చెప్పేవి విలువల్స్.. పక్కనే క్రిమినల్స్!
posted on Jul 22, 2024 @ 4:36PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున తన మార్క్ హంగామా ప్రదర్శించారు. ఆయన తీరు నీతులు చెప్పడానికే కానీ ఆచరించడానికి కాదని ఫిక్సైపోయినట్లు ఉంది. ఓ వైపు విలువల గురించి మాట్లాడుతూ.. అదే సమయంలో శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టుకున్నారు. అలాగే దళితుడి శిరోముండనం కేసులో కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించిన తోట త్రిమూర్తులూ ఆయన పక్కనే ఉన్నారు.
మొత్తం మీద జగన్ అసెంబ్లీ సజావుగా సాగడం జగన్ కు సుతరామూ ఇష్టం లేదన్న సంగతిని తొలి రోజు విస్పష్టంగా బయటపెట్టుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించే ఉద్దేశం అంతకన్నా లేదని ఆయన చాటారు. ఏదో విధంగా సభలో గలాటా సృష్టించి వాకౌట్ చేయడమో, లేదా సస్పెండ్ అవ్వడమో లక్ష్యంగా ఆయన వ్యవహార శైలి ఉందన్న విమర్శలను మూటకట్టుకున్నారు.
అసెంబ్లీలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి.. తద్వారా ఈ నెల 25న తాను తలపెట్టిన ఢిల్లీ ధర్నాకు మైలేజ్ వచ్చేలా చూసుకోవాలన్న తాపత్రేయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇక సోమవారం (జులై22) జగన్ ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చొచ్చుకుని పోవడానికి ప్రయత్నించారు. నిబంధనల ప్రకారం సభలోకి ప్లకార్డులను తీసుకువెళ్లడానికి వీలు లేదు. ఆ కారణంగా పోలీసులు అడ్డుకుంటే వారితో ఘర్షణ పడినంత పని చేశారు. ప్రజాస్వామ్యం, నిబంధనలు అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ప్రజాస్వామ్యం, పోలీసుల విధులు అంటూ ఆయన ప్రసంగించారు. పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆయన పోలీసులకు పోలీసు విధులు, ధర్మం, న్యాయం అంటూ సూక్తులు చెబుతున్న వీడియోలో ఆయన పక్కనే ఇటీవలే శిరోముండనం కేసులో కోర్టులో దోషిగా తేలిన తోట త్రిమూర్తులు ఉన్నారు.
అంతే కాదు ఆయన వెంట ఉన్న బృందంలో హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కూడా ఉన్నారు. వాళ్లిద్దరినీ పక్కన పెట్టుకుని జగన్ ప్రజాస్వామ్యం, హక్కులు, పోలీసుల విధులు అంటూ ప్రసంగించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాను అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యం ఖూనీ అయినా పట్టించుకోని, పైపెచ్చు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన అనంతబాబు, తోట త్రిమూర్తులు లాంటి వారిని వెనకేసుకొచ్చిన జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటూ నినాదాలు చేయడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.