ఏపీలో వైసీపీ గాయెబ్!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ ఎక్కడా కనిపించడం లేదు. ఏదో ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలో వార్తలు, ప్రకటనల్లో తప్ప.. రాష్ట్రంలో ఎక్కడా ఆ పార్టీ నేతలు కనిపించడం లేదు. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ క్రమంగా కనుమరుగౌతోందా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికల తరువాత మీడియా ముందుకు వచ్చిన నేతలు కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. ఆఖరికి ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఆర్ఘాటంగా ప్రకటించిన ప్రజాదర్బార్ ను సైతం రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చెక్కేశారు. ఆయన రాష్ట్రానికి వచ్చేది ఎప్పుడు అన్న విషయంలో క్లారిటీ లేదు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యర్ధులపై, తెలుగుదేశం నేతలపై బూతులతో విరుచుకుపడిన నాయకులెవరి గొంతులూ ఇప్పుడు వినిపించడం లేదు. ఇప్పటికే చ ాలా మంది రాష్ట్రం దాటేశారన్న సమాచారం ఉంది. ఇక రాష్ట్రంలో ఉన్న నేతలూ కూడా ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నారు.   

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ హయాంలో వివిధ రంగాలలో జరిగిన విధ్వంసంపై ఇప్పటి వరకూ నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేశారు.  ఆ శ్వేత పత్రాలలో వైసీపీ అరాచక పాలన కారణంగా రాష్ట్రానికి జరిగిన భారీ నష్టం వెలుగులోనికి వస్తుంది. అంచనాలకు మించి వైసీపీ సర్కార్న, నేతలు రాష్ట్ర సంపదను కొల్లగొట్టారని తేటతెల్లం అవుతోంది. అమరావతి, పోలవరం, విద్యుత్, సహజ సంపద దోడిపీపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రాల ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  వైసీపీ అరాచ, అధ్వాన పాలన, దోపిడీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయినా చంద్రబాబు శ్వేత పత్రాలలో వెల్లడించిన అంశాలను, జగన్ పలనా వైఫల్యం, అరాచకత్వం, అక్రమాలపై చేసిన ఆరోపణలను ఖండించడానికి  వైసీపీ అధినేత సహా ఏ నాయకుడూ ముందుకు రావడం లేదు.

 మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారు మీడియా ముందుకు వచ్చి ఏవో నాలుగు మాటలు మాట్లాడి తూతూ మంత్రంగా చంద్రబాబు శ్వేతపత్రాలపై విమర్శలు గుప్పించి మిన్నకున్నారు. ఆ మీడియా సమావేశాలలో వారు రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి విలేకరుల ప్రశ్నలకు బదులివ్వకుండా, అసలు వారికి ప్రశ్నలు వేసే అవకాశమే ఇవ్వకుండా తాము చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్లిపోతున్నారు.   రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి.

ఎక్కడా వైసీపీ నేతలు కనిపించడం లేదు. పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనా రాయణ, పుంగనూరు పుడింగి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం తొడకొట్టి మీసం మెలేసి మరీ ప్రత్యర్థులపై విరుచుకుపడిన మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్, సమయం సందర్భంతో పనిలేకుండా మీడియా కనిపిస్తే చాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై విరుచుకుపడిన రోజా,  వాడు, వీడు అంటూ విపక్ష నేతలపై బూతుల వర్షం కురిపించడానికే మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని వీరెవరూ ఇప్పుడు నోరెత్తడానికి కూడా సాహసించడం లేదు.

బొత్స సత్యనారాయణ  అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఆయన మాట్లాడే మాటలు, చేసే వ్యాఖ్యలు  వైసీపీ మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టేవిగానే ఉంటున్నాయి. ఆయన చూపులు కాంగ్రస్ వైపు మళ్లినట్లుగా పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది. ఇక ధర్మాన ప్రసాదరావు,  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ ఇలా పార్టీలోని సీనియర్లు ఎవరూ కూడా  నోరు విప్పి మాట్లాడటం లేదు. అసలు పార్టీలో కొనసాగుతారో లేదో తెలియడం లేదు. పలువురు వైసీపీ సీనియర్లు కాషాయ కండువా కప్పు కోవడానికి తహతహలాడుతున్నట్లు రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.  అసలు పార్టీ సీనియర్ నేతలలో చాలా మంది ఇప్పటికే రాష్ట్రం దాటేశారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. వారెవరూ ఇప్పట్లో రాష్ట్రానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నాయి. స్వయంగా పార్టీ అధ్యక్షుడే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బిచాణా ఎత్తేసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పలాయనం చిత్తగించారు, ఇక వైసీపీ నేతల పరార్ ఒక లెక్కా అని తెలుగుదేశం శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.  మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం వైసీపీ అజ్ణాతంలోకి వెళ్లిపోయిందా అన్నట్లుగి పరిస్థితులు ఉన్నాయి.