడింగ్ సెంటర్ మూసివేత వెనుక రాజకీయ నాయకులు ఉన్నారంటూ తమకు తమ ఉపాధి కోల్పోనివ్వకుండా తమకు తగిన న్యాయం చేయ్యాలంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు.

ఆర్టీసి సమ్మెను విరమించటానికి ప్రభుత్వం ఓ మెట్టు దిగనుందా..?

  పట్టు వీడని జేఏసీ మెట్టు దిగని సర్కార్ తెలంగాణా ఆర్టీసీ సమ్మె కేంద్రంగా కనిపిస్తుంది. కానీ, ఒకవేళ ఆర్టీసీ కార్మికులు కాస్త మెత్తబడి చర్చలకొస్తే సర్కార్ సానుభూతి చూపించే అవకాశం ఉందా, ఉద్యోగాలు లేవని ప్రకటించిన సీఎం కేసీఆర్ కరుణిస్తారా, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో మహదావకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దాంట్లో ఆయన రాసిన అంశం కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని, సూసైడ్ ఏ సమస్యకూ పరిష్కారం కాదు అని తెలిపారు. నలభై నాలుగు శాతం ఫిట్ మెంట్ పదహారు శాతం ఐఆర్ ఇచ్చి ఆర్టీసీ గొప్పగా ఆదుకున్న ఘనత టి.ఆర్.ఎస్ ప్రభుత్వానిదే అని ఆయన లేఖ ద్వారా ఆయన గుర్తు చేశారు. రెండు వేల పధ్ధెనిమిది ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో తాను ఉన్నా అని, ఎక్కడా కూడా అర్టీసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదు అని అలా చేయడమంటే పాలసీని మార్చుకోవడమే అన్నారు. ఇదంతా సాదాసీదా కామెంట్స్ అయినా కానీ పరిస్థితి చేజారిపోకముందే కార్మికులు సమ్మె విరమించాలి అని కూడా రాశారు. కార్మికులు ముందుకొస్తే పరిస్థితి అదుపు లోకి వచ్చినట్టే అని తెలుస్తుంది. అద్దె బస్సులు ప్రైవేట్ స్టేజ్ క్యారియర్ పై సీఎం తీసుకున్న నిర్ణయం సమ్మె నేపథ్యంలోనే అని గుర్తించాలని చెప్పారు కేకే. అయితే అర్టీసి కార్మికుల సమ్మె తీవ్ర తరం అవడంతో ప్రభుత్వం దీనిని ఆపాలనే ఉద్దేశంతో కెకెతో అధికారికంగా కాకపోయినా ఆర్టీసి సంఘాలతో సంప్రదింపులు జరిపి సమ్మెను విరమించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు టీఎన్జీవోలు కూడా తాము ఆర్టీసి తరపున ప్రభుత్వంతో చర్చలు జరపటానికి సిధ్ధంగా ఉన్నామని ముందుకొచ్చారు. వారు ముందే సీఎం కె.సి.ఆర్ ను సంప్రదించామని అన్నారు. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగటానికి సిధ్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.

బంగారు తెలంగాణ ఏమో కానీ... మేఘా కంపెనీ మాత్రం బంగారమవుతోంది..!

  కాళేశ్వరం బహుళార్ధక ఎత్తిపోతల ప్రాజెక్టు... లక్ష కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు... టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్... అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహా ప్రాజెక్టు... ఇప్పటికే దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేశారు... ఇంకా వేల కోట్ల రూపాయల పని మిగిలే ఉంది. అయితే, ప్రాజెక్టును మాత్రం ప్రారంభించేశారు. అయితే, లక్షల కోట్ల ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటివరకు అదనంగా ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ బీడు భూములను పారింది లేదు. ప్రాజెక్టు ట్రయల్ రన్స్ మినహా తెలంగాణ రైతాంగానికి ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదు. కానీ ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టరును మాత్రం అపర కుబేరుడిని చేసింది.  ఈ ఒకే ఒక్క ప్రాజెక్టుతో మేఘా కంపెనీ తలరాతే మారిపోయింది. అవును... కాళేశ్వరం ప్రాజెక్టు... మేఘా కంపెనీకి కాసుల పంట పండించింది. కాళేశ్వరంతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేస్తామన్న కేసీఆర్....  తెలంగాణను బంగారంగా మార్చారో లేదో తెలియదు కానీ... మేఘా కంపెనీ తలరాతను మాత్రం బంగారంగా మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాత మేఘా కంపెనీ దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అమాంతం దూసుకొచ్చింది. ఫోర్బ్స్ జాబితాలో మొన్నటివరకు 47వ స్థానంలో ఉన్న మేఘా కంపెనీ యజమానులు... కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 39వ ప్లేస్ కి చేరుకున్నారు. అయితే, మేఘా కంపెనీ ఒక్కసారిగా పుంజుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని ఫోర్బ్స్ విశ్లేషించింది. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా నెట్ ప్రాఫిట్ 3వేల కోట్లు దాటిందని, అలాగే రెవెన్యూ 23శాతం వృద్ధి చెందిందని, దాంతో మేఘా ఫ్యామిలీ ఆస్తుల విలువ 6శాతం పెరిగాయని ఫోర్బ్స్ విశ్లేషించింది. ఇక, మేఘా కంపెనీ అంటే టక్కున గుర్తొచ్చేది మేఘా కృష్ణారెడ్డే. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఎండీగా ఉన్న కృష్ణారెడ్డిపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కలిసి దాదాపు 40వేల కోట్ల రూపాయలు పంచుకుని తిన్నారని ఆరోపిస్తున్నాయి. ఇరిగేషన్ నిపుణుల సైతం ప్రాజెక్టు వ్యయంలో 30శాతంపైగా అవినీతి జరిగిందని విమర్శిస్తున్నారు. దోపిడీ కోసమే రీడిజైనింగ్ పేరుతో మేఘా కంపెనీకి లక్షల కోట్ల రూపాయల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టబెట్టారంటూ మొదట్నుంచీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. ఫోర్బ్స్ జాబితా చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాతే మేఘా కంపెనీ విలువ అమాంతం పెరిగింది. దేశ అత్యంత ధనవంతుల జాబితాలో మేఘా ఫ్యామిలీ ఏకంగా 39వ స్థానానికి ఎగబాకింది. ఇక, ఫోర్బ్స్ లిస్ట్ తర్వాతే మేఘా కంపెనీపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో కాళేశ్వరంలో తిన్న సొమ్మంతా కక్కించాలని మేఘా వ్యతిరేక వర్గం కోరుకుంటోంది. మేఘా కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల బాగోతం బయటపడాల్సిందేనని విపక్షాలూ ఆశిస్తున్నాయి. అయితే, ఒకే ఒక్క కాళేశ్వరంతో మేఘా కంపెనీ ఫోర్బ్స్ జాబితా టాప్ 40కి వచ్చేస్తే, ఇక ఏపీ, తెలంగాణలో దక్కించుకుంటున్న, దక్కించుకోబోతున్న ప్రాజెక్టులతో వచ్చే ఏడాడే టాప్ టెన్ లోకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల దందా... మరీ ఇంత దారుణమా!!

  ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్ మొదలు పెడుతున్నారు అని అందరికి చేరువవుతున్న విషయం. ఏ వ్యాపారమైనా సరే కప్పం కట్టాల్సిందే నని హుకుం జారీ చేశారని, వారిని బెదిరింపులతో దారిలోకి తెచ్చు కుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారాలూ కాంట్రాక్టులు ఇసుక ఇతరాత్ర లావాదేవీల సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే లకు ఇవే ఆర్ధిక వనరులు. కానీ కొందరు ఎమ్మెల్యే లు మరీ చెలరేగిపోతున్నారు. నాలుగు నెలల్లోనే నియోజక వర్గ ప్రజలు అమ్మో అని బెదిరిపోయేలా చేస్తున్నారు. చిన్నా చితక పోస్టుల విక్రయం నుంచి కోట్ల విలువ చేసే భూముల సెంటిమెంట్ల దాక అన్ని దారులల్లో చెలరేగిపోతున్నారు. మరికొందరేమో విగ్రహావిష్కరణ నుంచి పోస్టింగ్ ల దాకా ఏదైనా తమ కనుసన్నలలోనే జరగాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేల తీరు తీవ్ర చర్చ నీయాంశంగా మారింది.  పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే బ్రాందీ షాపులో పని చేసే ఉద్యోగాలను కూడా అమ్ము కున్నట్టు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. విద్యుత్ శాఖలో వుండే కొన్ని పోస్టులు ఆరు లక్షల రూపాయలకు భారం పెట్టేశారు. ఇదే కాదు ఏ చిన్నపోస్టు ఉన్న ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే తాము చెప్పిన మొత్తం ఇస్తామని ఒప్పుకున్న వారిని పిలిపించుకుని అందరి సెల్ ఫోన్ లు బయటపెట్టించి వ్యవహారం సెటిల్ చేశారు.  గుంటూరు జిల్లాలో కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే లు బ్రాందిషాపుల్లో పోస్టులతో సహా చిన్న చిన్న వాటిని కూడా వదలకుండా విక్రయించుకొంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ పోస్ట్ యాభై వేలకు అమ్మినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు ఈ పనిని చక్కదిద్దేశారు అని సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే బిజినెస్ మెన్ తరహా రాజకీయం చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న ఏ వ్యాపార వర్గమైన తనతో మాట్లాడి సెటిల్ చేసుకోవాల్సిందేనన్న షరతు పెట్టారు. గ్రానైట్ క్వారీల నుంచి నియోజకవర్గస్థాయి సంతల వరకు ప్రతి వ్యాపార వర్గాన్ని పిలిచి నెలకు ఇంత అని మాట్లాడుకున్నట్లు తెలిసింది. సదరు ఎమ్మెల్యే తీరు పట్ల సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.  గుంటూరు జిల్లా కు చెందిన ఒక ఎమ్మెల్యే విగ్రహాల పైన కూడా ప్రతాపం చూపిస్తున్నారు. తమ గ్రామం లో ఫలానా నాయకుడు విగ్రహం పలానా కూడలి లో పెడుతున్నారట కదా పెట్టేందుకు వీల్లేదు అంటూ విగ్రహ ఆవిష్కరణ కోసం కట్టిన దిమ్మెను కూడా కూల్చి వేయించినట్టు తెలిసింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక నిర్వాహకులు ఒక ప్రైవేటు స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఆ ఎమ్మెల్యే వదల్లేదు. ఆ ప్రైవేటు స్థలం యజమాని ఎవరో తెలుసుకొని ఆయన కు ఫోన్ చేసి విగ్రహం పెట్టేందుకు అనుమతించనందుకు మీ సంగతి చూస్తాను అంటూ బెదిరించినట్లు తెలిసింది.  అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్ ల వ్యవహారం మొదలుపెట్టినట్లు సమాచారం. ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా భూ వివాదం ఉంటే అది చక్కబెట్టేస్తాను అంటూ దిగుతారు, లేకుంటే వారే తన దగ్గర కు వివాద పరిష్కారం కోసం వచ్చేలా చేస్తారు. ఇక అక్కడ కు వెళ్లాక ముందు గా ఆ స్థలం లో తనకు కొంత రాసివ్వాలి అంటూ అడుగుతున్నారని సమాచారం. ఇలా ఇప్పటికే కొన్ని స్థలా లు తమ వారి పేరు మీద రాయించుకొని ఆ తర్వాత వివాదాల సెటిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తన నియోజక వర్గం దాటి అనంతపురం లో కూడా ఈ మేరకు సెటిల్ మెంట్ లు చేస్తున్నారని తప్పని సరి పరిస్థితుల్లో భయంతో అతన్ని మాట వినాల్సి వస్తుంద ని కొందరు వాపోతున్నారు.  ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే దెబ్బ కు ఇద్దరు వ్యాపారులు విపరీతమైన భయాందోళనకు గురయ్యారు అని అంటున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న ఒక లాడ్జి యజమానిని పిలిచిన ఎమ్మెల్యే భారీ మొత్తం లో డబ్బు డిమాండ్ చేశారని తెలిసింది. అంత మొత్తమా అంటూ ఆ వ్యాపారి భయాందోళనకు గురయ్యారు. ఆ తరువాత కొన్ని రోజులకు సదరు వ్యాపారి చనిపోవడం వెనుక ఈ బెదిరింపు ప్రభావం కూడా ఉన్నట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కూడా ఇదే విధంగా బెదిరించినట్టు తెలిసింది. అతను వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ కు అవసరమైన అనుమతులు ఇవ్వాలంటే తనకు ఇంత ఇవ్వాల్సిందే నని హుకుం జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలకు విరాళా లు ఇస్తామని ఇలా వెంచర్ వేసినందుకు భారీ మొత్తంలో డబ్బు లు ఇవ్వలేమని చెప్పినా వినకుండా బెదిరింపులకు గురి చేశారని సమాచారం. ఈ ఎమ్మెల్యేల తీరు పై వారి నియోజకవర్గాలతో పాటు పార్టీ లోనూ చర్చ  కొనసాగుతోంది. మరి సీఎం జగన్ ఇప్పటికైనా జాగ్రత్త పడతారా లేదా అనేది వేచి చూడాలి.  

విశాఖపట్నంలో జనసేనకు ఏమవుతోంది...

రాజకీయ ప్రభంజనం అనుకున్న జనసేనకు సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నిశబ్దంగా ఉంది. ఆ పార్టీకి కీలకంగా భావించిన విశాఖపట్నం జిల్లాలో నాయకులు క్యాడర్ అత్మస్థైర్యం రోజురోజుకు తగ్గిపోతుంది. ప్రశ్నించటమె లక్ష్యంగా ఎగసిన యువశక్తి స్తబ్దతగా మారిపోయింది. భవిష్యత్ పై క్లారిటీ లేకపోవడం, అధినాయకుడి అంతరంగం అర్థం కాకపోవడంతో నాయకత్వంలో అయోమయం నెలకొంది. రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఏర్పడినపుడు త్రిముఖ పోటీ జరిగింది. ప్రధాన ప్రతిపక్షం టిడిపి బలహీనంగా ఉండటం, సామాజిక బలం, గట్టి పట్టు కలిగిన అభ్యర్ధులు బరిలో నిలవడంతో జిల్లాలో పీఆర్పీ నాల్గు స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. రెండు వేల పంతొమ్మిది నాటికి జనసేన పిఆర్పిని మించిన అంచనాలతో ఓటర్ల ముందుకొచ్చింది. ప్రయోగాలు కొలిక్ కి రాకుండానే ఎన్నికల బరిలో దిగి పొయింది. స్వయంగా జనసేన చీఫ్ గాజువాక నుంచి పోటీ చేశారు. సీబీఐ మాజీ అధికారి వివి లక్ష్మీ నారాయణ, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య వంటి వారు జనసేన తరపున రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. అభ్యర్ధుల ఎంపిక నుంచి ఎలక్షన్ నిర్వహణ వరకు జనసేన స్వీయ తప్పిదాలు ఒకటీ రెండు కాదు ఇంతటి ప్రతికూల పరిస్థితులలోనూ ఆ పార్టీ పలు స్థానాల్లో గౌరవప్రదమైన ఓట్లను కైవసం చేసుకుంది. యలమంచిలిలో టిడిపి, విశాఖ సౌత్ జోన్ నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి, విశాఖ ఉత్తరంలో మాజీ మంత్రి గంటా మెజార్టీ తగ్గటానికి జనసేనకు పోలైన ఓట్లే కారణం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తొలిసారే జనసేన తరపున విశాఖ ఎంపిగా పోటి చేశారు మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ. ఈ ఎన్నికలలో జనసేనా ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా శాతం ఓట్లు దక్కించుకుంది. గాజువాక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్ కు పరిమితమయ్యారు. వ్యక్తిగత ప్రతిష్ట, పార్టీ ఇమేజ్, కమ్యునిటి ఫ్యాక్టర్, టిడిపిలో అంతర్గత రాజకీయాలు వంటి ఎన్నో ఎన్నెన్నో అంశాలు అనుకూలించినా విజయం సాధించలేకపోయారు. ఆ క్రమంలో ఎన్నికలు సమీపించే నాటికి పార్టీలు పరిస్థితులూ అంతుపట్టకుండా అయిపోగా ఇపుడు పరిస్థితి మరి గందరగోళంగా తయారైంది. అధినాయకుడితో జిల్లా నాయకులకు సంబంధాలు దాదాపు తెగిపోయాయి. సీనియర్లకు సైతం సముచిత స్థానం, భవిష్యత్ పై భరోసా లభించని పరిస్థితి. ఈ తరుణంలో రాజకీయ మనుగడ సాగించాలంటే ఏదో ఒక మార్గం వెతుక్కోక తప్పదు అనే అభిప్రాయం నాయకులలో వ్యక్తమవుతోంది. జనం ఆదరణ పొందినప్పటికీ పార్టీ కార్యాచరణ తమ భవిష్యత్ అర్థంకాకపో నాయకులు నలిగిపోతున్నారు. రాజకీయంగా సంధికాలం గడుపుతున్నవారు, తమ భవిష్యత్తును ఇతర పార్టీలో వెతుక్కునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల తర్వాత వివి లక్ష్మీ నారాయణ సామాజిక సేవకు పరిమితమయ్యారు. జెడి ఫౌండేషన్ తో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ ఆ జెండా కింద ఎటువంటి యాక్టివిటీ చేయటంలేదు. అనకాపల్లి నుంచి పోటీ చేసి రచయితల పార్థసారథి బీజేపీలో చేరి పోయారు. కేంద్ర కార్యాలయ వ్యవహారాలలో కీలకమైన పార్థసారథి పార్టీకి రాజీనామా చేసి జిల్లా స్థాయిలో పార్టీని వీడిన తొలి నాయకుడయ్యారు. పార్థసారథి ఒక్కరే కాదు, సమీప భవిష్యత్తులో మరికొంతమంది జనసేనకు గుడ్ బై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బాలరాజుతో వైసిపి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య డోలాయమానంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపికి స్థానిక సంస్థల ఎన్నికల పెద్ద సవాల్. విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం ప్రతిష్ఠాత్మకం ఈ నేపధ్యంలో సీనియర్ అవసరం కావాలి అంటున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. ఇప్పటికే టిడిపిని కాలిచేయడం పనిగా భారీగా వలసలు స్వాగతిస్తుంది వైసిపి. ఈ తరుణంలో జనసెనలో మిగిలిన నేతలతో ఎలా డీల్ చేస్తుందో చూడాలి ఇక.

ఆస్తులు కాపాడుకోడం కోసం బీజేపీలో చేరబోతున్నారా?

మొన్నటి వరకు సంచలనం సృష్టించిన విషయం కరకట్ట నిర్మాణాల తొలగింపు చర్యలు .కృష్ణా కరకట్ట నిర్మాణాల తొలగింపు విషయంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చ జరుగుతోంది. కరకట్ట మీద చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా వివిధ నిర్మాణాలకు గెస్ట్ హౌస్ లకు సీఆర్డీయే నోటీసులిచ్చింది. అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారని, వాటిని స్వచ్ఛంధంగా తొలగించాలని లేకుంటే తామే కూల్చివేతకు దిగాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ మేరకు డెడ్ లైన్ లతో గోడలకు నోటిస్ లను అంటించి హడావుడి చేసింది. ఓ నిర్మాణంలో నది లోపలికి చొచ్చుకుని వెళ్లి నిర్మించిన ర్యాంపును కూడా సీఆర్డీయే అధికారులు తొలగించారు. దాంతో చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ సహా మిగిలిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించేస్తారనే చర్చ జోరుగా సాగింది. ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులు కూడా అదే ఊపులో ఉన్నట్టు కనిపించారు. అయితే తనను వేధిస్తున్నారని తన గెస్ట్ హౌస్ నిర్మాణం అంతా పద్ధతి గానే జరిగిందని అన్ని నిబంధనలు ఉన్నాయంటు లింగమనేని రమేష్ కోర్టుకెక్కారు. ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామం అయితే రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న పరిస్థితులను  ఏపీలో కరకట్ట కట్టడాల విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం బీజేపీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు చేరారు. వీరిలో చెప్పుకోదగ్గ ముఖ్యులు ఉన్న వారి సంఖ్య తక్కువే అయినా ఇటీవల కాలంలో బీజేపీలో చేరిన వారి మీద శ్రద్ధ కొద్దిగా ఎక్కువ గానే వచ్చిందని చెప్పాలి. దానికి కారణం లేకపోలేదు. తెలంగాణ టిడిపి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ తెలుగుదేశాన్ని వీడి బీజేపీలో చేరారు. అలాగే ఏపీ నుంచి శనక్కాయల అరుణ కూడా పార్టీలో చేరారు. శనక్కాయల అరుణ కొంతకాలంగా టిడిపిలో యాక్టివ్ గా లేకున్నా సెడన్ గా బీజేపీలో చేరి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేశారు. వారితో పాటే ఇంకొంతమంది కూడా చేరి పోయారు. సందట్లో సడేమియా అన్నట్టుగా కరకట్టు మీదున్న నివాసాలకు చెందిన ఇద్దరు పెద్దలు బీజేపీలో చేరి పోయారు. పాతూరి నాగభూషణం అలాగే ఎస్ఆర్ఐ రామినేని బీజేపీ తీర్థం పుచ్చుకున్న బరిలో ఉన్నారు. ఇపుడిదే ఏపీ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. కరకట్ట విఐపిలకు బిజెపి షెల్టర్ జోన్ గా మారినా, తమ నిర్మాణాలు కాపాడుకునేందుకు కర్కట్ట విఐపిలూ బిజెపిని ఆశ్రయిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. కరకట్టపై ఉన్న నివాసాలులో మాజీ ఎంపి బిజెపి సీనియర్ నేత గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ ఉంది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణం కూడా అక్రమమేనని సీఆర్డీయే బాధిస్తోంది. దీనికి సంబంధించిన చర్చ ఓవైౖపు జరుగుతూనే ఉండగా మరో ఇద్దరు కరకట్ట విఐపిలూ బీజేపీ పంచన చేరడం హాట్ టాపిగ్గా మారింది. దీంతో సదరు కరకట్ట పెద్దలు తమ తమ నిర్మాణాలను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. మొన్నటి వరకూ కరకట్టపై సింగిల్ స్థానానికి పరిమితమైన బిజెపి వీఐపీల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరడం పై ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో వీరి నిర్మాణాల విషయంలో కానీ, మిగిలిన కరకట్ట నిర్మాణాల విషయంలో కానీ సర్కార్ వైఖరి ఏ విధంగా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కరకట్ట నిర్మాణ విషయంలో మొన్నటి వరకు చూపిన దూకుడు ఇక పై కూడా చూపుతారా లేక ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ సైలెంట్ అయిపోతారా అనేది ఆసక్తిగా మారింది. బీజేపీ విధానాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం లేదు. కనీసం రాజకీయ పరమైన అవసరాల వల్ల కూడా కాకుండా ఇలా తమ ఆస్తులను కాపాడుకోవడానికి కమలం బాట పట్టడం చూసి ఆ సొంత పార్టీ నేతలకు ఎనలేని కోపంతో మండిపడుతున్నారు.

ఓరుగల్లు జిల్లాలో చక్రం తిప్పబోయేది ఎవరు...

  పూర్వం బలమున్నవాడిదే రాజ్యం అన్న మాట మనం విన్నం కానీ ఇప్పుడు రాచరికాలు పోయినా మాటల్లోని విషయాన్ని మాత్రం మనం కళ్లారా చూస్తున్నం. దీనికి ఉదాహరణ ఉమ్మడి ఓరుగల్లు జిల్లాని తీసుకుంటే ఇక్కడ అధికార పార్టీలో నేతల బలపరీక్షలు పెరుగుతున్నాయి. స్థానికంగా గ్రూప్ రాజకీయాలు కొత్త కానప్పటికీ తాజగా ఏర్పడిన వర్గపోరు మోతాదు మించిందని చెప్పాలి. కొందరు నాయకులు రెండు గ్రూపులుగా విడిపోతే మరికొందరు ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా ఏకంగా రాష్ట్ర నాయకత్వంతోనే చేరువులో కి వెళ్లారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలే ఇప్పుడు టీఆర్ఎస్ లోనూ చక్రం తిప్పుతున్నారు. ఇద్దరూ రాజకీయాల్లో తలపండిన నేతలే కడియం శ్రీహరి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుత కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. పైకి ఇద్దరు కలిసున్నట్టే అనిపించినా అంతర్గతంగా మాత్రం ఎవరి వర్గం వారిదే గతంలో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు కూడా వీరి మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగేవి ఒక దశలో ఇద్దరు నేతలు నేరుగా ఎదురుపడి తిట్టుకున్న సందర్భాలున్నాయి. అయితే అదంతా గతం ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ లో ఉన్నారు. క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. గత మంత్రి వర్గ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరినప్పట్నుంచి వీరిద్దరూ ఒక్కటయ్యారని అంత అనుకున్నారు. కానీ గతంలో వారి మధ్య ఉన్న విబేధాలు అంతర్గతంగా కొనసాగుతూనే ఉన్నాయి. పైకి కనిపించినంతగా వారి మధ్య సఖ్యత లేదని టీఆర్ఎస్ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.  మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న కీలక నేతలు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు కడియం శ్రీహరి వర్గమైతే, మరికొందరు ఎర్రబెల్లి వర్గం కొనసాగుతున్నారు. ఈ రెండు గ్రూపులతో సంబంధం లేకుండా మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న కొంత మంది నేతలు నేరుగా అధినాయకత్వంతోనే వారు చేరువులో ఉంటున్నారు. అభివృద్ధి పనుల విషయంలో గానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని ఒక నేత పాల్గొంటే ఆయనకు అనుకూలంగా ఉండే ఇతర నేతలే వాటిని ముందుండి నడుపుతున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ముప్పై రోజుల ప్రణాళిక అమలు కార్యక్రమంలోనూ ఈ గ్రూపు రాజకీయం స్పష్టంగా కనిపించింది. మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత ఈ గ్రూపు విభేధాలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన నేతలు చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కడియం శ్రీహరి, మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వీరంతా మంత్రి పదవి ఆశించిన వారే. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కడియం శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఆ లిస్ట్ లో నుంచి కడియం శ్రీహరి పేరు మాయమైంది. అయితే కడియంకు మంత్రి పదవి రాక పోవడానికి ఎర్రబెల్లి దయాకర్ రావునే కారణమని కడియం అనుచరులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఊహించుకున్న దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవితో సరిపెట్టారు. అయితే ఆశించిన వారికి మంత్రి పదవులు దక్కక పోవడంతో ఒకరి పై ఒకరు అనుచరులు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు కీలక పదవులు కట్టబెట్టిన కేసీఆర్ ఈ సారి మాత్రం కాస్త మొండి చేయి చూపారని చెప్పాలి. గత మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా మొదటి రాజయ్యను తీసుకున్నారు. తర్వాత ఆయన తప్పించి ఆ పదవిని కడియం శ్రీహరికి కట్టబెట్టారు. ములుగు ఎమ్మెల్యేగా ఉన్నందుకు చందూలాల్ కు మంత్రి పదవి ఇచ్చారు. భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మధుసూదనాచారికి స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి ఓరుగల్లుకే రెండు మంత్రి పదవులు చీఫ్ విప్ పదవి మాత్రమే ఇచ్చారు. మొన్నటి వరకు ఒకే ఒక మంత్రి గా ఎర్రబెల్లి దయాకరావు కొనసాగారు, ఇప్పుడు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కు మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు.దాస్యం వినయ్ భాస్కర్ కు చీఫ్ విప్ పదవి ఇచ్చారు. గత ప్రభుత్వంలోనే మంత్రి పదవి ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయనకంటే ముందే టిడిపి నుంచి టిఆర్ఎస్ లో చేరిన సత్యవతి రాథోడ్ కు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. దీనిపై రెడ్యా నాయక్ కొంత అలక వహించినట్లు సమాచారం. మంత్రి పదవులు ఆశించిన వారికి అవి దక్కలేదు. అందువల్ల నామినేటెడ్ పోస్టులపై ఇప్పుడు వారి కన్ను పడింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సీఎంకు దగ్గరగా ఉండే వ్యక్తులతో పైరవీలు చేయించుకునే పనిలో బిజీగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టచ్ లో ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల్లో కొందరు కడియం శ్రీహరిని, మరికొందరు ఎర్రబెల్లి దయాకర్ రావుని నమ్ముకొని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయన దగ్గరకు ఆశావహులు క్యూ కడుతున్నారు. ఇక ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ఒరుగల్లుల్లో ఎవరు చక్రం తిప్పబోతున్నారో చూడాలి.

రైతులకు రుణాలు ఇకపై అందేనా?

  అన్నదాతా సుఖీభవ అని అన్నం తిన్న ప్రతీ ఒక్కరు మనస్పూర్తిగా అనే మాట.రెండేళ్లుగా అన్నదాతలకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రైతు సంక్షేమ పథకాలకూ క్రమంగా చరమగీతంపాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గడువు ప్రకారం రుణం చెల్లించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పావలా వడ్డీ వడ్డీ లేని రుణం వడ్డీ రాయితీలను పూర్తిగా అటకెక్కించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల లోపు వ్యవసాయ రుణాలకు రెండు శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. దాంతో ఏడు శాతానికే వ్యవసాయ రుణం లభిస్తుంది. ఆ రుణం గడువులోగా చెల్లిస్తే మరో మూడు శాతం వడ్డినీ రైతులకూ వెనక్కిస్తారు. అంటే నాలుగు శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం లక్ష రూపాయల రుణం వరకూ ఒక శాతం భారం భరించి, మూడు శాతానికే రైతులకు రుణం లభించేట్టు చేసింది. దీన్నే పావలా వడ్డీ రుణం అనేవారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న రోజులలో లక్ష రూపాయల లోపు రుణానికి ఆ పావలా వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గడువు ప్రకారం రుణం చెల్లించిన రైతులకు వడ్డీ సొమ్మును తిరిగి ఇచ్చేవారు.  రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన నేపథ్యంలో స్తోమత ఉన్న రైతులు కూడా బ్యాంకు అప్పులు చెల్లించాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని నాలుగు దఫాలుగా నాలుగేళ్ల పాటు అమలుచేసింది. ఈనేపధ్యంలో మొత్తం పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణ పథకం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. ఏ రైతూ గడువు లోగా చెల్లించక పోవడంతో ఎవరికి పావలా వడ్డీ లేద వడ్డీ లేని రుణం వర్తించని పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ ద్వారా రైతు పొందిన లబ్దిలో నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు గడువు దాటినందుకు అధిక వడ్డీల రూపంలో రైతు చెల్లించాల్సి వచ్చింది. ఆ తరవాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి డబ్బులు కేటాయించడమే మానేసింది. మొత్తం మీద ఐదేళ్లుగా ఈ పథకం అటకెక్కింది. కేంద్రం మాత్రం తన వంతు వాటాగా గడువులోగా చెల్లించిన రైతులకూ ఆర్బీఐ ద్వారా మూడు శాతం వడ్డీ రాయితీ కింద బ్యాంకు లకు నగదు జమ చేస్తూ వస్తోంది. పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణం పథకం కింద రెండు వేల పద్నాలుగు, పదిహేను ఆర్థిక సంవత్సరం నాటి బకాయిలే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది. మే ముప్పై ఒకటి న రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల విడుదలకు జీవో వచ్చింది. కానీ ఆర్థిక శాఖ నయా పైసా విడుదల చేయలేదు.  రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సర్వరోగ నివారిణిగా భావిస్తుంది. రెండు వేల పధ్ధెనిమిదిలో ఖరీఫ్, రబీ సీజన్లకు ఎకరానికి నాలుగు వేల చొప్పున ఏడాదికి ఎనిమిది వేల రూపాయల పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పది వేలకు పెంచింది. ప్రతి సీజన్ కు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బు ఇచ్చినప్పుడు ఇతర పథకాల అవసరం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే వడ్డీ లేని రుణం పథకాన్ని నిలిపివేశారు. రుణమాఫీ పథకాన్ని కూడా పక్కాగా అమలు చేయటం లేదు. మరోవైపు బ్యాంకర్లు వడ్డీ రాయితీకి కిసాన్ క్రెడిట్ కార్డులకు లింక్ పెడుతూ ప్రతిపాదనలు తయారు చేశాయి. కేవలం కేసీసీ ఉన్న రైతులకే వడ్డీ రాయితీని అమలు చేయాలని బ్యాంకులు ప్రభుత్వానికి సూచించాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ఎజెండాలో దీనిని పొందుపరిచారు. మూడు శాతం వడ్డీ రాయితీని రైతుల కిస్తున్న కేంద్రం బంగారు రుణాల పేరిట అనర్హులు వడ్డి రాయితీ పొందుతున్నారని భావిస్తోంది. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడుల్లో ఈ వ్యవహారం జరుగుతోందని కేంద్రం గుర్తించింది. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. అయితే రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు లేవు. వారందరికీ వడ్డీ రాయితీ ప్రయోజనాలూ బంగారం రుణం ప్రయోజనాలు అందవు. రైతన్నకు తోడుగా ఉంటూ 'జై కిసాన్' అని ప్రముఖ్యతను ఇస్తున్న రైతులకు రుణం అందుతుందో లేదో వేచి చూడాలి.

విశాఖ జిల్లా వైసీపీలో కోల్డ్ వార్... మంత్రి అవంతిపై జగన్‌కు ఫిర్యాదులు..!

విశాఖ జిల్లా వైసీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా మండుతోన్న మంటలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కేంద్రంగా గొడవలు రాజుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసి బంపర్ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవినే దక్కించుకున్న అవంతి... విశాఖ జిల్లాలో ఎవర్నీ లెక్కచేయడం లేదనే మాట వినిపిస్తోంది. జిల్లాలో తానే కింగ్ అన్నట్లుగా వ్యహరిస్తున్నారని, దాంతో అందరితోనూ గొడవలు అవుతున్నాయని అంటున్నారు. మొన్నటికి మొన్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌తో అవంతి గొడవపడ్డారన్న వార్త... వైసీపీలో కలకలం రేపగా, తాజాగా మరో కీలక నేత, వీఎంఆర్‌డీ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్ తో ఏకంగా అందరి ముందే మాటల యుద్ధానికి దిగడం సంచలనం సృష్టిస్తోంది. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో మంత్రి అవంతి... వీఎంఆర్డీ చైర్మన్ ద్రోణంరాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. అవంతి ప్రసంగిస్తుండగా, అదే స్టేజ్ పై ద్రోణంరాజు శ్రీనివాస్...కలెక్టర్ తో సంభాషిస్తున్నారు. అయితే, ఇబ్బందిగా ఫీలైన అవంతి... అన్నా శీనన్నా... నగరంలో పెరిగిన మీకు గ్రామీణ కష్టాలు తెలియవు... కొద్దిగా వినండన్నా అంటూ కామెంట్ చేయడంతో, ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. అవంతి మాటలతో నొచ్చుకున్న ద్రోణంరాజు... తాను మాట్లాడుతున్న టైమ్ లో ఘాటుగా బదులిచ్చారు. కుగ్రామంలో పుట్టి, పట్టణంలో పెరిగిన తనకు రెండు ప్రాంతాల గురించి అవగాహన ఉందని, కానీ ఎక్కడ్నుంచో వలసొచ్చి, ఇక్కడకొచ్చి వ్యాపారాలు చేసుకునేవాళ్లకు పల్లెటూళ్ల బాధలు ఏం తెలుస్తాయంటూ అవంతికి గట్టిగా కౌంటరిచ్చారు. అంతేకాదు చిన్నాపెద్దా చూసి మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో కంగుతిన్న అవంతి.... ద్రోణంరాజును బుజ్జగించే ప్రయత్నం చేశారు. తన మాటలను అపార్థం చేసుకున్నారంటూ సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. అయితే, ఇదంతా వందల మంది ముందు జరగడంతో వైసీపీ నేతలు షాకయ్యారు. అయితే, అవంతి వ్యవహార శైలి, విశాఖ జిల్లా వైసీపీలో గొడవలు, నేతల మధ్య కోల్డ్ వార్... జగన్ దృష్టికి వెళ్లడంతో క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సమయంలో నేతలు ఇలా బహిరంగంగా తిట్టుకుంటే ఎలా అంటూ మందలించారట. ప్రతి ఒక్కరూ విభేదాలను పక్కనబెట్టి, పార్టీ పటిష్టతకు కలిసి పనిచేయాలని, విశాఖ కార్పొరేషన్ లో వైసీపీ జెండా ఎగిరేలా కృషి చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.