ముద్రగడ రాజకీయ అడుగులు ఎటో?
posted on May 11, 2023 @ 11:33AM
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యక్ష రాజకీయాల్లోకి పున: ప్రవేశంపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని అంటున్నారు. కాపు సామాజికవర్గ ప్రజలకు ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖలో తుని రైల్వే కేసు కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన సత్యం జయించిందని సంతోషమని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ జోకర్ కార్డులా మారినందుకు చింతిస్తున్నానని లేఖలో ప్రస్తావించారు. 2016 ఫిబ్రవరి 2న తనను తీహార్ జైలుకు తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ రెడీ చేశారన్నారు. బెయిల్ తెచ్చుకోండి, లేకపోతే అండర్ గ్రౌండ్ కి వెళ్లమని సలహాలు ఇచ్చారని గుర్తుచేశారు.
ప్రజల్లో మార్పు రావాల్సి ఉందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఎన్నడూ రాలేదన్నారు. తుని ఘటన తరువాత తనను తీహార్ జైలుకు తీసుకువెళ్లేందుకు హెలికాప్టర్ సిద్ధం చేశారన్నారు. ఒకవేళ అలా చేసి ఉంటే కాపు ఉద్యమం చులకనయ్యేదన్నారు. అప్పటి డీజీపీకి కూడా నాపై సమస్త కేసులు పెట్టుకోండంటూ అప్పట్లో లేఖ రాశానన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పాడుచేయమని ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదన్నారు.
తుని రైలు దగ్ధం కేసును ఇటీవల రైల్వే కోర్టు కొట్టివేసింది. అంతకముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై పెట్టిన కేసులు ఎత్తేసింది. దీంతో ముద్రగడ పద్మనాభం వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్నప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించలేదు. అలాగని వాస్తవమేననీ అనలేదు. తాజాగా రాసిన లేఖలో మాత్రం రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ముద్రగడ రాజకీయ అడుగులు ఎటువైపు అన్నచర్చ అయితే జోరందుకుంది. అదలా ఉంటే.. ముద్రగడ కమలం వైపు మొగ్గు చూపుతున్నాన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ ప్రచారానికి ముద్రగడతో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు జరిపినట్లుగా చెబుతున్నచర్చలు కూడా ఒక కారణం.
ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముద్రగడ తాను కాకపోతే తన వారసుడిని న్నికల బరిలో నిలపాలని ముద్రగడ ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ముద్రగడ లేఖ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్లు అంటూ ఉద్యమాలు చేసిన ముద్రగడ. వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నకు సమాధానం యిచ్చిన తరువాతే ఆయన రాజకీయపున: ప్రవేశం చేయాలని కాపు నేతలుఅంటున్నారు.