కుమార్తె కోసం పార్టీ పణం?!

గత ఏడాది తెలంగాణ  అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైంది. ఆ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక చతికిల బడింది. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఆవిర్భావం తరువాత లోక్ సభలో స్థానం లేకుండా ఉన్న పరిస్థితి ఇదే తొలిసారి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పార్టీ ఓటమి పరాభవం కంటే తన కుమార్తె కవిత మద్యం కుంభకోణంలో అరెస్టై బెయిలు కూడా దొరకకుండా తీహార్ జైల్లో మగ్గుతుండటం ఎక్కవగా బాధిస్తోందనడంలో సందేహం లేదు.  కవితపై సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేయడం ఆయనను మరింత ఆందోళనకు గురి చేస్తున్నది.

ఈ కష్టాలన్నిటి నుంచీ బయటపడటానికి బీజేపీతో చెలిమి ఒక్కటే మార్గమని కేసీఆర్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఇటీవలి కాలంలో ఆయన మౌనాన్ని ఉదాహరణగా చెబుతున్నారు.  అయితే బీజేపీ నుంచి సానుకూల స్పందన లభించకపోవడం  కేసీఆర్ లో ఆందోళన మరింత పెరుగుతోంది.  పోనీ పార్టీని బలోపేతం చేయడం ద్వారా బలమైన విపక్షంగా నిలబడి కేసులను ఎదుర్కొందామా అనుకుంటే.. పార్టీ అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు ఉన్నాయి. అలాగే రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీల అడుగులు చూస్తుంటే నేడో రేపో బీఆర్ఎస్ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇంకో వైపు కేసీఆర్   ఫోన్ ట్యాపింగ్ కేసులో  పీకలోతు ఇరుక్కున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే  కాళేశ్వరం  సహా ఆ ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల అక్రమాలు, అవినీతి, నాణ్యతా లోపాలు కూడా కేసీఆర్ మెడకే చుట్టుకోనున్నాయా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఇన్ని ఇబ్బందులూ, కష్టాలలోనూ కేసీఆర్ దృష్టంతా కవితను బయటకు తీసుకురావడం ఎలా అన్నదానిపైనే ఉంది. అందుకోసం పార్టీని కూడా పట్టించుకోవడం లేదు. పార్టీలో తన తరువాత ప్రముఖులుగా గుర్పింపు ఉన్న తన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావులను కవిత బెయిలు, బీజేపీతో రాజీ కోసం హస్తిన పంపించారు. హస్తినలో  కవిత బెయిలు కోసమే కాకుండా, ఆమెను మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేసేందుకు సహకారం అందిస్తే.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను మూకుమ్మడిగా బీజేపీలో చేర్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు హస్తిన వెళ్లి వచ్చిన తరువాత జరిగిన పరిణామాలు ఆ వార్తలు వాస్తవమేననిపించేలా ఉన్నాయి.  

స్థానిక ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా నిలిచేందుకు కూడా బీఆర్ఎస్ మంతనాలు సాగిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఈ ప్రయత్నాలన్నీ కేసీఆర్ పర్యవేక్షణ, మార్గదర్శకంలోనే జరుగుతున్నాయని అంటున్నారు. అటు కాంగ్రెస్ ను ఇరుకున పడేయడం, ఇటు తన కుమార్తె కవితను మద్యం కుంభకోణం కేసు నుంచి బయటపడేయడం లక్ష్యంగానే కేసీఆర్ బీఆర్ఎస్ భవిష్యత్ ను పణంగా పెడుతున్నారని అంటున్నారు.