పవన్ కల్యాణ్ ఫ్రం 2014 టు 2024
posted on May 10, 2023 @ 4:58PM
కొణిదెల కల్యాణ్@ కొణిదెల పవన్ కల్యాణ్@ పవర్ స్టార్ పవన్ కల్యాణ్లో కొన్ని అరుదైన గుణాలు ఉన్నాయని ఆయనను దగ్గరగా చూసిన వారు అంటూ ఉంటారు. అన్నచాటు తమ్ముడిగా, సినిమాలలో అడుగులు వేసి, అన్నతోటి తమ్ముడిగా ప్రజారాజ్యంలో కలిసి, అన్నను మించిన తమ్ముడిగా జనసేనతో మెరుస్తున్న పవన్ కల్యాణ్ ది కొంత విలక్షణమైన మనస్తత్వమే.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో పవన్ కల్యాణ్ పేరు ఒకటి అని చెప్పడానికి అనుమానం అక్కర్లేదు. 2007 అక్టోబర్ లో రివాల్వర్ పట్టుకుని జూబ్లీహిల్స్ రోడ్లపై హల్ చల్ చేసిన పవన్ కు, పీఆర్పీ పెట్టనప్పుడు ప్రసంగాలు చేసిన పవన్ కు, జనసేన అధినేతగా యిప్పుడు పావులు కదుపుతున్న పవన్ కి చాలా వ్యత్యాసం ఉంది. కానీ పవన్ కల్యాణ్ కు సినిమారంగంలో దక్కినంత స్టార్ డమ్రాజకీయాలలో దొరకలేదనే చెప్పాలి. ఈ విషయాన్ని పవన్ స్వయంగా అంగీకరించడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.
సహజంగా గెలిచిన నాయకులు కూడా ప్రజల మొహం చూడని నేటి రాజకీయాలలో సమయం దొరికినపుడు ప్రజలతో కలిసే పవన్ కల్యాణ్ ను ప్రజలు యిష్టపడతారు. రెండు చోట్లా ఓడించినా ఎప్పుడూ ఎవరినీ పల్లెత్తుమాట అనని పవన్ తన మీద తానే జోకులు వేసుకుని ప్రజలకు దగ్గరయ్యేందకు ప్రయత్నిస్తున్నారు. యిదంతా పవన్ మేనరిజం అనుకుంటే పొరపాటే. పవన్ తన భావోద్వేగాలను తాను నియంత్రించుకుని రాజకీయ నాయకుడిగా తనను తాను మలచుకుంటున్నారు. పవన్ సినిమాలు, రాజకీయాలు అంటే జోడు పడవల ప్రయాణం చేస్తున్నాడని ఆరోపిస్తున్న వారికి సినిమాలు తన జీవనోపాధి అని చెప్పేశారు.
కనుక సినిమాలు చేయక తప్పని పరిస్థితి అనేది స్పష్టమైంది. గతంలో పవన్ ను కేవలం సినిమా స్టార్ గానే ప్రజలు చూశారనడంలో సందేహం లేదు. కానీ ఆ ఇమేజ్ ని పవన్ మార్చుకోగలిగారు. ఇందుకు పవన్ లోని రాజకీయ నిబద్ధత, కొంత కారణమైనా, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణం. 2014 మార్చ్ 14న ప్రారంభమైన జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో 2014 ఎన్నికలలో టీడీపీకి మద్దతు ఇచ్చింది. టీడీపీఅధికారలోకి రావడానికి తాము కూడా కారణమని భావించిన జనసేన 2019 ఎన్నికలలో స్వయంగా రంగంలోకి దిగి ఒకే ఒక్క అభ్యర్థిని గెలిపించుకోగలిగింది. దీంతో రాజకీయాలంటే సినిమా కాదని పవన్ కల్యాణ్ కి తెలిసి వచ్చింది.
సహజంగానే 2019 ఓటమి తరువాతే పవన్ కల్యాణ్ లో గుణాత్మకమైన మార్పు వచ్చింది. గడిచిన నాలుగేళ్లలో అధికార వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ ను మరింతగా పదును పెట్టారు. క్రమంగా రాజకీయాలు వంటబట్టించుకున్న పవన్ ఎప్పుడూ ర ాష్ట్ర అభివృద్ధి వైపే ఉంటానని చెప్పారు. తాజాగా టీడీపీకి పవన్ దగ్గరవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది వైసీపీ. అంతే కాకుండా మోడీ ఆశీస్సులు బలంగా పవన్ కల్యాణ్ పట్ల అధికార వైసీపీ ఆచితూచి స్పందిస్తోంది. గతంలో పవన్ వివాహాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగాగమనిస్తున్న జనసేన బృందం ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలుగుదేశంతో జతకట్టే అంశంపై రెండో ఆలోచనకు తావులేదనిపవన్ కల్యాణ్జనసేన ముఖ్యనేతలకు తేల్చి చెప్పారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉంటుందని, పవర్ షేరింగ్అనే విషయాలపై ఎవరూ నోరెత్తవద్దని పవన్ కల్యాణ్ తన పార్టీ సీనియర్లకు అల్టిమేటం ఇచ్చారని తెలిసింది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా త్వరలో బస్సుయాత్ర చేసేందుకు పవన్ సిద్ధంఅవుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఇదంతా గమనిస్తే రాజకీయ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి పవన్ ఎంత వ్యూహాత్మకంగా పావులుకదుపుతున్నారో అర్ధంఅవుతుంది. అభిమానుల ఆవేశాన్నికంట్రోల్ చేస్తూ, వ్యూహాలకు పదును పెడుతున్న పవన్ 2024 ఎన్నికలలో జనసేనపోటీ చేయబోతున్న సీట్లపై కూడా స్పష్టమైన అవగాహనతో ఉన్నారని తెలుస్తోంది.