అట్టుడికిన పాక్
posted on May 11, 2023 @ 1:07PM
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత అక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలతో బుధవారం అర్థరాత్రి పాకిస్తాన్ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాటకీయ నిర్బంధం తరువాత ఎనిమిది రోజుల పాటు కస్టడీలో ఉంటారు.
ఖాన్‌ను మంగళవారం రాజధాని ఇస్లామాబాద్‌లో సాధారణ విచారణ సందర్భంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిరసనకారుల సామూహిక అరెస్టులతో పాకిస్థాన్ అట్టుడికింది.
పాకిస్థాన్ లో అనేక స్మారక చిహ్నాలు మరియు ప్రభుత్వ భవనాలు తగలబడ్డాయి."మేము ఇమ్రాన్ ఖాన్‌కు అండగా ఉంటాము. మరణం వరకు అతనికి మద్దతు ఇస్తాము." అని అభిమానులు నినదించారు. శాంతిని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాజధానిలో సైన్యాన్ని మోహరించడానికి మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరమైన కరాచీలో ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఇస్లామాబాద్ తో పాటు ఇతర నగరాల్లో పిటీఐ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు.