మోడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపగలరా?
posted on Jul 16, 2024 @ 3:11PM
నరేంద్రమోడీ ముచ్చటగా మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు దాటింది. గత రెండు సార్లు ఆయన ప్రధానిగా ఉన్నప్పటి పరిస్థితి వేరు. మూడో సారి ప్రధానిగా ఆయన ప్రస్థానం వేరు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తొలి రెండు సార్లూ మోడీ నేతృత్వంలోని ఎన్డీయే పేరుకే సంకీర్ణం. కానీ బీజేపీకి భాగస్వామ్య పక్షాల మద్దతు అవసరం లేకుండానే సొంతంగా సర్కార్ ను ఏర్పాటు చేయగలిగినంత బలం ఉంది. ఆ కారణంగానే మోడీ పాలన ఆయన ఇష్టారాజ్యంగా సాగింది. పేరుకు భాగస్వామ్య పక్షాలకు తన కేబినెట్ లో స్థానం కల్పించినా. వాటికి కేటాయించిన శాఖలు అత్యంత అప్రాధాన్యమైనవి. అలాగే భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలకు ఇసుమంతైనా విలువ ఇవ్వకుండానే ఆయన పాలన సాగింది. అదే సమయంలో మోడీ భాగస్వామ్య పక్షాలను నిర్వీర్యం చేయడానికీ, వాటిలో చీలిక తీసుకురావడానికి ఇసుమంతైనా వెనుకాడని పరిస్థితి ఉండేది. ఆ కారణంగానే ఒక దశలో ఎన్డీయే నామమాత్రం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అందుకు తగ్గట్టుగానే పలు పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశాయి.
2014 ఎన్నికల ముందు నాటికి జాతీయ ప్రజాస్వామ్య కూటమి.. అదే ఎన్డీయే కథ ముగిసిపోయిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. వాజ్ పేయి హయాంలో 24 పార్టీలతో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చక్రం తిప్పిన ఎన్డీయే కూటమి పరిస్థితి 2024 నాటికి అగమ్య గోచరంగా మారిపోయింది. అసలా కూటమికి శుభం కార్డు పడిందా అన్న అనుమానాలు సైతం పరిశీలకుల నుంచి వ్యక్తం అయ్యాయి. చివరాఖరికి ఎన్డీయేకు ఏదో ఒక స్థాయిలో కూటమి అన్న గుర్తింపు రావడానికి కారణమైన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా ఒక దశలో కాడె వదిలేసి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ లో చేరి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకున్నారు. అయితే ఇండియా కూటమి సారథ్యం వహించాలన్న ఆయన ఆకాంక్ష సాకారమయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో మళ్లీ వెనక్కు వచ్చారనుకోండి అది వేరే సంగతి.
వాస్తవానికి 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ‘ఏకపార్టీ’ ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ ఇక ముగిసినట్లే అన్న విశ్లేషణలు వెలువడ్డాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా 2014 ఎన్నికలలో లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272) కంటే 10 సీట్లు అదనంగా (282) గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది. అదే సమయంలో ప్రతిపక్ష కూటమి యూపీఎ పరిస్థితి అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. అయినా 2014లో తిరిగి 2019లో కూడా బీజీపీ ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చింది.
2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు మాత్రమే ఎన్డీయేలో ఉన్నాయి. 2014 వచ్చే సరికి వాటిలో కొన్న బీజేపీకి తద్వారా ఎన్డీయేకి దూరమయ్యాయి. దీంతో 2024 ఎన్నికల నాటికి ఎన్డీయేలో ఉన్న ఏ పార్టీకీ, జేడీయూ వినా సొంతంగా ఒకటి రెండు స్థానాలకు మించి గెలుచుకునే అవకాశాలు కూడా లేని చితనా చితకా పార్టీలు మాత్రమే కూటమిలో మిగిలాయి. అలా మిగిలిన ఏ పార్టీకీ కూడా లోక్ సభలో ఒకటి, రెండు స్థానాలకు మించి లేవు.
బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలలో విజయం సాధించే అవకాశం లేదన్న సర్వేలతో కంగారుపడిన బీజేపీ మళ్లీ ఎన్డీయేను బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయేకు దూరమైన పార్టీలను ఆహ్వానిస్తూ అమిత్ షా పిలుపునిచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తుతో కలవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా చివరి నిముషంలో బీజేపీ మేల్కొని ఎన్డీయే కూటమి పటిష్టతకు నడుంబిగించి ఒకటికి రెండు మెట్లు దిగిరావడంతో మోడీ మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. లేకుంటే బీజేపీ మూడో సారి అధికార కూటమికి నేతృత్వం వహించగలిగేది కాదని 2024 సార్వత్రిక ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ఇప్పుడు కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం మనుగడ పూర్తిగా భాగస్వామ్య పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది. దీంతో ఐదేళ్ల పాటు భాగస్వామ్య పక్షాల మద్దతు పొందేలా మోడీ పాలన సాగించగలరా? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో ఎదురౌతున్నాయి.
మోడీ, షా జోడీ నాయకత్వంలో బీజేపీ నిన్నటి వరకూ శతృ మిత్ర బంధాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలనూ నిర్వీర్యం చేయడమనే ఫార్ములాను అనుసరించింది. అన్ని పార్టీలను రాజకీయ ప్రత్యర్ధులుగానే చూసింది. ఏక పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం దిశగా బీజేపీ అడుగులు వేస్తొందని పరిశీలకుల విశ్లేషణలకు అనుగుణంగానే మోడీ 2014, 2019లలో అధికారం చేపట్టినప్పుడు వ్యవహరించారు.
కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా అడుగులు వేసిన మోడీ సర్కార్.. ఆ పేరుతో ఇతర రాజకీయ పార్టీలను కూడా కబలించేయడానికి శతథా ప్రయత్నించింది. విఫలమైంది. దీంతో ఇప్పుడు మూడో సారి మోడీ నేతృత్వంలోని సర్కార్ కేంద్రంలో కొలువుదీరిన తరువాత మారిన పరిస్థితులకు అనుగుణంగా మోడీ తీరు మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.