మా అమ్మాయి పెళ్లి వరకూ విడిచిపెట్టండి : దర్యాప్తు సంస్థలను కోరిన పెండ్యాల శ్రీనివాస్!

ఐదోరోజు విచారణలో కంట తడి పెట్టిన పెండ్యాల జరుగుతున్న దర్యాప్తు తీరుతో బిత్తరపోయిన తెలుగుదేశం శ్రేణులు దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఎవరూ..ఏమీ మాట్లాడవద్దని పార్టీ క్యాడర్, లీడర్లకు నాయుడు ఆదేశం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ, దర్యాప్తు సంస్థలను ఉటంకిస్తూ కొందరు సీనియర్ అధికారులు ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నారు. వరసగా ఐదోరోజు కూడా పెండ్యాల శ్రీనివాస్ ఇంటిలో జరిగిన సోదాల సందర్భంగా, పెండ్యాల శ్రీనివాస్ అటు ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ , ఇటు ఇన్ కమ్ ట్యాక్స్, మరో వైపు డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ సంస్థల బృందాల వద్ద తన వైపు నుంచి అప్రూవర్ గా మారటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడైన ఒక మాజీ ఐ.ఏ.ఎస్. అధికారికి బంధువైన పెండ్యాల శ్రీనివాస్, నాయుడు దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చాలా సంవత్సరాలు పని చేశారు. 2014 లో తెలుగుదేశం అధికారం లోకి వచ్చిన తర్వాత నాయుడు, పెండ్యాల శ్రీనివాస్ ని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలలో, పెండ్యాల కొందరు ఐఏఎస్ లను ఏక వచనంతో సంబోధించేంతగా ఎదిగారు. నాయుడు దగ్గర పూర్తిగా ఆంతరంగిక సిబ్బందిలో భాగమైన పెండ్యాల శ్రీనివాస్ ద్వారా జరిగినట్టుగా ప్రచారమవుతున్న లావాదేవీలలో, ఎక్కువగా నాయుడికి అత్యంత సన్నిహితులైన వారి పేర్లు ఎక్కువ దఫాలు శ్రీనివాస్ ద్వారా జరిపిన బ్యాంక్ నగదు లావాదేవీల్లో రిఫ్లెక్ట్ అయినట్టు దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. కోటి రూపాయలకు పైబడి నగదు లావాదేవీలు జరిపేంతటి స్థాయి లేని పెండ్యాల శ్రీనివాస్ , పలు దఫాలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అందుకు బాధ్యులైన వారితో జరిపిన లావాదేవీలు, అలాగే ఫోన్ సంభాషణలన్నింటినీ కూడా దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా సేకరించి, అధ్యయనం చేస్తున్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా, వివిధ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన పెండ్యాల శ్రీనివాస్.. తాను అప్రూవర్ గా మారటానికి సిద్ధంగా ఉన్నాననీ, వచ్చే మాసం లో తన కుమార్తె వివాహం ఉన్న దృష్ట్యా తనను ప్రస్తుతానికి విడిచిపెట్టాలని అభ్యర్ధించినట్టు సమాచారం. అంతేకాకుండా, తన ద్వారా ప్రతిరోజూ పార్టీ లోని, ప్రభుత్వం లోని అత్యంత కీలకమైన వ్యక్తులకు ఏ మేరకు సొమ్ములు చేరవేసింది కూడా పెండ్యాల శ్రీనివాస్ దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అతని కాల్ రికార్డు హిస్టరీని, అలాగే బ్యాంక్ నగదు లావాదేవీల హిస్టరీని అధ్యయనం చేస్తున్న దర్యాప్తు అధికారులకు విస్తుపోయే సంగతులు తెలిసాయి. ఒక ప్రముఖ నటుడు, మాజీ ఎం.పి కి చెందిన నిర్మాణ సంస్థ తోనూ, అలాగే, మరో మాజీ ఎం.పి, ఆటోమోబైల్ వ్యాపార రంగం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా శాఖలున్న సంస్థ తోనూ...శ్రీనివాస్ ద్వారా జరిగిన ఆర్ధిక లావాదేవీలతో దర్యాప్తు సంస్థలు అనివార్యంగా తమ ఇంటరాగేషన్ ను మరి కొద్దీ రోజులు పొడిగించాల్సి వచ్చింది. వాస్తవానికి అటు హైదరాబాద్ లోనూ, ఇటు విజయవాడ లోనూ, ఇంకా శ్రీనివాస్ స్వస్థలంలోనూ జరుగుతున్న సోదాల సందర్భంగా తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని లోగడ ముఖ్యమంత్రి కార్యాలయం లో చక్రం తిప్పిన పలువురు సిబ్బంది ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా తెలుగు  దేశం హెడ్ క్వార్ట్రర్స్ నుంచి శ్రీనివాస్ ను ఆదుకునే వ్యవస్థేలేవీ ముందుకు రాకపోవడంతోనే, ఆయన అప్రూవర్ గా మారటానికి   నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

నా గురించి వర్రీ కాకండి: ఏ.బి. వెంకటేశ్వర రావు

కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఏ.పీ. సర్కార్ ఇది మరో సంక్షోభం... మొన్న జాస్తి కృష్ణ కిషోర్... ఈ రోజు ఏ.బి. వెంకటేశ్వర రావు. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వితే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందించిందో ఇప్పటికే అనుభవైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దూకుడు గా వ్యవహరిస్తోంది. జగన్ సర్కార్.... ఏమిటీ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలు... నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ అదనపు డి.జి. గా ఒక వెలుగు వెలిగిన ఏ.బి. వెంకటేశ్వర రావుతో  ఇప్పటి ప్రభుత్వం వ్యవహరించిన విధానం అసలేమాత్రం బాలేదనేది నిపుణుల అభిప్రాయం. అవును, ఏ.బి. రక్షణ పరికరాలు కొనడం మాత్రమే కాదు... 23 మంది ఎం.ఎల్.ఏ.  లను కొనడంలో కూడా కీలక పాత్ర పోషించారు... కాదనలేము.... ప్యానెల్ లో నిపుణుడు అయిన అధికారిని మార్చి తన పేరు మాత్రమే ఉండాలి అని చూసుకున్న సర్క్యులర్ ఉంది. ఇదీ కాదనలేం. టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కనుగోలు చేసి, నాయుడు పట్ల తన ప్రభు భక్తిని చాటుకున్నారు ...ఇది జగమెరిగిన సత్యం..ఇందులోనూ ఎలాంటి వివాదం లేదు..కానీ, ఇవన్నీ చేసింది ఆయన తన ప్రభుత్వానికి మీ నుంచి..అంటే వై.ఎస్.ఆర్.సి.పి . నుంచి ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్త లో భాగంగానే అనే విషయం మీరు గుర్తించాలి. అసలు లోగడ , ఏ ప్రభుత్వమైనా ఇలా కక్ష గట్టి అధికారులను టార్గెట్ చేసిన సందర్భాలున్నాయా.... మీ తండ్రి హయాంలో ..చంద్రబాబు నాయుడు భక్తులైన అధికారులకు కూడా సముచిత ప్రాధాన్యం లభించిన సంగతి మీకు తెలియదా.... చంద్రబాబు నాయుడి కి అత్యంత నమ్మకస్తుడైన సతీష్ చంద్ర చేత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగాఉన్న సమయం లో జలయజ్ఞం బాధ్యతలు అప్పగించలేదా... జగన్ మోహన్ రెడ్డి గారూ... ముఖ్యమంత్రిగా మీరు అందరినీ కలుపుకుని పోవలసిన సందర్భం ఇది... ఇంటా , బయటా శత్రువులను తయారు చేసుకుంటే, రాబోయే ఆపదల నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఇది ప్రతిపక్ష నేత నాయుడిని అభినందించాల్సిన సందర్భం ..ఎందుకంటే, ఎలాంటి అధికారి చేతనైన ఆయన పని చేయించుకునే  తీరు నుంచి మీరు నేర్చుకోవలసిన అవసరం ఏంటో ఉంది. జాస్తి కృష్ణ కిషోర్ లాంటి మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆఫీసర్ మీద కేసులు బనాయించిన మీ తీరు చూస్తే, పిడుక్కీ, బియ్యానికి ఒకటే మంత్రమేసే మీ అమాయకత్వమే కనిపిస్తోంది. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్ట్రర్స్ దాటి వెళ్ళొవద్దనేంత ఆదేశాలు ఇచ్చేముందు అసలు ఏ.బి. ర్యాంక్ ఏమిటి చూశారా..అన్నీ బావుంది, నాయుడు అధికారం లోకి వచ్చి ఉంటె, ఆయన డి.జి.పి . ఆయ్యేవారు... 40 ఏళ్ళ  సర్వీసు ఉన్న ఆ ఆఫీసర్ ఉన్న పళంగా ఏ విదేశాలకూ పారిపోరు...సెలవు పెట్టి తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని వ్యాపకం గా చేసుకున్న ఏ.బి. ఎక్కడికి పారిపోతారు? ఐదు కారణాలను చూపుతూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. నిబంధనలకు  విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు, ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు , ఇజ్రాయెల్ సంస్ధ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్ తో కుమ్మక్కై కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ, విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని కూడా పేర్కొన్నారు. విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ చేశారు. నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. రాష్ట్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణతో పాటు, కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని, విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని, ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని, నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారని, కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారని ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఇవన్నీ భారీ స్థాయి అభియోగాలు. అఖిల భారత సర్వీసు నిబంధలు ఉల్లంఘిస్తే, ఏ.బి. రాజద్రోహానికి పాల్పడినట్టు మీరు భావిస్తే, మన రక్షణ వ్యవహారాలకు భంగం కలిగించేలా ప్రోటోకాల్ నిబంధల కు నీళ్లు వదిలితే ...రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు....సొంతంగా దర్యాప్తు చేయటానికి మీకున్న విశేషాధికారాలు ఏమిటి..లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని మీకు తెలియదా? నిజానికి సస్పెండ్ చేయటమ వరకూ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది.... దీనిని ర్యాటిఫై చేయాల్సింది కేంద్రమే.నెలరోజుల లోపు ఈ వ్యవహారాన్ని కేంద్రానికి చేరవేయాలి. ఈ మొత్తం ఎపిసోడ్ పై ఏ.బి. వెంకటేశ్వర రావు 'తెలుగు వన్' తో మాట్లాడుతూ... మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. దీనివల్ల మానసికంగా తనకు వచ్చిన నష్టమేమీ లేదని, కాబట్టి మరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానని కూడా ఏ.బి. చెప్పారు.

నాయుడు మాజీ పీ.ఎస్. పెండ్యాల శ్రీనివాస్ చెప్పిన ఆ ఇద్దరూ ఎవరు?

ఒక ఇన్ ఫ్రా మేజర్ ద్వారా జరిగిన లావా దేవీ ల వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ తలకు చుట్టుకుంటోందా? 36 గంటల పైబడి జరుగుతున్న విచారణ లో పెండ్యాల ఇంతకీ ఎంఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈ.డీ) కి ఏమి సమాచారం చేరవేశారు? కిలారు రాజేష్, గుత్తా కిరణ్ లనూ ఇదే విషయమై విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడో రోజు కూడా శ్రీనివాస్ ఇంటిలో ఈ.డీ. చేస్తున్న సోదాలకు , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( డి.ఆర్.ఐ.), ఇన్ కమ్ ట్యాక్స్ (ఐ.టీ.) బృందాలు కూడా తోడవటం తెలుగుదేశం పార్టీ సీనియర్లను కలవరపెడుతోంది. పెండ్యాల శ్రీనివాస్ నివాసం లోని రహస్య లాకర్ల నుంచి కీలకమైన ఓత్రాలను స్వాధీనం చేసుకున్న ఈ.డీ. , డీ.ఆర్.ఐ. , ఐ.టీ . బృందాలు ప్రస్తుతం వాటిని అధ్యయనం చేసే పనిలో పడినట్టు సమాచారం. వాస్తవానికి, తమ నాయకుల నివాసాలు, వ్యాపార సంస్థలపైన లోగడ ఐ.టి. దాడులు జరిగినప్పుడు హడావుడిగా మీడియా సమావేశాలు నిర్వహించి కేంద్ర సంస్థలను ఏకిపారేసిన తెలుగుదేశం అగ్రనాయకత్వం ఇప్పుడు జరుగుతున్న సోదాల మీద మాత్రం ఏ రకమైన వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ, కేంద్ర సంస్థల తీరును ప్రశ్నిచే ప్రయత్నం కానీ చేయకపోవటం రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేస్తోంది. వాస్తవానికి, నిరుడు అక్టోబర్ లో జరిగిన సోదాల్లోనే ప్రముఖ ఇన్ ఫ్రా మేజర్ పేరు వెలుగులోకి వచ్చింది. అమరావతి నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్న ఆ సంస్థ, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ ద్వారా జరిపిన లావా దేవీల వ్యవహారం అంతా గమనించిన సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సి.బి.డి.టి.), ఇంకా ఐ.టి. అధికారులు ఆ ఇన్ఫ్రా మేజర్ ద్వారా అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ సంస్థ నుంచి దాదాపు 750 కోట్ల రూపాయల విరాళాలు వెళ్లినట్టు గుర్తించారు. అప్పటి నుంచే, దీనిపైన నిఘా వుంచిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈ.ఓ. డబ్ల్యు. ) ఆ దరిమిలా చేపట్టిన విచారణలో... అప్పటి ముఖ్యమంత్రి పెర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ పేరు ప్రముఖం గా ఫిగర్ అయింది. అలాగే, నారా లోకేష్ కుడి భుజం, ఎడమ భుజాలుగా వ్యవహరించిన కిలారు రాజేష్, గుత్తా కిరణ్ ల వ్యవహారం పైన కూడా ఈ నిఘాసంస్థలన్నీ దృష్టి సారించాయి. ముంబై కి చెందిన ఇన్ఫ్రా మేజర్ నుండి 150 కోట్ల రూపాయల  విరాళం తెలుగుదేశం పార్టీకి విరాళంగా వెళ్ళిందంటూ వచ్చిన వార్తల దరిమిలా, ఈ ఎపిసోడ్ లో కీలకపాత్ర పోషించినట్టుగా చెబుతున్న పెండ్యాల శ్రీనివాస్ ను పూర్తి స్థాయి లో విచారించటానికే, ఆయన్ను హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. ఐదేళ్ల పదవికాలం లో ఆ సంస్థకు దాదాపు 2230 కోట్ల రూపాయలు పనుల కాంట్రాక్టు పనులు అప్పజెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం లో కీలకమైన శాఖలకు మంత్రులుగా వ్యవహరించిన డాక్టర్ నారాయణ, నారా లోకేష్ అనుయాయులపైనా, వారి ఆర్ధిక లావాదేవీల కు సంబంధించిన డాక్యుమెంట్ల పైన లోతైన అధ్యయనం చేయటం కోసమే నిఘాసంస్థలు ఇంత సమయం తీసుకుంటున్నామని సమాచారం. పనులు ఇచ్చినందుకు గాను అప్పట్లో గవర్నమెంట్ కు చెందిన వ్యక్తి కి 700 కోట్లు చెల్లించాలని, అందులో భాగంగా అప్పటి అధికార పార్టీకి ఎన్నికల సమయంలో 150 కోట్ల రూపాయల డబ్బులు అందాయని  దర్యాప్తు సంస్థల విచారణ లో ప్రాధమికంగా వెల్లడైన అంశం. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్, ఆగ్రా, పూణే, గోవాలతో పాటు 42 చోట్ల, నిరుడు నవంబరు లో జరిపిన సోదాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ఇచ్చినట్లు లెక్కలు తేలినట్టు దర్యాప్తు సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఎన్నికల సమయం లో 150 కోట్ల రూపాయల డబ్బు  హైదరాబాద్ మీదుగా విజయవాడ కు చేరినట్టు గుర్తించిన ఐటీ అధికారులు, తర్వాతి విచారణ నిమిత్తం, ఈ.డీ., డీ.ఆర్. ఐ. ల సాయం కోరినట్టు సమాచారం. నిజానికి, ఇంత భారీ స్థాయిలో సోదాలు జరుగుతుంటే, అందునా... తన మాజీ పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ నివాసం లోనూ, లోకేష్ ఆంతరంగికుడు కిలారు రాజేష్, అలాగే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడి నివాసాల్లోనూ ఈ సోదాలు గడిచిన 36 గంటలుగా జరుగుతుంటే, తెలుగుదేశం అగ్రనాయకత్వం కిక్కురుమనకుండా కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవానికి, ఇప్పటికే వైఎస్ఆర్సిపీ ని ఈ ఎపిసోడ్ లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం తెలుగుదేశం చేసి ఉండేదనీ, అయితే, అవతల దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో రంగంలోకి దిగటం తో ఏమి జరుగుతుందో వేచి చూద్దామనే ధోరణిలోకి తెలుగుదేశం వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే, ఈ పరిణామాలేవీ వైఎస్ఆర్సిపీ కి కూడా మింగుడుపడటం లేదు..కారణమేమిటంటే , రాబోయే రోజుల్లో తమ వ్యాపార, వాణిజ్య సంస్థలపైనా కేంద్ర సంస్థలు ఈ రకమైన సోదాలు నిర్వహించవచ్చునేమోననే సందేహాలు ఆ పార్టీ లోనూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం బట్టి పెండ్యాల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వానికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు పారిశ్రామిక వేత్తల పేర్లు మాత్రమే ...దర్యాప్తు సంస్థల అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.

ఐటీ దాడులతో టీడీపీలో కలవరం.. నాన్ బీజేపీ పార్టీలతో టచ్ లోకి వెళ్లాలని నాయుడు యోచన!

ఒకవైపు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రస్తుతం తెలుగుదేశాన్ని చుట్టుముడుతున్న తీరు, తెలుగుదేశం అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది. దీన్ని ఎలా అధిగమించాలి అని తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి రాష్ట్రంలో కష్టకాలం మొదలైంది. పార్టీ అగ్ర నాయకత్వానికి అతి దగ్గరి వారైన అందరినీ ప్రస్తుతం జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.  గడిచిన 50 రోజులుగా మూడు రాజధానుల వివాదంతో  బలంగా ప్రజల్లోకి వెళ్లి గలిగిన తెలుగుదేశం పార్టీ, తాజాగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అనుయాయుల నివాసాల మీద, కార్యాలయాల్లోనూ జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ దాడులతో ఆత్మరక్షణలో పడిపోయింది. నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, లోకేష్ అనుచరుడు కిలారు రాజేష్, ఇంకా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు నివాసాలపై, ఇన్కమ్ టాక్స్ అధికారుల బృందం ఒకేసారి హైదరాబాద్ ,విజయవాడలో దాడులు జరిపింది. 2 నెలల క్రితం, నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ పెద్దలతో జరిపిన రాజీ మంతనాలు చంద్రబాబు నాయుడుకు ఎటువంటి ఊరటను ఇవ్వకపోగా బీజేపీ అధిష్టానం, ఇప్పట్లో తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధంగా లేదనే సంకేతాలను పంపాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో దూకుడు పెంచిన బిజెపి, తెలుగుదేశంతో సమానంగా అధికార వైయస్సార్సీపి పై ఉద్యమాల బాట పట్టింది. ఆరడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్ బిజెపికి తోడవడంతో, ప్రస్తుతానికి తెలుగుదేశంతో దూరం పాటించాలనే ఆలోచన లో బిజెపి హెడ్ క్వార్టర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఒక చిత్రమయిన పరిస్థితిని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ , వ్యూహాత్మకంగా వెళ్లలేక పోతుంది అనే భావన పార్టీ క్యాడర్లో నెలకొని ఉంది. మూడు రాజధానుల ప్రకటన చేసి జగన్మోహన్రెడ్డి సర్కార్, తెలుగుదేశం పార్టీకి కావలసినంత  ఆక్సిజన్ ఇచ్చినప్పటికీ, తాజాగా జరిగిన ఐటీ దాడులు ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయి. 2024 లో కనీసం ప్రతిపక్ష స్థాయిని చేరుకోవాలని భావిస్తున్న బిజెపి, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దశలవారీగా దెబ్బ కొట్టడానికి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలను టచ్ చేస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ బలహీన పడుతుందని, తద్వారా బీజేపీని బలోపేతం చేసుకోవచ్చునని అమిత్ షా ఇప్పటికే ఒక దిశా నిర్దేశనం  చేసినట్టు సమాచారం. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో టిడిపి ముఖ్య నాయకుల నివాసాలు కంపెనీల పైన కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోందని తెలుగుదేశం భావిస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతో పాటు, మరోవైపు పార్టీ అంతర్గత నిర్మాణం లో ఎటువంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి, బిజెపి వైపు నుంచే ఎక్కువ ప్రమాదం కనిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని ఖరాఖండిగా చెప్పేసిన వైయస్సార్ సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి,  ఆ రకంగా టీడీపీకి రిలీఫ్ ఇచ్చినప్పటికీ, మరోవైపు బిజెపి దూకుడుగా వెళుతూ  రాష్ట్రంలో టిడిపిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే, నాయుడు ముఖ్య అనుచరులపై కేంద్ర సంస్థలు మరికొన్ని కేసులతో, తెలుగుదేశాన్ని ఇరకాటంలో పెట్టే  ప్రయత్నాలు జరగవచ్చునని సంకేతాలు ఉన్నాయి. దరిదాపుల్లో టీడీపీకి, బిజెపి నుంచి స్నేహ హస్తం అందే అవకాశం లేక పోవటం వల్ల, ప్రస్తుతానికి అడుగులు ఆచి తూచి వేయాలని, అవసరమైతే  నాన్ బిజెపి పార్టీలతో మరోసారి జట్టు కట్టి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోనుందా? జగన్ ప్రభుత్వంతో కియాకి పడటం లేదా?

వైసీపీ ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పలువురు పారిశ్రామికవేత్తలు సైతం వైసీపీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతుందంటూ ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మోహన్‌దాస్ పాయ్ ఆమధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రముఖ కంపెనీలు, పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శలు నిజమేనేమోననిపిస్తున్నాయి. ఎందుకంటే, దక్షిణకొరియా దిగ్గజ కంపెనీ కియా మోటార్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలగేందుకు ప్రయత్నిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తన ప్లాంట్ ను తరలించాలనే ఉద్దేశంతో ఉందనే ప్రచారం జరుగుతోంది. 1.1 బిలియన్ డాలర్లతో అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కార్ల ప్లాంట్ ను తమిళనాడుకు తరలించే సాధ్యాసాధ్యాలపై కియా మోటార్స్ చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. కియా మోటార్స్ ప్రతినిధులు ఇఫ్పటికే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపినట్లు ప్రముఖ వార్తసంస్థ రాయిటర్స్ సంచలన కథనం ప్రచురించింది. దాంతో, రాయిటర్స్ కథనంపై ఏపీలో కలకలం రేగుతోంది.  ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కారు మార్కెట్ కలిగివున్న కియా మోటార్స్... భారత్ లోకి ఎంట్రీ ఇచ్చి తన తొలి ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పింది. అనంతపురం జిల్లాలో రెండేళ్ల నిర్మాణ పనుల తర్వాత గతేడాది డిసెంబర్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది. ఏడాదికి 3లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నెలకొల్పిన ఈ ప్లాంట్లో ప్రత్యక్షంగా 12వేల మందికి ఉద్యోగాలను కల్పించింది. అయితే, చంద్రబాబు హయాంతో రాష్ట్రానికొచ్చిన కియా మోటర్స్.... జగన్ ప్రభుత్వం వచ్చాక కొన్ని ఇబ్బందులను ఎదుర్కొందనే ఆరోపణలు వినిపించాయి. అందుకు రుజువుగా, అసెంబ్లీ సాక్షిగా కియాకి చంద్రబాబు కల్పించిన రాయితీలు, సౌకర్యాలపై మంత్రి బుగ్గన తప్పుబట్టారు. దాంతో, కియా మోటార్స్ తో జగన్ ప్రభుత్వానికి సఖ్యత లేదనే మాటలు వినిపించాయి. ఇఫ్పుడు, రాయిటర్స్ కథనంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక టీడీపీ నేతలైతే జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ వంటి వారైతే.. ఏపీ ప్రజలు ఏం తప్పు చేశారని ఈ శిక్ష అనుభవించాలి, ఏపీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారంటూ.. తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే, రాయిటర్స్ కథనాన్ని ఏపీ అధికారులు ఖండిస్తున్నారు. కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమంటున్నారు. కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని ఏపీ ఇండస్ట్రీస్ సెక్రటరీ రజత్ భార్గవ చెబుతున్నారు. వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా రాయిటర్స్ కథనాన్ని ఖండించారు. ఏపీ నుండి కియా తరలిపోతుందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సీఎం జగన్ కియాతో సంఖ్యతగా ఉన్నారని, రాష్ట్రంలో కియా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తారని విజయసాయి చెప్పుకొచ్చారు. అసలు రాయిటర్స్ లాంటి సంస్థ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏంటని అధికార పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కియా తరలిపోతుందన్న అసత్య ప్రచారంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో.. అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతలు.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. నష్టనివారణ చర్యలు చేపట్టారు. అయితే, రాయిటర్స్ కథనంపై కియా మోటార్స్ స్పందించాల్సి ఉంది. అలాగే, ఏపీ నుంచి ప్లాంట్ ను తరలించే ఉద్దేశం లేదని ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేదంటే అనుమానాలు కంటిన్యూ కావడం ఖాయం.

వికేంద్రీకరణ బిల్లుపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ!!

పాలన వికేంద్రీకరణ బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాకుండా జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. కమిటీలు వేయొద్దని కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుందని సమాచారం. చైర్మన్ నిర్ణయం పాటించొద్దు అంటూ ఉప ముఖ్యమంత్రి, చీఫ్ విప్ లు లేఖలు రాశారు. దీంతో కార్యదర్శి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. పాలన వికేంద్రీకరణ, సీ ఆర్ డీ ఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో సెలెక్ట్ కమిటీని ఏర్పాటు కాకుండా జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కమిటీల ఏర్పాటు జరగకుండా చూడాలని ప్రభుత్వ, వేసి తీరాల్సిందేనని చైర్మన్ గట్టి పట్టుదలతో ఉండటంతో ఉత్కంఠ భరితంగా మారింది. సెలక్ట్ కమిటీల ఏర్పాటును అడ్డుకునే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండలి కార్యదర్శికి ఏకంగా లేఖ రాయగా కమిటీల్లో నియమించేందుకు తమ సభ్యుల పేర్లను టిడిఎల్పీ ఇప్పటికే ఇన్ చార్జి కార్యదర్శి రాజ్ కుమార్ కు అందజేసింది. దీంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. రాజధాని బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏకంగా మండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం తుది నిర్ణయం తీసుకుని పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసేదాకా మండలి కొనసాగుతుంది. ఈలోపు సెలక్ట్ కమిటీలు ఏర్పాటు కాకుండా మండలి ఇన్ చార్జి కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సెలక్ట్ కమిటీల్లో నియమించే ఎమ్మెల్సీల పేర్లు పంపాల్సిందిగా ఆయా పార్టీలకు లేఖలు రాయాలని మండల ఇన్ చార్జి కార్యదర్శికి ఇప్పటికే చైర్మన్ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో చైర్మన్ ఆదేశాల ప్రకారం ఆయన వెంటనే లేఖలు రాస్తారు కానీ, ప్రభుత్వ ఒత్తిడి బలంగా ఉండటంతో ఆయన ఇంత వరకూ ఈ లేఖలు పంపలేదు. ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే యోచనతో టిడిపి శాసన సభాపక్షం తమ తరపున పదిమంది ఎమ్మెల్సీల పేర్ల జాబితాను ఇప్పటికే కార్యదర్శికి అందజేసింది. ఒక్కో కమిటీలో టిడిపి కోటా కింద ఐదుగురు సభ్యులు వస్తారు. ఇది అందజేసినట్టు కార్యదర్శి నుంచి రశీదు కూడా తీసుకున్నారు. ఇది తెలిసి అధికార పక్షం వెంటనే రంగంలోకి దిగింది. మండలిలో సభా నాయకుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ లు విడివిడిగా కార్యదర్శికి లేఖలు రాశారు. నియమాలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటీల ఏర్పాటు జరుగుతున్నందున అందులో తాము భాగస్వామి కాబోమని తమ పార్టీ నుంచి ఎవరూ ఈ కమిటీల్లో ఉండరని ఉమారెడ్డి తన లేఖలో తెలిపినట్టు ప్రచారం జరుగుతుంది. కమిటీలు ఏర్పాటు చేయాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం.. నియమాలకు విరుద్ధమని అందువల్ల కమిటీలు ఏర్పాటు చేయవద్దని కోరుతూ బోస్ మరో లేఖ రాశారు. ప్రభుత్వ అధికారి అయిన కార్యదర్శి అటు ప్రభుత్వపక్షం మాట కాదనలేక, ఇటు చేరిపోయిన ఆదేశాలను ధిక్కరించే పరిస్థితి లేక ఏ నిర్ణయం తీసుకోకుండా రోజులు నెట్టుకొస్తున్నారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మండలిలో సభా నాయకుడి లేఖను జతపరుస్తూ.. పై అభ్యంతరాల దృష్ట్యా తాను సెలెక్ట్ కమిటీ ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేనని చైర్మన్ కు లేఖ రాయాల్సిందిగా కార్యదర్శికి ప్రభుత్వం సూచించిందని అంటున్నారు. మరి ఆయన అలా రాస్తారా లేదా అన్నది చూడాలి.

శాసనమండలి రద్దు నిర్ణయంతో నిరాశకు గురైన వైసిపి నేతలు!!

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకే కాదు వైసీపీ నేతలకు కూడా తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. తాజాగా శాసనమండలిని రద్దు నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ లోని పలువురు నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే ఉద్దేశంతో ఏకంగా శాసన మండలినే ఏపీ ప్రభుత్వ పెద్దలు రద్దు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క చిక్కుముడి విప్పబోయి వంద చిక్కుముడులు వేసినట్టుగా ఉంది జగన్ తీరు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు కామెంట్ చేస్తున్నారు. శాసన మండలి రద్దు నిర్ణయం వల్ల ఆ పార్టీలోని ఎందరో నేతల ఎమ్మెల్సీ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో వారంతా పార్టీ అధినేత తీరుపై అసహనంతో ఉన్నారు.  మండలి రద్దు నిర్ణయంతో చిత్తూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు ముఖ్య నేతలు ఆశలు అడియాసలయ్యాయి. అందులో ఒకరు కె చంద్ర మౌళి కాగా రెండోవారు ఎస్సీవీ నాయుడు. తాము అధికారంలోకొస్తే ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడదే జగన్ ఏకంగా శాసనమండలిని రద్దు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో మండలి సభ్యత్వం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆ ఇద్దరి పరిస్థితేమిటన్నది పార్టీ శ్రేణులకు కూడా అంతుబట్టడం లేదు. సీఎం జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా ఎవరు తప్పుపట్టకపోయినా సన్నిహితుల వద్ద మాత్రం వారు ఆక్షేపిస్తున్నారు.  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కె చంద్ర మౌళి కుప్పం నియోజకవర్గంలో 2014-19 ఎన్నికల్లో వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పోటి చేసారు. పోటీ చేసిన రెండు సందర్భాలలో కూడా చంద్రబాబు మెజారిటీని కొంత తగ్గించగలిగారు. ఇదిలా ఉంటే కుప్పంలో చంద్రమౌళిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఒకవేళ బాబుపై గెలవకపోయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తామని కూడా వాగ్దానం చేశారు. దీనికి తోడు 2019 ఎన్నికల్లో చంద్రమౌళి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనలేకపోయారు. దీంతో పార్టీ వర్గాల్లో ఆయనపై బాగా సానుభూతి ఏర్పడింది. వయసు రీత్యా కూడా ఇది చివరి అవకాశం అనే భావన అందరిలో ఉంది వీటికి తోడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా హామీ ఇచ్చినందున చంద్ర మౌళికి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని కుప్పం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి. చంద్రమౌళి కూడా ఇదే ధీమాతో ఉన్నారు, మండలిలోకి చంద్రమౌళి అడుగుపెడతారని అదృష్టం కలిసొస్తే మంత్రి పదవి దక్కినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అనుచరులు గంపెడాశతో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలిని రద్దు తీర్మానం చేయడంతో ఈ అంశం చంద్రమౌళి పాలిట పిడుగుల మారింది.  శ్రీకాళహస్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు రాజకీయంగా అనేక పార్టీలలో కొనసాగినప్పటికీ స్థానికంగా బలమైన నేత. శ్రీకాళహస్తితోపాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్తివేడులోనూ నెల్లూరు జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట నియోజక వర్గంలో ఆయనకు బాగా పట్టుంది. గత పాతికేళ్ల నుంచి శ్రీ కాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆశతో అప్పటికే తాను కొనసాగిన పార్టీలో టిక్కెట్ ఆశించి భంగపడిన సందర్భాలూ ఉన్నాయి. నిజానికి ఈ ఆశతోనే ఆయన పలు పార్టీలు మారినట్టుగా స్థానికులు చెబుతుంటారు. 2004ఎన్నికల సమయంలో ఎస్సీవీ నాయుడు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ లభించింది, తొలిసారి గెలిచి చట్ట సభలోకి అడుగు పెట్టారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఎస్సీవీ నాయుడు తిరిగి తెలుగుదేశం గూటికి వచ్చారు. అప్పటి నుంచి టిడిపిలో కొనసాగారు. 2019 ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆశించారు, టికెట్ లభించకపోవడంతో టిడిపిని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీ కాళహస్తి సత్యవేడు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో కూడా ఎస్సీవీ నాయుడు పట్టు ఉండటంతో ఆ మూడు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు గట్టిగా కృషి చేశారు. అయితే పార్టీలో చేర్చుకునే సమయంలో ఎస్సీవీ నాయుడుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. వయసు రీత్యా నాయుడు కూడా ఈ ఐదేళ్ళలోనే సముచిత పదవులు పొందాలనే ఆశ పెట్టుకున్నారు. జగనిచ్చిన మాట నెరవేరుతుందని తన అనుచర వర్గంతో కూడా చెబుతూ వచ్చారు.  అయితే మూడు రాజధానుల బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందకపోవడంతో ఏకంగా మండలి పైనే వేటు వేశారు సీఎం జగన్. ఈ పరిస్థితుల్లో ఎమెల్సి పదవులపై ఆశ పెట్టుకున్న నేతల్లోనే కాకుండా వారి అనుచర వర్గాల్లో కూడా తీవ్ర నిరాశ చోటుచేసుకుంది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇతర పదవులేమైనా ఇస్తారని ఆశించాలన్నా అలాంటి అవకాశం కనుచూపు మేరలో కనబడటం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజికవర్గాలతోపాటు మహిళలకు రిజర్వేషన్ పాటించేలా విధాన పరమైన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. దీంతో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు దక్కడం దాదాపు అసాధ్యమని ఆయా నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ నిర్ణయంపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలు బహిరంగంగా మాత్రం విమర్శించటం లేదు కానీ, అంతర్గతంగా బాగా రగిలిపోతున్నారట. మండలి రద్దును స్వాగతించే వారికన్నా విమర్శించే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

ఇది అసలు ట్విస్ట్ అంటే... దేశ రెండో రాజధానిగా అమరావతి!!

ఏపీని నెలరోజులుగా పట్టి కుదిపేస్తున్న అంశం మూడు రాజధానులు. అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్ష టీడీపీ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజధానిగా అమరావతినే ఉంచాలని, అమరావతి నుంచి రాజధానిని తరలించడానికి వీల్లేదని రైతులతో కలిసి ఉద్యమిస్తోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజధాని అంశంపై ఒకరిపై ఒకరు కయ్యానికి కాలు దువ్వుతుంటే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం వేడుక చూస్తోంది. ఆ పార్టీ నాయకులు.. కొందరు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో.. రాజధానిపై బీజేపీ స్పష్టమైన వైఖరి ఏంటో తెలియకుండాపోయింది. ఇలా రాజధాని రగడ నెలరోజులకు పైగా కొనసాగుతూనే ఉంది. అయితే ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతున్న వేళ.. బీజేపీ ఊహించని ట్విస్ట్ ఇవ్వడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అమరావతిని దేశ రెండో రాజధానిగా చేయాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హవా ఉండేది. అయితే విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఏపీలో బీజేపీ ప్రభావం మొదటి నుండి అంతంత మాత్రంగానే ఉండేది. రాష్ట్ర విభజన తరువాత 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో కలిసి బరిలోకి దిగిన బీజేపీకి గౌరవప్రదమైన సీట్లు వచ్చాయి. అయితే ౨౦౧౯ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది. నోటా కంటే తక్కువ ఓట్లు సాధించింది. ఏపీ ప్రజలు.. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ని ఎంత వ్యతిరేకిస్తున్నారో... విభజన హామీలు మరిచి, ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన బీజేపీని కూడా.. అంతే వ్యతిరేకిస్తున్నారని ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది. ఆ వ్యతిరేకతను పోగొట్టి ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఆ దిశగానే ఇప్పుడు అడుగులు వేస్తోంది. దేశ రెండో రాజధాని దక్షిణాదిన ఉండాలని రాజ్యాంగంలో సూచించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. బీజేపీ ఇప్పుడు ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రెండో రాజధానిగా అమరావతి అయితే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆర్‌ఎస్ఎస్ కూడా అమరావతి అయితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చారిత్రకత, సంస్కృతి, ఇలా అన్నిటిపరంగా అమరావతి అనువైన రాజధాని అవుతుందని ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించి దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర భారత దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ.. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేదు ఫలితాలను రుచిచూసింది. దీంతో ఉత్తరంలో తగ్గిన ప్రభని దక్షిణంలో సరి చేయాలి అనుకుంటుంది. దానిలో భాగంగానే ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో 2014 నుండి టీడీపీ- వైసీపీల మధ్య పోరు నువ్వానేనా అన్నట్టుగా ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఊహించని విజయాన్ని అందుకొని.. టీడీపీకి వెనక్కి నెట్టింది. అయినా టీడీపీ బలంగానే ఉంది, ప్రతిపక్ష పార్టీగా తన గళాన్ని బలంగా వినిపిస్తోంది. అయితే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని వైసీపీ చూస్తోంది. మరోవైపు టీడీపీ ప్లేస్ లోకి బీజేపీ వచ్చి.. వైసీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని భావిస్తోంది. అంటే రెండు పార్టీలకు టీడీపీని దెబ్బకొట్టడం కావాలి. అందుకే రాజధాని అంశాన్ని తెరమీదకు తెచ్చి టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని అంటున్నారు. మూడు రాజధానులతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ మీద వ్యతిరేకత ఏర్పడేలా చేసి... మరోవైపు అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించి రాష్ట్రంలో బీజేపీ బలపడాలని చూస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మూడు రాజధానులు అంటూ వైసీపీ.. అమరావతి దేశ రెండో రాజధాని అంటూ బీజేపీ... ఇలా రెండు పార్టీలు కలిసి ఏపీలో టీడీపీని సమాధి చేయడానికి కంకణం కట్టుకున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మండలి రద్దయితే... పిల్లి, మోపిదేవి పరిస్థితేమిటి?

మండలిలో పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తుంటే... కౌన్సిల్ రద్దు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో... తెలుగుదేశానికి రుచి చూపించాలన్న పట్టుదలతో... జగన్మోహన్ రెడ్డి ఉన్నారని... దాంతో, మండలి రద్దు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తన ఏకచత్రాధిపత్యాన్నే ధిక్కరిస్తారా? అనే భావనతో జగన్ పట్టుదలకు పోతేమాత్రం మండలి రద్దు తప్పదంటున్నారు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని విశ్లేషించిన మీడియా, రాజకీయ విశ్లేషకులు సైతం మండలి రద్దు ఖాయమనే చెబుతున్నారు. అయితే, పట్టుదలకుపోయి మండలిని రద్దుచేస్తే, ముందుముందు జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు. ఎన్నికల సమయంలో ఎంతోమందికి ఎమ్మెల్సీ ఇస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. మరి, వీళ్లందరికీ ఏం సమాధానం చెబుతారు... ఏవిధంగా పదవుల్లో అకామిడేట్ చేస్తారనేది ప్రశ్నార్ధకమే. హామీలు పొందినవాళ్ల సంగతి పక్కనబెడితే... ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న 9మంది తమ పదవులు కోల్పోయి రాజకీయ నిరుద్యోగులు మారతారు. ముఖ్యంగా శాసనమండలి సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.  అయితే, మండలి రద్దయితే, ఇప్పటికిప్పుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులకు వచ్చే ముప్పు లేకపోయినా, ఆరు నెలలు తర్వాత మాత్రం కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈలోపు... ఏవైనా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలొచ్చి... ఎమ్మెల్యేలుగా గెలిస్తే తప్ప.... వీళ్లిద్దరూ మంత్రి పదవుల్లో కంటిన్యూ అయ్యే ఛాన్సుండదు. అయితే, ఏపీలో ప్రస్తుతం ఉపఎన్నికలు జరిగే పరిస్థితే లేదు. దాంతో, మండలి రద్దు జరిగితే మాత్రం ఆర్నెళ్ల తర్వాత కచ్చితంగా పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు మాజీలుగా మారిపోతారు. అయితే, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు... వైఎస్ కుటుంబానికి ఎంతో నమ్మకస్తులు. పైగా ఎప్పట్నుంచో వైఎస్ ఫ్యామిలీతో అసోసియేటై ఉన్నారు. అదే సమయంలో జగన్ కు కూడా ఇద్దరూ అత్యంత సన్నిహితులు. అందుకే, మోపిదేవి వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి కట్టబెట్టారు. పిల్లి సుభాష్ చంద్ర బోస్ ది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అయితే, మండలి రద్దయి ఆర్నెళ్ల తర్వాత మాజీలుగా మారితే... వీళ్లిద్దరికీ కేబినెట్ ర్యాంక్ తో కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టొచ్చని అంటున్నారు.

విశాఖకు రాజధాని తరలిస్తే ఇంత నష్టమా? కలలో కూడా ఊహించలేరు!!

ఏపీ రాజధానిని మూడు భాగాలుగా విభజించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా.. మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గకుండా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది. అయితే ఈ మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొత్త రాజధానిని నిర్మించడం అంటే.. పసి పిల్లాడిని పెంచి పెద్ద చేయడం లాంటిది. పిల్లోడు పుష్టిగా పెరగాలంటే టైంకి పాలు, ఫుడ్, నీళ్లు సరిగ్గా అందించాలి. అలా కాకుండా పాలు ఒక దగ్గర, ఫుడ్ ఒక దగ్గర, నీళ్లు మరో దగ్గర అంటూ.. అటు ఇటు తిప్పితే పిల్లోడి ఎదుగుదలకే ప్రమాదం. ఇప్పుడు ఏపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ముందు రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని నిర్మించి అభివృద్ధికి బలమైన పునాది వేయాలి. ఆ రాజధాని మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని మిగతా నగరాలను అభివృద్ధి చేయాలి. దానిని అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేకాని ఇలా పరిపాలన వికేంద్రీకరణ చేయడం వల్ల ఒరిగేదేమి లేదు. ఇలా మూడు నాలుగు రాజధానుల అనుకంటూ పొతే.. ఏపీకి అంటూ ఓ పెద్ద నగరం లేకుండా పోతుంది. ఎక్కడా పూర్తిగా అభివృద్ధి జరగదు. పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపవు. మన దేశంలోని పలు రాష్ట్రాలను తీసుకోండి. వాటికంటూ రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాతే.. రాష్ట్రంలోని మిగతా నగరాలను అభివృద్ధి చేసుకున్నాయి. తమిళనాడుని తీసుకోండి. రాజధాని చెన్నైని బాగా అభివృద్ధి చేసుకుంది. దాంతో పాటే కోయంబత్తూర్, తిర్పూర్, ట్రిచీ, సేలం ఇలా ఎన్నో నగరాలను అభివృద్ధి చేసుకుంది. మహారాష్ట్రని తీసుకుంటే ముంబై, నాగపూర్, పూణే ఇలా ఎన్నో నగరాలు అభివృద్ధి చెందాయి. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణను తీసుకుంటే.. తెలంగాణకు ఆదాయం తెచ్చే కామధేనువు హైదరాబాద్. రాష్ట్రానికి భారీగా ఆదాయం తెచ్చే పునాది హైదరాబాద్ ఉంది కాబట్టే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలలో.. ఐటీ హబ్ లు, మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాలు.. ముందు రాజధానిగా ఓ పెద్ద నగరాన్ని అభివృద్ధి చేసుకొని.. ఆ తరువాత రాష్ట్రంలోని మిగతా నగరాలని అభివృద్ధి చేసుకొని దూసుకుపోతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. మూడు రాజధానులు పేరుతో.. అసలు ఏపీకి అంటూ ఓ పెద్ద నగరం లేకుండా చేస్తోంది. హైదరాబాద్ కి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. వసతులు, ఆదాయ వనరులు ఉండటంతో.. లక్షల్లో ప్రజలు హైదరాబాద్ కి వలస వచ్చారు. ఇప్పుడు ఏపీలో ప్రాంతానికో రాజధాని పెట్టుకుంటే పొతే.. పెట్టుబడులు ఎలా వస్తాయి? రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?. ఈ మూడు రాజధానుల వల్ల ఏపీకి ఆదాయం తగ్గిపోవడమే కాదు.. భారీగా ఆర్ధిక భారం కూడా పడనుంది. గత ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖల కోసం పలు భవనాలు నిర్మించింది. అధికారులు, ఉద్యోగుల వసతి కోసం ఏర్పాటు చేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ పరిపాలనను విశాఖకు మారిస్తే.. కొత్తగా భవనాలు నిర్మించాలి, ఉద్యోగులకు వసతి కల్పించాలి. ఇదంతా ఆర్ధిక భారం కాదా? వివిధ శాఖలను తీసుకుంటే విశాఖకు తరలి వెళ్లాల్సిన ఉద్యోగులు సుమారుగా లక్షమంది ఉంటారు. ఈ ఉద్యోగులందరికీ విశాఖ వద్ద 200 చదరపు గజాల ఇంటి స్థలాలను నామమాత్రపు రేటుకు ప్రభుత్వం కేటాయిస్తుంది. కొత్త ఇళ్ల నిర్మాణానికి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్రత్యేక గృహనిర్మాణ భత్యం (హెచ్‌బిఎ) ఇవ్వనుంది. ఇళ్ళు నిర్మించే వరకు, ప్రభుత్వం ఉద్యోగులకు నివాస సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ .50 వేల నుండి గరిష్టంగా లక్ష రూపాయల వరకు షిఫ్టింగ్ భత్యం ఇవ్వనుంది. 1) ఒక్కొక్కరికి 200 గజాల ప్లాటు గవర్నమెంటు రేటు వైజాగ్ లో గజం 21,000 కంటే తక్కువ ఎక్కడా లేదు. అంటే 1,00,000x 200x 21,000 = 42,000 కోట్లలుతుంది. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టడటం సాధ్యం కాదన్న వారు.. కేవలం ఉద్యోగుల స్థలాల కోసం 42 వేల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమేనా? సరే ఎక్కడో సిటీకి దూరంగా ఇచ్చినా గజం రూ. 5,000 కంటే తక్కువ ఎక్కడా వుండదు. పోనీ గజం 5,000 తీసుకున్నా.. 10,000 కోట్లు ఖర్చవుతుంది. 2) ఒక్కొక్కరికి 25 లక్షల గృహ నిర్మాణ భత్యం. 1,00,000 x 25,00,000 = 25 వేల కోట్లు 3) షిఫ్టింగు భత్యం 50,000 నుండి లక్ష వరకు. సగటు గా ఒక్కొక్కరికి 75,000 అనుకుంటే 1,00,000 x 75,000 = 750 కోట్లు అంటే కేవలం ఉద్యోగుల కోసమే దాదాపు 50 వేల కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. ఇంకా అయిపోలేదు. పలు శాఖల భవనాలు కూడా ఉన్నాయి. * విజయవాడలో 4 లక్షల చదరపు అడుగులలో వంద కోట్ల ఖర్చుతో R&B భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో వంద కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో 2 లక్షల చదరపు అడుగులలో 108 కోట్ల ఖర్చుతో ఏపీఐఐసీ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 108 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో లక్ష చదరపు అడుగులలో 40 కోట్ల ఖర్చుతో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 40 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * విజయవాడలో లక్ష చదరపు అడుగులలో 143 కోట్ల ఖర్చుతో విద్యుత్ సౌధ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 143 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * వెలగపూడిలో శాసనసభ, శాసనమండలి మరియు సచివాలయం భవనాలకు కలిపి నిర్మాణానికి సుమారు 500 కోట్లు ఖర్చయింది. ఇప్పుడు మళ్లీ విశాఖలో సచివాలయం కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెడతారు? * గొల్లపూడిలో 30 వేల చదరపు అడుగులలో నాలుగున్నర కోట్ల ఖర్చుతో దేవాదాయ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో మరో భవనం నిర్మిస్తారా? * వెలగపూడిలో 58 కోట్ల ఖర్చుతో కమాండ్ కంట్రోల్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 58 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? * మంగళగిరిలో 65 వేల చదరపు అడుగులలో 19 కోట్ల ఖర్చుతో ఏపీ పోలీస్ టెక్ టవర్స్ నిర్మించారు. ఇప్పుడు దాన్నేం చేస్తారు? విశాఖలో 19 కోట్లతో మరో భవనం నిర్మిస్తారా? అమరావతిలో ఎన్నో భవనాల నిర్మాణం జరిగింది. వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అమ్మగా వచ్చిన డబ్బుతో రాజధానిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రాజధానిని తరలించాలని నిర్ణయించింది. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఖర్చుతో రాజధానిని తరలిస్తే.. అదంతా ప్రభుత్వం మీద భారం కాదా? ప్రజా ధనం వృధా కాదా?. ఇప్పటికైనా ఆలోచించండి.

అప్పుడు పవన్ చెప్పింది వినుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా?

కీడు ఎంచి మేలెంచాలి అంటారు పెద్దలు. ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన సమయంలో 2015 లో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే మాట గుర్తుచేశారు. "అనేక వేల మంది రైతులు.. వారి నమ్మకాన్ని, వారి భవిష్యత్తుని, వారి పిల్లల భవిష్యత్తుని టీడీపీ ప్రభుత్వం చేతుల్లో పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ ఓడిపోతే పరిస్థితి ఏంటి?. కీడు ఎంచి మేలెంచమంటారు కదా. ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాలేదు అనుకున్నాం. అప్పుడు మంత్రి నారాయణ ఉండరు, పత్తిపాటి పుల్లారావు ఉండరు. మరి రైతుల పరిస్థితి ఏంటి?. వారి భవిష్యత్తుకి గ్యారంటీ ఏంటి?. వారు టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తున్నారు.. కానీ ఆ నమ్మకానికి గ్యారంటీ ఏంటి?" అని పవన్ ప్రశ్నించారు. పవన్ అనుమానమే నిజమైంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. రైతులు పెట్టుకున్న నమ్మకం కన్నీటి పాలైంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వైపు అడుగులు వేస్తోంది. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంచి.. మిగతా పరిపాలన విభాగమంతా విశాఖకు తరలిస్తోంది. దీంతో రైతులు, మహిళలు.. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కానీ వారు ఎంత గొంతు చించుకున్నా, ఎంత కన్నీరు పెట్టుకున్నా ఏం లాభం?. జరగాల్సిన నష్టం జరిగిపోయి.. వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్తోంది. అప్పుడు టీడీపీ నేతలు.. ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తాం.. మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు రాకెట్ లా దూసుకుపోతుందని చెప్పారు.. ల్యాండ్ పూలింగ్ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా వంటివారు.. ల్యాండ్ పూలింగ్ లో ప్రధాన పాత్ర పోషించారు. మీ భవిష్యత్తు ఆకాశాన్ని తాకుతుంది అంటూ.. రైతుల దగ్గర నుండి వేల ఎకరాల భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? పవన్ అనుమానించినట్టుగానే.. టీడీపీ అధికారంలోకి రాలేదు. రైతుల నమ్మకానికి గ్యారంటీ ఏంటని పవన్ ప్రశ్నించినట్టుగానే.. వారి నమ్మకం దుఃఖంగా మారింది. ఇప్పుడు రైతులు రాజధానిని తరలించొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడు రైతులకు మాటలు చెప్పి భూములు తీసుకున్నవారు ఏమైపోయారు?. ముఖ్యంగా 'ల్యాండ్ పూలింగ్' అనే సినిమాకి తానే 'స్టోరీ-డైలాగ్స్- స్క్రీన్ ప్లే- డైరెక్షన్' అన్నట్టు ఫీలైన మాజీ మంత్రి నారాయణ ఏమైపోయారు?. అప్పుడు రైతులు భూములు ఇచ్చేవరకు తిరిగారు కాదా.. మరి ఇప్పుడు అదే రైతులు న్యాయం కోసం పోరాడుతుంటే.. వారి పక్షాన పోరాడరా?. ఏమైపోయారు నారాయణ, పత్తిపాటి పుల్లారావు వంటి నేతలు?. దేవినేని ఉమా వంటి వారు అప్పుడప్పుడు బయటికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు కానీ.. నిజంగా రైతులకు మేమున్నామన్న ధైర్యం ఇస్తూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారా? లేదు. అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లు ప్రవేశపెట్టే సమయంలో.. రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడించాలని టీడీపీ ప్లాన్ చేసింది. కానీ ఏమైంది? టీడీపీ నేతలు ఎంతమంది పాల్గొన్నారు?. ఎవరికివారు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే చాలు, మేం ఉద్యమంలో పాల్గొన్నట్టే అని ఫీలయ్యారు. ఈ తూతూ మంత్రం పోరాటాలు వల్ల ఒరిగేది ఏంటి?. ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనని హౌస్ అరెస్ట్ చేస్తారని ముందే తెలిసి.. సీక్రెట్ గా ఒక చోట దాక్కొని, పోలీసుల కళ్ళు గప్పి సడెన్ గా ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షమయ్యారు. అలాంటి దూకుడు ఏపీ టీడీపీ నేతల్లో కరువైంది. ఎలాగూ హౌస్ అరెస్ట్ చేస్తారు.. ఇంట్లోనే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిగా అన్నట్టుంది నేతల తీరు. ఎంపీ గల్లా జయదేవ్ మాత్రమే దూకుడు కనబరిచారు. కొందరి నేతల్లా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేయకుండా.. పొలాల వెంట, గుట్టల వెంట నడిచి.. రైతులకి అండగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మరి మిగతా నేతలు ఏం చేస్తున్నారు? అప్పుడు రైతుల పొలాలు తీసుకున్నారు. ఇప్పుడు రైతుల కోసం పోరాడలేరా?

అప్పుడు విశాఖ వైపు కన్నెత్తి చూడని జగన్.. ఇప్పుడు మంచి చేస్తాడంటే నమ్మాలా?

కొద్ది రోజులుగా ఏపీని పట్టి కుదిపేస్తున్న అంశం రాజధాని తరలింపు. అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రతిపాదన అంశాన్ని సీఎం వైఎస్ జగన్ తెరమీదకు తీసుకురావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని చెప్పడం.. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఇక రాజధాని తరలింపు ఖాయమని తెలుస్తోంది. దీంతో రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వారికి టీడీపీ పూర్తిగా మద్దతిస్తూ ఉద్యమిస్తోంది.  అయితే టీడీపీకి చెందిన కొందరు విశాఖ నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. స్థానిక ప్రజల మెప్పు కోసమే ఆ ప్రాంత టీడీపీ నేతలు కొందరు జగన్ నిర్ణయాన్ని స్వాగతించారని టీడీపీ శ్రేణులు భావించాయి. మరోవైపు అసలు జగన్ విశాఖకు మంచి చేస్తానంటే గుడ్డిగా ఎలా నమ్ముతున్నారంటూ  కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో విశాఖపై జగన్ ప్రదర్శించిన తీరుని గుర్తుచేస్తున్నారు. 2014 లో హుద్‌హుద్ తుఫాను విశాఖని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి విశాఖకు అండగా ఉన్నారు. కొద్దిరోజులపాటు విశాఖలోనే ఉండి అధికారులని ఉరుకులు పెట్టి పనులు చేయించారు. తుఫాను వచ్చి కళ తప్పిన విశాఖకు.. మళ్లీ కళ తెప్పించారు. విశాఖ ప్రజల కళ్ళల్లో ఆనందం తెప్పించారు. కానీ అప్పుడు వైఎస్ జగన్ మాత్రం విశాఖకు అండగా నిలబడలేదు. దానికి కారణం ఆయనకు విశాఖ ప్రజలపై ఉన్న కోపమే అని అప్పుడు ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత హుద్‌హుద్ తుఫాను విశాఖను కుదిపేసింది. విజయమ్మని ఓడించిన పాపం విశాఖకు తగిలింది అంటూ ఆ సమయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఇక జగన్ అయితే విశాఖ వైపు తిగిరిచూడలేదు. తన తల్లిని ఓడించారన్న కోపంతోనే జగన్ వారిని పరామర్శించలేదు, వారికి అండగా నిలబడలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం గెలిచినా ఓడినా ప్రజలకు అండగా ఉండాలి. 2009 కర్నూల్ లో వరదలు వచ్చిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడి.. వారికి తన తరఫున, తన పార్టీ తరఫున ఎంతో సేవ చేశారు. కానీ జగన్ మాత్రం తన తల్లిని ఓడించారన్న కోపంతో... ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ళ కనీళ్ళు తుడవడం కాదు కదా.. కనీసం పలకరించలేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వీటిని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారిని ప్రశ్నిస్తున్నారు కొందరు. అప్పుడు విశాఖ ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం కన్నెత్తి చూడనివాడు.. ఇప్పుడు విశాఖకు మంచి చేస్తానంటే ఎలా నమ్ముతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ కేవలం చంద్రబాబు మీద కోపంతోనే రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఓటమిని గుర్తు పెట్టుకొని విశాఖపై ప్రతీకారం తీర్చుకునే కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని విషయంలో జగన్ మనసులో ఏముందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జగన్ కి మద్దతుగా కొందరు, జగన్ కి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

పవన్ మళ్లీ మళ్లీ అదే తప్పు... పార్టీ బ్రతకాలని లేదా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా? తను తడబడుతూ తన వెంట నడుస్తున్న జనసైనికులను అయోమయానికి గురి చేస్తున్నాడా?. జనసేన ఆవిర్భావం నుండి తాజా రాజకీయ పరిస్థితులు వరకు ఆయన అడుగులు గమనిస్తే అవుననే అభిప్రాయం కలుగుతోంది. సినిమాలకు కామా పెట్టి 2014 లో సొంతంగా జనసేన పార్టీని స్తాపించాడు. సినిమాల్లో ఆయనను ఎంతగానో ఆదరించిన యువత.. రాజకీయాల్లో కూడా ఆయన వెంట నడవడానికి ఉత్సాహం చూపారు. ఆ సమయంలో పవన్ పోటీ చేస్తే గౌరవ ప్రదమైన సీట్లు గెలిపించే అంత ఉత్సాహం చూపించారు జన సైనికులు. కానీ, పవన్ మాత్రం మొదటి అడుగులోనే వారి ఉత్సాహానికి బ్రేకులు వేసాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అంటూ.. ఎన్నికల బరిలోకి దిగకుండా.. బీజేపీ-టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపాడు. దీంతో సగం మంది జనసైనికులు నిరుత్సాహ పడ్డారు. మిగతా వారు పవన్ చెప్పినట్టు.. బీజేపీ-టీడీపీ పార్టీలకు ఓటేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. దీంతో జనసైనికులు అది తమ విజయంగానే భవిస్తూ ఆనంద పడ్డారు. కానీ దానివల్ల జనసేనకు ఒరిగినదేమీ లేదు. బరిలోకి దిగకపోయేసరికి అదో రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తించలేదు. పార్టీ గానీ, పవన్ గానీ ప్రజల్లోకి వెళ్ళలేదు. 2014 ఎన్నికల తరువాత కొన్నాళ్ళకు బీజేపీ-టీడీపీ పార్టీలకు పవన్ దూరం జరిగాడు. ప్రశ్నించడం మొదలు పెట్టాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు. కానీ తాను టీడీపీ, బీజేపీ పార్టీలకు మిత్రుడు అనే ముద్ర పోగొట్టుకోలేకపోయాడు. వైసీపీ నేతలు పవన్ టీడీపీ రహస్య మిత్రుడు అంటూ ఆరోపిస్తుంటే .. పవన్ ఆ ఆరోపణలకు చెక్ పెట్టలేకపోయాడు. అది పవన్ కి బాగానే నష్టం చేసింది. ఎంతలా అంటే.. పార్టీ గెలవడం మాట అటుంచితే.. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం మూట గట్టుకున్నాడు. పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పవన్ కి రాజకీయాల్లో అంతటి దారుణమైన ఓటమి ఎదురుకావడానికి ప్రధాన కారణం.. పవన్ కి స్పష్టమైన స్టాండ్ లేదని ప్రజల్లో భావన కలగడమే. పవన్ బీజేపీ-టీడీపీ పార్టీల వ్యక్తిగానే ఎక్కువ మంది భావించారు. అందుకే పవన్ ని పట్టించుకోలేదు. అయినా వీటి నుండి పవన్ పాఠాలు నేర్చుకున్నట్టు లేడు. అందుకేనేమో మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాని కలిశాడు. ఏపీలో జనసేన-బీజేపీ కలిసి పనిచేయాలని పరస్పరం అంగీకారానికి వచ్చాయని అంటున్నారు. దీంతో జనసైనికుల్లో అయోమయం, అసహనం నెలకొన్నాయి. పవన్ ఓడిపోయినా ఇంకా ఆయన వెంట ఎందరో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజాసమస్యల మీద పోరాడుతూ, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే.. ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కాస్త ఆలస్యమైనా ఆయనపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ మాత్రం తప్పటడుగులు వేసి ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన బీజేపీ గొడుగు కిందకు చేరితే.. ఆయనకంటూ ఓ స్టాండ్ లేదని ప్రజలు అనుకుంటారు. ఈ అయోమయంలో మరికొందరు జనసైనికులు కూడా దూరం అవుతారు. మరి పవన్ ఇప్పటికైనా ఇలా ఏదోక పార్టీతో జతకట్టడం మానేసి.. తన పార్టీ తరపున ప్రజాసమస్యలపై పోరాడుతూ.. జనసైనికులకు భరోసా, ప్రజలకు నమ్మకం కలిగిస్తారేమో చూద్దాం.

చంద్రబాబు నెత్తిన పాలు పోసిన వైఎస్ జగన్!!

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ దూకుడు ముందు నిలబడలేక టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఇది మామూలు ఓటమి కాదు. టీడీపీ పునాదులనే కదిలించిన ఓటమి. అసలు ఈ ఓటమి నుండి టీడీపీ ఇప్పట్లో కోలుకుంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ క్యాడర్ లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. మరోవైపు వైసీపీ ఘన విజయంతో ఆ పార్టీ నాయకత్వం, కేడర్ నూతనోత్సాహంతో పరుగులు పెట్టింది. 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ జోరు చూసి.. వైఎస్ జగన్ కి ఇక తిరుగులేదు అనుకున్నారంతా. ప్రజలు రికార్డు మెజారిటీ ఇచ్చారు.. ఇక ఇతర పార్టీ నేతలను ఆకట్టుకోవాల్సిన పనికూడా లేదు. జగన్ కూల్ గా తనపని తాను చేసుకుంటూ పొతే చాలు.. వచ్చే ఎన్నికల్లో కూడా ఈజీగా గెలిచి సీఎం అయిపోతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. టీడీపీ ఇప్పట్లో ఆ ఓటమి నుండి కోలుకొని జగన్ ని దెబ్బకొట్టే అవకాశమే లేదు అనుకున్నారంతా. కానీ జగన్ మాత్రం తనంతట తానే టీడీపీకి త్వరగా కోలుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల రద్దు, ఇసుక కొరత.. ఇలా కొన్ని సందర్భాలలో టీడీపీకి స్వరం వినిపించే అవకాశాన్ని జగన్ ఇచ్చారు. అయితే ఘోర ఓటమిలో కూరుకుపోయిన టీడీపీని ఇవేవి చెయ్యి పట్టి పైకి లాగలేకపోయాయి. అలాంటి సమయంలో జగన్ నిర్ణయం రూపంలో టీడీపీకి ఓ వరం లభించింది. మూడు రాజధానుల అంశాన్ని జగన్ తెరమీదకు తీసుకురావడం టీడీపీకి కలిసొచ్చింది. మూడు రాజధానుల వ్యవహారం అమరావతి ప్రాంత రైతులు ఉద్యమించేలా చేసింది. రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ.. వారు గొంతెత్తి నినదిస్తున్నారు. లాఠీ దెబ్బలకు, అరెస్టులకు భయపడకుండా పిడికిలి బిగించి పోరాడుతున్నారు. వారికి టీడీపీ పూర్తిగా అండగా నిలబడింది. టీడీపీ నాయకత్వం ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మేమున్నామన్న భరోసా ఇస్తోంది. ఇన్నిరోజులు ఓటమి చీకటిలో మగ్గిపోయిన టీడీపీ రేపటి వెలుగు కోసం పోరాటం మొదలుపెట్టింది. కార్యకర్తలు స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొంటూ రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి టీడీపీ మళ్లీ ప్రజల నోళ్ళలో నానడం మొదలుపెట్టింది. ఒక్కోసారి మనం వేసే ఒక్క అడుగు భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. ఇప్పుడు రాజధాని విషయంలో జగన్ అలాంటి అడుగే వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందని అంటున్నారు. తెలుగువన్ సంస్థ క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది.  రాజధాని తరలింపు ప్రతిపాదనతో... కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రాయలసీమ ప్రజల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే తమకి బాగా దూరమువుతుందన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఇవే ఇప్పుడు టీడీపీకి కలిసొస్తున్నాయి. రాజధానిపై పోరాటంతో టీడీపీ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. చిన్న పెద్ద నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు రైతులు వెంట పోరుబాట పట్టారు. దీంతో ఆకు పచ్చ జెండా పట్టి ఉద్యమిస్తున్న రైతులకు పసుపు పచ్చ జెండా అండగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. మొత్తానికి.. 151 సీట్లతో ఘనంగా అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రశాంతంగా ఉండకుండా.. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చి.. టీడీపీకి పుంజుకునే అవకాశాన్ని ఇచ్చారని అంటున్నారు. జగన్ వేసిన ఈ ఒక్క రాంగ్ స్టెప్.. చంద్రబాబు నెత్తిన పాలు పోసి.. వైసీపీ వారిని తలలు పెట్టుకునేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

మూడు రాజధానుల వెనుక ముగ్గురు వ్యక్తులు.. బాబు నిలబడటం కష్టమే!!

గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని మార్పు అంశం ఏపీలో తీవ్ర కలకలం రేపింది. రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలిస్తుండటంపై.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ అమరావతి ప్రాంత రైతులు తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంత వాసుల్లో కూడా.. రాజధానిని విశాఖకు తరలిస్తే బాగా దూరం అవుతుందనే అసంతృప్తి ఉంది. రైతుల నుండి తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. కమిటీల పేరుతో ముందుకెళ్తోంది. మరోవైపు ఇంత జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుండి సరైన స్పందన లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి అమరావతి భూమి పూజకి ప్రధాని మోడీ వచ్చారు. పవిత్ర మట్టిని, గంగ జలాన్ని ఇచ్చి.. అమరావతిని ఢిల్లీ కంటే గొప్ప నగరంగా తీర్చిదిద్దటంలో పూర్తీ సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోడీ మాట ఇచ్చారు. ఇప్పుడూ ప్రధానిగానే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మాటని మట్టిలో కలిపేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. అయినా బీజేపీ నుండి ఆశించిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవట్లేదు. దీనినిబట్టి చూస్తుంటే.. అసలు జగన్ ఇంత దూకుడుగా వెళ్లడం వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సపోర్ట్ లేకుండా అంత తేలికగా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడు రాజధానుల నిర్ణయం వల్ల బీజేపీకి ఒరిగేదేముంది అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ప్రభ తగ్గుతోంది. పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. దీంతో ఉత్తరాదిలో మొదలైన వ్యతిరేకతను దక్షిణాదితో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. దక్షిణాదిలో బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగానే ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీలో జగన్ ని పావుగా వాడుకొని పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. కొద్దిరోజులుగా జగన్ ని జైలుకి పంపి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోందని ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ మాత్రం.. జగన్ జైలు కి వెళ్లడం కంటే.. బయట ఉంటేనే తమ పార్టీకి ప్రయోజనమని భావిస్తోందట. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారిలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. ఒకవేళ జగన్ జైలుకి వెళ్లి.. వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే.. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారు కానీ బీజేపీ వైపు చూడరు. అంటే ఏపీలో కాంగ్రెస్ కి బీజేపీనే జీవం పోసినట్టు అవుతుంది. అసలు కాంగ్రెస్ బలపడటం బీజేపీకి ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న ఒకేఒక బలమైన శత్రువు కాంగ్రెస్. కాబట్టి  కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే పని బీజేపీ ఎప్పటికీ చేయదు. అందుకే జగన్ ని తమ గ్రిప్ లో పెట్టుకొని గేమ్ ఆడాలని చూస్తోందట. ఏపీలో టీడీపీ ప్లేస్ ని భర్తీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. టీడీపీ కేవలం అమరావతి ప్రాంతానికి చెందిన పార్టీ అనే ముద్ర వేసి.. మిగతా ప్రాంతాల్లో బీజేపీ బలపడాలని చూస్తోందట. 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ ఓటమి నుండి టీడీపీని కోలుకోకుండా చేసి.. టీడీపీ ప్లేస్ ని బీజేపీ భర్తీ చేయాలని అనుకుంటుందట. మరోవైపు వైసీపీ కూడా టీడీపీని పూర్తిగా దెబ్బ కొట్టాలని చూస్తోంది. అసలు టీడీపీ, చంద్రబాబు వంటి మాటలు భవిష్యత్తులో వినపడకూడదు అనేలా చేయాలనుకుంటోంది. దానిలో భాగంగానే జగన్.. రాజధాని తరలింపుకు శ్రీకారం చుట్టారు అంటున్నారు. అమరావతిని చంద్రబాబు రాజధానిగా ఎంపిక చేసి, దానిని ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. కానీ ఆ దిశగా అడుగులు వేసేలోపే ఆయనకు అధికారం దూరమైంది. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. ఆయన అమరావతిని ఎంత బాగా డెవలప్ చేసినా.. ముందుగా జనాలకు గుర్తొచ్చే పేరు మాత్రం చంద్రబాబు. అందుకే ఆ పేరు వినపడకూడదనే రాజధాని తరలింపు లాంటి పెద్ద నిర్ణయం జగన్ తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజధాని తరలింపు వెనుక కారణం ఏదైనా.. పైకి మాత్రం రాజధానిగా అమరావతి సరైన ప్రాంతం కాదని, ఒక కులానికి చెందిన రాజధాని అని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంది. గతంలో విశాఖ, కర్నూల్ తుఫాను-వరదలతో అల్లాడిపోయాయి కానీ అమరావతి కాదు. ఇక CRDA భూ యజమానులు లిస్ట్ చూస్తే అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని కాదని స్పష్టంగా అర్ధమవుతోంది. అయినా కుల ముద్ర వేస్తున్నారు. నిజానికి అమరావతికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. దానినో పవిత్ర ప్రాంతంగా భావిస్తున్నారు. అదీగాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరం ఉంది. ఇలా అనేక కారణాల చేత అప్పుడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఆ ఎంపికే తప్పు అంటున్నారు. నిజంగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని అనుకోవడంలో తప్పు లేదు. రాజధానితో పాటు కొన్ని నగరాల్ని అభివృద్ధి చేయవచ్చు. తమిళనాడులో రాజధాని చెన్నైతో పాటు.. కోయంబత్తూర్, సేలం, వెల్లూర్ వంటి ఎన్నో నగరాలను అభివృద్ధి చేశారు. కానీ జగన్ సర్కార్ మాత్రం రాజధాని తరలించడం, విడదీయడమే అభివృద్ధి అనుకుంటోంది. ఇలా చేయడం వల్ల ఏపీకి అంటూ ఒక పెద్ద నగరం లేకుండా పోతుంది. ఇదంతా చూస్తుంటే.. కేవలం అమరావతి అంటే చంద్రబాబు బ్రాండ్ అనే ముద్ర ఉంటుందనే కారణంతోనే జగన్ రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రాజధాని తరలింపుతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కృష్ణ, గుంటూరు, గోదావరి, ప్రకాశం జిల్లాలలో ప్రజలు రాజధాని తరలింపుని వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ ప్రజలు కూడా విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే తమకి బాగా దూరమవుతుందనే అభిప్రాయంలో ఉన్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు రాజధానిని తరలించవద్దంటూ ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని తరలింపు వార్తలను జీర్ణించుకోలేక పలువురు రైతులు గుండె పోటుతో మరణించారు కూడా. ఇంత జరుగుతున్నా బీజేపీ నుండి సరైన స్పందన లేదు. రాజధాని మార్పు రాష్ట్ర పరిధిలోని అంశమని ఒకరు, మూడు రాజధానులు వస్తే మంచిదే అని మరొకరు.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు కాని ఇది ప్రధాని మోడీ భూమి పూజ చేసిన రాజధాని అంటూ.. అమరావతి కోసం ఒక్కరు కూడా బలంగా పోరాడటం లేదు. బీజేపీ మౌనంగా ఉండటం చూస్తుంటే.. ఈ రాజధాని మార్పు వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిపై ఇంత రగడ జరుగుతుంటే స్పందించని బీజేపీ.. మత పరమైన రాజకీయాలు అంటూ వైసీపీని టార్గెట్ చేస్తోంది. వైసీపీపై క్రిస్టియానిటీ ముద్ర వేస్తోంది. తిరుపతిలో అన్యమత ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయని, దేవాలయాల సొమ్ముని పాస్టర్లకు దోచి పెడుతున్నారని ఇలా రకరకాలుగా వైసీపీ మీద విమర్శలు చేస్తోంది. అయితే ఇలా కావాలనే వైసీపీ పై క్రిస్టియానిటీ ముద్ర వేస్తోందని అంటున్నారు. ఈ ప్రచారం వల్ల క్రిస్టియన్స్ అందరూ వైసీపీకి దగ్గరైతే.. నార్త్ ఇండియాలో జరిగినట్టుగా.. హిందువులు బీజేపీ వైపు వస్తారని బీజేపీ భావిస్తోన్నట్టు తెలుస్తోంది. ఈ రిలీజియన్ సెంటిమెంట్ తో అటు వైసీపీ, ఇటు బీజేపీ రెండు పార్టీలు లాభపడి.. టీడీపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి అంటున్నారు. మొత్తానికి మోడీ, అమిత్ షా ఆశీస్సులతోనే జగన్ నడుస్తున్నారని.. ముగ్గురూ కలిసి ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

రైతుల తరపున భువనేశ్వరి పోరాటం... లోకేష్ ని తప్పించడానికేనా?

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రగడ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదంటూ.. అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతులకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ మద్దతుగా నిలుస్తూ పోరాడుతోంది. ఈ పోరాటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా పాలుపంచుకున్నారు. తాజాగా భువనేశ్వరి చంద్రబాబుతో కలిసి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలపటమే కాకుండా, రైతుల కోసం అమరావతి పరిరక్షణ సమితికి ఖరీదైన తన బంగారు గాజులు విరాళంగా కూడా ఇచ్చారు. అయితే భువనేశ్వరి ఉన్నట్టుండి.. ఇలా రైతుల కోసం ప్రత్యక్షంగా పోరాటంలో పాలుపంచుకోవడం వెనుక.. రాజకీయ కోణం ఉందనే ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా చంద్రబాబు తరువాత టీడీపీని నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. చంద్రబాబు తరువాత ఆయన కుమారుడు లోకేష్ టీడీపీని నడిపిస్తారని మొదట్లో పార్టీ శ్రేణులు భావించాయి. కానీ లోకేష్ పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులకు నమ్మకాన్ని కలిగించలేకపోయారు. ముఖ్యంగా మాటతీరు లోకేష్ కు పెద్ద సమస్యగా మారింది. ఆయన తెలుగు పదాలు పలకడంలో కాస్త ఇబ్బందిపడతారు. దీంతో ప్రత్యర్థి పార్టీలు పప్పు అంటూ ఆయనను బాగా టార్గెట్ చేశాయి. ఆ విమర్శలను తిప్పికొట్టడంలో, ప్రత్యర్థి పార్టీల మీద ఎదురుదాడి చేయడంలో లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. ఇక కార్యకర్తలను కలుపుకొని వెళ్లడంలో కూడా లోకేష్ వెనకబడిపోయారు. ఒకరిద్దరిని పక్కన తిప్పుకోవడం తప్ప.. భవిష్యత్తు నేతనన్న భరోసా కల్పిస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనస్సు గెలుచుకోలేకపోయారు. ఇలా పలు కారణాల వల్ల చంద్రబాబు తరువాత టీడీపీ ని నడిపించే నేత లోకేష్ అనే భరోసా ఆ పార్టీ కార్యకర్తల్లో కలగలేదు. దీంతో చంద్రబాబు రిటైర్మెంట్ తరువాత పార్టీ నడిపించేది ఎవరనే ప్రశ్న పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. అయితే ఆ లోటుని భర్తీ చేయడానికే చంద్రబాబు.. భువనేశ్వరిని రంగంలోకి దింపారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ కుమార్తెగా భువనేశ్వరి అంటే తెలుగు ప్రజలకు గౌరవముంది. ఆమె మంచి వాగ్దాటి కూడా. గతంలో ఆమె పలు సందర్భాల్లో ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడారు. తాజాగా అమరావతిలో కూడా ఆమె ప్రసంగం ఆకట్టుకుంది. మాకు కుటుంబం కంటే.. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల క్షేమమే ముఖ్యమంటూ సెంటిమెంట్ ని రగిల్చేలా మాట్లాడారు. ఆమె ఇలానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజా సమస్యలపై గళాన్ని వినిపిస్తూ ఉంటే.. టీడీపీ భవిష్యత్తు సారథిగా ఆమెపై పార్టీ శ్రేణులకు నమ్మకం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు ఎన్టీఆర్ కుమార్తెగా, ఇటు చంద్రబాబు సతీమణిగా.. ఆమెకు కార్యకర్తలు బ్రహ్మరధం పట్టే అవకాశముంది. అంతేకాదు ఆమె ప్రసంగం మహిళలను కూడా ఆకట్టుకునేలా ఉంది. అదీగాక ఆమె మీద గౌరవంతో అంత త్వరగా ప్రత్యర్థులు విమర్శలు కూడా చేయకపోవచ్చు. ఇలా ఆమెకి పలు అంశాలు కలిసొస్తున్నాయని అంటున్నారు. అందుకే, ఆమె ఇలాగే ముందుకెళ్తే టీడీపీ భవిష్యత్తు సారధి అయ్యే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ పై వస్తున్న విమర్శలకు బ్రేకులు వేయాలన్నా, పార్టీ భవిష్యత్తు గురించి కార్యకర్తల్లో భరోసా కల్పించాలన్నా.. భువనేశ్వరిని తెరపైకి తీసుకురావడం కరెక్ట్ అని చంద్రబాబు భావిస్తున్నారట. అందులో భాగంగానే ఆమె అమరావతి రైతుల తరపున పోరాటంలో పాలుపంచుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి భవిష్యత్తులో టీడీపీని నడిపించే బాధ్యతని భువనేశ్వరి తీసుకుంటారేమో చూడాలి.

విశాఖకు రాజధాని మార్పు కేవలం భూముల కోసమేనా?

విశాఖకు రాజధాని మార్పు అన్న విషయం కొందరికి ఆనందాన్ని ఇస్తే, మరికొందరికి తీవ్ర నిరాశను ఇస్తొంది. రాజధాని ప్రకటన రాగానే విశాఖలో భూముల మాయాజాలం మొదలైంది. నిషేధిత 22 ఎ జాబితాలో ఉన్న భూములకు రెక్కలొస్తున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు కాదని కొత్తగా వచ్చిన అభ్యర్థులకు ల్యాండ్ క్లియరెన్స్ వచ్చేస్తుంది. జిల్లా యంత్రాంగం కాదూ కూడదు అని స్పష్టం చేసినా ఏకంగా సచివాలయం స్థాయి నుంచే ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. సర్కార్ కు సన్నిహితులైన వారికి మాత్రమే ఇలాంటి వెసులుబాటు లభిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఐదారు దరఖాస్తులను నేరుగా అమరావతి నుంచే పరిష్కరించినట్టు తెలిసింది. దీని ద్వారా విశాఖ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు మరో ఇద్దరు నేతలకు లబ్ధి చేకూరినట్టు సమాచారం. జిల్లాలో 22ఎ జాబితాలో నమోదైన భూములపై సుమారు 2,200 దరఖాస్తులొచ్చాయి.2018 నుంచి ఇప్పటి వరకు వస్తున్న దరఖాస్తులను జిల్లా యంత్రాంగం క్షుణ్ణంగా పరిశీలించి పక్కా ఆధారాలు ఉంటేనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇలా ఒక 1,800 దరఖాస్తుల పరిష్కరించినట్టు సమాచారం. 22 ఏ లో చేర్చిన వాటిలో ఎక్కువ భాగం భూ సేకరణలో ఉన్న స్థలాలే ఉన్నాయి. ప్రజావసరాలకు సేకరించిన భూమికి సబ్ డివిజన్ చేయాలి. లేకపోతే సర్వే నెంబరు మొత్తం ప్రభుత్వ భూమిగా నమోదు అవుతుంది. జిరాయితీ భూమికి ఆనుకొని గోర్జి, గెడ్డ పోరంబోకు చెరువులను ఆక్రమించుకుని కొందరు విక్రయాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి భూములను కూడా 22 ఏ కింద చేర్చుతుంటారు.వాటిని నిషేధిత జాబితా నుంచి తప్పించాలంటే ఆక్రమణకు గురై భూమిని సర్వే చేసి మిగిలిన జిరాయితీ భూమిని యజమానికి బదలాయిస్తారు. జిల్లాలో భూములకు విలువ పెరగటంతో 22ఏ కింద చేర్చిన భూములకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.వీటి విషయంలో అధికారులు ఆచితూచి అడుగులు వేస్తుంటారు.  నగరంతో పాటు విశాఖ రూలర్, భీమిలి, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, గాజువాక,పరవాడ, అనకాపల్లి మండలాల్లో 22 ఏ దరఖాస్తుల అధికారుల పై తీవ్ర ఒత్తిడి ఉంది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో 22ఎ జాబితాలో నమోదైన భూముల మినహాయింపు కోసం వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని అధికారులు తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి వాటికి సంబంధించిన సమాచారం కోరినపుడు అదే విషయాన్ని నివేదించారు. అయితే అధికార పార్టీ నేతలు రంగ ప్రవేశం చేసి ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి అమరావతి నుంచి ఫైళ్లను పంపించినట్లు సమాచారం.రెండో సారి కూడా అధికారులు సదరు ఫైళ్లను తిరస్కరిస్తూ మళ్లీ ప్రభుత్వానికి పంపారు. ఉన్నత స్థాయి వ్యక్తులు రంగ ప్రవేశం చేసి 22 ఏ నుంచి మినహాయించాల్సిందేనని ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఆ ఆదేశాలను అమలు చేయటానికి అధికారులు నానా అవస్తలు పడుతున్నట్టు సమాచారం.ముడసర్లోవ, మర్రిపాలెం, మాధవధార, పెదవాల్తేరు, పోతినమల్లయ్యపాలెంతో పాటు రెండుచోట్ల ఇరవై రెండు ఏళ్ల ఉన్న భూముల కు మినహాయింపు సాధించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీని పై స్పందించేందుకు జిల్లా అధికారులు ఎవరూ సమాధానం ఇవ్వట్లేదు. ఒకటి రెండేళ్ల క్రితం పెట్టుకున్న దరఖాస్తులను కాదని ఇటీవల వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఆగమేఘాల మీద అనుమతి ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి, ఇరవై రెండు ఏ లో చేర్చిన భూములు రాయితీలో ఉన్నాయా లేదా అనేది బహిరంగం గా విచారణ చేపట్ట కుండా హడావిడిగా ఫైళ్లు తప్పించుకోవటం వెనుక ఏం జరిగింది ఇప్పుడు ఇదే చర్చ నీయాంశంగా మారింది.అసలు అత్యవసరంగా విశాఖ భూముల పై ప్రభుత్వానికి దృష్టి ఎందుకు మళ్లిందో వేచి చూడాలి.

మోడీ ఆఫ్ ద ఇయర్... 2019 నేషనల్ పొలిటికల్ రిపోర్ట్...

రాజకీయ సంచలనాలకు కూడా 2019 వేదికైంది. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న మొదలైన సార్వత్రిక ఎన్నికలు... మొత్తం ఏడు దశల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ టార్గెట్ ప్రకారం 300 ప్లస్ సీట్లను సాధించింది. గతంలో కంటే 21 స్థానాలను అదనంగా మొత్తం 303 స్థానాల్లో గెలుపొందింది, దాంతో, మే 30న మోడీ రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. ఇక, కాంగ్రెస్ మరోసారి ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 52 స్థానాలకే పరిమితమైంది. దేశవ్యాప్తంగా బీజేపీ 37.36 శాతం ఓట్లను సాధించగా, కాంగ్రెస్ 19.01 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగింది. మొత్తం మీద బీజేపీ కూటమి 353 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్ కూటమి 91 సీట్లలో విజయం సాధించింది. ఇతరులు 98 సీట్లలో నెగ్గారు. ఇక, కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యంలో రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక, 2019లోనే ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలతోపాటే ఏపీ, అరుణాచల్, సిక్కిం, ఒడిషాకు ఎన్నికలు జరిగాయి. ఏపీలో వైసీపీ... అరుణాచల్ లో బీజేపీ... సిక్కింలో బీజేపీ మిత్రపక్షాలు... ఒడిషాలో నవీన్ పట్నాయక్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానాకు ఎన్నికలు జరగగా... మహారాష్ట్రలో రాజకీయాలు అనేక మలుపు తిరిగాయి. చివరికి, కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన అధికారం చేపట్టింది. ఇక, హర్యానాలో హంగ్ ఫలితాలు వచ్చినప్పటికీ... బీజేపీనే అధికారం దక్కించుకుంది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో 2019 రాజకీయాలు ముగిశాయి. 2019 చివర్లో జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో జేఎఎం ఘనవిజయం సాధించడం హేమంత్ సోరెన్  రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే, 2019 అనేక రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టగా... ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ... 50శాతం ఓట్లు, 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు దేశ దృష్టిని ఆకర్షించాయి. బీజేపీ, శివసేన గొడవలతో మహా పాలిటిక్స్ అనేక మలుపులు తిరిగాయి. అధికారం కోసం రెండు పార్టీలూ కొత్త దారులు వెతుక్కున్నాయి. చివరికి కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన అధికారం దక్కించుకుంది. ఇక, కర్నాటక రాజకీయాలు కూడా రసవత్తరంగా సాగాయి. సరికొత్త నెంబర్ గేమ్ తో కర్నాటకలో అధికారాన్ని బీజేపీ దక్కించుకుంది. మొత్తానికి అనేక కొత్త రాజకీయాలకు సంచలనాలకు 2019 వేదికైంది.

విశాఖ రాజధానిపై సీమ ప్రజలు ఫైర్.. పక్క రాష్ట్రాల రాజధానులే దగ్గరగా ఉన్నాయి

రాజధాని అంటే రాత్రి బస్సు ఎక్కితే ఉదయానికి దిగేలా ఉండాలి. విశాఖ అంటే ఎటు నుంచి చూసినా దాదాపు 1000 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. దీనికంటే పక్క రాష్ట్రాల రాజధానులు మేలు, ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. కడుపులో నీళ్లు కదలకుండా అమరావతికు వచ్చిపోయే రాయలసీమ ప్రజలు విశాఖ రాజధాని అనగానే గగ్గోలు పెడుతున్నారు. బాబోయ్ రాజధానిగా ఆ నగరం మాకు వద్దే వద్దని అంటున్నారు. భౌగోళికంగా సుదూర ప్రాంతం కావడంతో సీమ ప్రజలు విశాఖను రాజధానిగా అంగీకరించడానికి సుముఖంగా లేరు. దీనికంటే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాజధానులు తమకు దగ్గరగా ఉన్నాయని అంటున్నారు. చివరకు గోవాకైన విశాఖ కంటే వేగంగా చేరుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రాయలసీమ లోని నాలుగు జిల్లాల కేంద్రాల నుంచి విశాఖ చేరుకోవాలంటే సగటున 900 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. సీఎం జగన్ సొంత జిల్లా కడప ప్రజలు 14 గంటల పాటు బస్సులో ప్రయాణం చేస్తే తప్ప ఆ నగరానికి చేరుకోలేరు. కడప నగరం నుంచి విశాఖకు 732 కిలోమీటర్ల దూరం ఉంది. అనంతపురం నుంచి విశాఖకు చేరుకోవాలంటే మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే.. 890 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. 17 గంటల పాటు బస్సులో ప్రయాణిస్తే తప్ప చేరుకోలేరు. ఇదే జిల్లా రాయదుర్గం నుంచి విశాఖకు 977 కిలో మీటర్లు అంటే మరో రెండు గంటలు అదనపు ప్రయాణం అవుతుంది. ఇక చిత్తూరు ప్రజల పరిస్థితి కూడా ఇలానే ఉంది. చిత్తూరు నగరి నుంచి విశాఖకు వెళ్లాలంటే 832 కిలో మీటర్లు, 15 గంటల పాటు బస్సు ప్రయాణం చేయాలి. అదే టిడిపి అధినేత చంద్రబాబు ప్రాతి నిధ్యం వహిస్తున్న కుప్పం నుంచైతే విశాఖకు 950 కిలో మీటర్ల దూరం, కర్నూలు ప్రజలు విశాఖ చేరుకోవాలంటే సుమారు 700 కిలో మీటర్ల దూరం వుంది. ఇలా ఆ నాలుగు జిల్లాల ప్రజలు రాజధానికి వచ్చి వెళ్లడానికి సుమారు రెండు రోజుల సమయం కేటాయించాలి. విశాఖ కంటే వారు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు తక్కువ సమయంలో వెళ్లిరావచ్చు. కడప నుంచి హైదరాబాద్ కు వెళ్లాలంటే 415 కిలో మీటర్లు, చెన్నైకి 260 కిలో మీటర్లు, బెంగళూర్ కు 289 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సరిపోతుంది. ఇక చిత్తూరు నుంచి హైదరాబాద్ కు 570 కిలో మీటర్లు, చెన్నైకి 158 కిలో మీటర్లు, బెంగళూరుకు 181 కిలో మీటర్లు ప్రయాణించిసి కేవలం గంటల వ్యవధి లోనే చేరుకునే అవకాశముంది. ఇక అనంతపురం నుంచి బెంగళూరుకు 215 కిలో మీటర్లు, హైదరాబాద్ కు 360 కిలో మీటర్లు, చెన్నైకి 464 కిలో మీటర్లు ప్రయాణిస్తే  విశాఖ కంటే చాలా తక్కువ సమయంలో చేరుకోవచ్చు. కర్నూలు పరిధిలో విశాఖ కంటే ఈ మూడు రాష్ట్రాల రాజధానులకు తక్కువ సమయంలో వెళ్లిరావొచ్చు. కర్నూల్ నుంచి హైదరాబాద్ కు 218 కిలోమీటర్లు, బెంగుళూరుకు 360 కిలో మీటర్లు, చెన్నైకి 503 కిలో మీటర్లు ప్రయాణించి సులువుగా ఆయా ప్రాంతాలకు వెళ్లవచ్చు. కానీ విశాఖ కు వెళ్లిరావాలంటే రాయలసీమ ప్రజలకు చుక్కలు కనిపిస్తాయి. రాయలసీమ ప్రజలు రాజధానిగా విశాఖ కంటే అమరావతి మేలని భావిస్తున్నారు. ఆ నాలుగు జిల్లాల ప్రజలు రాత్రికి బస్సు ఎక్కితే ఉదయానికల్లా అమరావతికి చేరుకోవచ్చు. ఒక్క అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల ప్రజలు కేవలం 7 గంటల్లో అమరావతికి రావచ్చు, అనంతపురం నుంచి కూడా 9 గంటల్లో అమరావతికి చేరుకోవచ్చు. ఆ నాలుగు జిల్లాలకు అమరావతి 450 కిలోమీటర్ల లోపే ఉంది. అనంతపురం నుంచి అమరావతికి 438 కిలోమీటర్ల దూరం కేవలం 9 గంటలలో రావచ్చు. కడప నుంచి కూడా 6 గంటల్లో 348 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే చేరుకోవచ్చు. చిత్తూరు ప్రజలు 447 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అత్యల్పంగా కర్నూలు ప్రజలు 297 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే అమరావతికి సులువుగా చేరుకునే అవకాశముంది.