తమిళిసై నియామకం కేసీఆర్‌కు ఇష్టం లేదా? మరి ఆ ఆర్టికల్ రాయించిందెవరు?

తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసైపై అప్పుడే రాజకీయ దుమారం మొదలైపోయింది. తమిళిసై ప్రమాణస్వీకారం చేసిన రోజే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ డైరెక్ట్ గా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. గవర్నర్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ సీపీఆర్వో రాసిన వ్యాసం దీనికి కేంద్రమైంది. సర్కారియా కమిషన్ సిపార్సులను ఊటంకిస్తూ రాసిన వ్యాసంలో... తమిళిసై నియామకంపై పరోక్షంగా టీఆర్ఎస్ సర్కారు అయిష్టతను బయటపెట్టిందనే మాట వినిపిస్తోంది. ఎక్కడా తమిళిసై పేరు ఎత్తకుండా రాసిన ఈ వ్యాసంలో... రాజకీయంగా చురుగ్గా ఉన్న నేతలను గవర్నర్లగా నియమించకూడదనే సర్కారియా కమిషన్ సిఫార్సులను ప్రస్తావించారు. గవర్నర్ వ్యవస్థపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందంటూ సీఎం కేసీఆర్ సీపీఆర్వో విశ్లేషణ సాగింది. అయితే సీఎం సీపీఆర్వో ఆర్టికల్ పై బీజేపీ మండిపడుతోంది. అసలు సర్కారియా కమిషన్ సిఫార్సులు ఎక్కడ అతిక్రమించామో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు గవర్నర్ ను గౌరవిస్తామని చెబుతూనే, మరోవైపు గవర్నర్ వ్యవస్థను అవమానించేలా వ్యాసాలు రాయించడమేంటని కాషాయ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి, పైగా సీఎం సీపీఆర్వో... రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ పై అనుమానాలు, అపోహలు ఉన్నాయంటూ, ఆర్టికల్ రాసే స్వేచ్ఛ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆర్టికల్ రాసిన వ్యక్తికి సర్కారియా కమిషన్ సిఫార్సులు గురించి కనీస అవగాహన లేదని మండిపడ్డారు. ఇదంతా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తోన్న బీజేపీ... సీపీఆర్వోను వెంటనే తొలగించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. గవర్నర్ పై అనుచిత ఆర్టికల్ రాసిన సీఎం సీపీఆర్వోపై చర్యలు తీసుకోకపోతే, క్రిమినల్ కేసు పెడతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. అయినా, గవర్నర్‌గా బాధ్యతలు తీసుకుని 24గంటలు కూడా గడవకముందే ఇలా విషం కక్కడమేంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, గవర్నర్ల నియామకం రాష్ట్రపతి చేతుల్లో ఉంటుందని, దాన్ని రాజకీయాల్లోకి లాగడం సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ గా తమిళిసైకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామన్న కేటీఆర్... ఆమె మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. మరోవైపు మిగతా గవర్నర్లకు భిన్నంగా బాధ్యతలు స్వీకరించినరోజే తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తమిళిసై... కేసీఆర్ పరిపాలనను, అమలు చేస్తోన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రశంసించారు. బంగారు తెలంగాణ సాధనలో తాను కూడా భాగస్వామ్యమైనందుకు సంతోషంతో ఉందంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి, తెలంగాణకు కొత్త గవర్నర్ రాక సందర్భంగా, సీఎం కేసీఆర్ సీపీఆర్వో రాసిన వ్యాసం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, రాజకీయ కోణంలోనే తమిళిసైని తెలంగాణకు గవర్నర్ గా పంపారనే ప్రచారం విస్తృతంగా సాగుతుండటంతో, ఆమె నియామకం.... సీఎం కేసీఆర్ కు కూడా ఇష్టం లేదనే చర్చ నడుస్తోంది. మరి ముందుముందు ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి.

పల్నాటి యుద్ధం... వడ్డీతో సహా చెల్లిస్తామంటూ బాబు వార్నింగ్

  పల్నాడు పేరు చెబితేనే పగలు ప్రతీకారాలు గుర్తుకొస్తాయి. దాడులు ప్రతిదాడులు కామన్ గా కనిపిస్తాయి. ఇక అధికారం మారినప్పుడల్లా పరిస్థితులూ మారిపోతాయి. అందుకే, ఇప్పుడు పల్నాడులో కొత్త యుద్ధం నడుస్తోంది. ఆనాటి పల్నాటి యుద్ధాన్ని తలపించేలా అధికార వైసీపీ... ప్రతిపక్ష టీడీపీ... కత్తులు దూసుకుంటున్నాయి. రాజకీయ దాడులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిప్పులు కక్కుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక... గూండాయిజం పెరిగిపోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే...  టీడీపీ వాళ్లే దాడులు చేస్తూ... తిరిగి వైసీపీపై విమర్శలు చేస్తున్నారంటూ అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. పల్నాడులో రాజకీయ దాడుల బాధితుల కోసం పునరావాస శిబిరం ఏర్పాటు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు... వైసీపీ వంద రోజుల పాలనలో ఐదు వందలకు పైగా దాడులు జరిగాయని, పది మందిని చంపేశారని ఆరోపించారు. ఇదే తరహాలో దాడులు కొనసాగిస్తే, భవిష్యత్తులో అంతకంతకు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ చంద్రబాబు హెచ్చరించారు. ఇక నారా లోకేష్ కూడా రాజకీయ దాడులపై నిప్పులు చెరిగారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానని రాక్షస పాలన తెచ్చారంటూ మండిపడ్డారు. అయితే, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే, తప్పుడు కేసులు పెడుతూ తమ కార్యకర్తలను ఊరు వదిలిపెళ్లిపోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయితే, తెలుగుదేశం ఆరోపణలపై హోంమంత్రి సుచరిత ఘాటుగా స్పందించారు. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పల్నాడు ప్రశాంతంగా ఉందని, ఆ ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించొద్దని సూచించారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో టీడీపీ పునరావాస కేంద్రాలు నిర్వహిస్తోందన్న సుచరిత... అసలక్కడ నిజంగా బాధితులు ఉన్నారో లేదో తెలుసుకునేందుకు నిజనిర్ధారణతోపాటు సమగ్ర విచారణ చేపడతామని ప్రకటించారు.  ఒకవేళ పునరావాస కేంద్రాల్లో నిజంగానే బాధితులు ఉంటే, పోలీసులే వారిని స్వయంగా గ్రామాలకు తీసుకెళ్లి...రక్షణ కల్పిస్తారని హోంమంత్రి హామీ ఇచ్చారు. అలాగే, టీడీపీ ఛలో ఆత్మకూరుకు అనుమతి లేదని, ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

హరీష్ రావుకి చెక్ పెట్టిన కేసీఆర్.. ఆర్ధిక శాఖ ఇవ్వడం వెనుక మాస్టర్ ప్లాన్!!

  తెలంగాణలో ఆదివారం నాడు మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. హరీష్ రావు, కేటీఆర్ సహా ఆరుగురు నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్.. హరీష్ రావుకి కీలకమైన ఆర్ధిక శాఖను అప్పగించారు. దీంతో హరీష్ అభిమానుల్లో సంతోషం నెలకొంది. అయితే ఒక్కరోజులో సీను పూర్తిగా రివర్స్ అయింది. హరీష్ కు ఆర్ధిక శాఖను అప్పగించడం వెనుక కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఉందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2019-20 ఏడాదికి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణపై ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని అన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తామని చెప్పటంతో పాటు.. ఇక నుంచి ఎలాంటి కొత్త అభివృద్ధి పనులు ఉండబోవని.. బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం తీసుకున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. ఓ రకంగా ఖాళీ గల్లా పెట్టెను హరీష్ చేతికి ఇచ్చిన కేసీఆర్.. అందులోకి వచ్చే ఆదాయం ఏమైనా సరే.. తాను చెప్పిన రీతిలో బకాయిల చెల్లింపులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేశారు. ఏ శాఖకు ఎంత కేటాయింపు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ కు అధికారం ఉండాలి. కానీ, ఆర్థిక శాఖ ఏం చేయాలన్న విషయాన్ని కేసీఆర్ తన స్పీచ్ లో చెప్పేయటంతో.. పరిమితుల మధ్య హరీష్ పని చేయటానికి మించి చేసేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే.. ఆర్థికమంత్రిగా హరీష్.. సింపుల్ గా ఆఫీసుకు రావటం, వెళ్ళటం తప్పించి పెద్దగా చేసేందుకు పనేమీ ఉండదని అంటున్నారు. దానికి తోడు దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం వలన తెలంగాణలో కూడా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఏ పనులకైన నిధులు కొరత ఏర్పడితే ఆర్థిక మంత్రి హోదాలో హరీష్ రావు సమాధానం చెప్పాలి. దీన్నిబట్టి చూస్తుంటే.. ఆర్థిక మాంద్యం సమయంలో హరీష్ రావుకి ఆర్ధిక శాఖను అప్పగించి, ఖాళీ గల్లా పెట్టెను చేతికిచ్చి ఇరుకున పెట్టారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కారే కాదు... సైకిల్ కూడా ఉంది... యాదాద్రి వివాదంలో లాజిక్ మిస్సయిన అధికారులు

  పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వివాదం రాజుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్ నిర్మిస్తోన్న యాదాద్రి ఆలయంలో రాజకీయ నాయకుల చిత్రపటాలు కలకలం రేపాయి. దేవతా విగ్రహాలు, సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర ఉండాల్సిన చోట... పొలిటికల్ లీడర్స్, పార్టీల గుర్తులు, మేనిఫెస్టోలను పెట్టారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారు, అలాగే కేసీఆర్ చిత్రపటాలను ఆలయ ప్రాకారాల్లో చిత్రీకరించడంపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. అయితే, యాదాద్రి రాతి స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలను చెక్కడంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు. ఏ ఆలయంలోనైనా అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా శిల్పాలు చెక్కడం సర్వసాధారణమని యాదాద్రి ప్రత్యేకాధికారి కిషన్ రావు తెలిపారు. ఇవి ఏ వ్యక్తి కోసమో చెక్కినవి కావని, ఫలానా బొమ్మలు చెక్కమని శిల్పులకు ఎవరూ చెప్పలేదని, సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా, వాళ్లే స్ఫూర్తిపొంది చిత్రాలను చెక్కారని అన్నారు. అలాగే కేసీఆర్‌పై అభిమానంతోనే ఆయన చిత్రపటాన్ని శిల్పులు చెక్కారని వైటీడీఏ అధికారి కిషన్‌రావు చెప్పుకొచ్చారు. అంతేగాని సీఎం కేసీఆర్ మెప్పు కోసమే చెక్కించామని చెప్పడం సరికాదన్నారు. ఇక కారును ఒక పార్టీ గుర్తు మాత్రమే చూడటం దుర్మార్గమన్న కిషన్ రావు.... రాతి స్తంభాలపై ఒక్క కారు మాత్రమే లేదని, ఎడ్లబండి, సైకిల్, రిక్షా... ఇలా అనేక బొమ్మలు ఉన్నాయన్నారు. అయితే,  కేసీఆర్ చిత్రపటం చెక్కడాన్ని సమర్ధించుకునే ప్రయత్నంచేశారు. అహోబిలం శిలలపై గాంధీ, నెహ్రూ బొమ్మలున్నాయని, ఒకవేళ అభ్యంతరాలుంటే కేసీఆర్ బొమ్మను తీసేస్తామంటూ చెప్పుకొచచారు కిషన్ రావు. మొత్తానికి యాదాద్రి వివాదాన్ని తెలివిగా శిల్పులపైకి నెట్టే ప్రయత్నం జరిగింది. అయితే, ఇక్కడ అధికారుల తెలివి తక్కువతనం క్లియర్ గా బయటపడింది. ఎందుకంటే, రెండువేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఆలయంలో శిల్పులే తమంతట తాముగా శిల్పాలు చెక్కడం సాధ్యమేనా? పైగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, అధికారుల నిరంతర పర్యవేక్షణలో యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం జరుగుతుంటే, ఎలాంటి దిశానిర్దేశం లేకుండానే శిల్పులు... వాళ్లకు నచ్చిన చిత్రాలను వాళ్లు చెక్కేస్తారా? అసలు జరిగే పనేనా? కాదని, సామాన్యుడిని అడిగినా చెబుతారు. మరి అధికారులు ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయారో..! ఏదేమైనా యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో రాజకీయ నేతల చిత్రాలను చెక్కడంపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. బీజేపీ, హిందూసంస్థలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.

ఒకే ఒక్క అడుగు దూరంలో లక్ష్యం... ఇస్రోకి ఇదే అసలుసిసలు సవాలు...

  వెయ్యి కోట్ల రూపాయలతో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి దశకు చేరుకుంది. చందమామను అందుకోవడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది ఇస్రో. చందమామ చివరి కక్ష్యలో పరిభ్రమిస్తోన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్... మరికొన్ని గంటల్లో జాబిల్లిపై అడుగు పెట్టబోతున్నాయి. అయితే, ఇప్పటివరకు సాగిన చంద్రయాన్-2 ప్రయాణం ఒక ఎత్తయితే... చివరిగా జరగాల్సిన సాఫ్ట్ ల్యాండింగే అతిపెద్ద సవాలుగా మారింది... చంద్రుడి దక్షిణధృవం వైపు దూసుకెళ్తోన్న ల్యాండర్ విక్రమ్‌ను సజావుగా దిగేలా చేయడమే ఇప్పుడు ఇస్రో ముందున్న లక్ష్యం. సెకనుకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ల్యాండర్ విక్రమ్‌ను చందమామ దక్షిణ ధృవంలో సురక్షితంగా దిగేలా చేయడం అత్యంత సంక్లిష్ట పని. చంద్రుడి ఉపరితలంపై ఎగుడు దిగుడు లేని ప్రదేశాన్ని ఎంచుకుని... విక్రమ్‌ను ల్యాండ్ చేయాల్సి ఉంటుంది‌. అయితే, వందల కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తోన్న ఈ ల్యాండర్ వేగాన్ని సకాలంలో నియంత్రిస్తూ ఉండాలి. అందులో, ఒక్క సెకను తేడా వచ్చినా సాఫ్ట్ ల్యాండింగ్ కుదరకపోవచ్చు. దాని వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇస్రో తన లక్ష్యాన్నీ చేరుకోలేకపోవచ్చు. అయితే, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌కు అమర్చిన కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు అందే ఫొటోలను బేరీజు వేసుకుంటున్న ఇస్రో.... సాఫ్ట్ ల్యాండింగ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, అగాథాల్లేని ప్రాంతం కోసం వెదుకుతోంది. చదునుగా ఉంటే, ఉపరితలాన్ని ఎంచుకుని, సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇది క్షణాల్లో జరిగిపోయే ప్రక్రియ. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా... మొత్తం కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. 7న అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి రెండున్నర మధ్య విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపే అవకాశాలున్నాయి. అయితే, ఇప్పటివరకు సాగిన ప్రయాణంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకపోవడంతో ల్యాండింగ్ కూడా విజయవంతమవుతుందనే ధీమాతో ఉంది ఇస్రో. అత్యంత క్లిష్టమైన దశగా భావిస్తున్న సాఫ్ట్ ల్యాండింగ్‌ను  అధిగమిస్తే... అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయంగా భారత్ పేరు మారుమోగడం ఖాయం.

తూర్పుగోదావరి టీడీపీలో ముసలం... చంద్రబాబుకి షాకిచ్చిన సీనియర్లు...

టీడీపీ అధినేత చంద్రబాబుకు తూర్పుగోదావరి టూర్ లో ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం కేడర్ లో ధైర్యం నింపేందుకు వచ్చిన చంద్రబాబుకు సీనియర్లు షాకిచ్చారు. సాక్షాత్తూ పార్టీ అధినేత హాజరైన సమీక్షా సమావేశానికే కీలక నేతలు డుమ్మాకొట్టారు. కాకినాడలో చంద్రబాబు నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి తోట త్రిమూర్తులు, మాగంటి రూప, చలమలశెట్టి సునీల్, బొడ్డు భాస్కర రామారావు, దొరబాబు తదితర ముఖ్యనేతలు గైర్హాజరయ్యారు. దాంతో తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో ముసలం మొదలైందనే చర్చ ఊపందుకుంది. పార్టీ అధినేత సమావేశానికే డుమ్మాకొట్టడం టీడీపీలో కలకలం రేపుతోంది. ఓటమి భారంతో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయిన నేతలు, కార్యకర్తల్లో ధైర్యం, జోష్ నింపేందుకు ప్రయత్నిస్తోన్న చంద్రబాబు.... జిల్లాల్లో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా, తూర్పుగోదావరిలో పర్యటిస్తూ కాకినాడలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. మొదటిరోజు రంపచోడవరం, అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ అండ్ రూరల్‌, రాజోలు, గన్నవరం, అమలాపురం, కొత్తపేట నియోజకవర్గాల సమీక్ష చేపట్టాయి. అయితే, ఈ సమావేశానికి తోట త్రిమూర్తులు, మాగంటి రూప, చలమలశెట్టి సునీల్, బొడ్డు భాస్కర రామారావు, దొరబాబు డుమ్మా కొట్టడం తీవ్ర సంచలనమైంది. అయితే, చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా, తోట త్రిమూర్తులు... కాపు నేతలతో సమావేశం నిర్వహించి కలకలం రేపారు. అంతేకాదు తోట త్రిమూర్తులు నేతృత్వంలో టీడీపీ కాపు నేతలంతా.... బీజేపీలో చేరబోతున్నారంటూ లీకులు వదిలారు. ఆ తర్వాత విజయవాడ బోండా ఉమా నివాసంలో మరోసారి కాపు లీడర్లంతా సమావేశమై కలకలం రేపారు. అప్పుడు కూడా, పలువురు నేతలు పార్టీ మారతారనే చర్చ జరిగింది. అయితే ఇప్పుడు, సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు హాజరైన సమావేశానికే ముఖ్యనేతలు డుమ్మా కొట్టడం తెలుగుదేశం అధిష్టానాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

దగ్గుబాటిపై నిఘా నిజమేనా? పర్చూరులో అసలేం జరుగుతోంది?

  దగ్గుబాటి వెంకటేశ్వరావు... దగ్గుబాటి పురంధేశ్వరి... పరిచయం అక్కర్లేని పేర్లు... ఎన్టీఆర్ అల్లుడిగా, ఎన్టీఆర్ కూతురిగానే కాకుండా తెలుగు రాజకీయాల్లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న పొలిటికల్ జంట... అయితే ఒకరు వైసీపీలో ఉంటే... మరొకరు బీజేపీలో ఉండటం... సమస్యగా మారుతోంది. ఒకే ఇంట్లో రెండు జెండాలు ఉండటం... వాళ్లిద్దరి వరకు సమస్య లేకపోయినా, ఆ రెండు పార్టీల అధినాయకుల్లో మాత్రం అనుమానాలు పెంచుతుందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల పురంధేశ్వరి.... వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో... దగ్గుబాటి వెంకటేశ్వరావుపై జగన్మోహన్ రెడ్డి నిఘా పెట్టారనే వార్త వైసీపీలో సంచలనంగా మారింది. భార్య ఒక పార్టీలో... భర్త మరో పార్టీలో... అంటూ విమర్శలు చెలరేగినా, దగ్గుబాటి దంపతులు మాత్రం తమతమ పార్టీల్లో ఎవరి పని వాళ్లు చేసుకుపోతున్నారు. ఇద్దరూ కూడా ఎవరి రాజకీయంలో వారు బిజీగా ఉన్నారు. అయితే, గత ఎన్నికల్లో అనూహ్యంగా పర్చూరు వైసీపీ టికెట్ దక్కించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరావు... టీడీపీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. దగ్గుబాటి ఓడిపోయినప్పటికీ, పర్చూరు నియోజకవర్గంలో మాత్రం దగ్గుబాటి మాటే చెల్లుబాటు అవుతుందని అంటున్నారు. అధికార యంత్రాంగంలోనూ, బదిలీల్లోనూ ఇలా ప్రతీ విషయంలోనూ దగ్గుబాటి వెంకటేశ్వరావు చక్రం తిప్పుతున్నారనే వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు. అలాగే, కుమారుడితో కలిసి అటు అధికారులు, ఇటు పార్టీ లీడర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోన్న దగ్గుబాటి... నియోజకవర్గంలో ప్రతీదీ తన కనుసన్నల్లోనే జరగాలని చెబుతున్నారట. అయితే దగ్గుబాటి పోకడపై సొంత పార్టీలోనే మరో వర్గం జగన్ కు ఫిర్యాదు చేసిందట. దాంతో దగ్గుబాటి వ్యవహారశైలిపై జగన్ నిఘా పెట్టారనే చర్చ సాగుతోంది. అయితే, దగ్గుబాటిపై జగన్ నిఘా పెట్టారనే ప్రచారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, సొంత పార్టీ నాయకుడిపై ప్రభుత్వం నిఘా ఎందుకు పెట్టిందని మాట్లాడుకుంటున్నారు. దీనికి, జగన్ ప్రభుత్వంపై ఇటీవల పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలే కారణమన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏపీలో బలపడాలనుకుంటోన్న బీజేపీ... ఎన్నికల తర్వాత విమర్శల దాడిని పెంచింది. అందులో భాగంగానే పురంధేశ్వరి కూడా జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటిపై వైసీపీ అధిష్టానం నిఘా పెట్టిందనే మాట వినిపిస్తోంది. పురంధేశ్వరి విమర్శల నేపథ్యంలోనే... పర్చూరులో పరిస్థితేంటి? ఆమె భర్త దగ్గుబాటి వైఖరి ఎలా ఉంది అంటూ సీఎం జగన్ ఆరా తీశారని చెప్పుకుంటున్నారు. అందుకే, నిఘా అధికారులు పర్చూరు నియోజకవర్గానికి వెళ్లి, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, నివేదికలు ఇస్తున్నారని తెలుస్తోంది. అయితే, దగ్గుబాటిపై జగన్ నిఘా పెట్టారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. అధికార పార్టీగా నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు, ప్రాధమ్యాలను జనానికి వివరించడానికి, పార్టీ పట్టు పెంచుకోవడానికే దగ్గుబాటి తన కుమారుడితో కలిసి, పర్యటిస్తున్నారని అంటున్నారు. ఇదంతా ప్రత్యర్ధుల కుట్ర అంటూ కొట్టిపారేస్తున్నారు.

అప్పుడు ఎన్టీఆర్... ఇప్పుడు కేసీఆర్... తమిళిసై రాకతో 1985 సీన్ రిపీట్ కానుందా?

2023లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుపుతోన్న బీజేపీ... అన్నివైపుల నుంచి అస్త్రాలను ప్రయోగిస్తోంది. రాజకీయంగా బలపడటమే కాకుండా... వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఘనవిజయం సాధించి... తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందుకు అస్త్రంగానే తమిళిసైని ప్రయోగించారనే ప్రచారం జరుగుతోంది. ఎన్ని ట్యాగులు తగిలించుకున్నా, బీజేపీకి హిందుత్వవాదమే బలం. అందుకే కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న తమిళిసైని వ్యూహాత్మకంగా రంగంలోకి దింపారనే మాట వినిపిస్తోంది. హిందుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేసిన తమిళిసైది దూకుడుగా వ్యవహరించే నైజం. తమిళనాట అసలు బీజేపీ ఉనికే లేనప్పుడు తమిళిసై అత్యంత సమర్ధవంతంగా పనిచేశారని అంటారు. అందుకే, తమిళిసైకి తమిళనాడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని, ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా నియమించడం వెనుకా పక్కా వ్యూహం ఉందంటున్నారు. హిందుత్వవాదులను ప్రోత్సహించి బలపడాలన్నదే బీజేపీ గేమ్ ప్లాన్ కావడంతో... తమిళిసై రాకతో తెలంగాణలో హిందుత్వవాదులకు ఊహించనిస్థాయిలో అండ లభించబోతుందనే మాట వినిపిస్తోంది. కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న తమిళిసై రాకతో కేసీఆర్‌కు చిక్కులు తప్పవనే మాట వినిపిస్తోంది. అసలు కేసీఆర్‌ అండ్ టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గానే తమిళిసైని గవర్నర్‌గా నియమించారనే ప్రచారం జరుగుతుండటంతో... 1985 నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆనాడు ఎన్టీఆర్‌‌కి ఎదురైన పరిస్థితులే... ఇప్పుడు కేసీఆర్‌కి రిపీట్ కాబోతున్నాయేమోనని అంటున్నారు. 1985 నుంచి 1990 వరకు ఏపీ గవర్నర్‌గా పనిచేసిన కుముద్ బెన్ జోషి... ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కి చుక్కలు చూపించారు. అప్పటి కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ ఆశీస్సులతో రంగంలోకి దిగిన కుముద్ బెన్ జోషి... రాష్ట్రమంతా పర్యటించి లోపాయికారీగా కాంగ్రెస్‌ బలోపేతానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే గవర్నర్ కుముద్ బెన్ జోషి చర్యలను ఎన్టీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు కుముద్ బెన్ జోషికి సహకరించొద్దంటూ అధికార యంత్రాంగానికి ఎన్టీఆర్ ఆదేశాలు సైతం ఇచ్చారు. అయితే, కేంద్రం అండతో రాజ్ భవన్‌ నుంచి కుముద్ బెన్ జోషి... ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపారని అంటారు. వైస్ ఛాన్సలర్లతో చర్చలు జరపడం... నిత్యం కాంగ్రెస్ లీడర్లతో సమావేశమవడం కావడంతో... రాజ్‌భవన్‌ కాంగ్రెస్ కార్యాలయంగా మారిందనే విమర్శలు వచ్చాయి. అయితే, ఇప్పుడు తమిళిసై కూడా అదే తరహాలో వ్యవహరించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలకు అందుబాటులో ఉంటూ, హిందుత్వవాదులను, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే అవకాశముందంటున్నారు. మొత్తానికి తెలంగాణపై పకడ్బందీ ప్లాన్‌తోనే బీజేపీ నాయకత్వం తమిళిసైని తెరపైకి తెచ్చిందనే ప్రచారం జరుగుతోంది. 2023లో టీఆర్‌ఎస్‌ను ఓడించడం, అలాగే గద్దెనెక్కడమే లక్ష్యంగా గవర్నర్‌ నియామకం జరిగిందంటున్నారు. దాంతో కొత్త గవర్నర్ తమిళిసైతో కేసీఆర్‌కు తిప్పలు తప్పవనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా, కేసీఆర్ ప్రభుత్వానికి తమిళిసై కొరకరాని కొయ్యగా మారుతారో లేక నర్సింహన్ తరహాలోనే సహకరిస్తారో చూడాలి.

అప్పుడు కేంద్రం... ఇప్పుడు ట్రిబ్యునల్... జగన్ సర్కారుకు దెబ్బ మీద దెబ్బ..!

  జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మొండిగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునసమీక్షిస్తూ రద్దు చేస్తోన్న వైసీపీ ప్రభుత్వానికి విద్యుత్ అప్పిటల్ ట్రిబ్యునల్ షాకిచ్చింది. సౌర-పవన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయొద్దని ఏపీ గవర్నమెంట్ ను ఆదేశించింది. అలాగే పీపీఏలపై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేదని రెగ్యులేటరీ కమిషన్‌కు తేల్చిచెప్పింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలను యథాతథంగా కొనసాగించాలని జగన్ సర్కారును ఆదేశించింది. పీపీఏల రద్దుపై మూడు కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో ఈ ఆదేశాలిచ్చింది. పీపీపీలను పునసమీక్షిస్తూ పలు సోలార్, విండ్ విద్యుత్ కంపెనీలకు జగన్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో... అనంతపురం, కడపకి చెందిన మూడు కంపెనీలు... ఎస్‌బీఈ, అయన, స్పింగ్ కంపెనీలు విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, భవిష్యత్ లో తాము అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నాయి. అంతేకాదు పీపీఏలను సమీక్షించడమంటే... తమపై నమ్మకం లేకపోవడమేనని... ఇది తమ కంపెనీలకు తీవ్ర నష్టం కలిగిస్తుందంటూ ట్రిబ్యునల్ ముందు కంపెనీలు వాదనలు వినిపించాయి. దాదాపు రెండు నెలలుగా సాగిన ఇరుపక్షాల వాదనలను విన్న విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్.... పీపీఏలను రద్దు చేయొద్దంటూ జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే పీపీఏల సమీక్ష, రద్దు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సూచించింది. ఏదేమైనా పీపీఏల సమీక్ష, రద్దు నిర్ణయాలపై జగన్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జపాన్ లేఖతో ఇప్పటికే  కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా, ఇఫ్పుడు ఏకంగా విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునలే షాకిచ్చింది. మరి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలపై జగన్ సర్కారు ఏవిధంగా స్పందిస్తుందో... ఎలా ముందుకెళ్తుందో చూడాలి.  

రాజధాని అంశంపై జగన్ మౌనం.. బొత్స చేతిలో కీలుబొమ్మ అయ్యారా?

  ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది. ఈ మూడు నెలల్లో వైసీపీ సర్కార్ పాలన ఎలా ఉంది? ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందా?లేదా? అని చర్చ జరగాల్సింది పోయి.. రాజధానిగా అమరావతే ఉంటుందా? లేదా? అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ బలంగా చెప్పిన మాట.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని అమరావతి నుండి దొనకొండకు మారిపోతుంది. కానీ వైసీపీ మాత్రం అబ్బే అలాంటిదేం లేదు.. రాజధాని అమరావతే ఉంటుంది. అంతెందుకు మా పార్టీ అధినేత జగన్ అమరావతిలో సొంతిల్లు కట్టుకున్నారు చూసారా అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిసాయి. వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయినా రాజధాని విషయంలో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. అవకాశం రావాలి కానీ రాజధానిని మార్చడానికి వైసీపీ సిద్ధంగా ఉందంటూ టీడీపీ పదేపదే చెప్తూ వచ్చింది.  ఇంతలో వరదలు వచ్చాయి. టీడీపీ అనుమానాలు రెట్టింపయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా కావాలనే కృత్రిమ వరదను సృష్టించారని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబు నివాసాన్ని, అమరావతి సమీప గ్రామాలను కృత్రిమ వరదతో ముంచెత్తి, ఈ సాకుని చూపి రాజధానిని మార్చడానికి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. రాజధానిగా అమరావతి సరికాదన్నట్టు అర్థం వచ్చేలా బొత్స వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని మారబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. దీంతో రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు విపక్షాలు వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజధానిని మారిస్తే ఊరుకునేది లేదని, రాజధానిని మార్చేది లేదని సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలనీ.. విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ జగన్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. సీఎం జగన్.. ప్రజావేదిక, పోలవరం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వంటి అంశాలపై ముక్కు సూటిగా వ్యవహరించినప్పుడు.. రాజధాని విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాజధాని విషయంలో మంత్రి బొత్స వివిధ సందర్భాల్లో వివిధ రకాలైన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారు. కాసేపు వరదలు వస్తే అమరావతిలో కష్టం అంటారు, మరోసారి అమరావతిలో నిర్మాణాలకు డబుల్ ఖర్చు అవుతుందంటారు, ఇంకోసారి అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. తాజాగా.. ఒక్క కులం కోసమే రాజధాని నిర్మాణం ఉండకూడదన్నారు. మరో సందర్భంలో.. రాజధానిని తరలిస్తున్నామని ఎవరో అంటే మేం సమాధానం చెప్పాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారే తప్పితే.. అమరావతినే రాజధానిగా ఉంచుతారా లేదా అన్నది కుండబద్ధలు కొట్టినట్లు చెప్పట్లేదు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు ఇలాంటి కీలకమైన అంశంపై సీఎం జగన్ ఇంతవరకూ స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం మాట్లాడాల్సిన అంశంపై మాటిమాటికీ బొత్స ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బొత్స చేతిలో జగన్ కీలుబొమ్మ అయ్యారా? బొత్స చెప్పినట్లు జగన్ నడుచుకుంటున్నారా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఏ అంశంపైనైనా స్పష్టమైన వైఖరితో ముందుకువెళ్లాలి. ముఖ్యమైన రాజధాని విషయంలో.. స్పష్టమైన ప్రకటన చెయ్యాల్సిన సమయంలో.. డొంకతిరుగుడు మాటలెందుకని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్త కంపెనీలు రావడానికి ఆసక్తి చూపించట్లేదు. ఇలాగైతే.. కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయన్న ప్రశ్న తలెత్తుతోంది. ఖజానాకు ఆదాయం రావాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా.. రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా సాగాలి. అది పూర్తైతేనే కంపెనీలు ఏపీవైపు చూస్తాయి. లేదంటే మిగతా రాష్ట్రాలకు వెళ్లిపోతాయి. ఇది ఏపీకి తీరని నష్టం. కానీ ఇవేం పట్టనట్టు రాజధాని విషయంలో ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు?. అసలు జగన్ మనసులో ఏముంది?. జగన్ మౌనాన్ని వీడాలి. రాజధాని అమరావతిపై స్పష్టమైన ప్రకటన చెయ్యాలి. అంతే తప్ప.. మంత్రులతో నాన్చుడు ప్రకటనలు చేయించడం వల్ల ఇటు రాష్ట్రానికి, అటు వారి పార్టీకి కూడా నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్య సలహాదారు పాత్ర ముగిసినట్టేనా? జగన్ మనసు ఎందుకు మారింది?

  అజయ్ కల్లం రెడ్డి... జగన్ కోటరీలో అత్యంత కీలకమైన వ్యక్తి... మూడేళ్ల పదవీకాలంతో  ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా అపాయింటైన అజేయ కల్లం రెడ్డికి తెలియకుండా జగన్ ప్రభుత్వంలో ఏమీ జరగదనే చెప్పాలి... ఆయా శాఖాధిపతులైనా... చివరికి సీఎస్ అయినా... డీజీపీ అయినా... అజేయ కల్లం రెడ్డికి చెప్పకుండా... ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేరని అంటారు.... అంతటి పవర్స్ ను ఆయనకు కట్టబెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎంవోలో అధికారగణం, ప్రభుత్వ సలహాదారులు... ఇలా ఎవరైనాసరే అజేయకల్లంరెడ్డికే రిపోర్ట్ చేయాల్సిందే. అజేయకల్లంరెడ్డిపై జగన్మోహన్ రెడ్డి అంత నమ్మకం పెట్టుకున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రభుత్వ పాలనను, విధానాలను జగన్ ఆయన చేతిలో పెట్టారు. అయితే, అజేయ కల్లంరెడ్డిపై జగన్ పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లిందనే మాట అమరావతిలో వినిపిస్తోంది. మూడేళ్ల పదవీకాలంతో అపాయింటైన అజయ్ కల్లం రెడ్డి... మూడు నెలలు కూడా కాకుండానే ముగిసిపోనుందనే ప్రచారం జరుగుతోంది. సీఎంవోలో అన్నీ తానై పాలనా వ్యవహారాలు చక్కబెడుతున్న అజేయకల్లంరెడ్డిని సాగనంపడానికి డెసిషన్ జరిగిపోయిందనే మాట వినిపిస్తోంది. జగన్ అమెరికా పర్యటనలో ఉండగా.... ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం, అమరావతి, పీపీఏలు, రివర్స్ టెండరింగ్ లాంటి అంశాలను సరిగ్గా డీల్ చేయలేకపోయారని జగన్ మండిపడ్డారట. అమరావతిపై ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్లలేకపోతుందో... పోలవరంలో రివర్స్ టెండరింగ్ ఎందుకో... పీపీఏల పునసమీక్షకు కారణాలేంటో... ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడంలో... కేంద్రాన్ని ఒప్పించడంలో మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందనే భావనకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి... దీనంతటికి అజేయకల్లంరెడ్డిని బాధ్యులుగా చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా రాజకీయ వైఫలమైనప్పటికీ... మొత్తం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థనే అజేయకల్లం చేతిలో పెట్టినందున.... పాలనాపరమైన వైఫల్యంగా లెక్కగట్టి.... అజేయకల్లంరెడ్డిని సాగనంపడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, అజయ్ కల్లంరెడ్డి వైపు నుంచి కూడా మిస్టేక్స్ ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అసలు అమరావతి పాలసీ ఏమిటో, ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో... అర్ధమయ్యేలా చెబుతూ మంత్రులకు అజేయకల్లం సరైన గైడెన్స్ ఇవ్వలేకపోయారని అంటున్నారు. అందుకే సున్నితమైన రాజధాని అంశాన్ని మంత్రులు పెద్ద వివాదంగా మార్చేశారని జగన్ అంచనాకి వచ్చారట. అందుకే, ముఖ్య సలహాదారును సాగనంపి...  ఇకపై పాలనావ్యవహారాలన్నీ పూర్తిగా తానే చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వచ్చారట.

ఏపీకి అప్పులే దిక్కా? ఆర్ధిక పతనానికి జగన్ విధానాలే కారణమా?

  ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్ర ఆదాయం ఊహించనిస్థాయిలో గణనీయంగా పడిపోయింది. నాలుగు నెలలుగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం ఆశించినమేర రాలేదు. ఒకవైపు ఖర్చుల భారం పెరగడం... మరోవైపు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందకపోవడంతో... ఆ ప్రభావం తప్పనిసరిగా అమలుచేయాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోంది. అయితే, ఊహించనివిధంగా గాడితప్పుతోన్న ఆర్ధిక వ్యవస్థను దారిలోపెట్టేందుకు ఏం చేయాలో తెలియక ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అయోమయంలో పడింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణాశాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కు ...అధికారులు కళ్లు బైర్లు కమ్మే నిజాలు చెప్పారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిపోయిందని లెక్కలతో సహా వివరించారు. ముఖ్యంగా ఇసుక నిలిపివేత, బెల్టుషాపుల రద్దు... ఏపీ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించాయని వివరించారు. లిక్కర్ వినియోగం గణనీయంగా తగ్గిపోవడంతో ఆదాయం కూదా అదే స్థాయిలో పడిపోయిందని తెలిపారు. ఇక ఇసుక నిలిపివేతతో నిర్మాణరంగం కుదేలైందని, అదే-సమయంలో సిమెంట్, ఐరన్ రేట్లు తగ్గడంతో పన్ను రాబడి పతనమై రాష్ట్ర ఖజానాకు దెబ్బపడిందన్నారు. అలాగే వాహన రంగంలో మంద గమనంతో జీఎస్టీ తగ్గిందని వివరించారు. మొత్తంగా వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా, కేవలం 5.3శాతం మాత్రమే నమోదైందని అధికారులు లెక్కతేల్చారు. అంటే రావాల్సిన దానికంటే 8.7శాతం ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రికి వివరించారు. ఇది భారీ మొత్తం కావడంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో కొత్త ఆదాయ వనరులపై దృష్టిపెట్టాలని, కొత్త మార్గాలను ఆన్వేషించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. అలాగే, సెప్టెంబర్ రెండు నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండటంతో... ఆ సమయానికల్లా సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే, ఈ ఆర్ధిక సంవ్సరం చివరి నాటికి ఆదాయాలు మెరుగుపడతాయని, అనుకున్నమేర 14శాతం వృద్ధిని సాధిస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇక సెప్టెంబర్లో జీఎస్టీ పరిహారం కింద సుమారు 6వందల కోట్లు వస్తాయని సీఎంకు  తెలియజేశారు  అయితే, ఆర్ధిక మాంద్యంతో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అంత ఈజీగా మెరుగుపడే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. పతనమవుతున్న ఆర్ధిక వ్యవస్థకు ఏపీ పరిస్థితి అద్దం పడుతోందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితికి జగన్ ప్రభుత్వ విధానాలూ ఒక కారణమంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే అప్పులు చేయక తప్పదని చెబుతున్నారు.

ఆందోళనలో తెలంగాణ ప్రభుత్వం... లెక్క తప్పుతోన్న అంచనాలు

  2019-20 బడ్జెట్ పై సీఎం కేసీఆర్ తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్ధిక మాంద్యంతో ఎన్నికల హామీల అమలు కత్తి మీద సాములా మారిందనే మాట వినిపిస్తోంది. అందుకే ఆదాయం, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కచ్చితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అయితే, ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు అంత సులువు కాదంటున్నారు అధికారులు. ఆర్ధిక మాంద్యంతో ఇప్పటికే ఆదాయం పడిపోవడంతో, అది ముందుముందు ఏ స్థాయిలో ఉంటుందో అంచనాకి రాలేకపోతున్నారు. గత రెండు నెలలుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పడింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వివిధ అభివృద్ధి పనులకు చెల్లింపులు నిలిచిపోయాయి. ఒకవైపు భారీ సాగునీటి ప్రాజెక్టులు... మరోవైపు పెన్షన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి లాంటి సంక్షేమ పథకాలు....ఇంకోవైపు కొత్తగా ఇచ్చిన ఎన్నికల హామీలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఒక్క రైతు రుణమాఫీకే 24వేల కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు... ఇక ఉద్యోగుల పీఆర్సీ అమలు చేస్తే మరో భారం... మరోవైపు మిషన్ భగీరథ, నీటి, విద్యుత్ ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పుల వాయిదాలు చెల్లించడం మొదలవడంతో... వీటన్నింటికీ కేటాయింపులు చేయడం అంత ఈజీ కాదంటున్నారు. ఆర్ధిక మాంద్యంతో కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు తగ్గిపోయి, రాష్ట్ర ఆదాయం కూడా తగ్గిపోతే తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అయితే, పరిస్థితి చేయి దాటకముందే అప్రమత్తం కావాలని, లేకపోతే ఆర్ధిక ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తగ్గిన ఆదాయానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటే, భారీ ప్రాజెక్టులు, వివిధ సంక్షేమ పథకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందా? ఎన్నికల ముందున్న కోపం ఇప్పుడు లేదా?

    బీజేపీపై ఆంధ్రుల్లో వ్యతిరేకత తగ్గిపోతోందా? ఎన్నికల ముందున్న కోపం ఇప్పుడు లేదా? ప్రత్యేక హోదా ఇష్యూలో బీజేపీపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం ఇప్పుడు కరిగిపోతుందా? ఏపీ రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే నిజమేనంటున్నారు పరిశీలకులు. జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీకి దేశవ్యాప్తంగా ఆదరణ, అభిమానం పెరిగిందని, ఈ పరిణామమే ఏపీలోనూ బీజేపీకి అనుకూలంగా మారిందనే మాట వినిపిస్తోంది. మోడీని ఢీకొట్టగలిగే నాయకుడు ప్రస్తుతం దేశంలో ఎవరు లేరనే అభిప్రాయానికి ఆంధ్రులు వచ్చారని, దాంతో బీజేపీపై సానుకూల దృక్పథం కనిపిస్తోందని అంటున్నారు. ఒకవైపు మోడీపై రోజురోజుకీ పెరుగుతోన్న అభిమానం... మరోవైపు జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో... ఏపీలో బలపడటానికి ఇదే మంచి సమయమని కమలనాథులు భావిస్తున్నారు. పోలవరం, అమరావతి, రివర్స్ టెండరింగ్, పీపీఏల సమీక్షలాంటి దుందుడుకు నిర్ణయాలతో వివాదాల్లో చిక్కుకుంటున్న జగన్ సర్కారును ఇప్పటికే ఇరకాటంలో పెడుతున్న కమలనాథులు... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే మోడీతో మాత్రమే సాధ్యమన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఎంతకాదన్నా, బీజేపీకి బలం...హిందుత్వవాదమే. అందుకే మతపరంగానూ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఏపీలో క్రైస్తవులంతా గంపగుత్తగా జగన్ కు ఓట్లేయడంతో, వైసీపీకి వ్యతిరేకంగా హిందువులను సంఘటితం చేసేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. మతానికి సంబంధించిన భావోద్వేగాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తేలిక, అందుకే జగన్ ప్రభుత్వం... క్రైస్తవులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై మతపరమైన దాడి మొదలుపెట్టిన బీజేపీ.... ‘రావాలి యేసు-కావాలి యేసు‘ అన్నట్లుగా వైసీపీ ప్రభుత్వ విధానం ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కమలదళం అస్త్రశస్త్రాలను సిద్దంచేసుకుంటోంది.

రాజధాని విషయంలో వైసీపీ, బీజేపీ కలిసి గేమ్స్ ఆడుతున్నాయా?

  రాజధాని విషయంలో కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. మొన్నటికి మొన్న బొత్స సత్యనారాయణ.. ఏపీ రాజధానిగా అమరావతి ఎంపిక సరైన నిర్ణయం కాదన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వైసీపీ సర్కార్ రాజధానిని మార్చే అవకాశముందని ప్రచారం మొదలైంది. ఒకవైపు అమరావతి ప్రాంత రైతులు.. ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం ఒకవైపు బొత్స వ్యాఖ్యలు సమర్ధిస్తూనే.. మరోవైపు రాజధాని మార్పు అనేది కేవలం ప్రచారం అని కొట్టి పారేస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలు రాజధానిపై కొత్త అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చన్న టీజీ వెంకటేష్.. ఏపీకి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ చెప్పుకొచ్చారు. రాజధాని అంశంపై ఇప్పటికే సీఎం జగన్ బీజేపీ అధిష్టానంతో చర్చించారని, అందులో భాగంగానే నాలుగు రాజధానుల ప్రతిపాదన వచ్చిందని అన్నారు. ఈ విషయం తనకు బీజేపీ అధిష్టానమే చెప్పిందని టీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీజీ వెంకటేష్ బీజేపీ అధిష్టానం మాటనే తన మాటగా చెప్పారా? లేక ఈ మధ్య జనాల్లో తన పేరు అంతగా నానట్లేదని లైం లైట్ లోకి రావడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మరోవైపు టీజీ వెంకటేష్ వ్యాఖ్యల వెనుక.. వైసీపీ ఉందా అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టీజీ వ్యాఖ్యలను రెండు తెలుగు ప్రధాన పత్రికలు వేరువేరు కోణాల్లో రాసుకొచ్చాయి. "రాష్ట్ర ప్రభుత్వంలో ఒకరు.. రాజధాని నిర్మాణాన్ని కొనసాగివ్వబోమని, నాలుగు ప్రాంతాల్లో నాలుగు రాజధానులు పెట్టే యోచనలో వైసీపీ సర్కార్ ఉందని" టీజీ వ్యాఖ్యానించినట్టుగా ఈనాడులో ప్రచురితమైంది. సాక్షిలో మాత్రం.. "అమరావతిలో అభివృద్ధి శూన్యం, అక్కడ రాజధాని ఏర్పాటు స్థానికులకు ఇష్టంలేదు, అందుకే లోకేష్ ను ఓడించారని" అని టీజీ అన్నట్టుగా ప్రచురితమైంది. ఈ రెండిట్లో ఏది నిజం?. సరే రెండిట్లో వచ్చింది నిజమే అనుకుందాం. అసలు టీజీ వెంకటేష్ ఉన్నట్టుండి రాజధాని గురించి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు?. నిజంగానే రాజధానిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉందా? ఈ విషయం బీజేపీకి కూడా తెలుసా? రెండు కలిసే రాజధాని విషయంలో గేమ్స్ ఆడుతున్నాయా?. టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చూస్తుంటే అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి అంటున్నారు. చూద్దాం మరి ముందు ముందు ఎలాంటి ట్విస్ట్ లు వస్తాయో ఏంటో.

జగన్ అమెరికా టూర్ అభిమానుల్లో ఆవేదన మిగిల్చిందా? డల్లాస్ లో అసలేం జరిగింది?

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చేశారు. ఎప్పటిలాగే పాలనా వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. అయితే, జగన్ అమెరికా టూర్ పై ప్రవాసాంధ్రులు ఏమనుకుంటున్నారు? అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డల్లాస్ సభ అనుకున్నట్లుగానే సాగిందా? లేక ప్రవాసాంధ్రుల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందా? జగన్ అమెరికా నుంచి వచ్చేశాక ఇప్పుడిలాంటి ప్రశ్నలేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే, జగన్ అమెరికా పర్యటనను విజయవంతం చేయడంలో ఆర్గనైజర్లు పూర్తిగా ఫెయిలయ్యారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా డల్లాస్ సభలో జరిగిన తప్పులకు లెక్కే లేదంటున్నారు. సభకి జనం బాగానే వచ్చారు. భోజనాలూ బాగానే పెట్టారు. జగన్ స్పీచ్ కూడా ఆకట్టుకుంది. అయితే, జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు, పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడినవాళ్లకు తీవ్ర అన్యాయం జరిగిందట. పార్టీ కోసం ఫండింగ్ ఇస్తూ, వైసీపీ అధికారంలోకి రావడం కోసం తమ వంతు పాత్ర పోషించిన అభిమానులను ఆర్గనైజర్లు అడ్డుకున్నారట. జగన్ ను కలవకుండా అడ్డంకులు సృష్టించారట. జగన్ బసచేసిన హోటల్ దరిదాపులకు కూడా రానివ్వలేదని తెలుస్తోంది. జగన్ అండ్ వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కే కాదు... కమ్యూనిటీ పెద్దలకు కూడా తీవ్ర అవమానం జరిగిందని చెబుతున్నారు. లక్కిరెడ్డి హనిమిరెడ్డిలాంటి పెద్దలు కూడా గంటల తరబడి హోటల్ రూమ్ దగ్గర పడిగాపులు పడినా, కలవనీయకుండా చేశారట. దాంతో జగన్ అభిమానులు, కమ్యూనిటీ పెద్దలు తీవ్ర మనస్తాపానికి అసంతృప్తికి గురయ్యారని ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడినవాళ్లను కాదని, ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చారని మండిపడుతున్నారు. ఇక డల్లాస్ సభలో స్టేజీపై లక్కిరెడ్డికి కుర్చీవేసిన ఆర్గనైజర్లు, ఆ తర్వాత ఆయనను కుర్చీ తీసేసి, స్టేజ్ పై ఒక మూలన నిలబెట్టారు. దాదాపు గంటపాటు స్టేజీపై నిలబడ్డ ఆ పెద్దాయన... చివరికి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇక కమ్యూనిటీ పెద్దలు పైళ్ల మల్లారెడ్డి, ఆటా హనుమంతరెడ్డిదీ ఇదే పరిస్థితి. కనీసం వీళ్లకి సీట్లు కూడా కేటాయించకపోవడంతో, జనరల్ సీటింగ్ లో ఎవరో లేచి కుర్చీ ఇస్తే కూర్చొని సరిపెట్టుకున్నారు. అలా చోటామోటా నాయకులందరికీ డల్లాస్ సభలో తీవ్ర అవమానం జరిగింది. దాంతో తీవ్ర నిరాశ, అసహనం, కోపానికి గురయ్యారు. ఆర్గనైజర్లంతా కుర్రకారు కావడంతో పెద్దలంటే లెక్కలేకుండా కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించారని అంటున్నారు. ఇక వీవీఐపీలకు, ఎన్నారై కమిటీ సభ్యులకు కనీసం ట్యాగ్ లు ఇవ్వకపోవడంతో ఆర్గనైజర్లతో గొడవలు జరిగాయి. ఎవరికి వాళ్లే పక్కనున్న షాషింగ్ మాల్స్ కు వెళ్లి ట్యాగ్ లు తెచ్చుకుని పెట్టేసుకోవడం తీవ్ర గందరగోళం మధ్య సభ జరిగిందట. అలాగే 10లక్షలపైన డొనేట్ చేసిన వారికి జగన్ తో ఫొటో అన్నారు. చివరికి అది కూడా లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, వందల డాలర్లు ఖర్చు పెట్టుకొని, జగన్ కోసం అమెరికా నలుమూలల నుంచి వస్తే, జగన్ ను కలవనీయకుండా ఆర్గనైజర్లు అడ్డుకున్నారని అభిమానులు రగిలిపోతున్నారు. అయితే, జగన్ టూర్ లో ఆర్గనైజర్ల అరాచకాలను, లోపాలను ఎత్తిచూపుతూ, తమ బాధను చెప్పుకుంటూ ప్రవాసాంధ్రుల నుంచి వైసీపీకి పెద్దఎత్తున ఈ-మెయిల్స్ వస్తున్నాయట. దీనంతటికీ విజయసాయిరెడ్డే కారణమని ఆరోపిస్తున్నారట. విజయసాయి సూచనల మేరకే ఆర్గనైజర్లు అలా చేశారని, ఇందులో చంద్రగిరి ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందంటూ మండిపడుతున్నారు. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ టైమ్ అమెరికా వెళ్లిన జగన్మోహన్ రెడ్డి... తన స్పీచ్ తో అక్కడ అందరినీ ఆకట్టుకున్నా... ఆర్గనైజర్ల అరాచకాలతో తమ ప్రియమైన నేతను స్వయంగా కలవలేకపోయామనే మాత్రం ప్రవాసాంధ్రులను వెంటాడుతోంది.

తెలంగాణ యోగి ఎక్కడ? బీజేపీ పక్కన పెట్టేసిందా?

  స్వామి పరిపూర్ణనంద... హిందూధర్మ పరిరక్షణలో దూకుడుగా వెళ్తూ కాంట్రవర్సీ కామెంట్స్ తో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫ్యామస్ అయిన స్వామీజీ. ఇదే బీజేపీ హైకమాండ్ ను ఆకర్షించింది. అంతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో పార్టీలోకి రప్పించి రాష్ట్రమంతా తిప్పారు. పరిపూర్ణానంద కూడా బాగానే హడావిడి చేశారు. తన వాడివేడి ప్రసంగాలతో తెలంగాణ యోగిగా పార్టీ నేతలు కీర్తించేలా చేసుకున్నారు. సొంత హెలికాఫ్టర్‌పై తిరుగుతూ... లక్ష్మణ్‌కు పోటాపోటీగా, సభలు సమావేశాలు, ర్యాలీలతో అనధికార స్టార్ క్యాంపెయినర్‌గా చక్రం తిప్పారు. మతం, జాతీయవాదం పేరుతో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ పై ఓ రేంజ్‌లో చెలరేగిపోతూనే... కాంట్రవర్సీ కామెంట్స్ తో కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. దాంతో భవిష్యత్తులో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చేది స్వామీజీనే అనుకున్నారు. కానీ ఫలితాల తర్వాత కథ అడ్డం తిరిగింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఉన్న సీట్లను కూడా చేజార్చుకొని ఒక్కసీటుకే పరిమితమైంది. స్వామిజీ తిరిగిన ఏ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేదు. పైగా డిపాజిట్లు కూడా రాలేదు. రాజాసింగ్ సొంత ఇమేజ్‌తో గెలిచాడు. తన ప్రయోగం విఫలం కావడంతో పరిపూర్ణానంద కలత చెందారట. ఇక ఏదేదో ఊహించుకున్న పార్టీ అధిష్టానం కూడా, స్వామిజీ ప్రభావం శూన్యమేనని భావించి, ప్రాధాన్యత తగ్గించిందట. దాంతో స్వామిజీ కూడా పార్టీకి దూరం జరిగారు.  అయితే, అసెంబ్లీ ఎలక్షన్స్ వెనువెంటనే వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో, అసెంబ్లీ అనుభవంతో, ఒక్క ఎంపీ సీటూ కూడా రాదని స్వామిజీ అంచనా వేశారట. అయితే, ఈసారి కూడా అంచనా తప్పింది. పార్లమెంట్‌ పోరులో, అందరి అంచనాలను తలకిందులుచేస్తూ... నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో మరోసారి అవాక్కవడం స్వామిజీ వంతయ్యింది. ఒకవేళ పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వామిజీ ప్రచారం చేసి ఉంటే, తన వల్లే నాలుగు ఎంపీ స్థానాలు వచ్చాయని చెప్పుకునే అవకాశం దక్కేది. పార్టీలో భవిష్యత్‌ లీడర్‌గా ఒక వెలుగు వెలిగేవారు. కానీ ప్రచారం చేయలేదు కాబట్టి, చెప్పుకునే ఛాన్సే లేకుండా పోయింది. దాంతో, ఇప్పుడెక్కడా కనిపించకుండా సెలైన్స్ మెయింటైన్ చేస్తున్నారట స్వామీజీ. అయితే, పార్టీకి ఆదరణ లేనప్పుడు పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ పుంజుకుంటున్నప్పుడు పట్టించుకోకపోవడం స్వామిజీకి రుచించడం లేదట. పైగా కొందరు నేతలు పరిపూర్ణానందను అవమానించారని, అందుకే దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే, స్వామీజీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం కొందరు ముఖ్యనేతలకు నచ్చడంలేదనే మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి, పరిపూర్ణానంద పరిస్థితిని తలుచుకుని... పాపం స్వామిజీ అంటున్నారట బీజేపీ కార్యకర్తలు.

కవిత సైలెన్స్ కి రీజనేంటి? కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయమేంటి?

  ఈవీఎంలైనా, బ్యాలెట్ పేపరైనా తనకు తిరుగులేదని అసెంబ్లీ అండ్ లోకల్ ఎలక్షన్స్ లో రుజువు చేసుకుంది టీఆర్ఎస్. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ లెక్క తప్పింది. ఎవరూ ఊహించనివిధంగా బీజేపీ ఏకంగా నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ కూడా మూడు సీట్లను గెలుచుకుని ఫర్వాలేదనిపించుకుంది. ఇక కారు-సారు(కేసీఆర్)-పదహారు అంటూ బరిలోకి దిగిన టీఆర్ఎస్... 9 సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఆ తొమ్మింటిలోనూ రెండు స్థానాలను బొటాబోటీ మెజారిటీతో దక్కించుకుంది. ఇదంతా పక్కనబెడితే కేసీఆర్ కు అత్యంత ఆప్తుడైన వినోద్ కుమార్ కరీంనగర్ లో... కూతురు కవిత నిజామాబాద్ లో దారుణ పరాజయం పాలవడంతో గులాబీ బాస్ షాక్ తిన్నారు. అయితే, తన కూతురుపై ప్రజాగ్రహాన్ని ముందే గుర్తించిన కేసీఆర్... కవిత గెలుపు కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. నిజామాబాద్ లో పట్టున్న మండవ లాంటి లీడర్లను అప్పటికప్పుడు పార్టీలోకి రప్పించి కవితను గట్టెక్కించేందుకు ప్రయత్నించారు. అయినాసరే నిజామాబాద్ ప్రజలు కేసీఆర్ అండ్ కవితకు తిరుగులేని షాకిచ్చారు. అయితే, ఓటమి తర్వాత సైలెంటైపోయిన కవిత భవిష్యత్ ఏంటనే చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది. కవిత ఓటమిని కేసీఆర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో మెరుపులా మెరిసి, ఇప్పుడు సైలెంటైపోవడంతో ఆమె అభిమానులకు మింగుడుపడటం లేదు. అయితే, కరీంనగర్ లో ఓడిపోయిన వినోద్ కుమార్ ను కేబినెట్ ర్యాంకున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్.... కూతురు కవితకు కూడా కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన కీలక పదవిని అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కవితను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని, అలాగే పార్టీకి-ప్రభుత్వానికి మధ్య కో-ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ సాగుతోంది.  అయితే, రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్ పర్సన్ గా కవితను నియమిస్తారనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. కేబినెట్‌ ర్యాంకున్న ఈ పదవిని, కవితకు ఇస్తే బాగుంటుందన్న చర్చ తెలంగాణ భవన్‌లో జరుగుతోంది. నిజామాబాద్‌లో కవిత ఓడిపోవడానికి రైతుల ఆందోళనే ముఖ్య కారణం. అందుకే, రైతులతో మరింత మమేకమయ్యేందుకు, ఈ పదవి ఉపకరిస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరి రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో వెళ్తారా? లేక పార్టీకి, ప్రభుత్వానికి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారా? లేదంటే రైతు సమన్వయ సమితి ఛైర్ పర్సన్ గా కొత్త బాధ్యతలు చేపడతారో చూడాలి.

అమరావతి మునిగే ఛాన్సే లేదు... ఇవిగో ఆధారాలు... తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్

  అమరావతి గ్రామానికి... రాజధాని అమరావతికి తేడా తెలియకుండానే మంత్రులు మాట్లాడుతున్నారా? అమరావతి నగరంపై మంత్రి బొత్సకు అసలు అవగాహన ఉందా? లేక విలేకరులు అడిగారని... తెలిసీ తెలియని సమాచారంతో అత్యుత్సాహంతో మాట్లాడేశారా? అసలింతకీ బొత్స చెబుతున్నట్లు రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం ఉందా? లేదా? తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకోసం. అమరావతి గ్రామానికి... రాజధాని అమరావతికి తేడా తెలియకుండానే మంత్రి బొత్స మాట్లాడినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, నవ్యాంధ్ర రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం బౌండరీస్ గట్టుపైన ఉన్నాయి. అది సముద్ర మట్టానికి 24 మీటర్ల ఎత్తులో ఉంది. ఆ ఎత్తును 25 మీటర్లకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే, 2009లో భారీ వరదలు వచ్చినప్పుడు సైతం కృష్ణమ్మ... సముద్రమట్టానికి 21 మీటర్లు దాటలేదు. అంటే వరద ఇంకో 12 అడుగులు (3 మీటర్లు) మేర పెరిగినా రాజధాని అమరావతి ఇంచు కూడా మునగదు. ఇక ప్రకాశం బ్యారేజీ రోడ్ కూడా సముద్ర మట్టానికి 25 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే రాజధాని అమరావతిలోకి నీళ్లు రావాలంటే, కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజీ పైనుంచి పొంగి పొర్లాలి. అదే జరిగితే అమరావతే కాదు... కృష్ణా డెల్టా మొత్తం మునిగిపోవాల్సి ఉంటుంది. ఇక కొండవీటి వాగు లిఫ్ట్ వల్ల... వాగులోకి వరద ఎదురుతన్నే ఛాన్సే లేదు. మరి అలాంటప్పుడు రాజధాని అమరావతి ఎలా మునుగుతుంది? ఒకవేళ అమరావతి మునగాలంటే... రెండు మూడు డ్యాములు బద్దలైతే తప్ప సాధ్యంకాదు.   ఇక కృష్ణా కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లుకి, రాజధాని అమరావతికి అస్సలు లింకు పెట్టుకూడదు. ఎందుకంటే, చంద్రబాబు ఇల్లు ... గట్టుకి నదికి మధ్యన ఉంది. ఆ ప్రాంతం దాదాపు 250 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు కట్టే ప్లాన్ లేదు. అక్కడ కేవలం రివర్ టూరిజం ప్రాజెక్ట్స్, ప్లే గ్రౌండ్స్, పార్కులు మాత్రమే వస్తాయి. మరి, అమరావతి మునిగిపోతుందని... మంత్రులు తెలిసి మాట్లాడుతున్నారో... తెలియక మాట్లాడుతున్నారో... లేక చంద్రబాబుపై కక్షతోనే మాట్లాడుతున్నారో తెలియదు గానీ, అమాత్యుల్లో అవగాహనారాహిత్యమైతే కనబడుతోంది.  ఇక ఏకపక్ష విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్ కు అద్భుతమైన రాజధాని కావాలని, అది ప్రపంచశ్రేణి నగరం కావాలని, ఏపీ భవిష్యత్ కోసం తమ భూములను త్యాగంచేసిన రైతులకు మంత్రులు ఏం సమాధానం చెబుతారు? వేలాది మంది రైతుల త్యాగాలను, ఉసురును ప్రభుత్వం మూటగట్టుకుంటుందా? ల్యాండ్ ఫూలింగ్ లో కేవలం ఆరేడు వందల ఎకరాల భూములివ్వని రైతుల కోసం పోరాడిన మేధావులు... ఇప్పుడు 33వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు?